క్లస్టర్ బాంబులు: యుక్రెయిన్‌కు అమెరికా ఇస్తున్న ఈ బాంబులను వందకు పైగా దేశాలు నిషేధించాయి... ఇవి అంత ప్రమాదకరమా?

యుక్రెయిన్‌లో లభించిన క్లస్టర్ బాంబు

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, ఫ్రాంక్ గార్డనర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

యుక్రెయిన్‌కు క్లస్టర్ ఆయుధాలను సరఫరాపై సానుకూలంగా ఉన్నట్లు అమెరికా ప్రకటించింది. అయితే, ఈ చర్యను మానవ హక్కుల సంఘాలు విమర్శిస్తున్నాయి.

ఈ బాంబులను100కు పైగా దేశాలు నిషేధించాయి.

క్లస్టర్ వెపన్ అంటే రాకెట్, క్షిపణి లేదా ఫిరంగి షెల్ నుంచి పెద్ద సంఖ్యలో చిన్న బాంబులను వెదజల్లే పద్ధతి.

విమానంలోంచి ప్రయోగించినపుడు ఇది విడిపోయి బాంబులను వెదజల్లుతుంది. దీనివల్ల ఎక్కువ విస్తీర్ణంలో బాంబుల వర్షం కురుస్తుంది.

చాలావరకు తడి లేదా మెత్తటి నేల మీద పడిన తర్వాత అవి పేలుతాయి. ఇవన్నీ ఎక్కువ ప్రభావంతో పేలడానికి ప్రయోగిస్తారు కానీ, కొన్నిబాంబులు పేలకుండా (డడ్ రేటు) ఉంటాయి.

ఎవరైనా ఆ బాంబులను తొక్కినా, తీసినా అవి పేలవచ్చు. చెల్లాచెదురుగా ఎక్కువ ప్రాంతంలో ఇవి పడటం వల్ల సాధారణంగా పౌరుల ప్రాణాలు పోతుంటాయి.

అంతేకాదు, అందులో పేలకుండా ఉండిపోయినవి ఇలా దశాబ్దాల తరువాత కూడా ఎవరినో ఒకరిని బలి తీసుకుంటుంటాయి.

కందకాలు, తవ్విన నేలలో వాటిని వాడినపుడు అవి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయని మిలటరీలు భావిస్తాయి.

ఆ ప్రాంతాలను జాగ్రత్తగా క్లియర్ చేసే వరకు అక్కడ తిరగడం చాలా ప్రమాదకరం.

క్లస్టర్ బాంబులు

ఫొటో సోర్స్, Reuters

ఆ బాంబులను ఎందుకు నిషేధించారు?

క్లస్టర్ ఆయుధాలను నిషేధిస్తూ యూకే, ఫ్రాన్స్, జర్మనీతో సహా 100 కంటే ఎక్కువ దేశాలు అంతర్జాతీయ ఒప్పందంపై సంతకం చేశాయి.

పౌరులపై ఈ ఆయుధాల ప్రభావం తీవ్రంగా ఉండటంతో వాటి 'నిల్వ, వినియోగంపై నిషేధం' నిర్ణయం తీసుకున్నారు.

మానవ హక్కుల సంఘాలు ఈ క్లస్టర్ ఆయుధాలను అసహ్యకరమైనవిగా, వీటి వాడకాన్ని యుద్ధ నేరంగా అభివర్ణించాయి.

ముఖ్యంగా బొమ్మలను పోలి ఉండే ఈ క్లస్టర్ బాంబులు చిన్నారుల పాలిట శాపం అని చెప్పొచ్చు.

యుద్ధాల్లో వేసిన ఈ బాంబులను తరువాత కాలంలో ఆ ప్రాంతాల్లో తిరుగాడే పిల్లలు బాంబులని తెలుసుకోలేక ఆట వస్తువులుగా భావించి బలైపోయిన ఘటనలు ప్రపంచవ్యాప్తంగా కోకొల్లలు.

క్లస్టర్ బాంబులు వేసేటప్పుడు చనిపోయిన పౌరుల్లో 33 శాతం బాలలే. ఇక ఎప్పుడో వేసిన క్లస్టర్ బాంబుల వల్ల తరువాత కాలాల్లో చనిపోయినవారిలోనూ 62 శాతం మంది చిన్నారులే.

2017లో ఇలాంటి క్లస్టర్ బాంబుల అవశేషాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా 289 మంది ప్రాణాలు కోల్పోయారని 'కొయిలేషన్ అగెనెస్ట్ క్లస్టర్ బాంబ్స్' నివేదిక వెల్లడించింది.

ఇందులో అత్యధికంగా సిరియాలో 187, యెమెన్‌లో 54 మంది మృత్యువాతపడ్డారు. వీటితో తాజా దాడులతో పాటు ఎప్పుడో జారవిడిచిన బాంబు వల్లా మరణాలు నమోదయ్యాయి.

2016లో మొత్తం 971 మంది ఇలా ప్రాణాలు కోల్పోగా అందులో ఒక్క సిరియాలోనే 857 మంది చనిపోయారు.

కంబోడియా, ఇరాక్; లావోస్, లెబనాన్, సెర్బియా, సిరియా, వియత్నాం వంటి ఇతర దేశాల్లోనూ క్లస్టర్ బాంబులు ఎందరివో ప్రాణాలు తీశాయి.

