జమ్మూ: దగ్గు మందు తాగి చనిపోయిన పిల్లలు... న్యాయం కోసం తల్లిదండ్రుల పడిగాపులు

- రచయిత, వినీత్ ఖరే
- హోదా, బీబీసీ న్యూస్, జమ్మూ
మూడేళ్ల బాలుడు అనిరుధ్ ఆస్పత్రి బెడ్‌పై పడుకుని ఉన్న వీడియోను తీశారు. ఈ వీడియోలో బాలుడి చేతులు మొత్తం వైర్లతో నిండి ఉన్నాయి. కదలలేని స్థితిలో అనిరుధ్ ఉన్నాడు.
తన తల్లి కన్నీళ్లతో స్పూన్‌తో బాబుకి తినిపించాలని ప్రయత్నించారు. కాస్త తిని కోలుకుంటే వీడియో గేమ్స్ ఆడుకోవచ్చని ఆమె బుజ్జగించారు. కానీ, బాబు తినలేకపోయాడు.
ఆ తర్వాత మూడు రోజులకి 2020 జనవరి 10న ఆస్పత్రిలో అనిరుధ్ చనిపోయాడు.
బాబు ఈ పరిస్థితులోకి రావడానికి కంటే కొన్ని రోజుల ముందు జ్వరం, ఛాతీ సమస్యలు రావడంతో దగ్గు మందు తాగించారు తల్లిదండ్రులు.
ఈ దగ్గు మందు తాగిన తర్వాత బాబుకు మూత్రం రావడం ఆగిపోయింది. కాళ్లు లావయ్యాయి. ఏం తిన్నా వాంతి చేసుకునే వాడని తల్లిదండ్రులు చెప్పారు.
ఆ దగ్గు మందును వారు నివసించి ఉండే జమ్మూలోని ఒక చిన్న పట్టణం రామ్‌నగర్‌లోని ఒక స్థానిక మెడికల్ షాపులో కొన్నారు.
డాక్టర్లు బాబు కిడ్నీలు దెబ్బతిన్నట్లు చెప్పారు. కిడ్నీలు ఫిల్టర్ చేసే కడుపులోని వ్యర్థ పదార్థం క్రియాటినిన్ శరీరంలో అత్యధికంగా ఉన్నట్లు తేలింది.
దగ్గు మందు వల్లనే తమ కొడుకు మృతి చెందాడని అనిరుధ్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
డైథిలీన్ గ్లైకాల్‌లు ఈ దగ్గు మందులో అధికంగా ఉన్నట్లు పరీక్షల్లో తేలిందని స్థానిక డ్రగ్ కంట్రోలర్ అధికారులు చెప్పారు. విషపూరితమైన ఈ కారకం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ అయి, ఆ తర్వాత మరణానికి దారితీస్తుంది.
‘‘నా కొడుకు చాలా బాధపడ్డాడు’’ అని అనిరుధ్ తల్లి వీణా కుమారి బీబీసీకి తెలిపారు.
‘‘తినడానికి ఇబ్బంది పడేవాడు. కళ్లు తెరలేకపోయేవాడు. ముఖం, బాడీ అంతా ఉబ్బిపోయేది’’ అంటూ ఆమె కన్నీరు పెట్టుకున్నారు.
జమ్మూ రామ్‌నగర్‌లో 2019 డిసెంబర్ నుంచి 2020 జనవరి మధ్య కాలంలో 12 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వీరందరూ కూడా ఐదేళ్ల లోపు పిల్లలే.
దగ్గు మందు తాగిన తర్వాత వీరు మరణించినట్లు ఆరోపణలున్నాయి. చనిపోయిన పిల్లల సంఖ్య ఎక్కువగానే ఉండొచ్చని యాక్టివిస్టులు చెప్పారు.
దగ్గు మందును తయారు చేసిన డిజిటల్ విజన్ కంపెనీపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, GETTY IMAGES
పిల్లల మరణానికి తమ దగ్గు మందే కారణమనే ఆరోపణలను డిజిటల్ విజన్ కంపెనీ యజమాని పురుషోత్తమ్ గోయల్ ఖండిస్తున్నారు.
‘‘మరొకరి పిల్లల్ని మేమెందుకు చంపుతాం? మా ఇళ్లలో కూడా పిల్లలు ఉన్నారు. మేం మందులు తయారు చేస్తున్నాం. పాయిజన్ కాదు’’ అని బీబీసీతో అన్నారు.
భారత్‌లో తయారు చేసిన దగ్గు మందు తాగడం వల్ల గాంబియా, ఉజ్బెకిస్తాన్‌లలో పిల్లలు మరణించిన తర్వాత, రామ్‌నగర్ విషాదం కూడా మరోసారి వెలుగులోకి వచ్చింది.
తల్లిదండ్రులు తమ పిల్లల మరణానికి న్యాయాన్ని కోరేందుకు ఈ కేసులు సహకరిస్తున్నాయి.
గాంబియా, ఉజ్బెకిస్తాన్‌లలో పిల్లలు మరణించడానికి ముందు ఎలాంటి లక్షణాలు అయితే కనిపించాయో, తమ పిల్లలకి కూడా అవే లక్షణాలున్నట్లు చాలా మంది తల్లిదండ్రులు చెప్పారు.
