భారత్, పాకిస్తాన్ రెండింటి తరపున ఆడిన ముగ్గురు పంజాబీ క్రికెటర్ల కథ

ఫొటో సోర్స్, GETTY IMAGES/PCB
- రచయిత, జస్పాల్ సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అది 1952 అక్టోబర్ 16, దిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానం. ఆ రోజు ప్రపంచ క్రికెట్ చరిత్రలో అద్భుతంగా మిగిలిపోయింది.
ఆ రోజు పాకిస్తాన్ జట్టు తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. ప్రత్యర్థి భారత్. దానితో పాటు ఈ మ్యాచ్‌కి మరో ప్రత్యేకత ఉంది.
అదేంటంటే, అబ్దుల్ హఫీజ్ కర్దార్, అమీర్ ఇలాహి, గుల్ మొహమ్మద్. భారత్, పాకిస్తాన్ రెండు దేశాల తరపున టెస్ట్ క్రికెట్ ఆడిన ముగ్గురు ఆటగాళ్లు వీరు.
భారత్ - పాకిస్తాన్ మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో ఈ ముగ్గురు ఆటగాళ్లు ఉన్నారు. గుల్ మొహమ్మద్ భారత్ తరపున, అబ్దుల్ హఫీజ్ కర్దార్, అమీర్ ఇలాహి పాకిస్తాన్ పక్షాన ఆడారు.
ఈ ముగ్గురు ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.
'ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ క్రికెట్' - అబ్దుల్ హఫీజ్ కర్దార్
తొలినాళ్లలో పాకిస్తాన్ క్రికెట్‌కు కొత్త మార్గాన్ని చూపిన క్రికెటర్‌గా అబ్దుల్ హఫీజ్‌ను పరిగణిస్తారు. పాకిస్తాన్ ఆడిన తొలి మ్యాచ్‌కు అబ్దుల్ హఫీజ్ కెప్టెన్.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ వెబ్‌సైట్‌లో ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ క్రికెట్‌గా అబ్దుల్ హఫీజ్ కర్దార్‌ను పేర్కొన్నారు. 1952 నుంచి 1958 మధ్య కాలంలో ఆయన పాకిస్తాన్ తరఫున 23 టెస్ట్ మ్యాచ్‌లు ఆడారు. అన్ని మ్యాచ్‌లలోనూ పాకిస్తాన్ జట్టు కెప్టెన్‌గా ఉన్నారు.
అబ్దుల్ హఫీజ్ కర్దార్ 1925లో లాహోర్‌లో జన్మించినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ వెబ్‌సైట్ పేర్కొంది. ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్ఫో ప్రకారం, కర్దార్ పుట్టిన రోజు 1925 జనవరి 17.
లాహోర్‌లోని ఇస్లామియా కాలేజీలో చదువుతున్న రోజుల్లో క్రికెట్‌లో ప్రావీణ్యం సంపాదించారు కర్దార్. అప్పట్లో ఇస్లామియా కాలేజీ ప్రముఖ విద్యాసంస్థగా ఉండేది.
భారత్, పాకిస్తాన్ విభజనకు ముందు లాహోర్‌లోని ఇస్లామియా కాలేజీ పంజాబ్‌కు చెందిన టెస్ట్ క్రికెటర్లకు నర్సరీగా ఉండేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ వెబ్‌సైట్ పేర్కొంది.
అబ్దుల్ హఫీజ్ వేర్వేరు క్రికెట్ జట్ల తరఫున ఆడారు. ఆయన 174 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 8 సెంచరీలతో 6,832 పరుగులు చేశారు. బౌలర్‌గానూ రాణించిన అబ్దుల్ హఫీజ్ 344 వికెట్లు పడగొట్టారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
భారత్ తరపున తొలి మ్యాచ్
ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ క్రికెట్‌గా భావించే అబ్దుల్ హఫీజ్ తన తొలి క్రికెట్ మ్యాచ్ 1946లో భారత్ తరపున ఆడారు. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన భారత్ క్రికెట్ జట్టుకు ఆయన ఎంపికయ్యారు.
భారత్ తరఫున ఆయన మూడు టెస్ట్ మ్యాచ్‌లు ఆడారు. ఆ మూడు మ్యాచ్‌లలో ఆయన 80 పరుగులు చేశారు.
ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్ఫో ప్రకారం, ఇంగ్లండ్ టూర్‌లో ఆయన అబ్దుల్ హఫీజ్ పేరుతో ఆడారు. ఈ టూర్ తర్వాత ఆయన తన ఇంటి పేరు కర్దార్‌ను తన పేరులో చేర్చారు.
