జనాభాలో చైనాను దాటేసిన భారత్ సూపర్ పవర్‌గానూ మారుతుందా?

భారత్ శకం మొదలైందని 2001లో ఆర్థిక శాస్త్ర నోబెల్‌ను గెలుచుకున్న స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మైకెల్ స్పెన్స్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్ శకం మొదలైందని 2001లో ఆర్థిక శాస్త్ర నోబెల్‌ను గెలుచుకున్న స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మైకెల్ స్పెన్స్ చెప్పారు
    • రచయిత, రిచర్డో సెర్నా
    • హోదా, గ్లోబల్ పాపులేషన్ కరస్పాండెంట్

భూమిపై అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనాను అధిగమించి భారత్‌ కొత్త రికార్డు నెలకొల్పిందని తాజాగా ఐక్యరాజ్యసమితి గణాంకాలు వెల్లడించాయి.

మరి ‘‘గ్లోబల్ సూపర్‌పవర్‌’’గానూ చైనాను భారత్ దాటుకొని ముందుకు వెళ్లగలదా?

ఆర్థిక పరిమాణం, భౌగోళిక-రాజకీయ ప్రాబల్యం, సైనిక శక్తిలో ప్రస్తుతానికి చైనా ముందంజలో ఉంది. అయితే, పరిస్థితులు మారుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

భారత్ శకం మొదలైందని 2001లో ఆర్థిక శాస్త్ర నోబెల్‌ను గెలుచుకున్న స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మైకెల్ స్పెన్స్ చెప్పారు.

‘‘చైనా వేగాన్ని భారత్ అందుకుంటుంది. అంతేకాదు, భవిష్యత్‌లో చైనా వృద్ధి రేటు మందగిస్తుంది. కానీ, భారత్‌లో ఆ సూచనలేవీ కనిపించడం లేదు’’అని ఆయన అన్నారు.

అయితే, ఇక్కడ మరికొన్ని ఇతర సవాళ్లు కూడా ఉన్నాయి.

ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా కొనసాగుతోంది. భారత్‌తో పోలిస్తే చైనా ఆర్థిక వ్యవస్థ ఐదు రెట్లు పెద్దది. భారత్ ప్రస్తుతం ఐదో స్థానంలో కొనసాగుతోంది.

చైనా తరహాలో దూసుకువెళ్లాలంటే భారత్‌లో విద్య, జీవన ప్రమాణాలు, జెండర్ సమానత్వం, ఆర్థిక సంస్కరణల్లో భారీగా పెట్టుబడులు అవసరం.

ఇక్కడ సూపర్‌పవర్ అంటే జనాభా, ఆర్థిక వ్యవస్థలకు వెలుపలి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. భౌగోళిక-రాజకీయ అంశాలు, సైనిక శక్తి లాంటి వాటిని కూడా విశ్లేషించాలి. అయితే, వీటిలో భారత్ చాలా వెనుకబడి ఉంది.

ఇక్కడ ‘‘సాఫ్ట్‌ పవర్’’ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. బాలీవుడ్ సినీ పరిశ్రమ భారత్‌ సంస్కృతీ, అభిరుచులను ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లోనూ భారత్ సినిమాలు కొత్తరికార్డులు సృష్టిస్తున్నాయి.

అయితే, ఇక్కడ చైనావుడ్ కూడా ఉంది. ఇది తొలిసారిగా 2020లో బాక్సాఫీస్ కలెక్షన్లలో హాలీవుడ్‌ను దాటుకుని ముందుకు వెళ్లింది. 2021లోనూ మరోసారి దీన్ని రుజువుచేసి చూపించింది.

జననాల రేటు పడిపోవడంతో చైనా జనాభా ఇప్పటికే తగ్గిపోతోంది
ఫొటో క్యాప్షన్, జననాల రేటు పడిపోవడంతో చైనా జనాభా తగ్గిపోతోంది

భారత్ ఆర్థిక వృద్ధి ఎలా ఉంది?

భారత్‌లో రోజుకు 86,000 మంది శిశువులు జన్మిస్తున్నారు. చైనాలో ఇది 49,400గా ఉంది.

