బిహార్: షేర్షాబాదీ ముస్లిం అమ్మాయిలకు పెళ్ళి చేయడం ఇప్పటికీ చాలా కష్టం, ఎందుకంటే...

షేర్షాబాదీ ముస్లిం మహిళలు

ఫొటో సోర్స్, SEETU TEWARI/BBC

    • రచయిత, సీటూ తివారీ
    • హోదా, బీబీసీ కోసం

బిహార్‌లోని సుపౌల్‌కు చెందిన షామా, పెళ్లి పాటలు వింటున్నప్పుడల్లా నిరాశ‌కు గురవుతుంటారు.

ఇంకా పెళ్లి కాకపోవడమే 27 ఏళ్ల షామా నిస్పృహకు కారణం. పెళ్లి చేసుకోకపోవడం అనేది ఆమె నిర్ణయం కాదు. పెళ్లి చేసుకోకుండా ఆమె ఉండాల్సి వచ్చింది.

షామా సోదరి సకీనా ఖాతూన్‌కు కూడా పెళ్లి కాలేదు. ఆమె వయస్సు 26 ఏళ్లు.

ఈ కథ కేవలం షామా, సకీనాలది మాత్రమే కాదు.

సుపౌల్ బ్లాక్‌ , కొచ్‌గామా పంచాయతీ 10వ వార్డులోని దాదాపు 15 మంది యువతుల కథ ఇది. వారంతా పెళ్లికి దూరంగా ఉండాల్సి వచ్చింది.

ఈ యువతులు అందరూ షేర్షాబాదీ వర్గానికి చెందినవారు. పెళ్లి చేసుకోవాలంటే ఇక్కడి అమ్మాయిలు మధ్యవర్తుల కోసం ఎదురుచూస్తారు.

కానీ, ఈ అమ్మాయిల కోసం ఏ మధ్యవర్తీ పెళ్లి సంబంధం తీసుకొని రాలేదు. పెళ్లి కోసం రెండు కుటుంబాల మధ్య మధ్యవర్తిత్వం వహించే వ్యక్తిని మధ్యవర్తి అంటారు.

అక్కడి అమ్మాయిలకు సాధారణంగా 15-20 ఏళ్ల మధ్యలో పెళ్లి జరుగుతుందని, ఒకవేళ అమ్మాయిల వయస్సు 25 దాటితే వారిని ముసలివాళ్లుగా చూస్తారని బీబీసీతో వార్డు సభ్యుడు అబ్దుల్ మాలీ చెప్పారు. 25 ఏళ్లు దాటిన అమ్మాయిలకు పెళ్లి జరగడం కష్టమని అన్నారు.

షంసున్ నహర్ (ఎడమ), జమీలా ఖాతూన్

ఫొటో సోర్స్, SEETU TEWARI/BBC

ఫొటో క్యాప్షన్, షంసున్ నహర్ (ఎడమ), జమీలా ఖాతూన్

‘‘మా సముదాయంలో అబ్బాయి తరఫు నుంచే సంబంధం తీసుకొని అమ్మాయి ఇంటికి మధ్యవర్తి వస్తాడు. సంబంధం కోరుతూ అమ్మాయి వాళ్ల నుంచి మధ్యవర్తి వెళ్లడం ఉండదు. ఒకవేళ సంబంధం కోసం అమ్మాయి తరఫు వాళ్లు వాళ్తే ఆ అమ్మాయిలో ఏదో లోపం ఉన్నట్లు లెక్క’’ అని ఆయన వివరించారు.

పెళ్లి కాలేదని బాధతో ఉన్న వారిలో 27 ఏళ్ల షామా నుంచి 76 ఏళ్ల జమీలా ఖాతూన్ వరకు ఉన్నారు.

జమీలా ఖాతూన్ కూడా సుపౌల్‌లోనే పుట్టి పెరిగారు. తన పెళ్లి ఊరేగింపు వస్తుందని, తనకు పెళ్లి జరుగుతుందని ఆమె కలగన్నారు. కానీ, అది నెరవేరలేదు. జమీలా తన చెల్లి షంసున్‌తో కలిసి ఉంటున్నారు. షంసున్ వయస్సు 57 ఏళ్లు.

ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లకు పెళ్లి కాలేదు. వారు అయిదు మేకలను మేపుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

ఇంత కాలం పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటని అడిగితే.. ‘‘ఏం చేస్తాం. పెళ్లి సంబంధం తీసుకొని ఏ మధ్యవర్తి కూడా మా కుటుంబం దగ్గరికి రాలేదు’’ అని వారు చెప్పారు.

