స్వర భాస్కర్-ఫర్హాద్ అహ్మద్‌: హిందూ, ముస్లిం ప్రేమికులు పెళ్లి చేసుకోవాలంటే ఎలా... స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఏం చెబుతోంది?

స్వరా భాస్కర్ - ఫర్హాద్ అహ్మద్‌

ఫొటో సోర్స్, SWARA BHASKAR PR TEAM

    • రచయిత, పారా పద్దయ్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘‘అంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి ముందు ఒకసారి రిఫ్రిజిరేటర్‌ను ఆమె చూడాల్సింది. శ్రద్ధా వాల్కర్‌కు ఏం జరిగిందో.. ఆమెకూ అదే జరగొచ్చు.’’

ఇవీ సినీ నటి స్వర భాస్కర్, సమాజ్‌వాదీ పార్టీ నేత ఫర్హాద్ జిరార్‌ అహ్మద్‌ను వివాహం చేసుకోవడంపై వీహెచ్‌పీ నాయకురాలు సాధ్వీ ప్రాచీ చేసిన వ్యాఖ్యలు.

దీనిపై ట్విట్టర్‌లో స్పందించిన స్వర భాస్కర్, 'ద్వేషించేవారికి సూట్‌కేసు, రిఫ్రిజిటేర్, అక్రమ సంతానం, మార్పిడులు... మాకు మాత్రం ప్రేమ' అంటూ హార్ట్ ఇమోజీలను ట్వీట్ చేశారు.

అయితే, ఇదంతా జరగడానికి నాలుగు రోజుల ముందుకు వెళదాం మనం.

స్వర భాస్కర్ - ఫర్హాద్ అహ్మద్‌

ఫొటో సోర్స్, TWITTER/@REALLYSWARA

ఫొటో క్యాప్షన్, స్వర భాస్కర్ - ఫర్హాద్ అహ్మద్‌

త్రీ ఛీర్స్ ఫర్ ద స్పెషల్ మ్యారేజ్ యాక్ట్

‘‘త్రీ ఛీర్స్ ఫర్ ద స్పెషల్ మ్యారేజ్ యాక్ట్. నోటీస్ పీరియడ్ లాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ... కనీసం అది ఉనికిలో ఉంది. ప్రేమకు అవకాశం ఇస్తోంది. ప్రేమించే హక్కు, మీ జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు, పెళ్లి చేసుకునే హక్కు లాంటివి కొందరికే పరిమితమైనవిగా ఉండకూడదు’’ అనే మెసేజ్‌తో పాటు ఫహద్ జిరార్ అహ్మద్‌ను వివాహం చేసుకుంటున్న ఫోటోలను ట్వీట్ చేశారు స్వర భాస్కర్.

ఇందులో స్వర భాస్కర్ ప్రస్తావించిన ప్రత్యేక వివాహ చట్టంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.

స్వరా భాస్కర్ - ఫర్హాద్ అహ్మద్‌

ఫొటో సోర్స్, TWITTER/@FAHADZIRARAHMAD

ఏమిటీ ప్రత్యేక వివాహ చట్టం?

ద స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ -1954ను పార్లమెంట్‌ 1954, అక్టోబర్ 9న ఆమోదించింది.

భారతదేశంలో వివాహం, విడాకులు, దత్తత వంటి వ్యవహారాలన్నీ మతపరమైన ప్రత్యేక చట్టాల ద్వారా జరుగుతున్నాయి.

ముస్లిం వివాహ చట్టం, 1954, హిందూ వివాహ చట్టం, 1955 వంటి చట్టాల ప్రకారం భిన్న మతాలకు చెందిన వధూవరులు పెళ్లి చేసుకోవాలనుకుంటే, పెళ్లికి ముందే జీవిత భాగస్వాముల్లో ఒకరు మరొకరి మతంలోకి మారవలసి ఉంటుంది.

అయితే, ప్రత్యేక వివాహ చట్టంలో అలాంటిదేమీ లేకుండానే మతాంతర వివాహాలు చేసుకోవచ్చు. ఈ వివాహంలో దంపతులు పెళ్లయిన తర్వాత కూడా ఎవరికి వారు తమ మత విశ్వాసాలను, సంప్రదాయాలను పాటించవచ్చు.

స్వరా భాస్కర్ - ఫర్హాద్ అహ్మద్‌

ఫొటో సోర్స్, TWITTER/@FAHADZIRARAHMAD

ఈ చట్టం కింద ఎవరెవరు పెళ్లి చేసుకోవచ్చు?

ఈ చట్టం దేశంలోని హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులతో సహా అన్ని విశ్వాసాల ప్రజలకు వర్తిస్తుంది.

ప్రత్యేక వివాహ చట్టానికి సంబంధించిన బిల్లుని 1952లో రూపొందించినప్పుడు ఏకభార్యత్వం ఆవశ్యకతను తీవ్రంగా పరిగణించారు.

బిల్లులోని సెక్షన్ 4 ప్రకారం పెళ్లి చేసుకోవాలనుకునే వధూవరులు తాము మరో జీవిత భాగస్వామిని కలిగి లేమని లిఖితపూర్వకంగా అందించాలి.

