తెలంగాణ ‘పోలీస్ కస్టడీలో చిత్ర హింసలు.. చైన్ స్నాచింగ్ కేసులో అనుమానితుడి మృతి’ - ఖదీర్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నాక ఏం జరిగింది?

ఫొటో సోర్స్, UGC
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణలోని మెదక్ పట్టణంలో పోలీసులు చిత్రహింసలు పెట్టడం వల్లే ఖదీర్ ఖాన్ అనే వ్యక్తి మరణించినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
చైన్ స్నాచింగ్ చేశాడనే అనుమానంతో ఖదీర్ ఖాన్ (37) ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను నాలుగు రోజులు పోలీసులు కస్టడీలో ఉంచుకుని చిత్రహింసలు పెట్టారని ఆయన భార్య సిద్ధేశ్వరి ఆరోపించారు.
‘‘ఆయన్ను దారుణంగా హింసించారు. పోలీసుల దెబ్బలను ఆయన తట్టుకోలేకపోయారు. చివరకు అనారోగ్యం పాలై ఆయన మరణించారు’’ ఆమె బీబీసీకి చెప్పారు.
రాష్ట్రంలో పోలీసులు చిత్రహింసలు పెట్టారని ఆరోపణలు రావడం ఇదేమీ తొలిసారి కాదు. 2021 జూన్‌లోనూ యాదాద్రి భువనగిరి జిల్లాలోని అడ్డగూడూరు పోలీసుస్టేషన్ పరిధిలో మరియమ్మ అనే దళిత మహిళ లాకప్ డెత్ ఘటన కలకలం రేపింది.
ఏడేళ్ల కిందట మెదక్ జిల్లాలో పుల్కల్ పోలీసుస్టేషన్‌లోనూ పోలీసుల వేధింపులతో ఓ వ్యక్తి చనిపోయాడని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ మెదక్ పట్టణంలో ఖదీర్ మృతి కేసు దూమారం రేపుతోంది.
తనను పోలీసులు ఏ విధంగా కొట్టారనే విషయాన్ని ఖదీర్ చెబుతున్న వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై మెదక్ పట్టణానికి వెళ్లి బీబీసీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్టు ఇదీ.

కిరాయి ఇంట్లోనే జీవనం..
ఖదీర్ ఖాన్ సొంత ఊరు మెదక్ పట్టణంలోని పిట్లం బేస్. మొదట్లో ఆయన పాన్ డబ్బా నిర్వహించేవారని, ఆ తర్వాత చిన్న చిన్న వ్యాపారాలు కూడా చేశారని ఆయన భార్య సిద్ధేశ్వరి చెప్పారు. వీరిద్దరికీ 2017 డిసెంబరులో వివాహమైంది.
‘‘నాకు ఇంతకముందే పెళ్లయింది. నా భర్త చనిపోయారు. ముగ్గురు పిల్లలున్నారు. అయినప్పటికీ, నా మీద ఇష్టంతో ఖదీర్ నన్ను పెళ్లి చేసుకున్నారు’’ అని ఆమె చెప్పారు.
ఖదీర్ చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారని, నాన్నమ్మ దగ్గరే ఆయన పెరిగారని స్థానికుడు అఫ్జల్ చెప్పారు. ‘‘వారిది పేద కుటుంబం. చిన్న పెంకుటింట్లో వారు అద్దెకు ఉంటారు. పండ్లు అమ్ముకుని ఖదీర్ కుటుంబాన్ని పోషించేవారు’’అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, UGC
అసలేం జరిగింది?
మెదక్ పట్టణంలోని అరబ్ గల్లీకి చెందిన ఒక మహిళ తన మెడలోని పుస్తెలతాడును తెంపుకొని పోయారని పోలీసులకు జనవరి 27న ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. సమీపంలోని ఓ ఆలయం వద్ద అమర్చి ఉన్న సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించారు.
అనంతరం చైన్ స్నాచింగ్ చేశారనే అనుమానంతో ఖదీర్ ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై ఖదీర్ సోదరి తబస్సుం బీబీసీతో మాట్లాడారు.
