పుతిన్ అనుకూల బ్లాగర్లకు డబ్బే డబ్బు.. ఎలాగంటే..?

అలెక్సాండర్ కోట్స్

ఫొటో సోర్స్, ALEXANDER KOTS/TELEGRAM

    • రచయిత, గ్రిగోర్ అటనేసియన్
    • హోదా, బీబీసీ గ్లోబల్ డిస్‌ఇన్‌ఫర్మేషన్ టీమ్

రష్యా అనుకూల ఇన్‌ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియా వేదికపై ఈ యుద్ధాన్ని ప్రసారం చేస్తూ భారీ మొత్తంలో అడ్వర్‌టైజింగ్ రెవెన్యూను సంపాదిస్తున్నారని బీబీసీ గుర్తించింది.

డ్రోన్ దాడుల వీడియోలను, యుక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమీర్ జెలియెన్‌స్కీ గురించి తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేస్తూ, వీటి మధ్యలో క్రిప్టోకరెన్సీ నుంచి ఫ్యాషన్ వరకు పలు రకాల వ్యాపార ప్రకటనలను షేర్ చేస్తున్నారు.

రష్యాలో వీరిని ‘జెడ్-బ్లాగర్స్’’గా పిలుస్తున్నారు. ఎందుకంటే యుద్ధానికి వీరిచ్చే మద్దతును లెటర్ జెడ్‌తో సూచిస్తున్నారు.

యుద్ధ భూముల నుంచి రష్యా అనుకూల ఇన్‌ఫ్లుయెన్సర్లు ఈ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. రష్యా సైన్యంలో యువత కూడా చేరాలంటూ వారు పిలుపునిస్తున్నారు.

2022 ఫిబ్రవరిలో యుక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రారంభించిన తర్వాత, యుద్ధ అనుకూల ఇన్‌ఫ్లుయెన్సర్లు టెలిగ్రామ్‌‌లో లక్షల మంది ఫాలోవర్స్‌ను సంపాదించారు.

వార్ బ్లాగర్లతో రష్యా అధ్యక్షుడు పుతిన్

ఫొటో సోర్స్, RUSSIAN GOVERNMENT HANDOUT

యుద్ధ అనుకూల బ్లాగర్లు ఎంత వసూలు చేస్తున్నారు?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విటర్ అకౌంట్లను ఆ దేశంలో బ్యాన్ చేశారు. అప్పటి నుంచి రష్యా పౌరులు పెద్దయెత్తున టెలిగ్రామ్‌ను వాడుతున్నారు.

టెలిగ్రామ్ వ్యాపార ప్రకటనల మార్కెట్ కూడా బాగా పెరిగింది. దీని నుంచి ఇన్‌ఫ్లుయెన్సర్లు లబ్ది పొందుతున్నారు. యువతను చేరుకునేందుకు కంపెనీల వ్యాపార ప్రకటనలను వారు చూపించడం ప్రారంభించారు.

ఈ వ్యాపార ప్రకటనలకు వారెంత వసూలు చేస్తున్నారో తెలుసుకునేందుకు బీబీసీ గ్లోబల్ డిస్‌ఇన్‌ఫర్మేషన్ టీమ్ సభ్యులు.. హోటల్ యజమానుల మాదిరి ఈ యుద్ధ అనుకూల ఇన్‌ఫ్లుయెన్సర్లను సంప్రదించారు. వారి ఛానళ్లపై తమ యాడ్స్‌ను పోస్ట్ చేసేలా వారిని కోరారు.

కొంత మంది ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్లనే బీబీసీ టీమ్ సంప్రదించింది.

వారిలో అలెక్సాండర్ కోట్స్ ఒకరు. ప్రభుత్వ అనుకూల వార్తాపత్రిక ప్రముఖ ప్రతినిధిగా పనిచేసిన ఇతను వార్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారారు.

తన వ్యక్తిగత టెలిగ్రామ్ ఛానల్‌పై 6 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

వార్ గోంజోగా పిలిచే సెమియోన్ పెగోవ్ మరొకరు. ఈయన ప్రముఖ జెడ్ బ్లాగర్. ఇతనికి 13 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.

