వరంగల్: ఎంజీఎంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికో ప్రీతి పరిస్థితి విషమం... ఇది ర్యాగింగ్ దారుణమేనా?

- రచయిత, ప్రవీణ్ శుభం
- హోదా, బీబీసీ కోసం
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో సీనియర్ విద్యార్థి వేధింపుల కారణంగా జూనియర్ పీజీ వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి తనకు తాను ఇంజక్షన్ చేసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది.
ప్రస్తుతం ప్రీతికి హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స జరుగుతోంది.
నిమ్స్‌లో చికిత్స పొందుతోన్న ప్రీతిని, ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర రాజన్. వైద్యులతో మాట్లాడి ప్రీతి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు.
ప్రీతి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందన్నారు గవర్నర్. డాక్టర్లు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారని, ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. "ఇది చాలా బాధాకరమైన పరిస్థితి. ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలో జరగాలి. ఇప్పుడే దీనిపై ఏం జరిగిందన్నది చెప్పలేం. విద్యార్థులందరూ ధైర్యంగా ఉండాలి" అని ఆమె అన్నారు.
ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రీతిని నిమ్స్‌కి తరలించేప్పపటికే మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల పరిస్థితి క్లిష్టంగా మారిందని ఆ బులెటిన్‌లో తెలిపారు. వెంటిలేటర్, ఎక్మో సపోర్ట్‌తో చికిత్స చేస్తున్నామన్నాారు.
ఈ ఘటనపై వరంగల్ మట్టేవాడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
పోలీసులు, తెలంగాణ వైద్యశాఖ అధ్యర్యంలో ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.
జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొంగ్రాయి గిర్నీ తాండకు చెందిన ప్రీతి కుటుంబం కొంతకాలంగా హైదరాబాద్‌లో నివాసం ఉంటోంది.
తండ్రి ధరావత్ నరేందర్ వరంగల్ రైల్వే పోలీస్‌లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు.
ప్రీతి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. గత ఏడాది నవంబర్‌లో వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో అనస్తీషియా పీజీ కోర్స్‌లో జాయిన్ అయ్యింది.
గత రెండు నెలలుగా కాకతీయ మెడికల్ కాలేజ్ బోధనాసుపత్రి అయిన ఎంజీఎం ఆసుపత్రిలో ప్రొఫెసర్లు, సీనియర్ విద్యార్థుల పర్యవేక్షణలో విధులు నిర్వహిస్తోంది.
కొద్దిరోజులుగా అనస్తీషియా సీనియర్ విద్యార్థి సైఫ్ అలీ, ప్రీతికి మధ్య డ్యూటీ సందర్భంగా పొరపొచ్చాలు వచ్చాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.
డ్యూటీలో వేధింపులు, ర్యాగింగ్ వల్లే ప్రీతి ఆత్మహత్యాయత్నానికి దారితీసిందన్న వార్తలు వచ్చాయి.
పోలీసులు ఏమన్నారంటే...
పోలీసులు, వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు అందించిన సమాచారం ప్రకారం....
ఘటనకు రెండు రోజుల ముందు ప్రీతి తండ్రి నరేందర్ ఈ విషయంపై వరంగల్ పోలీస్ ఉన్నతాధికారి ఒకరికి మౌఖికంగా పిర్యాదు చేశారు. పోలీసులు ఆ విషయాన్ని కాకతీయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లారు.
ప్రిన్సిపల్ ఆదేశాలపై ప్రీతి, సైఫ్ లను పిలిపించిన అనస్తీషియా విభాగం హెచ్ఓడీ కౌన్సిలింగ్ ఇచ్చారు.
ఆ తర్వాత ఇద్దరికి వేర్వేరుగా డ్యూటీలు వేశారు.
ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఎంజీఎం ఆసుపత్రి ప్రసవాల విభాగంలో ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్ విధులకు హాజరైన ప్రీతి బుధవారం తెల్లవారు జామున డ్యూటీ డాక్టర్ రూమ్‌లో అపస్మారక స్థితిలో కనిపించింది.
అక్కడే ఉన్న తోటి వైద్య విద్యార్థులు, డ్యూటీ సిబ్బంది విషయం ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చి ఐసీయూలో చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుండి ప్రీతిని అత్యవసర చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు.

డాక్టర్ అవ్వాలన్నది చిన్ననాటి కల
ధరావత్ నరేందర్‌కు ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. తన కంటే పెద్ద వారైన ఇద్దరు అక్కలు ఇంజనీరింగ్ ఎంచుకోగా డాక్టర్ అవ్వాలన్నది ప్రీతి చిన్ననాటి కల అని కుటుంబ సభ్యులు తెలిపారు.