క్లస్టర్
ఫొటో క్యాప్షన్, క్లస్టర్ ఆయుధం ప్రయోగ దృశ్యం

ఎవరు వినియోగిస్తున్నారు?

రష్యా, యుక్రెయిన్ రెండూ క్లస్టర్ ఆయుధాలను ఉపయోగిస్తున్నాయి.

వాటిని నిషేధించే ఒప్పందంపై ఇరు దేశాలు సంతకం చేయకపోవడమే దీనికి కారణం.

అంతేకాదు ఈ ఒప్పందంలో అమెరికా కూడా లేదు. అయితే, రష్యా ఈ క్లస్టర్ ఆయుధాన్ని విస్తృతంగా ఉపయోగించడాన్ని అమెరికా గతంలో విమర్శించింది.

రష్యన్ క్లస్టర్ ఆయుధాలలో 40 శాతం పేలకుండా ఉన్నాయని తెలిపింది. అంటే ఆ ప్రాంతం అత్యధిక ప్రమాదంలో ఉన్నట్లే.

అయితే, పేలకుండా ఉన్న బాంబులు 20 శాతం మాత్రమేనని పలువురు నమ్ముతున్నారు.

అమెరికా మాత్రం తన బాంబులలో 3 శాతం మాత్రమే పేలకుండా (డడ్ రేటు) ఉంటాయని అంచనా వేస్తోంది.

జెలియన్ స్కీ, బైడెన్

ఫొటో సోర్స్, Reuters

యుక్రెయిన్ క్లస్టర్ ఆయుధాలను ఎందుకు అడుగుతోంది?

యుక్రెయిన్ దళాలలో ఫిరంగి గుండ్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే రష్యా మాదిరే యుక్రెయిన్ కూడా వాటిని ఎక్కువగా ఉపయోగిస్తోంది.

అయితే, యుక్రెయిన్ పాశ్చాత్య మిత్రదేశాలు అంత వేగంగా వాటిని అందివ్వలేవు. దక్షిణ, తూర్పు యుక్రెయిన్‌ యుద్దభూమిలో ఫిరంగి కీలక ఆయుధంగా మారింది.

ఆక్రమణకు గురైన తమ 1,000 కి.మీ. భూభాగం నుంచి రష్యన్ సైనికులను తరిమికొట్టేందుకు యుక్రెయిన్ చాలా కష్టపడుతోంది.

తమ వద్ద తగినంత ఫిరంగి గుండ్లు లేనందున, రష్యన్ పదాతిదళాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి క్లస్టర్ ఆయుధాలు సరఫరా చేయాల్సిందిగా అమెరికాను కోరింది యుక్రెయిన్.

అయితే అమెరికాకు ఇది అంత తేలికైన నిర్ణయం కాదు. దీనిపై డెమొక్రాట్‌లు, మానవ హక్కుల న్యాయవాదులకు మధ్య కనీసం ఆరు నెలలుగా చర్చ సాగుతోంది.

బాంబులు

ఫొటో సోర్స్, LEGACIES OF WAR

అమెరికా నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపుతుంది?

తక్షణ ప్రభావం అంటే ఈ యుద్ధంలో అమెరికా నైతికత దెబ్బతినొచ్చు.

రష్యాపై ఆరోపించిన యుద్ధ నేరాలను బయటి ప్రపంచానికి చాటి చెప్పడంలో సఫలమైనా, ఈ చర్య అమెరికాను వేలెత్తి చూపే అవకాశం ఉంది.

క్లస్టర్ ఒక భయంకరమైన, విచక్షణారహిత ఆయుధం. దీన్ని ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో నిషేధించారు.

అమెరికా నిర్ణయం పాశ్చాత్య మిత్రదేశాలతో కొంత వైరుధ్యాన్ని కలిగించొచ్చు. దీంతో కూటమిలో చీలికకూ దారి తీయవచ్చు, రష్యా కోరుకునేది కూడా అదే.

కాగా, క్లస్టర్ ఆయుధాల నిషేధ ఒప్పందపై భారత్, పాక్ దేశాలు కూడా సంతకం చేయలేదు.

క్లస్టర్

ఫొటో సోర్స్, JOEL GUNTER/BBC

అత్యధికంగా బాంబులు పడిన దేశం

వియత్నాం యుద్ధ సమయంలో అమెరికా లావోస్‌లో 27 కోట్ల బాంబులను జారవిడిచిందని చెబుతారు. అందుకే అక్కడి జనాభాతో పోల్చినప్పుడు ఇది ఎన్నో రెట్లు ఎక్కువ.

1960లో అమెరికా లావోస్‌లో ఇలాంటి బాంబుల దాడి ప్రారంభించగా ఇప్పటి వరకు లావోస్‌లోనే అత్యధికంగా 7,697 మంది వీటి కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

ఆ తరువాత సిరియాలో 3,081... ఇరాక్‌లో 3,039 మంది మరణించారు.

ప్రపంచవ్యాప్తంగా 33కి పైగా దేశాల్లో 56 వేల మరణాలు వీటి వల్లే సంభవించినట్లు నివేదిక వెల్లడిస్తోంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)