అలెక్సాండర్ కోట్స్ తన ఛానల్‌పై ఒక పోస్ట్‌కి 48 వేల రూబెల్స్ నుంచి 70 వేల రూబెల్స్‌ను వసూలు చేస్తున్నారు. భారతీయ కరెన్సీ ప్రకారం రూ.45 వేల పైన నుంచి రూ.70 వేల పైనే.

తన టెలిగ్రామ్ ఫీడ్‌పై ఎంత సేపు ఈ యాడ్‌ను ఉంచాలనుకుంటారో దాన్ని బట్టి ఈ ఛార్జ్ ఉంటుందని అలెక్సాండర్ చెప్పారు.

వార్ బ్లాగర్లు

ఫొటో సోర్స్, GAVRIIL GRIGOROV / SPUTNIK / AFP

వార్ గోంజో అయితే ఒక్కో యాడ్‌కి 1,550 యూరోలు అంటే లక్షా 61 వేల పైనే వసూలు చేస్తున్నారు.

ప్రముఖ వార్ ఇన్‌ఫ్లుయెన్సర్లు తమ ఛానల్స్‌పై రోజుకు కనీసం ఒక యాడ్‌నైనా పబ్లిష్ చేస్తున్నారు.

ఇలా ప్రతి నెలా సామాన్య రష్యా పౌరులే సగటున 675 డాలర్లు అంటే 66 వేల రూబెల్స్ సంపాదిస్తున్నారని బీబీసీ టీమ్ గుర్తించింది.

వాగ్నర్ గ్రూప్ నేత ప్రిగోజిన్ స్థాపించిన రియా ఫ్యాన్ అనే వెబ్‌సైట్ కరెస్పాండెంట్ అలెక్సాండర్ సిమోనోవ్ చానల్‌పై వ్యాపార ప్రకటన కోసం ఒక్కో పోస్ట్‌కు 180 యూరోలను వసూలు చేస్తున్నారు.

మరో రియా ఫ్యాన్ రిపోర్టర్ అలెక్సాండర్ యారెంచుక్ కూడా తన చానల్‌పై ఒక్కో పోస్టుకి 86 యూరోలను వసూలు చేస్తున్నారు. ఈయనకు ఫాలోవర్స్ సంఖ్య కాస్త తక్కువగానే ఉంది.

ప్రభుత్వ అనుకూల మీడియా కోసం యుద్ధంపై రిపోర్టింగ్ చేయడంలో జెడ్-బ్లాగర్లకు మంచి అనుభవముంది.

ప్రముఖ వార్ బ్లాగర్లను ఇంటర్వ్యూ చేసేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ, అలెక్సాండర్ కోట్స్ తప్ప మరెవరూ ఇంటర్వ్యూ ఇచ్చేందుకు అంగీకరించలేదు.

రష్యా స్వాధీనం చేసుకున్న నగరం బఖ్ముత్ నుంచి యుద్ధానికి సంబంధించిన సమాచారాన్ని అందజేసే రిపోర్టర్‌గా ఆయన పేర్కొన్నారు.

బ్లాగర్లు షేర్ చేసిన వీడియో క్లిప్

రష్యాలో ఏం జరుగుతోంది?

‘‘రక్షణ శాఖ తరచూ మా మాటలు వింటోంది. వారికి ప్రైవేట్‌గా సమాచారాన్ని అందించేందుకు నేరుగా మా వద్ద మాధ్యమం ఉంది. ఇదంతా తెర వెనుకాల జరుగుతుంది. నేను దీన్ని చేస్తున్నాను’’ అని చెప్పారు.

జెడ్ బ్లాగర్స్ ప్రస్తుతం రష్యాలో పెరుగుతున్న మార్కెట్‌గా ఉంది. పేలుడు వీడియోలను ప్రచారం చేయడంతో వీరికి బాగా పేరు వచ్చింది. ఈ వీడియోల వల్ల వీరికి ఫాలోవర్స్ సంఖ్య కూడా పెరిగింది.

ఈ ఫాలోవర్లలో ఆ దేశంలో యుద్ధానికి మద్దతు ఇస్తున్న వారు, పశ్చిమ దేశాల వారు, యుక్రెయిన్ నిపుణులు ఉన్నారు. రష్యాలో అసలేం జరుగుతుందో తెలుసుకోవడం కోసం వారు వీరిని అనుసరిస్తున్నారు.

