జీ-20 సదస్సు: కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేశాక శ్రీనగర్‌లో పరిస్థితులు ఎలా మారాయి?

- రచయిత, నితిన్ శ్రీవాస్తవ
- హోదా, బీబీసీ ప్రతినిధి
జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జీ-20 టూరిజం వర్కింగ్ గ్రూప్ మీటింగ్ రెండో రోజు అది.
సమావేశాన్ని కవర్ చేసేందుకు నాతో కలిసి పనిచేసే దేవాశీష్‌తో కలిసి ఉదయం 11 గంటలకు రాజ్‌బాగ్ ప్రాంతానికి చేరుకున్నాను.
మరో అరగంటలో మేం లైవ్ చేయబోతున్నాం. దీని కోసం కెమెరాను దేవాశీష్ సిద్ధంచేశారు. ఏర్పాట్లపై బీబీసీ లండన్ స్డూడియోతో ఆయన మాట్లాడారు.
వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే రోడ్డును ఆనుకుని ఉన్న హోటల్ బయట మేం నిలబడి ఉన్నాం.
అప్పుడే అక్కడకు రెండు సాయుధ బలగాల వాహనాలు వచ్చాయి. వాటిలో నుంచి ఏకే-56 తుపాకులు పట్టుకున్న ఐదుగురు కమాండోలు దిగారు. వారి ఇన్‌చార్జి జమ్మూకశ్మీర్ పోలీస్ యూనిఫామ్ వేసుకున్నారు.
మీరు ఇక్కడ ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ‘‘మేం మీడియా ప్రతినిధులం, ఇవి మా ఐడీ కార్డులు, మేం ఇక్కడ లైవ్ చేసేందుకు సిద్ధం అవుతున్నాం’’ అని నేను సమాధానం ఇచ్చాను.
‘‘ఇలాంటి సున్నితమైన ప్రాంతాల్లో మీరు లైవ్ చేయకూడదు. ఇక్కడకు దగ్గర్లోనే ఉన్నతాధికారులు ఉండే ఇళ్లు ఉన్నాయి. ఏదైనా జరగొచ్చు’’ అని ఆయన మాకు చెప్పారు.
దీంతో వెంటవెంటనే మా లగేజీని సర్దుకొని వేరే ప్రాంతానికి మేం లైవ్ చేయడానికి వెళ్లాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
కంటోన్మెంట్ టౌన్
ఆదివారం నుంచీ శ్రీనగర్‌లో పరిస్థితులు ఇలానే ఉన్నాయి. ఈ నగరం మొత్తం ఒక సైనిక శిబిరంలా కనిపిస్తోంది.
ధనిక వర్గాలు ఎక్కువగా ఉండే రాజ్‌బాగ్ ప్రాంతంలోనూ మాతో కెమెరా ముందు మాట్లాడేందుకు జనం ఇష్టపడటం లేదు. దీంతో శ్రీనగర్‌లోని ‘ఓల్డ్ ఏరియా’కు వెళ్దామని మాతోపాటు వచ్చిన జర్నలిస్టు మాజిద్ జహంగీర్ చెప్పారు.
ఆ తర్వాత మేం హజ్రత్‌బల్ దర్గాకు వెళ్లాం. శ్రీనగర్‌లోని రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి. అయితే, ఇక్కడ కూడా ప్రజలు ఇల్లు వదిలి బయటకు రావడానికి ఇష్టపడటం లేదు.
దర్గాకు అనుకుని ఉండే రోడ్డుపై చెక్క బల్ల మీద బట్టలు మడతపెడుతూ 71 ఏళ్ల మహమ్మద్ యాసీన్ బాబా కనిపించారు.
గత 28 ఏళ్లుగా ఆయన ఇక్కడే బట్టలు అమ్ముతున్నారు. ఇక్కడ పరిస్థితులు నేడు చాలా మారిపోయాయని ఆయన చెబుతున్నారు.