‘‘నా గుండెలో ఎంతో బాధ దాగి ఉంది. దాన్ని ఎవరికి చెప్పాలి? ఏమని చెప్పాలి’’ అని బీబీసీతో షంసున్ ఆవేదన వ్యక్తం చేశారు.

తాము షేర్షాబాదీ ముస్లిం కావడమే తమకు పెళ్లి జరగకపోవడానికి కారణమని వారిద్దరూ తెలిపారు.

షేర్షాబాదీ ముస్లిం మహిళ

ఫొటో సోర్స్, SEETU TEWARI/BBC

షేర్షాబాదీ ముస్లింల గుర్తింపు

బిహార్‌లో ఉండే షేర్షాబాదీ జనాభా అత్యంత వెనుకబడిన తరగతికి చెందినవారు.

బిహార్‌లోని సుపౌల్, పూర్ణియా, కటిహార్, కిషన్‌గంజ్, అరారియా జిల్లాల్లో వీరు పెద్ద సంఖ్యలో ఉంటారు.

అబ్బాయి తరఫు నుంచి పెళ్లి సంబంధం తీసుకొని పైగామ్ లేదా అగువా అని పిలిచే వివాహ మధ్యవర్తులు అమ్మాయి ఇంటికి రావడం ఇక్కడి ఆచారం.

ఇక్కడ ఈ ఆచారాన్ని ఎంత బలంగా పాటిస్తారంటే, ఒకవేళ అమ్మాయికి ఇలా పెళ్లి సంబంధం తీసుకొని మధ్యవర్తి రాకపోతే, ఆమె ఎప్పటికీ అవివాహితగానే మిగిలిపోతుంది.

బిహార్‌లో షేర్షాబాదీ సముదాయం ఉన్న చోట్లలో ఇలా పెళ్లి కాని మహిళలు కనిపించడానికి ఇదే కారణం.

కొచ్‌గామా పంచాయతీ సర్పంచ్ భర్త నురుల్ హోదా మాట్లాడుతూ, ‘‘కొన్నేళ్ల క్రితం ఇలాంటి పెళ్లికాని మహిళల జాబితాను తయారు చేశాం. అప్పుడు వారి సంఖ్య 250గా ఉండేది. ఇప్పుడు ఈ సంఖ్య మరింత పెరిగిపోయి ఉండాలి’’ అని అన్నారు.

షేర్షాబాదీ ముస్లిం

ఫొటో సోర్స్, SEETU TEWARI/BBC

షేర్షా సూరీ సంబంధీకులు

ఉర్దూ, బెంగాలీ భాషలు కలిసినట్లుగా ఉండే బెంగాలీని షేర్షాబాదీలు మాట్లాడతారు. తాము బాద్షా షేర్షా సూరీ సంబంధీకులమని వారు చెప్పుకుంటారు.

షేర్షా సైన్యంలో సైనికులుగా షేర్షాబాదీలు పనిచేసినట్లు వారు చెబుతారు. సూరీ రాజవంశ స్థాపకుడు షేర్షా. మొఘల్ చక్రవర్తి హుమాయూన్‌ను ఓడించి సూరీ తన రాజ్యాన్ని స్థాపించాడు.

ఆల్ బిహార్ షేర్షాబాదీ అసోసియేషన్ అధ్యక్షుడు సయ్యదుర్రహమాన్ రెహ్మాన్ వీరి గురించి బీబీసీతో మాట్లాడారు.

‘‘షేర్షా హయాంలో వీరు స్థిరపడ్డారు. కష్టపడి పనిచేసే, నదీ ఒడ్డున నివసించే ఈ సముదాయ ప్రజలు బిహార్‌తో పాటు బెంగాల్, జార్ఖండ్ మరియు నేపాల్ సరిహద్దుల్లో ఉంటారు’’ అని ఆయన చెప్పారు.

బిహార్‌లో వీరి జనాభా దాదాపు 40 లక్షలు. సీమాంచల్‌లోని 20 ఎమ్మెల్యే స్థానాల్లో వీరి ప్రభావం ఉంటుంది. బిహార్‌లో ఈ సముదాయానికి చెందిన ఆర్థికంగా, విద్యాపరంగా చాలా వెనుకబడి ఉన్నారు.