అయితే, యుద్ధ మద్దతుదారులు పోస్ట్ చేసే కొన్ని వీడియోలు తప్పుడివిగా కూడా ఉంటున్నాయి.

2022 మార్చిలో అలెక్సాండర్ కోట్స్ లాంటి ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్లందరూ డ్యాష్‌కామ్ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఇద్దరు పిల్లలు, మహిళ కారులో వెళ్తుండగా ఇద్దరు యుక్రెయిన్ సైనికులు ఆపినట్లు చూపించారు.

ఆమె రష్యా భాష మాట్లాడటంతో, ఆ మహిళను సైనికులు పంది అని పిలిచి, బెదిరించినట్లు చూపించారు.

సామాన్య పౌరులతో యుక్రెయిన్ ఎలా ప్రవర్తిస్తుందో తెలియజేసేందుకు ఇది సరైన ఉదాహరణ అని వీడియోలో జెడ్ బ్లాగర్లు చెప్పారు.

కానీ, ఈ వీడియోలో చూపించిన ప్రదేశాన్ని తాము గుర్తిస్తే, అది దోన్యస్క్ పట్టణానికి దగ్గర్లో ఉన్న ఒక ప్రాంతంగా తేలింది. యుక్రెయిన్‌కు చెందిన ఈ ప్రాంతం 2014 నుంచి రష్యా అనుకూల బలగాల చేతిలోనే ఉంది.

ఈ ప్రాంతంలో యూనిఫామ్ ధరించిన యుక్రెయిన్ సైనికులు పనిచేయడం అసాధ్యం.

అంతేకాక డ్యాష్‌కామ్‌లు యుక్రెయిన్‌లో నిషేధం కూడా. అలాగే, ఆ వాహనంపై వాడిన క్రాస్ గుర్తు, యుక్రెయిన్‌ బలగాలు వాడే క్రాస్ గుర్తుతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంది.

ఈ వీడియోలో చూపించిన అన్ని కూడా ఇది నకిలీదిగా, తప్పుడిదిగా నిరూపిస్తున్నాయి.

యుద్ధానికి మద్దతు ఇచ్చేలా రష్యా యువతను ప్రోత్సహించేందుకు ఇలాంటి తప్పుడు వీడియోలను వాడుతున్నారు.

వార్ బ్లాగర్ మరియానా నౌమోవా

ఫొటో సోర్స్, MARYANA NAUMOVA

రష్యాలో టెలిగ్రామ్‌‌కు వేగంగా పెరిగిన మార్కెట్

యుక్రెయిన్‌తో జరిగే యుద్ధంలో వాలంటీర్‌గా సేవలందిస్తున్న ఒక రష్యా వ్యక్తి.. ‘వార్ గోంజో’ రిపోర్ట్‌లను చూసిన తర్వాత, తాను యుద్ధానికి వచ్చినట్లు చెప్పారు.

టెలిగ్రామ్ చానల్‌పై సైనికులకు చెందిన వార్తలను, పరిశీలనను అనుసరిస్తున్నానని తెలిపారు.

పుతిన్ యుద్ధ అనుకూల బ్లాగర్లు ఇలా భారీగా పెరగడంపై ఈ ప్లాట్‌ఫామ్‌ను ప్రశ్నించగా.. ‘‘మెదుజ లాంటి స్వతంత్ర మీడియా సంస్థలు, బీబీసీ లేదా జెలియెన్‌స్కీ ప్రసంగాలు లాంటి అన్‌సెన్సార్డ్ ఇంటర్నేషనల్ వార్తలను రష్యన్ పౌరులు పొందేందుకు ఉన్న చిట్టచివరి ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్’’ అని పేర్కొంది.

అన్ని పార్టీలను తాము సమానంగా చూస్తున్నట్లు టెలిగ్రామ్ అధికార ప్రతినిధి చెప్పారు.

జెడ్ బ్లాగర్లు యుద్ధాన్ని చూపిస్తున్న తీరును అధ్యక్షుడు పుతిన్ మెచ్చుకుంటున్నారు.

అలెక్సాండర్ కోట్స్‌ను మానవ హక్కుల మండలిలో ఒక సభ్యుడిగా నియమించారు. సెమియోన్ పెగోవ్, ఇతర బ్లాగర్లను వర్కింగ్ గ్రూప్ సభ్యులుగా నియమించారు.

ఇవి కూడా చదవండి: