వృద్ధ జంట ప్రేమ కథ.. 75 ఏళ్ల బాబూరావు, 70 ఏళ్ల అనసూయ

పాటిల్ దంపతులు

ఫొటో సోర్స్, BBC/SARFRAJ SANADI

    • రచయిత, సర్ఫరాజ్ సనదీ
    • హోదా, బీబీసీ కోసం

మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాకు చెందిన బాబూరావు పాటిల్ (75), అనుసూయ షిండే (70) వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ కొల్హాపూర్‌లోని 'జానకి' వృద్ధాశ్రమంలో నివసిస్తున్నారు.

పుణెకి చెందిన అనుసూయ షిండే, తన భర్త శ్రీరంగ్ షిండేతో కలిసి అయిదేళ్ల క్రితం జానకి వృద్ధాశ్రమానికి వచ్చారు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఇద్దరూ ఇల్లు విడిచిపెట్టి వృద్ధాశ్రమానికి చేరారు. అక్కడ కూడా ఇద్దరూ ఒకరికొకరు అండగా ఉండేవారు. నాలుగు నెలల క్రితం అనసూయ భర్త మృతి చెందడంతో ఆమె ఒంటరివారయ్యారు.

మరోవైపు, బాబూరావు తన భార్య చనిపోవడంతో ఇల్లు వదిలి వృద్ధాశ్రమానికి వచ్చారు.

బాబూరావు పాటిల్ కథ

బాబూరావు పాటిల్‌ ఏడాదిన్నర క్రితం జానకి వృద్ధాశ్రమంలో చేరారు. అంతకుముందు, ఆయన జీవితం చాలా ఒడిదుడుకులతో సాగింది.

భార్య చనిపోయిన తరువాత ఆయనకు పిల్లలతో సంబంధాలు తెగిపోయాయి. కరోనా మహమ్మారి ఆయన వ్యాపారాన్ని కుంగదీసింది.

అలాంటి పరిస్థితుల్లో ఆసరా కోసం బాబూరావు తన అన్నయ్య దగ్గరకి వెళ్లారు. అక్కడ కొంతకాలం ఉన్నారు. చివరికి, వృద్ధాశ్రమంలో చేరారు.

బాబూరావ్ పాటిల్

ఫొటో సోర్స్, BBC/SARFRAJ SANADI

వాలెంటైన్స్ డే రోజు పెళ్లి ఆలోచన వచ్చింది

బాబూరావు, అనసూయ ఇద్దరూ ఒంటరితనాన్ని అనుభవిస్తున్నవారే.

ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఓ కళాశాలలో వృద్ధాశ్రమం నుంచి ఒక కార్యక్రమం నిర్వహించారు. ఆ సందర్భం, ఆ వాతావరణం చూసి బాబూరావుకు మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చింది.

కార్యక్రమం ముగించుకుని తిరిగి వచ్చిన బాబూరావు అనుసూయ షిండే ముందు తన ప్రేమను వ్యక్తపరిచారు. ఒక గులాబీ పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేశారు.

అయితే, అనసూయ వెంటనే ఆయన ప్రేమను అంగీకరించలేదు. భర్తను కోల్పోయిన దుఃఖం నుంచి ఆమె అప్పటికి ఇంకా బయటపడలేదు. ఆలోచించుకోవడానికి కొంత సమయం కావాలని ఆమె బాబూరావుకు చెప్పారు.

అనసూయా శిందే

ఫొటో సోర్స్, BBC/SARFRAJ SANADI

అనసూయ భయాలు

జానకి వృద్ధాశ్రమాన్ని నడుపుతున్న బాబాసాహెబ్ పూజారికి వీరిద్దరిపై సందేహం వచ్చింది. బాబూరాబు, అనసూయల మధ్య ఏదో జరుగుతోందని ఊహించారు. అనసూయని పిలిచి, బాబూరావును పెళ్లి చేసుకోబోతున్నారా అని అడిగారు.

ఆ తరువాత, వృద్ధాశ్రమంలో వీరిద్దరి వివాహంపై చర్చ జోరుగా సాగింది. అనసూయ తన మనసులోని భయాలను పూజారికి చెప్పారు. తను బాబూరావుని పెళ్లి చేసుకుంటే సమాజం ఏమంటుంది, వృద్ధాశ్రమంపై ఎలాంటి ప్రభావం పడుతుంది అంటూ తన సందేహాలను వ్యక్తంచేశారు.

ఈ భయాలతోనే అనసూయ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు.

బాబా సాహెబ్ పూజారీ

ఫొటో సోర్స్, BBC/SARFRAJ SANADI

వృద్ధాశ్రమం వేదికగా ఒక్కటైన జంట

వృద్ధాశ్రమ నిర్వాహకుడు బాబాసాహెబ్ పూజారి ఇద్దరితోనూ మాట్లాడారు. వివాహంపై అనసూయ మనసులో భయాలను తొలగించే ప్రయత్నం చేశారు.

దాంతో, అనసూయ బాబూరావు పెళ్లి ప్రపోజల్‌ను అంగీకరించారు.

వృద్ధాశ్రమం వేదికగా అనసూయ, బాబూరావుల వివాహం ఘనంగా జరిగింది. సంప్రదాయబద్ధంగా, చట్టబద్ధంగా వివాహం చేసుకున్నారు.

అయితే, పెళ్లయిన తరువాత కూడా ఈ జంట వృద్ధాశ్రమంలోనే ఉంటున్నారు. తమ శేషజీవితం వృద్ధాశ్రమంలోనే గడుపుతామని ఇద్దరూ చెబుతున్నారు.

"పెళ్లి అంటే కేవలం శారీరక సుఖం, పిల్లల్ని కనడం మాత్రమే కాదు. ఒకరికొకరు తోడుగా ఉండడమే ముఖ్యం. అందుకే, ఈ వయసులో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. బతికి ఉన్నంతకాలం, సుఖదుఃఖాలలో ఒకరికొకరు తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నాం" అన్నారు బాబూరావు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)