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES
సంతలో బట్టల అమ్మకాలు పడిపోయాయి: యాసిన్ బాబా
ఇదివరకటి తరహాలో తమ దగ్గర బట్టలు అమ్ముడుపోవడంలేదని యాసీన్ బాబా చెప్పారు.
‘‘మేం ఆదివారం ఇక్కడి సంతలో కూడా బట్టలు అమ్ముతాం. ఇదివరకు 40-50 బట్టలు కొనేవారు. నేడు ఇవి పది-12కు పడిపోయాయి. పరిస్థితులు చాలా మారిపోయాయి. మీకు తెలియనిదేమీ లేదు. అన్నీ ధరలు పెరిగాయి. ఒకప్పుడు రూ.800 ఉండే గ్యాస్ ధర నేడు రూ.1,200 నుంచి రూ.1,300 వరకూ పెరిగింది. మేం రోడ్డు పక్కనే బట్టలు అమ్ముతాం. ధరలు ఇంతలా పెరిగిపోతే మేం ఎక్కడికి పోవాలి. ఇక్కడ చాలా మంది పరిస్థితి ఇలానే ఉంది’’ అని ఆయన అన్నారు.
జీ-20 సదస్సు నేపథ్యంలో కశ్మీర్ ప్రస్తుతం మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. యూరోపియన్ యూనియన్‌తోపాటు అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు అవుతున్నారు. కానీ, చైనా, తుర్కియే, సౌదీ అరేబియా తమ ప్రతినిధులను పంపించలేదు.
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని 2019లో నరేంద్ర మోదీ ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత ఇక్కడ జరుగుతున్న అతిపెద్ద అంతర్జాతీయ సదస్సు ఇదే.

ఫొటో సోర్స్, TAUSEEF MUSTAFA
జీ-20 సదస్సును నిర్వహించడం ద్వారా ఇక్కడ పరిస్థితులన్నీ సాధారణంగానే ఉన్నాయనే సంకేతాన్ని భారత్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉండొచ్చు..
అయితే, సదస్సు జరుగుతున్న ప్రాంతానికి కొన్ని కి.మీ.ల దూరంలోనే వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్నారు. ఎక్కడికక్కడే రోడ్లపై ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు. ఎక్కడా భద్రతా పరమైన సమస్యలు ఎదురుకాకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ఇక్కడి అంశాలను మొత్తం కలిపి చూస్తేనేగా పరిస్థితి ఏమిటో అర్థమవుతుందని కొందరు నిపుణులు చెబుతున్నారు.
సీనియర్ జర్నలిస్టు, చట్టాన్ వార్తాపత్రిక ఎడిటర్ తాహిర్ మొహియుద్దీన్ మాట్లాడుతూ- ‘‘ఇక్కడ చేయాల్సింది ఇంకా చాలా ఉంది. అయితే, పరిస్థితి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో కూడా మీరు గమనించాలి’’ అన్నారు.

ఫొటో సోర్స్, EPA
'పర్యటకులు మళ్లీ వస్తున్నారు'
‘‘ఈ సదస్సు చాలా ముఖ్యమైనది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే, దీని వల్ల పర్యటకం కూడా అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లే కనిపిస్తోంది. ఒకప్పుడు ఇక్కడ సమ్మెలు, మిలిటెంట్ దాడులు, రాళ్లు రువ్వుకోవడాలు కనిపించేవి. ఆరు నెలలపాటు అన్నింటినీ మూసివేస్తే, ఆర్థిక వ్యవస్థ, పిల్లల చదువులు అన్నీ దెబ్బతింటాయి. ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే కాస్త శాంతి నెలకొన్నట్లు కనిపిస్తుంది. పిల్లలు చదువుకోవడానికి వెళ్తున్నారు. మళ్లీ మార్కెట్‌లో కార్యకలాపాలు జరుగుతున్నాయి’’అని తాహిర్ మొహియుద్దీన్ చెప్పారు.
గత నాలుగేళ్లలో జమ్మూకశ్మీర్‌లో అభివృద్ధి కోసం రూ.40 వేల కోట్లను ఖర్చు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం ఇక్కడ భద్రతా పరమైన సవాళ్లు కూడా తగ్గినట్లు వివరిస్తోంది.
జమ్మూకశ్మీర్ పరిపాలనా యంత్రాంగం లెక్కల ప్రకారం నిరుడు రికార్డు స్థాయిలో 25 లక్షల మంది పర్యటకులు వచ్చారు.
ఇదే విషయంపై దాల్ సరస్సులో శికారా యాత్రకు తీసుకెళ్లే గులాం నబీతో మాట్లాడాం. ఆయన తన జీవితంలో ఎలాంటి ఆటుపోట్లు ఎదుర్కొన్నారో చెప్పారు. ఒకానొక సమయంలో తనకు ఇక్కడేమీ మిగల్లేదని అనిపించిందని ఆయన అన్నారు.
‘‘కశ్మీర్ చాలా మారిపోయింది. మొదట్లో పర్యటకులు వచ్చేవారు. ఆ తర్వాత ఇక్కడ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో పర్యటకుల రాకపోకలు స్తంభించిపోయాయి. మళ్లీ ఇప్పుడు పర్యటకులు రావడం మొదలైంది’’ అని ఆయన అన్నారు.
గత నాలుగేళ్లలో ఎలాంటి మార్పులు వచ్చాయని ప్రశ్నించినప్పుడు.. ‘‘మేం కూలీలం. రోజంతా శ్రమించడం, రాత్రి భోజనం చేసి పడుకోవడం.. ఇదే మా పని’’ అని ఆయన అన్నారు.