‘’ప్రీతి చిన్ననాటి నుండి ధైర్యవంతురాలు. పోటీ పడి చదివి ఇద్దరక్కలకు భిన్నంగా ఉండాలని ఎంబీబీఎస్ ఎంపిక చేసుకుంది. యూపీఎస్సీ మెడికల్ సర్వీస్ ఎగ్జామ్‌లో ఇంటర్వూ వరకు వెళ్లింది. కోవిడ్ సమయంలో హైదరాబాద్‌లో కాంట్రాక్ట్ డాక్టర్‌గా కరోనా వార్డ్‌లో పనిచేసింది. సమాజంలో నలుగురికి ఉపయోగపడాల్సిన అమ్మాయి చేతికంది వచ్చాక ఇలా అయ్యింది’’ అని ప్రీతి తండ్రి ధరావత్ నరేందర్ బీబీసీతో అన్నారు.
కులం పేరుతో వేధింపులు, ర్యాగింగ్ ఆరోపణలు
ప్రీతిని కులం పేరుతో అవమానించడం, ర్యాగింగ్ చేసారన్న ఆరోపణలు వచ్చాయి.
ఈ ఆరోపణలపై ప్రీతి కుటుంబ సభ్యులు, కాకతీయ మెడికల్ కాలేజ్, ఎంజీఎం ఆసుపత్రి వర్గాలతో బీబీసీ మాట్లాడింది.
‘’పనిగట్టుగుని వేధించేవాడు. పనిచేసినా చేయలేదని ఇబ్బంది పెడుతున్నాడని ఏడుస్తూ చెప్పేది. కంప్లైంట్ చేద్దామంటే వద్దూ మార్కులు తక్కువ వేస్తారని వారించేది. ఎప్పుడూ ధైర్యంగా ఉండే నా బిడ్డ ఏడుపు చూసి వరంగల్ పోలీసులను సంప్రదించాను. మెడికల్ కాలేజీ అధికారులు సరైన సమయంలో స్పందించి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదేమో?’’ అని ప్రీతి తండ్రి నరేందర్ బీబీసీతో అన్నారు.
ఈ అంశం పై కాకతీయ మెడికల్ కాలేజ్ (కేఎంసీ) ప్రిన్సిపల్ మోహన్ దాస్ బీబీసీ తో మాట్లాడారు.
‘’కాకతీయ మెడికల్ కాలేజీలో వివిధ విభాగాలకు చెందిన 1500 మంది అండర్ గ్రాడ్యుయేట్లు, 500 మంది వరకు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఉన్నారు. విద్యార్థుల సమస్యలు మా దృష్టికి తెచ్చేందుకు కంప్లైంట్ బాక్స్ ఉంటుంది. ఈ మెయిల్ ఐడీ కూడా ఇచ్చాం. సమస్య చెబితే చాలు, పేరు చెప్పాల్సిన అవసరం కూడా లేదని చెప్పాం. గతంలో ఇలా వచ్చిన కంప్లైంట్స్‌ను పరిష్కరించాం. ఏదో సోర్స్ నుండి కంప్లైంట్ రావాలి కదా? ప్రీతి నుండి కానీ వారి పేరెంట్స్ నుండి కానీ కంప్లైంట్స్ రాలేదు. సైఫ్ అలీ అనే సీనియర్ పీజీ విద్యార్థి ర్యాగింగ్ , వేధింపులకు పాల్పడుతున్నాడని, ఆ విషయం చూడాలని వరంగల్ పోలీసుల నుండి కాల్ వచ్చింది. అనస్తీషియా విభాగం హెడ్, మరో ఇద్దరు మహిళా ప్రొఫెసర్లతో ప్రీతి, సైఫ్ అలీలకు కౌన్సిలింగ్ ఇప్పించాం. ఆ తర్వాత ఇద్దరు కలిసి పనిచేయకుండా వేర్వేరు విభాగాల్లో డ్యూటీలు వేసాం’’అని బీబీసీతో చెప్పారు.

అయితే, విధులు నిర్వహించే సందర్భంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి డాక్టర్ పర్యవేక్షణలో జూనియర్, సీనియర్ విద్యార్థులు ఆపరేషన్ థియేటర్లలో విధులు నిర్వహించాల్సి ఉంటుందని, అయితే అలా కాకుండా సీనియర్లకే వదిలేసి వెళ్లడంతో ఇలాంటి ఘటన చోటుచేసుకుందన్న ఆరోపణలు వచ్చాయి.
అయితే ఈ ఆరోపణలను కేఎంసీ వర్గాలు ఖండించాయి. ఘటన జరిగిన రోజు అసిస్టెంట్ ప్రొఫెసర్ డ్యూటీలో ఉన్నారని కేఎంసీ ప్రిన్సిపల్ మోహన్ దాస్ బీబీసీకి తెలిపారు.