జనరిక్ ఔషధాల ఎగుమతుల్లో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎగుమతిదారిగా ఉంది.
అభివృద్ధి చెందిన దేశాల్లో ఔషధ అవసరాలను చాలా వరకు భారతే తీరుస్తోంది.
కానీ, గాంబియా, ఉజ్బెకిస్తాన్ దేశాల్లో సంభవించిన ఈ మరణాలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి.
భారత ఔషధ రంగ పరిశ్రమ నాణ్యతా ప్రమాణాలపై పలు ప్రశ్నలను ఎదుర్కొంటోంది.
విపరీతంగా వృద్ధి సాధిస్తోన్న ఈ రంగం తయారీ విధానాల్లో సరైన ప్రమాణాలను పాటించడం లేదని, నియంత్రణా సంస్థ పర్యవేక్షణ లోపించిందని చెప్పేందుకు తాము చాలా కాలంగా ప్రయత్నించినట్లు భారత వైద్య కార్యకర్తలు చెప్పారు.
డైథలీన్ గ్లైకాల్ విషపూరితం కావడం వల్ల పిల్లలు మరణించిన కేసు తొలిసారి 1972లో నమోదైందని ఆరోగ్య కార్యకర్త దినేశ్ ఠాకూర్, న్యాయవాది ప్రశాంత్ రెడ్డి రాసిన ‘ది ట్రూత్ పిల్’ అనే పుస్తకంలో తెలిపారు. ఆ సమయంలో తమిళనాడులో 15 మంది మంది పిల్లలు మరణించారు.
అప్పటి నుంచి భారత్‌లో పలు రాష్ట్రాల్లో ఔషధాలు విషపూరితమైన ఘటనలు చోటు చేసుకున్నాయన్నారు.
గుర్తించడానికి వీలు కాని డైథలీన్ గ్లైకాల్ పాయిజనింగ్ వల్ల మరణించిన వారి సంఖ్య ఎక్కువగానే ఉండొచ్చన్నారు.
‘‘ది ట్రూత్ పిల్’’ పేరుతో రాసిన పుస్తకంలో రామ్‌నగర్ మరణాలు గురించి కూడా రాశారు.
కంపెనీలు మార్కెట్లోకి ఔషధాన్ని తీసుకొచ్చే ముందు వాటి ముడి సరుకులను కానీ లేదా ఫైనల్ ఫార్ములేషన్‌ను కానీ సాధారణంగా పరీక్షించవని ఈ పుస్తక రచయితలు చెప్పారు.

‘‘కొన్ని దారితప్పడం వల్ల, కొన్ని బ్యాచ్‌ల కారణంగా భారత్‌లో మొత్తం ఔషధ పరిశ్రమనే సరిగా పనిచేయడం లేదని అనడం సరైంది కాదు’’ అని ఫార్మాస్యూటికల్స్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ ఉదయ భాస్కర్ చెప్పారు.
గాంబియాలో పిల్లల మరణాలకు కారణమని చెబుతోన్న నాలుగు దగ్గు మందులను దేశీయంగా పరీక్షించినప్పుడు అవి నాణ్యతా ప్రమాణాలకు కట్టుబడి ఉన్నాయని తేలిందని భారత నియంత్రణా సంస్థలు చెబుతున్నాయి.
కానీ, భారతీయ కంపెనీ తయారు చేసిన ఈ దగ్గు మందుల అమ్మకాన్ని ఆపివేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అక్టోబర్‌లో ఆదేశాలు జారీ చేసింది.
ఉజ్బెకిస్తాన్‌లో మరణాలకు కారణమైన ఈ ఉత్పత్తులను తయారు చేసిన సంస్థ తయారీ లైసెన్స్‌ను రద్దు కూడా చేశారు.
ఎగుమతి చేసే ముందు ప్రభుత్వ ఆమోదిత ల్యాబ్‌లలోనే దగ్గు మందు సిరప్‌లను కంపెనీలు పరీక్షించడాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది.
రామ్‌నగర్ మరణాల్లో ఆరోపణలు ఎదుర్కొంటోన్న వ్యక్తులపై కేసు దాఖలు చేయడానికి పోలీసులకు రెండేళ్లు సమయం పట్టింది.
ఈ దగ్గు మందును అమ్మిన కెమిస్ట్, డిజిటల్ విజన్‌కు చెందిన ముగ్గురు అధికారులతో పాటు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసుపై స్థానిక కోర్టులో విచారణ జరుగుతోంది.
ఈ విషయంలో ఇంటర్వ్యూ కోసం బీబీసీ జిల్లా ఉన్నత పోలీసు అధికారులను సంప్రదించగా.. వారు స్పందించలేదు.
పిల్లల మరణాల తర్వాత 2020లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని డిజిటల్ విజన్ తయారీ యూనిట్ ఆరు నెలలు మూత పడింది. కానీ, కోర్టు ఆదేశాల తర్వాత మళ్లీ తెరుచుకుంది.