భవిష్యత్తులో అది తప్పని తేలితే తీసుకోబోయే చర్యలకు కట్టుబడి ఉంటామని అంగీకారం తెలపాలి.

స్వరా భాస్కర్ - ఫర్హాద్ అహ్మద్‌

ఫొటో సోర్స్, SWARA BHASKAR PR TEAM

చట్టంలో కీలక అంశాలు

చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం పెళ్లి చేసుకోబోయేవారు జిల్లా మ్యారేజ్ ఆఫీసరుకు రాతపూర్వకంగా నోటీసు అందించాల్సి ఉంటుంది.

ఈ నోటీసుపైన ఎవరికైనా అభ్యంతరాలుంటే చెప్పవచ్చంటూ మ్యారేజ్ ఆఫీసరు దాన్ని 30 రోజుల పాటు ప్రదర్శనకు పెడతారు.

అయితే, ఇది తప్పనిసరి ఏమీ కాదని అలహాబాద్ హైకోర్టు సఫియా సుల్తానా వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తర ప్రదేశ్‌కేసులో తీర్పు చెప్పింది.

వివాహాన్ని ప్రకటించడానికి ముందు దంపతులతో పాటు ముగ్గురు సాక్షులు మ్యారేజ్ ఆఫీసర్ దగ్గరున్న డిక్లరేషన్‌లో సంతకం చెయ్యాలి. డిక్లరేషన్ ఆమోదం పొందిన తర్వాత వివాహం జరిగినట్లు సర్టిఫికెట్ వస్తుంది.

స్వరా భాస్కర్ - ఫర్హాద్ అహ్మద్‌

ఫొటో సోర్స్, TWITTER/SWARA BHASKAR

చట్టంపై వివాదాలు

చట్టంలోని ఆరవ సెక్షన్ ప్రకారం పెళ్లి చేసుకోదలచినవారు ఇచ్చే నోటీసుని మ్యారేజ్ నోటీస్ బుక్‌లో ఇన్‌స్పెక్షన్ కోసం ఉంచవచ్చు.

చట్టంలోని సెక్షన్‌7 ప్రకారం వివాహంపై ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే మ్యారేజ్ ఆఫీసర్ వివాహాన్ని ధ్రువీకరించడం వీలు కాదు.

సదరు వ్యక్తి తన అభ్యంతరాన్ని వెనక్కి తీసుకుంటేనే ఈ వివాహం అధికారికం అవుతుంది. ఈ రెండు అంశాలపై కోర్టుల్లో కేసులు దాఖలయ్యాయి.

నోటీసుని బహిరంగ ప్రదర్శనకు ఉంచటడం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనని 2009లో దిల్లీ హైకోర్టులో కేసు దాఖలైంది.

దీనిపై విచారించిన న్యాయస్థానం పెళ్లి చేసుకునే వారి గురించి స్థానిక పోలీసు స్టేషన్ ద్వారా విచారించి వివరాలు తెలుసుకోవాలని, నోటీసుల ద్వారా వారి గుర్తింపును బహిరంగ పరచడం వారి వ్యక్తిగత భద్రతకు ముప్పుగా మారుతుందని కోర్టు తెలిపింది.

వీడియో క్యాప్షన్, ఆ ఇంట్లో రోజూ కూరగాయలకు అయ్యే ఖర్చు రూ. 1200

మారిన కాలం- మారుతున్న పరిస్థితులు

'స్వర భాస్కర్ పెళ్లి చట్టబద్ధం కావచ్చు. కానీ, ఇస్లామిక్ సంప్రదాయప్రకారం చెల్లదంటూ' షికాగోకు చెందిన ఇస్లామిక్ స్కాలర్ యాసిర్ నదీమ్ అల్ వజీదీ ట్వీట్ చేశారు.

ఆమె ముస్లింగా మారనంత కాలం ఈ వివాహాన్ని అల్లా అంగీకరించడని అందులో పేర్కొన్నారు. దీన్ని ఛాందసవాదంగా విమర్శిస్తూ ఆన్‌లైన్‌లో చాలానే చర్చ జరిగింది.

మొత్తానికి, వివాహం, మతం, సంప్రదాయం ... వీటి చుట్టూ విస్తృతమైన చర్చ జరుగుతోంది.

మతాంతర వివాహాలపై లవ్ జిహాద్ పేరుతో దాడులు, కులాంతర వివాహాలపై పరువు పేరుతో హత్యలు ఇటీవల తరచూ చూస్తున్నాం.

ఇలాంటి సవాళ్ల మధ్య కులాలకు, మతాలకు అతీతంగా వైవాహిక జీవితాన్ని గడపాలనుకునే ప్రేమజీవులకు ప్రత్యేక వివాహ చట్టం ఓ పరిష్కారంగా ఉంటుందని చెప్పొచ్చు.

వీడియో క్యాప్షన్, ఇంట్లోంచి సవతి తల్లి పంపించేస్తే ఏం చేయాలి?

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)