‘’ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకే ఫ్యాకల్టీ స్టూడెంట్స్‌తో ఉంటారు (క్లాస్‌లు జరుగుతాయి). ఆ తర్వాత ఆపరేషన్ థియేటర్ ,ఇతరత్రా డ్యూటీల్లో సీనియర్లు జూనియర్లను గైడ్ చేస్తుంటారు. నేర్చుకోవడంలో ఈ పద్దతి అనవాయితీగా వస్తోంది. డ్యూటీ లో ఇద్దరి మధ్య పొరపొచ్చాలు వస్తే కౌన్సిలింగ్ నిర్వహించి వేర్వేరు విభాగాల్లో పనిచేసేలా సెపరేట్ చేశాం. మా విచారణలో కాలేజీలో, హాస్టళ్లలో ర్యాగింగ్ జరిగినట్టుగా ఎక్కడ లేదు’’అని ప్రిన్సిపల్ మోహన్ దాస్ అన్నారు.
అయితే, ఎంజీఎంలో ఆయా విభాగాల్లో విధుల నిర్వహణ సందర్భంగా వైద్య విద్యార్థులు వివిధ రకాల ఒత్తిడిల మధ్య పనిచేస్తున్నారన్న వాదనలు కొంతకాలంగా ఉన్నాయి.
ఈ విషయంలో విద్యార్థులు, ఫ్యాకల్టీతో మాట్లాడతాం. సైకియాట్రిస్ట్‌లతో కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తామని కేఎంసీ ప్రిన్సిపల్ మోహన్ దాస్ అన్నారు.

ఇతరత్రా ఆరోగ్య సమస్యలా, హానికర ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడిందా?
ప్రీతి ఆత్మహత్యయత్నంపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి.
ఒత్తిడి, వేధింపులకు లోనైన ప్రీతి తనకు తాను ఇంజక్షన్ చేసుకుని (మత్తు ఇంజక్షన్, హానికారక ఇంజక్షన్) ఆత్మహత్యాప్రయత్నం చేసిందన్నది ఒక వాదన కాగా.. ఆయాసం, ఛాతిలో నొప్పితో డ్యూటీ డాక్టర్ రూమ్‌లోకి విశ్రాంతి కోసం వెళ్లి, అక్కడే కొద్దిసేపటికి అపస్మారక స్థితిలో వెళ్లిన ఆమెను చూసిన డ్యూటీ సిబ్బంది ఉన్నతాధికారులకు విషయం తెలియజేశారన్నది మరో వాదన.
సాధారణ వ్యక్తి అనస్తీషియా ఇంజక్షన్ చేసుకుంటే ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయన్న అంశంపై ప్రీతీ తన సెల్ ఫోన్ లో గూగుల్ సెర్చ్ చేసిందన్న వాదనలు ఉన్నాయి.
‘’ ఎంజీఎం ఆర్ఐసియూలో ప్రీతికి మొదట చికిత్స అందించాం. పరిస్థితి క్రిటికల్ గా మారడంతో నిమ్స్ ఆసుపత్రికి తరలించాం. అక్కడి డాక్టర్లతో మాట్లాడుతున్నాం. మా విద్యార్థిని కాపాడుకోవడం మాకు మొదటి ప్రాధాన్యత. ఇది మెడికో లీగల్ కేసు. పోలీసులకు ఇన్ఫామ్ చేసి ప్రీతి సెల్ ఫోన్ ను అప్పగించాం. వేధింపులు జరిగాయా లేదా అన్నది పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో బయటపడుతుంది. తప్పు జరిగిందని తేలితే చర్యలు తీసుకుంటాం. ఇద్దరూ డాక్టర్లే. 60 ఏళ్ల చరిత్రలో ఎంజీఎంలో ఇలాంటి ఘటన జరగలేదు. పోలీసుల ఇన్వెస్టిగేషన్‌కు సహకరిస్తున్నాం’’ అని ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ బీబీసీతో అన్నారు.
‘ప్రీతి థైరాయిడ్, రుమటాయిడ్ ఆర్థ్రైటిస్‌కు కొంతకాలంగా మందులు వాడుతోంది. తనకు తానుగా ఇంజన్ చేసుకుందా అనే విషయం పోలీసుల విచారణలో తేలుతుంది. ఘటన జరిగిన సందర్భంలో డ్యూటీలో ఉన్న సిబ్బంది అందరూ పోలీసుల విచారణకు సహకరిస్తున్నారు. ఇద్దరూ మా విద్యార్థులే. ప్రజల కోసం పనిచేస్తున్నారు. పోలీసుల విచారణ రిపోర్ట్ ప్రకారం తదుపరి చర్యలకు కట్టుబడి ఉన్నాం’ అని డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.