ఈ టూర్ తర్వాత కర్దార్ ఇంగ్లండ్‌లో ఉండిపోయారు. అక్కడి వార్విక్షా కౌంటీ తరఫున క్రికెట్ ఆడారు.
ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ అయిన అబ్దుల్ హఫీజ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో అందరికీ సుపరిచితులు. ఆయన క్రీజ్‌లో నుంచి బయటికి వచ్చి బౌలర్ తల మీదుగా షాట్స్ ఆడేవారు. బౌలర్ ఎవరైనా, మ్యాచ్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అదే దూకుడు ఉండేది.
ఇంగ్లండ్ నుంచి తిరిగి వచ్చేప్పటికి పాకిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పాటైంది. ఆ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించారు.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్ క్రికెట్‌కు ఊతమిచ్చిన కర్దార్
కర్దార్ కెప్టెన్సీలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు టెస్ట్ క్రికెట్ ఆడుతున్న జట్టుగా 1951లో గుర్తింపు పొందింది. ఏడాది తర్వాత, తొలిసారి భారత్ పర్యటనకు వచ్చిన పాకిస్తాన్ జట్టు కర్దార్ కెప్టెన్సీలో రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్‌పై విజయం సాధించింది.
కర్దార్ కెప్టెన్సీలో పాకిస్తాన్ జట్టు సౌతాఫ్రికా మినహా ఐదు టెస్ట్ క్రికెట్ జట్లపై విజయం సాధించినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
మొదటి సిరీస్‌లోనే ఈ విజయాలన్నీ నమోదయ్యాయి.
రిటైర్ అయిన తర్వాత కర్దార్ క్రికెట్‌తోనే కొనసాగారు.
1972 నుంచి 1977 వరకూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (అప్పట్లో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ పాకిస్తాన్) అధ్యక్షుడిగా పనిచేశారు.
పాకిస్తాన్ క్రికెట్‌ను ఆధునీకరించేందుకు ఆయన హయాంలో చాలా ప్రయత్నాలు జరిగాయి.
ఆ తర్వాత కర్దార్ రాజకీయాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 1970లో ఆయన పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాతి కాలంలో స్విట్జర్లాండ్‌కు పాకిస్తాన్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు.
భారత్ - పాకిస్తాన్ విభజనతో చాలా మంది క్రీడాకారులు కూడా విడిపోయారు.

ఫొటో సోర్స్, PAKISTAN CRICKET BOAR/TWITTER
గుల్ మొహమ్మద్
అది 1947, మార్చి 8వ తేదీ. వడోదరాలో హొల్కర్, బరోడా మధ్య రంజీ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. బరోడా అప్పటికి మూడు వికెట్లు కోల్పోయి 91 పరుగులు చేసింది.
అప్పుడే గుల్ మొహమ్మద్ క్రీజులో అడుగుపెట్టారు. ఆయన భారత ప్రముఖ ఆటగాడు విజయ్ హజారేతో కలిసి నాలుగో వికెట్‌కు 577 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.
దాదాపు 8 గంటల 53 నిమిషాలు క్రీజ్‌లో ఉన్న గుల్ మొహమ్మద్ 319 రన్స్ చేశారు.
ఆయన 1921 అక్టోబర్ 15న లాహోర్‌లో జన్మించారు. పంజాబ్‌కి చెందిన గుల్ మొహమ్మద్ భారత్, పాకిస్తాన్ తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఆటగాళ్లలో ఒకరు.
భారత్ తరపున 8 మ్యాచ్‌లు ఆడిన గుల్, పాకిస్తాన్ తరపున ఒక టెస్ట్ మ్యాచ్ ఆడారు.
ఈయన ఎడమచేతి వాటం ఉన్న బ్యాట్స్‌మెన్, బౌలర్ కూడా. ఫీల్డింగ్‌లోనూ చురుగ్గా ఉండేవారు. ఆయన చేతుల నుంచి చేప కూడా సులభంగా తప్పించుకోలేదని గుల్ గురించి చెబుతుంటారు.
అబ్దుల్ హఫీజ్ కర్దార్ చదివిన లాహోర్‌లోని ఇస్లామియా కాలేజీ నుంచే గుల్ మొహమ్మద్ కూడా వచ్చారు.
1938-39లో పదిహేడేళ్ల వయసులో గుల్ తన తొలి రంజీ మ్యాచ్ ఆడినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ వెబ్‌సైట్ పేర్కొంది.
దేశీయ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో గుల్ మొహమ్మద్ రాణించారు. కొన్నేళ్ల తర్వాత, 1946లో ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లిన భారత జట్టుకు ఎంపికయ్యారు.
