ప్రధాని మోదీపై పొగడ్తల వర్షం కురిపించిన రష్యా అధ్యక్షుడు, సడెన్‌గా ఎందుకింత ప్రేమ?

వ్లాదిమిర్ పుతిన్, నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికాకు వెళ్లి వచ్చిన తర్వాత భారత్, రష్యాల మధ్యనున్న సంబంధాలపై చాలా విషయాలు చర్చనీయమవుతున్నాయి.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం మాస్కోలో ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీని ప్రాణ స్నేహితుడని వర్ణించి, మేకిన్ ఇండియాను పొగిడినప్పటికీ ఈ ఊహాగానాలు ఆగలేదు.

‘‘రష్యాకు నరేంద్రమోదీ మంచి స్నేహితుడు. కొన్నేళ్ల క్రితం మేకిన్ ఇండియా(భారత్‌లోనే తయారీ) కార్యక్రమాన్ని ప్రధాని మోదీ అమల్లోకి తెచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థపై మేకిన్ ఇండియా కార్యక్రమం గణనీయమైన ప్రభావాన్ని చూపించింది’’ అని వ్లాదిమిర్ పుతిన్ అన్నారు.

పుతిన్ మాట్లాడిన ఈ వీడియో క్లిప్‌ను రష్యా ప్రభుత్వ నియంత్రణలోని న్యూస్ టీవీ ఆర్‌టీ ట్విటర్‌లో షేర్ చేసింది.

ప్రధాని మోదీపై రష్యా అధ్యక్షుడు పొగడ్తల వర్షం కురిపించడం, రష్యాకు భారత్ ఎంత ముఖ్యమో అనే కోణంలో కూడా చూడొచ్చు.

యుక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించిన తర్వాత, రష్యాపై పశ్చిమ దేశాలన్ని కఠిన ఆంక్షలు విధించాయి.

కానీ, ఈ సమయంలో రష్యా నుంచి భారత్ పెద్ద మొత్తంలో ఆయిల్‌ కొనుగోలు చేసింది. ఇది రష్యాకు ఆర్థికంగా బాగా సాయపడింది.

ప్రపంచం ఎన్నో సమస్యలతో సతమతమవుతోంది, అయినప్పటికీ భారత్, రష్యాల మధ్య సంబంధాలు స్థిరంగా ఉన్నాయని అంటూ భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ కూడా దిల్లీలో ఓ కార్యక్రమంలో అన్నారు.

‘‘ఎన్ని సవాలున్నప్పటికీ, రష్యాతో మా సంబంధాలు చెక్కుచెదరవు’’ అని జైశంకర్ అన్నారు.

రష్యాతో సంబంధాల ప్రాధాన్యాన్ని తాము పరిశీలిస్తూ వస్తున్నామని అన్నారు.

కేవలం రక్షణ అవసరాల కోసం మాత్రమే రష్యాతో భారత్ స్నేహ బంధం కొనసాగుతుందని చూడటం తప్పు అని చెప్పారు.

తమ సంబంధాలు దీనికి మించినవని తెలిపారు. రష్యాతో సంబంధాల విషయంలో తమకు సొంత భౌగోళిక రాజకీయ అంశాలున్నాయన్నారు.

రెండు దేశాల మధ్య ఆర్థిక పరమైన విషయాల్లో సహకారం పెరుగుతుందని తెలిపారు.

వ్లాదిమిర్ పుతిన్, నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

భారత్, రష్యాల స్నేహం

ప్రచ్ఛన్న యుద్ధం కాలం నుంచే భారత్, రష్యాల మధ్య సంబంధాలు కాలపరీక్షకు తట్టుకుని నిలిచినట్లు పరిగణిస్తారు.

రక్షణ, చమురు, అణు శక్తి, అంతరిక్ష రంగాలలో రెండు దేశాల మధ్య సహకారం ఉంది.

కానీ, చైనాకు రష్యా దగ్గరవడంతో భారత్‌తో రష్యా సంబంధాలపై అనుమానాలు పెరిగాయి.

యుక్రెయిన్‌తో ప్రస్తుతం యుద్ధం ప్రారంభించిన తర్వాత, చైనాకు రష్యా జూనియర్ పార్టనర్‌గా మారింది.

1950లో ప్రచ్ఛన్న యుద్ధం కాలం నుంచే సోవియట్ యూనియన్‌తో భారత్ బలమైన సంబంధాలను ఏర్పాటు చేసుకోవడం ప్రారంభించింది.