తమ పిల్లల మరణాలకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
‘‘మాకు న్యాయం కావాలి. మా పిల్లల్ని చంపిన హంతకులను శిక్షించాలి’’ అని ముర్ఫా బివి చెప్పారు. తమ మూడేళ్ల బాలుడు ఇర్ఫాన్ ఈ దగ్గు మందు తాగిన తర్వాత 10 రోజులకు మృతి చెందాడు.
‘‘ఏ కారణం లేకుండా పిల్లలు చనిపోయారు. తయారీదారులు, డ్రగ్ కంట్రోలర్ అధికారులు వారి బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించడంలో విఫలమయ్యారు’’ అని జమ్మూలో తల్లిదండ్రుల తరఫున ఈ కేసులపై పోరాడుతున్న కార్యకర్త సుకేష్ ఖజురియా చెప్పారు.
ఒకవేళ ప్రభుత్వ అధికారులు తమ బాధ్యతలను సరిగ్గా నిర్వహిస్తే, గాంబియాలో ఇలాంటి మరణాలు సంభవించేవి కావన్నారు.
తల్లిదండ్రులకు న్యాయం చేసేందుకు తాము శతవిధాలా కృషి చేస్తున్నామని డ్రగ్ కంట్రోల్ అధికారులు చెప్పారు.
‘‘రామ్‌గనర్‌లో మేం లీగల్ శాంపుల్ సేకరించాం. దాన్ని తొలుత స్థానిక ఔషధ నియంత్రణ సంస్థ చండీగఢ్‌కు పంపాం. అక్కడి నుంచి వచ్చిన రిపోర్టు ప్రకారం డైథిలీన్ గ్లైకాల్ 34 శాతం అధికంగా ఉందని గుర్తించాం. మళ్లీ శాంపుల్ సేకరించాం. దాన్ని సీడీఎల్ కోల్‌కతా అప్పీలేట్ ల్యాబ్‌కి పంపాం. అక్కడి నుంచి అదే రకమైన రిపోర్ట్ వచ్చింది. ఆ తర్వాత విచారణ ప్రారంభించాం’’ అని జమ్మూ కశ్మీర్ డ్రగ్ కంట్రోలర్ లోతిక ఖజురియా చెప్పారు.
రామ్‌నగర్‌లోని పిల్లల మరణాలపై చిన్న పిల్లల వైద్యురాలు భావనీత్ భారతి నేతృత్వంలోని టీమ్ విచారణ చేసింది. వీరి విచారణలో కూడా దగ్గు మందులో డైథిలీన్ గ్లైకాల్ అధికంగా ఉన్నట్లు గుర్తించారు.
‘‘ఈ విషపూరితమైన కారకాల వల్ల పిల్లల కిడ్నీలు పాడయ్యాయి. కొన్ని కేసుల్లో మెదడు, కాలేయం, ఊపిరితిత్తులు వంటి మల్టిపుల్ ఆర్గాన్లపై ఇది ప్రభావం చూపింది. కొందర్ని వెంటిలేటర్‌పై ఉంచాం. కొంతమంది పిల్లలు మరణించగా.. కొందరు ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు’’ అని భారతి చెప్పారు.
అయితే, ఈ దగ్గు మందు తాగిన తర్వాత ఆస్పత్రి పాలై బతికిన వారిలో 15 నెలల బాలుడు పవన్ కుమార్ ఒకడు.
మూడు నెలల పాటు ఆస్పత్రిలో చికిత్స పొంది, ప్రస్తుతం డిశ్చార్జ్ అయ్యాడు. ఇంకా ఈ బాబుకు వైద్య చికిత్స అందిస్తున్నారు.
‘‘ఈ పిల్లాడి కంటిచూపు మందగించింది. వినగలిగే సామర్థ్యం బాగా తగ్గింది. అధిక రక్త పోటును ఎదుర్కొంటున్నాడు’’ అని పవన్ కుమార్ తండ్రి శంభు రామ్ చెప్పారు.
తమ కొడుకు చికిత్స కోసం ప్రభుత్వం తమల్ని ఆర్థికంగా ఆదుకోవాలని కుటుంబం కోరుకుంటోంది.
ఇవి కూడా చదవండి:
- ఖురాన్: అందమైన చేతిరాతతో రాసిన అరుదైన మత గ్రంథాన్నిబులెట్ ప్రూఫ్ కేస్‌లో భద్రంగా కాపాడుతున్న కేప్‌టౌన్ ముస్లింలు
- హోటల్ రివ్యూలు రాస్తే డబ్బులు ఇస్తామని చెప్పి, లక్షలు కాజేస్తున్న సైబర్ దొంగలు.. ఈ మోసాన్ని ఎలా గుర్తించాలి?
- కొందరికి రాత్రి పూట ఎక్కువసార్లు మూత్రం వస్తుంది, ఎందుకు? పరిష్కారమేంటి?
- ‘తలపై పిడుగు పడి, జ్ఞాపకశక్తి కోల్పోయా. మళ్లీ మామూలు మనిషిని ఎలా అయ్యానంటే...’
- పుతిన్ అనుకూల బ్లాగర్లకు డబ్బే డబ్బు.. ఎలాగంటే..?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