ముస్లిం మహిళ

ఫొటో సోర్స్, SEETU TEWARI/BBC

ఆడపిల్లల్లో పెళ్లి కాదనే భయం

కొచ్‌గామా పంచాయతీకి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న కటిహార్‌కు చెందిన ఖైరియా పంచాయతీలో కూడా షేర్షాబాదీల జనాభా ఉంది.

ధీమ్‌నగర్ గ్రామానికి చెందిన రెఫుల్ ఖాన్ బీబీసీతో మాట్లాడారు. ‘‘నేను షేర్షాబాదీ మహిళను. నా పెళ్లి కోసం మా నాన్న అగువాకు పదివేల రూపాయలు ఇచ్చాడు’’ అని ఆమె చెప్పారు. రెఫుల్ భర్త బెంగాల్‌లో కూలీగా పనిచేస్తున్నారు.

‘‘మాకు ఇక్కడో ఆచారం ఉంది. అబ్బాయి తరఫు నుంచే అగువా పెళ్లి సంబంధం తీసుకొని వస్తాడు. ఆయన లేకుండా పెళ్లి జరుగదు. అమ్మాయిలు పెళ్లి కాకుండా ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. మా ఊరిలో పెళ్లి కాకుండా ఉన్న అమ్మాయిలు చాలా మంది ఉన్నారు’’ అని ఆమె చెప్పారు.

ఇక్కడి అమ్మాయిల్లో తమకు పెళ్లి అవుతుందా? లేదా? అనే భయం ఎంతగా ఉంటుందంటే, 14 ఏళ్ల బాలిక కూడా తనకు పెళ్లి అవుతుందో లేదో అనే భయంతో జీవిస్తుంది.

హమీదా ఖాతూన్

ఫొటో సోర్స్, SEETU TEWARI/BBC

ఫొటో క్యాప్షన్, హమీదా ఖాతూన్

డబ్బు, చదువు, అమ్మాయి రంగు

ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడిన ఈ సముదాయానికి చెందిన అమ్మాయిల్లో ఎక్కువ మంది చదువు అయిదో తరగతికే ముగిసింది.

మహిళలకు ఇంటి నుంచి బయటకు వెళ్లే స్వేచ్ఛ ఉండదు. పురుషులు కూడా సూరత్, జైపూర్, కోల్‌కతా వంటి పెద్ద నగరాల్లో కూలీలుగా లేదా టైలర్లుగా పని చేస్తారు.

పెళ్లికి సంబంధించిన ముఖ్యమైన అంశాల్లో పైగామ్‌తో పాటు అమ్మాయి శరీర రంగు కూడా ఉంది.

12 మంది తోబుట్టువులలో షహనాజ్ బేగం అందరికన్నా పెద్దవారు. ఆమె ఇద్దరు చెల్లెళ్లకు పెళ్లి అయింది. కానీ షహనాజ్‌కు మాత్రం ఇంకా కాలేదు.

“నా చెల్లెళ్లు తెల్లగా ఉన్నారు కాబట్టి వారికి పెళ్లి జరిగింది. నేను నల్లగా ఉంటాను. నన్నెవరు పెళ్లి చేసుకుంటారు’’ అని షహనాజ్ అన్నారు.

‘‘మేం అంతటా చూస్తున్నాం. ఇక్కడ నల్లగా ఉండేవారికి పెళ్లి కాదు. మేం చిన్నప్పటి నుంచి పేదవాళ్లం. అలాగే నల్లగా కూడా ఉంటాం. మాకు పెళ్లి కావడం చాలా కష్టం’’ అని అయిదో తరగతి చదివిన షహనాజ్ చెల్లెలు మర్జానా ఖాతూన్ చెప్పారు.

వృత్తిరీత్యా ప్రైవేట్ టీచర్ అయిన అబూ హిలాల్ షేర్షాబాదీ కమ్యూనిటీ హక్కుల కోసం పనిచేస్తున్నారు. ఆయన బీబీసీతో మాట్లాడారు.

‘‘1980లలో కొచ్‌గామాలో షేర్షాబాదీల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో అమ్మాయి తరఫు నుంచి కూడా పెళ్లి సంబంధాలు పంపవచ్చని నిర్ణయించారు. కానీ, పరిస్థితి ఏమీ మారలేదు.

ఇప్పుడు అమ్మాయి రంగు కూడా చాలా ముఖ్యంగా మారింది. అమ్మాయి తండ్రి రహస్యంగా కట్నం ఇవ్వడానికి ముందుకు వచ్చినప్పటికీ, అమ్మాయి సరైన రంగు లేకపోతే పెళ్లి జరుగడం కష్టమే’’ అని ఆయన చెప్పారు.