‘‘జనవరి 29న రాత్రి ఓ వేడుకలో ఉండగా ఖదీర్‌ను పోలీసులు తీసుకెళ్లారు. ఫిబ్రవరి 2వ తేదీ వరకు మెదక్ పోలీసు స్టేషన్‌లోనే ఆయన్ను ఉంచారు. 2వ తేదీ మధ్యాహ్నం ఆయన భార్య సిద్ధేశ్వరికి పోలీసులు ఫోన్ చేశారు. ఖదీర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం ఇచ్చారు’’అని తబస్సుం చెప్పారు.
సిద్ధేశ్వరి కామారెడ్డిలో ఉండటంతో 3వ తేదీన పోలీసు స్టేషన్‌కు వచ్చారు. అప్పటికే మేజిస్ట్రేట్ ఎదుట ఖదిర్‌ను హాజరు పరిచారు.
‘‘ఖదీర్‌తో గొడవపడి జనవరి 7న నేను ఇంట్లో నుంచి వెళ్లిపోయా. 12న ఖదీర్ హైదరాబాద్ వెళ్లారు’’అని సిద్ధేశ్వరి బీబీసీతో చెప్పారు.
‘‘ఫిబ్రవరి 2న పట్టుకున్నాం.. 3న వదిలిపెడుతున్నాం.. అని కాగితంపై రాసి సంతకం పెట్టమని ఖదీర్‌ను అడిగారట. కానీ, తనను జనవరి 29నే పట్టుకున్నారు కదా అని ఖదీర్ ప్రశ్నించారట.. పైగా రాయడానికి వస్తాలేదు అని చెప్పాడట’’అని ఆమె వివరించారు.
‘‘ఎక్కడికక్కడ చేతులు విరిచేశారు. మొదట్లో నొప్పి వల్ల అలా అంటున్నారేమో అనుకున్నాను. సంతకం చేయడానికి రావడం లేదంటే.. సంతకం కూడా వాళ్లే(పోలీసులు) చేసారట’’అని ఆమె తెలిపారు.
‘‘ఇంతలా ఎందుకు కొట్టారని నేను పోలీసులను అడిగా. తప్పు చేశామని కొట్టామమ్మా అని వారన్నారు. పైగా ప్రాణం పోయేంతగా ఏమీ కొట్టం అని కూడా అన్నారు. నేను కూడా తగ్గిపోతుందిలే అనుకుని తీసుకువచ్చా’’ అని సిద్ధేశ్వరి బీబీసీకి చెప్పారు.

‘‘కొట్టినప్పట్నుంచి మూత్రం రావట్లేదన్నారు’’
ఆ తర్వాత ఖదీర్ ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ తీవ్రమైందని సిద్ధేశ్వరి తెలిపారు.
‘‘ఇంటికి తీసుకువచ్చాక చిన్న పిల్లాడిలా చూసుకున్నాను. ఆయన అన్నం తిన లేదు.. ఏమీ తిన లేదు. బాత్రూంకు కూడా నేనే తీసుకెళ్లిదాన్ని. చిన్న బాబును ఎలా తీసుకెళతారో అలాగే తీసుకెళ్లాను. అసలు మూత్రం పోయడానికే తను వెళ్లేవాడు కాదు. ఏమైంది అసలు మూత్రం పోయట్లేదు? అని అడిగితే, కొట్టినప్పట్నుంచి మూత్రం రావట్లేదని అన్నారు. ఎవరెవరు కొట్టారో.. వాళ్ల పేర్లు కూడా చెప్పారు. వారి పేర్లు రాసి కలెక్టర్ ఆఫీసులో పిటిషన్ వేసి వచ్చాను’’ అని సిద్దేశ్వరి చెప్పారు.
వాంతులు అవ్వడం, కడుపు ఉబ్బడంతో ఫిబ్రవరి 8న మెదక్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి ఖదీర్‌ను తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు చేశారు.
‘‘9వ తేదీన రిపోర్టులు వచ్చాయి. ఖదీర్ రెండు కిడ్నీలు పాడైనట్లు వైద్యులు చెప్పారు. వెంటనే అక్కడి నుంచి కొంపల్లిలోని రెనోవా ఆసుపత్రికి పోలీసులే తీసుకెళ్లారు. అక్కడ మూడు రోజులు ఉన్న తర్వాత పరిస్థితి మరింత విషమించింది’’అని సిద్ధేశ్వరి వివరించారు.