అయితే ప్రీతి తండ్రి నరేందర్ మాత్రం తమ కూతురు ఆత్మహత్యాయత్నం ఘటనపై భిన్నమైన వాదన వినిపిస్తున్నారు.
‘ఆ రాత్రి ఏం జరిగిందో అన్న దానిపై అనుమానాలు ఉన్నాయి. బుధవారం ఉదయం 8.30 గంటలకు నా కూతురు ఫోన్ నుండే నాకు ఫోన్ వచ్చింది. సహచర డాక్టర్ ఒకరు ఫోన్ చేసి ప్రీతి అపస్మారక స్థితిలో ఐసియూలో చికిత్స పొందుతోందని చెప్పారు. ఆమె ఆరోగ్యంగా ఉంది. థైరాయిడ్ వల్ల మనుషులు చనిపోరు కదా’’ అని ప్రశ్నించారు.

విచారణ కమిటీ ఏర్పాటు
ఈ ఘటనపై తెలంగాణ వైద్య విద్యాశాఖ డైరెక్టర్ విచారణకు ఆదేశించారు. ఎంజీఎం ఆసుపత్రికి చెందిన నలుగురు సీనియర్ ప్రొఫెసర్లతో విచారణ కమిటీని నియమించారు. 24 గంటల్లో వారి నుండి నివేదిక కోరారు.
సీల్డ్ కవర్ నివేదిక అందాక డీఎంఈ (డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్)కు నివేదిక పంపుతాం అని ఎంజీఎం సూపరింటెండెంట్ తెలిపారు.
ర్యాగింగ్, అట్రాసిటి కేసు నమోదు:
ఈ ఘటనపై ఏబీవీపి విద్యార్థి సంఘం కాకతీయ మెడికల్ కాలేజ్ ముందు ఆందోళనకు దిగింది. ఆరోపణలు ఎదుర్కొంటోన్న విద్యార్థి సైఫ్ అలీ మెడికల్ డిగ్రీని రద్దు చేయాలని డిమాండ్ చేసింది. సీనియర్ల వేధింపులను కేఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించింది. ఈ సందర్భంగా ఏబీవీపి విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటోన్న సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ అలీ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు.
వరంగల్ ఏసిపి కిషన్ ఆధ్వర్యంలో ఈ కేసు విచారణ జరుగుతోంది.
‘ప్రీతి తండ్రి ఇచ్చిన పిర్యాదుపై యాంటీ ర్యాగింగ్, ఐపిసి 354, ఎస్సీ-ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశాం. వేధింపుల కారణంగా సూసైడ్ అటెంప్ట్ చేసినట్టు పిర్యాదులో చెప్పారు. ఇంజక్షన్ తీసుకుందా ఇంకా ఇతరత్ర అంశాలపై ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాం. ర్యాగింగ్ జరగలేదు కానీ డ్యూటీలో ఒత్తిడికి లోనైనట్టు తెలుస్తోంది. మా విచారణ కొనసాగుతోంది.’
‘ఉన్నత వైద్య విద్యార్థిని ఆత్మహత్యయత్నం బాధాకరం. ఒత్తిడి, వేధింపులు ఉంటే సంబంధిత అధికారులకో, పోలీసులకో ఇన్ఫామ్ చేసి సహాయం పొందాలి’ అని వరంగల్ ఏసిపి కిషన్ బీబీసీతో అన్నారు.
ప్రస్తుతం నిమ్స్ లో చికిత్స పొందుతున్న ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఆమెకు అత్యవసర ఎక్మో చికిత్సను అందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆంగ్లో ఇండియన్స్ అంటే ఎవరు, ఎందుకు తమ మూలాలు వెతుక్కుంటున్నారు?
- ఏజ్ ఆఫ్ కన్సెంట్: సెక్స్‌కు సమ్మతి తెలపాలంటే కనీస వయసు ఎంత ఉండాలి?
- అదానీ గ్రూప్ నుంచి భారీ ధరలకు ‘విద్యుత్ కొనుగోలు’ ఒప్పందం... ఇరకాటంలో బంగ్లాదేశ్
- తుర్కియే-సిరియా: భూకంప బాధితులు ఎందుకు సరిహద్దులకు వస్తున్నారు?– బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- రోహిణీ సింధూరి-రూపా మౌద్గిల్: ఈ ఇద్దరు మహిళా ఆఫీసర్ల మధ్య గొడవేంటి, కర్ణాటక ప్రభుత్వం ఏం చేసింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