కొచ్‌గామా పంచాయతీ వార్డు సభ్యుడు అబ్దుల్ మాలీ ఇందుకు ఉదాహరణ.

‘‘ నా కూతురు చదువుకుంది. ఆమె పెళ్లి కోసం డబ్బు ఖర్చు పెట్టడం కష్టం కాదు. కానీ, ఎన్ని లాబీయింగ్‌లు చేసినా పెద్ద కూతురు పెళ్లి కాలేదు. నా చిన్న కూతురు తెల్లగా ఉంటుంది. ఆమె పెళ్లికి ఎలాంటి ఇబ్బంది ఉండదు’’ అని మాలీ అన్నారు.

అదే ప్రాంతానికి చెందిన ఫర్హాన్ మాట్లాడుతూ, ‘‘నల్లగా ఉండే అబ్బాయి కూడా తెల్లటి అమ్మాయినే కోరుకుంటాడు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొనే అబ్బాయిలు ఇలా ఆలోచిస్తారు. ఎందుకుంటే పిల్లలు తెల్లగా ఉండాలి కదా’’ అని వివరించారు.

షేర్షాబాదీ ముస్లిం మహిళ

వయస్సు అంతరాలు

11 మంది పిల్లలకు తల్లి అయిన అర్ఫా ఖాతూన్ తన పెద్ద కుమార్తెకు వివాహం చేయలేకపోయారు. తన చిన్న కూతురు రుక్సానాను 50 ఏళ్ల రియాజుల్లాకు ఇచ్చి పెళ్లి చేశారు.

రుక్సానా వయస్సు 18 సంవత్సరాలు. ఆమె భర్త రియాజుల్లాకు ఇప్పటికే అయిదుగురు పిల్లలు ఉన్నారు. ఆయన సంతానంలో అందరికంటే పెద్ద పిల్లాడి వయస్సు 23 ఏళ్లు.

‘‘ఏం చేస్తాం. వచ్చిన సంబంధాల్లోనే పిల్లలకు పెళ్లి చేయాలి’’ అని ఆర్ఫా ఏడుస్తూ చెప్పారు.

షేర్షాబాదీ మహిళ

చిన్న మార్పులు

ఈ సముదాయంలో సమస్యలు అలాగే ఉన్నాయి. కానీ, గత కొన్నేళ్లలో ఈ సముదాయంలో కూడా కొన్ని మార్పులు రావడం కనిపిస్తోంది.

కొంతమంది మహిళలు అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తయారు చేసే పనిలో చేరారు.

45 ఏళ్ల హమీదా ఖాతూన్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండుతారు.

పెళ్లి గురించి ఆమె మాట్లాడుతూ, ‘‘నేను 1500 రూపాయలు సంపాదించడం మొదలుపెట్టినప్పటి నుంచి నా సోదరుడి ఇంటి నుంచి వేరుగా ఉంటున్నా. ఎవరైనా కట్నం లేకుండా నన్ను పెళ్లి చేసుకుంటానంటే నేను అందుకు సిద్ధంగా ఉన్నా’’ అని ఆమె అన్నారు.

ఇప్పుడు ముస్లింలలోని ఇతర కులాల్లోనూ వివాహాలు జరగడం మొదలైంది.

ఒక్క కొచ్‌గామాలోనే ఈ మధ్య కాలంలో ఇలాంటి వివాహాలు 100కు పైగా జరిగాయి.

10 మంది పిల్లలకు తల్లి అయిన నస్తారా ఖాతూన్ తన కుమార్తెను కశ్మీర్‌కు చెందిన ఒక కుటుంబంలోకి పెళ్లి చేసి పంపించారు. ఆమె కుమార్తె 12వ తరగతి పాస్ అయ్యారు.

"నా కూతురు చదువుకుంది. కానీ, ఆమె ఛాయ నల్లగా ఉంటుంది. ఇక్కడ ఆమెకు పెళ్లి సంబంధాలు కుదరట్లేదు. ఏ మధ్యవర్తి కూడా ఆమె కోసం సంబంధాన్ని తీసుకురాలేదు. దీంతో కశ్మీర్‌కు చెందిన 30 ఏళ్ల అబ్బాయి సంబంధం వస్తే ఆమెకు వివాహం చేశాం" అని నస్తారా వివరించారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)