పాకిస్తాన్‌తో భారత్ యుద్ధం చేసినప్పుడు, రష్యాతో సంబంధాలు మరింత పెరిగాయి.

1965లో భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం ముగిసేందుకు మధ్యవర్తిగా సోవియట్ యూనియన్ కీలక పాత్ర పోషించింది.

1971లో పాకిస్తాన్‌లో మరోసారి భారత్ యుద్ధం చేసినప్పుడు, ఐక్యరాజ్యసమితిలో భారత్‌కు మద్దతు తెలిపేందుకు సోవియట్ యూనియన్ తన వీటో అధికారాన్ని ఉపయోగించింది.

భారత్, సోవియట్ యూనియన్‌ల మధ్య 1971లో శాంతి, స్నేహం, సహకారం విషయంలో త్రైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.

సోవియట్ యూనియన్ కుప్పకూలినప్పుడు ఈ ఒప్పందం 1993 జనవరిలో ఇండో-రష్యన్ స్నేహబంధం, సహకార సంధిగా మారింది.

1971లో భారత్, పాకిస్తాన్‌ల మధ్య 13 రోజులు యుద్ధం జరిగింది.

ఈ యుద్ధంతో తూర్పు పాకిస్తాన్‌(ప్రస్తుత బంగ్లాదేశ్) మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంది.

ఈ యుద్ధం తర్వాత తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్‌గా అవతరించింది.

తూర్పు పాకిస్తాన్‌లో పశ్చిమ పాకిస్తాన్‌ అధికారం గురించి భారత్ ప్రపంచం మొత్తానికి తెలియజేసేందుకు అంతకుముందు ఎంతో ప్రయత్నించింది.

తూర్పు పాకిస్తాన్ నుంచి పెద్ద సంఖ్యలో శరణార్థులు భారత్‌కు వచ్చారు.

తూర్పు, పశ్చిమ పాకిస్తాన్‌ల మధ్యలో రాజకీయ సమస్యలకు పరిష్కారం దక్కుతుందనే విషయంలో భారత్ ఆశలు వదులుకుంది.

ఆ సమయంలో కేవలం సోవియట్ యూనియన్ మాత్రమే భారత్ వాదనను వినిపించుకుంది.

వ్లాదిమిర్ పుతిన్

ఫొటో సోర్స్, Getty Images

‘భారత్-సోవియట్‌ల శాంతి, స్నేహం, సహకారం ఒప్పందం’పై ఇందిరా గాంధీ సంతకం

1971 ఆగస్టులో ‘భారత్-సోవియట్‌ల శాంతి, స్నేహం, సహకారం ఒప్పందం’పై భారత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ సంతకం చేశారు.

ఈ ఒప్పందం కింద యుద్ధం సమయంలో తాము ఆయుధ, దౌత్యపరమైన మద్దతు కల్పిస్తామని భారత్‌కు సోవియట్ యూనియన్ హామీ ఇచ్చింది.

భారత్‌కు మాస్కో నమ్మకమైన భాగస్వామిగా ఉంటూ వస్తోంది.

మరోవైపు, భారత్‌ కంటే పాకిస్తాన్‌కు అమెరికా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది.

2022 ఫిబ్రవరిలో యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించినప్పుడు, ఐక్యరాజ్య సమితిలో రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు భారత్ ముందుకు రాలేదు.

యుక్రెయిన్‌పై రష్యా దాడిని భారత్ ఎప్పుడూ విమర్శించలేదు.

అమెరికా, యూరోపియన్ దేశాల నుంచి ఒత్తిడి పెరుగుతున్నప్పటికీ, గత ఏడాది సెప్టెంబర్‌లో కెమెరాల ముందు మాట్లాడినప్పుడు కూడా ఇది యుద్ధాలు చేసే యుగం కాదని మాత్రమే నరేంద్ర మోదీ, పుతిన్‌తో అన్నారు.

ప్రజాస్వామ్యం, దౌత్యం, సంభాషణల ద్వారా ప్రపంచాన్ని ఐక్యమత్యంగా ఉంచొచ్చని ప్రధాని మోదీ చెప్పారు.

ఆ సమయంలో ఉజ్బెకిస్తాన్‌లోని సమర్కాంద్ నగరంలో జరిగిన షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ సమిట్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ప్రధాని మోదీని కలుసుకున్నారు.