జననాల రేటు పడిపోవడంతో చైనా జనాభా ఇప్పటికే తగ్గిపోతోంది. ఈ శతాబ్దం చివరినాటికి చైనా జనాభా వంద కోట్ల కంటే తగ్గిపోతోంది.

అయితే, భారత్ జనాభా 2064 వరకూ పెరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతమున్న 140 కోట్ల నుంచి ఆ ఏడాదికి 170 కోట్లకు పెరుగుతుంది. భారత్‌లో పనిచేసే వారి సంఖ్య పెరగడంతో, ఆర్థిక వృద్ధికి కూడా ఊతం వస్తుంది. దీన్నే ‘‘డిమొగ్రఫిక్ డివిడెండ్’’గా చెబుతారు.

‘‘1990ల్లో భారత్ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. అయితే, కార్మిక శక్తిలో ఎందరు చదువుకున్న వారు, ఆరోగ్యవంతులు, నైపుణ్యవంతులు ఉన్నారు? అనేది ఇప్పుడు ముఖ్యం’’ అని న్యూయార్క్‌లోని న్యూస్కూల్ ఇండియా చైనా ఇన్‌స్టిట్యూట్‌ ప్రొఫెసర్ మార్క్ ఫ్రేజియర్ అన్నారు.

యాపిల్, ఫాక్స్‌కాన్ లాంటి అగ్రశ్రేణి కంపెనీలు వస్తున్నప్పటికీ, భారత్‌లోని అధికారిక యంత్రాంగం, పదేపదే మారుస్తున్న విధానాలు మదుపరులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

‘‘జనాభా ఎంత ఎక్కువ ఉంటే అంత శక్తిమంతమైన దేశం అనేది 19వ శతాబ్దంనాటి మాట’’అని ఫ్రేజియర్ అన్నారు. నేడు చాలా అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.

నేడు భారత్‌లోని జనాభాలో పనిచేసే వయసు (14 నుంచి 64 ఏళ్లు)లో సగం మంది మాత్రమే పనిచేస్తున్నారని ప్రపంచ బ్యాంకు గణాంకాలు చెబుతున్నాయి.

పనిచేసే మహిళల విషయానికి వస్తే, ఇది 25 శాతంగా ఉంది. చైనాలో ఇది 60 శాతం ఉండగా, ఈయూలో 52 శాతముంది.

1980, 1990ల్లో వరుస సంస్కరణల తర్వాత చైనా ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టింది. కానీ, కోవిడ్-19 ప్రభావం ఒకవైపు, పెరుగుతున్న జనాభా సగటు వయసు మరోవైపు, పశ్చిమ దేశాలతో విభేదాలు ఇంకొకవైపు వృద్ధికి కళ్లెం వేస్తున్నాయి.

ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం, భారత్ వృద్ధి రేటు చైనా కంటే వేగంగా ముందుకు వెళ్తోంది. భవిష్యత్‌లోనూ ఇది ఇలానే కొనసాగొచ్చని అంచనాలు చెబుతున్నాయి.

చైనా సాయుధ బలగాల్లో జవాన్ల సంఖ్య భారత్ కంటే 6,00,000 ఎక్కువ
ఫొటో క్యాప్షన్, చైనా సాయుధ బలగాల్లో జవాన్ల సంఖ్య భారత్ కంటే 6,00,000 ఎక్కువ

వృద్ధి రేటు తక్కువగా ఉంటే చైనా ప్రాబల్యం కూడా తగ్గుతుందా?

‘‘2030 వరకూ చైనా వృద్ధి రేటు నాలుగు లేదా ఐదు శాతం మధ్య ఉంటుంది. ఒకప్పుడు 8 నుంచి 9 శాతం మధ్య వృద్ధి రేటు నమోదుచేసిన దేశానికి నేటి పరిస్థితిని ఆర్థిక మందగమనంగా కొందరు చెబుతున్నారు. కానీ, మనం అలా చూడకూడదు’’ అని ప్రొఫెసర్ స్పెన్స్ చెప్పారు.