కెమెరా ముందు మాట్లాడటానికి విముఖత
శ్రీనగర్‌లో పరిస్థితులు ఎలా మారాయో తెలుసుకోవడానికి సాధారణ ప్రజలతోనూ మాట్లాడేందుకు ప్రయత్నించాం. కానీ, చాలా మంది కెమెరా ముందుకు రావడానికి ఇష్టపడలేదు. అయితే, శ్రీనగర్, ఆ చుట్టుపక్కల ప్రాంతాలను చూస్తే కొన్ని మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
రోడ్లు ఇదివరకటి కంటే విశాలంగా కనిపిస్తున్నాయి. కొత్త భవనాలను నిర్మిస్తున్నారు. వేరే రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఉపాధి కోసం ఇక్కడకు వస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, పర్యటకులు పెద్దయెత్తున వస్తున్నారు. మొత్తంగా పరిస్థితులు ఎలా మారాయో అంచనా వేయాలంటే మరికొన్ని నెలలు లేదా సంవత్సరాలు పట్టొచ్చు.
మారుతున్న పరిస్థితులపై శ్రీనగర్ ఓల్డ్ ఏరియాలో పప్పుల దుకాణం నడిపిస్తున్న గుల్జార్ మాట్లాడారు.
‘‘అల్లా దయ వల్ల చాలా మందికి ఉపాధి దొరుకుతోంది. పరిస్థితులు మునుపటి కంటే మెరుగుపడ్డాయి’’ అని ఆయన చెప్పారు.
అయితే, జమ్మూకశ్మీర్‌లో మిలిటెంట్ దాడులు చాలా తగ్గిపోయాయని ఇప్పుడే చెప్పలేం. కశ్మీర్ లోయలో దాడులు తగ్గినట్లు కనిపిస్తున్నా, జమ్మూతోపాటు సరిహద్దు ప్రాంతాల్లో దాడులు పెరిగాయి.
ఇక్కడ ఎన్నికైన ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడుతుందోననే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. దీనిపై రాజకీయ విశ్లేషకుడు, మాజీ ప్రొఫెసర్ నూర్ అహ్మద్ బాబా మాట్లాడారు.
‘‘2019లో కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దుచేసినప్పుడు, పరిస్థితులు పూర్తిగా సద్దుమణుగుతాయని, ఇక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కానీ, ఇప్పటికీ ఇక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. పాలన మొత్తం దిల్లీ నుంచే కొనసాగుతోంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడ ప్రభుత్వం ఏర్పడితేనే పరిస్థితులు సాధారణానికి వచ్చినట్లు’’ అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- 'భారత పార్లమెంట్ కొత్త భవనాన్ని మహాత్మాగాంధీని జీవితాంతం వ్యతిరేకించిన సావర్కర్ జయంతి రోజున ప్రారంభిస్తారా?'
- బిహార్: షేర్షాబాదీ ముస్లిం అమ్మాయిలకు పెళ్ళి చేయడం ఇప్పటికీ చాలా కష్టం, ఎందుకంటే...
- జీ20 సదస్సు: కశ్మీర్లో ఆర్టికల్-370 రద్దు తర్వాత ఈ నాలుగేళ్ళలో ఏం మారింది?
- మానవ శరీరంలో ప్రకృతి చేసిన 'డిజైనింగ్ తప్పులు'
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