1962లో చైనాతో జరిగిన భీకర యుద్ధం అనంతరం, సోవియట్ యూనియన్‌తో భారత్ రక్షణ సంబంధాలు బాగా పెంచుకుంది.

1990 ప్రారంభంలో భారత ఆర్మీలో సోవియట్ యూనియన్ తయారు చేసిన ఆయుధాల వాటా 70 శాతంగా, ఎయిర్‌ ఫోర్స్ సిస్టమ్‌లో 80 శాతంగా, నేవిలో 85 శాతంగా ఉంది. భారత్ తన తొలి ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యను 2004లో రష్యా నుంచి కొనుగోలు చేసింది.

రష్యా రాయబారి ఏం చెప్పారు?

ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు, ఇంగ్లీష్ వార్తాపత్రిక హిందూస్తాన్ టైమ్స్‌తో భారత్‌లోని రష్యా రాయబారి డేనిస్ అలిపోవ్ మాట్లాడారు.

భారత్ డిమాండ్‌కు అనుగుణంగా తాము ఆయిల్ సరఫరాను కొనసాగిస్తామని తెలిపారు.

చమురు సరఫరాలను చేరుకునేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని, వాణిజ్యంలో అసమతుల్యతను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.

పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించడంతో తమ రెండు దేశాలు కొత్త చెల్లింపుల విధానంపై కూడా పనిచేస్తున్నట్లు అలిపోవ్ తెలిపారు. ప్రత్యామ్నాయ చెల్లింపుల విధానాన్ని ఏర్పాటు చేసే పనులు కొనసాగుతున్నాయని అన్నారు.

చైనాతో రష్యా సంబంధాలు బలంగా మారడం, భారత్, రష్యాల మధ్య సంబంధాలను దెబ్బకొడుతుందా? అనే ప్రశ్నపై కూడా అలిపోవ్ స్పందించారు.

‘‘రష్యాలో చైనా ఉనికి పెరుగుతుందని ఆందోళన చెందే కంటే, రష్యా మార్కెట్లో భారత్ విస్తరణను ప్రోత్సహించి ఉంటే బాగుండేది’’ అని అన్నారు.

రష్యా అధ్యక్షుడి ప్రసంగం

ఫొటో సోర్స్, Getty Images

రష్యా చమురు భారత్‌కు రావడం ఎల్లకాలం కొనసాగుతుందా?

‘‘భారత్‌లో డిమాండ్ ఉన్నంత కాలం, మేము సరఫరా కొనసాగిస్తాం’’ అని అలిపోవ్ సమాధానమిచ్చారు.

చమురు సరఫరాలతో 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయిలో 44.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

భారత్ మొత్తం ఆయిల్ దిగుమతుల్లో మూడింట ఒకవంతు వాటా రష్యాదే.

భారత ఎనర్జీ సెక్యూరిటీలో రష్యా అతిపెద్ద వాటాదారి. భారత్‌కు దీర్ఘకాలిక ఎనర్జీ సరఫరాదారిగా ఉండేందుకు తాము కృషి చేస్తున్నామని అలిపోవ్ తెలిపారు.

చైనాతో ఉన్న బలమైన సంబంధాలపై స్పందించిన అలిపోవ్, రష్యా ఏ దేశంపై ఆధారపడదని స్పష్టం చేశారు.

చైనా లేదా మరే దేశంతోనైనా తమ ఆర్థిక సంబంధాల విస్తరిస్తున్నామంటే, అది ఎవరికీ ఒక రాజకీయ మాధ్యమం కాదన్నారు.

భారత్, చైనా ఇరు దేశాలతో రష్యా మంచి సంబంధాలను ఏర్పాటు చేసుకుంది.

ఈ సంబంధాలు దేశాల మధ్య పరస్పర సంబంధాలకు అనుగుణంగా ఉన్నాయి. తమ వద్ద ఎలాంటి దాపరిక అజెండా లేదని అలిపోవ్ స్పష్టీకరించారు.

‘‘భారత్, చైనాల మధ్య సంబంధాలు సాధారణమైనవిగా ఉండాలని రష్యా కోరుకుంటోంది. యూరోసియాలో స్థిరత్వానికి ఇది చాలా అవసరం. యుక్రెయిన్ సంక్షోభంలో కూడా భారత్ అనుసరిస్తోన్న విధానం భాధ్యతాయుతమైన ప్రపంచ శక్తిగా అనిపిస్తుంది’’ అని అలిపోవ్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.