‘‘చైనా నేడు దాదాపుగా అమెరికాలా మారిపోయింది. అమెరికాలోనూ అంతే.. 8, 9, 10 శాతం లాంటి వృద్ధి రేట్లు కనిపించవు. అయితే, విద్య, సైన్స్, టెక్నాలజీల్లో భారీ పెట్టుబడుల వల్ల ఆధిపత్యం కొనసాగుతోంది’’ అని ఆయన అన్నారు.

చైనా సైనిక శక్తి

చైనా, భారత్.. రెండు దేశాలూ అణు ఆయుధాలున్న దేశాలే. ఫలితంగా ప్రపంచ చెస్‌బోర్డులో వీటికంటూ వ్యూహాత్మక స్థానముంది.

భారత్‌తో పోలిస్తే, చైనా అణ్వాయుధాల అమ్ముల పొది 2.5 రెట్ల పెద్దదని ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ అంచనా వేస్తోంది.

చైనా సాయుధ బలగాల్లో జవాన్ల సంఖ్య భారత్ కంటే 6,00,000 ఎక్కువ. రక్షణ రంగంలో చైనా భారీగా పెట్టుబడులు పెడుతోంది.

‘‘ఈ విషయంలో రష్యాపై భారత్ అతిగా ఆధారపడుతోంది. టెక్నాలజీ, రక్షణ రంగ ఉత్పత్తులు చాలావరకూ అక్కడి నుంచే వస్తున్నాయి. కానీ, చైనా మాత్రం టెక్నాలజీపై పరిశోధనలు, కొత్త పరికరాలను దేశీయంగా తయారుచేయడంపై భారీగా పెట్టుబడులు పెడుతోంది’’ అని ఫ్రేజియర్ చెప్పారు.

రక్షణ రంగంలో చైనా ముందంజలో ఉంది. అయితే, ఈ టెక్నాలజీలో అగ్రదేశాలుగా కొనసాగుతున్న అమెరికాతోపాటు యూరోపియన్ యూనియన్ సభ్యులతోనూ భారత్‌కు మంచి సంబంధాలున్నాయి.

‘‘ఇండో పసిఫిక్‌లో పశ్చిమ దేశాల వ్యూహాత్మక భాగస్వామిగా భారత్ కొనసాగుతోంది. ఇక్కడ చైనా చుట్టుపక్కల కొత్త సెక్యూరిటీ జోన్ తరహా కూటమిని ఏర్పాటుచేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. ఇది తూర్పు ఆసియాకు మాత్రమే పరిమితం కాదు. పశ్చిమ పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రంలో దేశాలనూ దీనిలో భాగస్వామ్యం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి’’ అని ఫ్రేజియర్ అన్నారు.

ఈ ఏడాది జీ-20 సదస్సుకు భారత్ అతిథ్యమిస్తోంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఈ ఏడాది జీ-20 సదస్సుకు భారత్ అతిథ్యమిస్తోంది

భౌగోళిక-రాజకీయ పరిస్థితులు ఇలా..

ఈ ఏడాది జీ-20 సదస్సుకు భారత్ అతిథ్యమిస్తోంది. 85 శాతం ఆర్థిక వ్యవస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్న దేశాల ఎదుట తమ సంస్కృతీ, సంప్రదాయాలు, భౌగోళిక-రాజకీయ శక్తిసామర్థ్యాలను ప్రదర్శించేందుకు భారత్‌కు ఇదొక మంచి అవకాశం.

అయితే, అమెరికా అధ్యక్షుడిగా డోనల్డ్ ట్రంప్ హయాంలో అమెరికాతో చైనా సంబంధాలు మరింత దిగజారాయి. అయినప్పటికీ రష్యా, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా లాంటి 120కిపైగా దేశాలతో చైనాకు దృఢమైన ఆర్థిక సంబంధాలున్నాయి.

మరోవైపు బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్‌తోనూ విదేశాల్లో ప్రాబల్యం కోసం చైనా ప్రయత్నిస్తోంది.