‘‘11వ తేదీన గచ్చిబౌలిలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రితికి మార్చేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే, దానికి ఖదీర్ ఒప్పుకోలేదు. ప్రైవేటు ఆసుపత్రికి వెళితే.. తనను చంపేస్తారని భయపడ్డారు. తనను ప్రభుత్వ ఆసుపత్రికి లేదా దర్గాకు తీసుకెళ్లాలని ప్రాధేయపడ్డారు’’అని ఆమె చెప్పారు.
‘‘అదే రోజు రాత్రి హైదరాబాద్ శివారులోని కౌకూరు వద్ద దర్గా వద్దకు తీసుకువచ్చి పోలీసులు మమ్మల్ని వదిలిపెట్టారు. ఆ తర్వాత 12వ తేదీ ఉదయం ఆయన్ను హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చేర్పించాం’’అని ఆమె వివరించారు.
‘‘అక్కడ ఖదీర్‌కు డయాలసిస్ ప్రారంభించారు. పరిస్థితి విషమించి 16వ తేదీన ఖదీర్ చనిపోయారు’’అని సిద్ధేశ్వరి తెలిపారు. పోలీసు స్టేషన్‌లో ఉన్నప్పుడు తీవ్రంగా కొట్టడం వల్లే ఆయన చనిపోయారని ఆమె ఆరోపించారు.
‘‘రెండు చేతులు పైకి వేలాడదీసి రెండు గంటలు కొట్టారంట. హైదరాబాద్ నుంచి తీసుకొచ్చేప్పుడు కూడా తన్నారట. రోకలి బండతో కూడా కొట్టారట. బెల్టుతో కొట్టారట. నీళ్లు అడిగితే కూడా ఇవ్వలేదట. జుట్టు పట్టి గుంజారట. చాలా దారుణంగా హింసించారు. ఇవన్నీ ఏడ్చుకుంటూ ఖదీర్ చెప్పారు. ఆయన చాలా బాధపడ్డాడు’’అని సిద్ధేశ్వరి చెప్పారు.
‘‘మరోవైపు మీ అక్కను కూడా పట్టుకున్నాం. లేడీ పోలీసులకు అప్పగించాం. ఆమెపైకి ఎలుకలు వదిలిపెడతాం’’ అని కూడా ఖదీర్‌ను భయపెట్టారని సిద్ధేశ్వరి ఆరోపించారు.

పోలీసులు ఏం అంటున్నారు?
ఈ కేసుపై మీడియాలో వార్తలు రావడంతో ఫిబ్రవరి14వ తేదీన ఎస్‌ఐ రాజశేఖర్, కానిస్టేబుళ్లు ఆర్.పవన్ కుమార్, బి.ప్రశాంత్‌లను బదిలీ చేస్తూ మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆదేశాలు జారీచేశారు.
‘‘దొంగతనం చేశాడనే అనుమానంతో ఖదీర్ ఖాన్‌ను మెదక్ పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టారు. కానీ, కొట్టలేదు. దొంగతనం చేయలేదని తేలడంతో మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి కుటుంబ సభ్యులకు అప్పగించాం. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఈ మధ్యలో ఏం జరిగిందో తెలియదు’’ అని తొలుత డీఎస్పీ సైదులు వివరణ ఇచ్చినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.
మరోవైపు ఫిబ్రవరి 17 తేదీ సీఐ మధు, ఎస్ఐ రాజశేఖర్, కానిస్టేబుళ్లు ఆర్.పవన్ కుమార్, బి.ప్రశాంత్‌లను సస్పెండ్ చేస్తూ ఐజీ ఆదేశాలు జారీ చేశారని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ విషయంపై వివరణ కోసం మెదక్ పట్టణ పోలీసులు, డీఎస్పీని బీబీసీ సంప్రదించింది. అయితే, ఘటనపై ఉన్నత స్థాయిలో విచారణ జరుగుతుండటంతో తాము మాట్లాడకూడదన్నారు.
‘‘వాళ్లను ఉద్యోగం నుంచి తొలగించాలి. జైలు శిక్ష పడాలి. నా భర్త చాలా నరకం అనుభవించారు. అనవసరంగా చేయని తప్పుకు కొట్టి ఒక నిండు ప్రాణం బలి తీసుకున్నారు. మమ్మల్ని అనాథలను చేశారు’’ అని సిద్ధేశ్వరి ఆవేదన వ్యక్తంచేశారు.