తొలి టెస్ట్ మ్యాచ్‌లో మంచి ప్రదర్శన చేయలేకపోయారు.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1947-48లో లాలా అమర్నాథ్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా టూర్‌కి వెళ్లిన భారత జట్టుకి ఎంపికయ్యారు.
ఈ టూర్‌లో భారత జట్టు ప్రదర్శన పేలవంగా సాగింది. ఈ టూర్‌లో గుల్ మొహమ్మద్ ఐదు టెస్ట్ మ్యాచ్‌లలో 130 పరుగులు చేశారు. అయితే, తన ఫీల్డింగ్‌తో ఆయన అందరినీ ఆకట్టుకున్నారు.
పాకిస్తాన్‌తో ఆడిన తొలి రెండు మ్యాచ్‌లలోనూ భారత్ తరఫున ఆడారు. ఆ తర్వాత ఆయన పాకిస్తాన్ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.
1956-57 మధ్య ఆయన పాకిస్తాన్ జట్టుకు ఎంపికయ్యారు. కరాచీలో ఆస్ట్రేలియా - పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రెండు ఇన్సింగ్స్‌లలో కలిపి 39 పరుగులు చేశారు.
ఆ తర్వాత ఆయన కౌంటీ క్రికెట్‌లో అద్భుత ప్రతిభ కనబరిచారు.
సుదీర్ఘ కాలం అనారోగ్యంతో బాధపడిన గుల్, 1992లో లాహోర్‌లో మరణించారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
అమీర్ ఇలాహి
అమీర్ ఇలాహి లాహార్‌లో జన్మించారు. ఆయనకు రెండు ప్రత్యేకతలున్నాయి. భారత్, పాకిస్తాన్ రెండు జట్ల తరఫున క్రికెట్ ఆడిన ఆటగాడే కాకుండా, ప్రపంచంలోనే పురాతన 20 మంది క్రికెటర్లలో ఈయన కూడా ఒకరు.
1908 సెప్టెంబర్ ఒకటో తేదీన అమీర్ జన్మించారు.
విస్డన్ క్రికెటర్స్ అల్మనాక్ ప్రకారం, అమీర్ భారత్ తరఫున ఒకసారి, పాకిస్తాన్ తరఫున ఐదుసార్లు ఆడారు.
1952-53లో భారత్‌లో పాకిస్తాన్ తరఫున ఐదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడారు. కోల్‌కతాలో ఆయన మ్యాచ్ ఆడుతున్న సమయానికి ఆయనకు 44 ఏళ్లు.
మీడియం పేసర్‌గా కెరీర్ ప్రారంభించిన అమీర్ ఆ తర్వాతి కాలంలో లెగ్‌స్పిన్నర్‌గా మారారు.
టెస్ట్ మ్యాచ్‌లలో చెప్పుకోదగ్గ ప్రదర్శన లేకపోయినా, రంజీ ట్రోఫీలో అద్భుత ప్రతిభ కనబరిచారు. రంజీ ట్రోఫీలో 24.72 సగటుతో 194 వికెట్లు పడగొట్టారు.
పాకిస్తాన్ పౌరుడు కావడానికి కొద్ది కాలం ముందు జరిగిన రంజీ ట్రోఫీలో బరోడా జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.
ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్ఫో ప్రకారం, ఆయన ఆడిన ఒక ఇన్నింగ్స్ చరిత్రలో నిలిచిపోయింది.
చెన్నైలో జరిగిన భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ తరఫున ఆడిన అమీర్, జుల్ఫికర్ అహ్మద్‌తో కలిసి పదో వికెట్‌కు 104 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు.
ఈ మ్యాచ్‌లో 47 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.
1980 డిసెంబర్‌లో కరాచీలో 72 ఏళ్ల వయసులో అమీర్ మరణించారు.
ఇవి కూడా చదవండి:
- వెస్టిండీస్: ప్రపంచ క్రికెట్‌ను శాసించిన ఈ జట్టు వరల్డ్ కప్ 2023కి ఎందుకు అర్హత సాధించలేకపోయింది?
- సర్ఫరాజ్ ఖాన్: 37 మ్యాచ్‌లలో 13 సెంచరీలు.. అయినా టీమ్ఇండియాకు సెలక్ట్ చేయలేదు.. లావుగా ఉంటే ఆడనివ్వరా
- క్రికెట్ వరల్డ్ కప్-1983 విజయానికి 40 ఏళ్ళు: కపిల్ దేవ్ నాయకత్వంలో ఆ మరపురాని గెలుపు ఎలా సాధ్యమైందంటే...
- వరల్డ్ కప్ 2023: భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ?
- వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్: 4 x 400 మీటర్ల రిలే జట్టు సభ్యుల మతంపై చర్చ ఎందుకు జరుగుతోంది?