భారత్‌ను ప్రధాన మిత్రదేశంగా పశ్చిమ దేశాలు చూస్తున్నప్పటికీ, ఐక్యరాజ్యసమితి శాశ్వత సభ్యదేశాల్లో చైనా ఒకటి. అంటే ఏదైనా నిర్ణయాన్ని వీటో చేసే శక్తి చైనాకు ఉంది.

ఈ శాశ్వత సభ్యత్వాన్ని విస్తరించాలని భారత్‌తోపాటు కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాయి. కానీ, ఎలాంటి ఫలితమూ కనిపించడం లేదు.

వరుసగా రెండేళ్లపాటు వసూళ్లలో హాలీవుడ్‌ను చైనా దాటినప్పటికీ, 2022లో కోవిడ్-19 వ్యాప్తి ఆంక్షలతో 36 శాతం వసూళ్లు పడిపోయాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వరుసగా రెండేళ్లపాటు వసూళ్లలో హాలీవుడ్‌ను చైనా దాటినప్పటికీ, 2022లో కోవిడ్-19 వ్యాప్తి ఆంక్షలతో 36 శాతం వసూళ్లు పడిపోయాయి

సాఫ్ట్ పవర్

శతాబ్దం క్రితం అమెరికా విలువలను ప్రపంచ దేశాల్లో ప్రోత్సహించడానికి హాలీవుడ్‌ను ఒక అస్త్రంగా మలుచుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇప్పుడు ఇదే వ్యూహాన్ని చైనా కూడా అనుసరిస్తోంది.

2007 నుంచి చైనాలో సినిమా స్క్రీన్‌ల సంఖ్య 20 రెట్లు పెరిగింది. ఇప్పుడు ఇది ఏడాదికి 80,000కు పెరిగింది. అమెరికాలో ఇది 41,000 కాగా, భారత్‌లో ఇది 9,300 మాత్రమే.

‘‘కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తికి ముందు చైనావుడ్ వృద్ధి బాటలో పరుగులు తీసేది. కొన్ని హాలీవుడ్ ఫిల్మ్ స్టూడియోలను చైనా సంస్థలు కొనుగోలు చేశాయి. మరోవైపు హాలీవుడ్ ప్రముఖలతో కలిసి చైనా సినీప్రముఖులు సినిమాలను నిర్మించడం మొదలుపెట్టారు’’ అని కాలిఫోర్నియా యూనివర్సిటీలోని మీడియా, కల్చరల్ స్టడీస్ ప్రొఫెసర్ వాండీ సూ చెప్పారు.

వరుసగా రెండేళ్లపాటు వసూళ్లలో హాలీవుడ్‌ను చైనా దాటినప్పటికీ, 2022లో కోవిడ్-19 వ్యాప్తి ఆంక్షలతో 36 శాతం వసూళ్లు పడిపోయాయి.

మరోవైపు బాలీవుడ్‌కు కూడా ఆసియా హాలీవుడ్‌గా పేరుంది. అయితే, ఇక్కడ చాలామందికి చైనావుడ్ పేరు కూడా తెలియదు.

‘‘ప్రపంచ దేశాల్లో బాలీవుడ్ ప్రభావం చాలా ఎక్కువ’’అని ప్రొఫెసర్ సూ చెప్పారు.

‘‘నిజానికి చైనాలోనూ బాలీవుడ్ సినిమాలు మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. 2016లో ఇక్కడ విడుదలైన దంగల్ చైనాలో విడుదలైన హాలీవుడ్ సినిమాలను తోసిరాజని వరుసగా 16 రోజులు అత్యధిక వసూళ్లను రాబట్టింది. దాదాపు 60 రోజులు ఇక్కడ దంగల్‌ను ప్రదర్శించారు. ఇది చైనాలో సుదీర్ఘకాలం ప్రదర్శించిన విదేశీ సినిమాల్లో ఒకటిగా రికార్డు సృష్టించింది’’ అని సూ తెలిపారు.

వీడియో క్యాప్షన్, నచ్చినప్పుడు, నచ్చిన వ్యక్తి ద్వారా గర్భం దాల్చే అవకాశం మహిళలకు వస్తే ఏం జరుగుతుంది?

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)