సిద్ధేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సెక్షన్ 174 (అనుమానాస్పద మృతి) కింద మెదక్ పట్టణ పోలీసులు ఈ నెల 17న కేసు నమోదు చేశారు.
పోస్టుమార్టం నివేదికమై గాంధీ ఆసుపత్రి వర్గాలను సంప్రదించగా.. బయటకు ఇవ్వడానికి కుదరదని, నివేదిక నేరుగా పోలీసులకే అందిస్తామని చెప్పారు.

మానవ హక్కుల సంఘాలు ఏమంటున్నాయి?
సిద్ధేశ్వరి కుటుంబానికి మానవ హక్కుల సంఘాలు, మైనార్టీ సంఘాలు వచ్చి మద్దతు తెలుపుతున్నాయి.
ఈ కేసుపై మానవ హక్కుల ఫోరం మెదక్ జిల్లా అధ్యక్షుడు షేక్ అహ్మద్ బీబీసీతో మాట్లాడారు.
‘‘ఈ కేసులో పోలీసులు మానవ హక్కులను ఉల్లంఘించారు. ఇలాంటి పోలీసు వ్యవస్థ మధ్య యుగాల్లో ఉండేది. కుటుంబ సభ్యులను కలవనివ్వక పోవడంతో తనను చంపేస్తారేమోననే భయంతో ఆయన పూర్తిగా కుంగిపోయారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ముందుగా సీఆర్‌పీసీ సెక్షన్ 41 ప్రకారం నోటీసులు ఇవ్వాలి. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలి.
24 గంటలలోగా కోర్టు ముందు హాజరు పరచాలి.. కానీ, ఇవేమీ పోలీసులు పాటించలేదు’’అని ఆయన చెప్పారు.
‘‘మరియమ్మ లాకప్ డెత్ తర్వాత ఇలాంటివి పునరావృతంకావని సీఎం ప్రకటించారు. కానీ, మళ్లీ ఇప్పుడు ఇలాంటి మృతి సంభవించింది. ఐజీ విచారణ కమిటీ వేసినా, మాకు నమ్మకం కలగడం లేదు. హైకోర్టు ఆధ్వర్యంలోనే విచారణ కమిషన్ వేయాలి. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగిన తీరుపై సుప్రీంకోర్టు కలగజేసుకోవాలి’’ అని ఆయన డిమాండ్ చేశారు.
మరోవైపు ఈ కేసుపై హైకోర్టు న్యాయవాది అశోక్ కుమార్ కూడా బీబీసీతో మాట్లాడారు. ‘‘సాధారణంగా దొంగతనం కేసులో ఆరు నెలలే జైలు శిక్ష వేస్తారు. కానీ, ఈ కేసు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు ఆశ్చర్యంగా ఉంది. దీన్ని కస్టోడియల్ డెత్ అనాలి. సెక్షన్ 302 కింద హత్య కేసు బుక్ చేయాలి. సెక్షన్ 174 కింద మాత్రమే కేసును పెట్టి ఊరుకోవడం సరికాదు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ సహా కేసులో ఉన్న అందరూ విచారణ ఎదుర్కోవాలి’’ అని అశోక్ కుమార్ అన్నారు.
మరోవైపు హత్యారోపణలతో సెక్షన్ 302 కింద కేసు నమోదు చేయాలని మాజీ ఐపీస్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఖదీర్ ఖాన్‌కు న్యాయం జరిగే వరకు పోరాడతామని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ 2022: ముగిసిన ఓటింగ్, మార్చి 5న విజేత ప్రకటన
- మాతృభాషా దినోత్సవం: తెలుగు భాషకు ప్రాచీన హోదా వల్ల ఏదైనా మేలు జరిగిందా... ప్రాచీన భాషా అధ్యయన కేంద్రం నిధుల మాటేమిటి?
- అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం: తెలుగు, సంస్కృతం, హిందీ, తమిళం.. ఏది ప్రాచీన భాష? ఏ భాష మూలాలు ఏమిటి?
- E sanjeevani: పైసా ఖర్చు లేకుండా ఆన్లైన్లో టెలిఫోన్ ద్వారా లేదా వీడియో కన్సల్టేషన్ పొందడం ఎలా?
- బీబీసీ ఎలా పని చేస్తుంది, నిధులు ఎక్కడి నుంచి వస్తాయి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















