బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ 2022: ముగిసిన ఓటింగ్, మార్చి 5న విజేత ప్రకటన

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కోసం నిర్వహించిన ఓటింగ్‌లో భారత్‌తోపాటు విదేశాల్లోని క్రీడా అభిమానులు కూడా పాలుపంచుకొని తమకు నచ్చిన క్రీడాకారిణికి ఓటు వేశారు. ఫిబ్రవరి 6న ఈ ఓటింగ్ మొదలైంది.
2022 ఏడాదికి గాను ఐదుగురు క్రీడాకారిణులు ఈ అవార్డు కోసం పోటీ పడుతున్నారు. వీరిలో వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, రెజ్లర్లు సాక్షి మలిక్, వినేశ్ ఫోగట్, షట్లర్ పీవీ సింధు, బాక్సర్ నిఖత్ జరీన్ ఈ జాబితాలో ఉన్నారు.
విజేతను 2023 మార్చి 5వ తేదీన ప్రకటిస్తారు.
ఈ ఐదుగురు నామినీలను స్పోర్ట్స్ నిపుణులు, జర్నలిస్టులు, రచయితలు ఎంపిక చేశారు.
నామినీలు వీరే...

ఫొటో సోర్స్, Getty Images
మీరా బాయి చాను
టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని గెలుచుకున్న తొలి భారతీయ వెయిట్‌లిఫ్టర్‌గా సైఖోమ్ మీరాబాయి చాను 2021లో క్రీడా రంగంలో చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ 2022లో రజత పతకాన్ని, బర్మింగ్హమ్ కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకాన్ని ఆమె గెలుచుకున్నారు.
రియో గేమ్స్‌లో బరువు ఎత్తడంలో విఫలమైనప్పటి నుంచి అంటే 2016 నుంచి ఆమె పట్టు వదలని దీక్షతో పతకం కోసం ప్రయత్నించారు. వరల్డ్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్స్ 2017లో ఆమె బంగారు పతకాన్ని గెలుచుకోవడం ద్వారా తనని తాను నిరూపించుకున్నారు.
భారత్‌లోని ఈశాన్య రాష్ట్రమైన మణిపుర్‌లో మీరాబాయి చాను జన్మించారు. టీ దుకాణం యజమాని కూతురు ఆమె. తన క్రీడా జీవితాన్ని ప్రారంభించినప్పుడు మీరాబాయి చాను ఎన్నో ఆర్థిక సవాళ్లను ఎదుర్కొన్నారు. కానీ, ఒలింపిక్ ఛాంపియన్‌గా ఎదిగేందుకు ఆమెను తనకెదురైన అడ్డంకులన్నింటిని అధిగమించారు. 2021లో కూడా మీరాబాయి చాను బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సాక్షి మలిక్
58 కేజీ వెయిట్ కేటగిరీలో కాంస్య పతకాన్ని గెలుచుకోవడంతో 2016లో రియో ఒలింపిక్స్‌లో పతకాన్ని పొందిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా సాక్షి మలిక్ చరిత్ర సృష్టించారు.
ఒలింపిక్ పతకం సాధించిన నాలుగవ భారతీయ మహిళా ఈమె కావడం విశేషం. సాక్షికి క్రీడలంటే ఎంతో ఇష్టం. తన తాత రెజ్లర్ అని తెలుసుకున్న తర్వాత ఆమె ఎంతో స్ఫూర్తిని పొందారు. రియో ఒలింపిక్స్‌లో మెరిసిన తర్వాత, సాక్షి కెరీర్ ఒక్కసారిగా కుప్పకూలింది. కానీ, ఏ మాత్రం అధైర్యపడకుండా 2022లో బర్మింగ్హమ్ ఒలింపిక్స్‌లో బంగార పతకాన్ని గెలుచుకోవడం ద్వారా మరోసారి మెరిశారు. అంతకుముందు కామన్‌వెల్త్ గేమ్స్‌లో సాక్షి మాలిక్ రజత, కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వినేశ్ ఫోగట్
రెజ్లింగ్‌లో రెండు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు గెలుచుకున్న తొలి భారతీయ మహిళ వినేశ్ ఫోగట్. కామన్‌వెల్త్, ఏసియన్ గేమ్స్ రెండింట్లో బంగారు పతకాన్ని పొందిన తొలి భారతీయ రెజ్లర్ కూడా ఈమెనే. వినేశ్ కామన్‌వెల్త్ గేమ్స్‌తో తన పేరుపై వరుసగా మూడు బంగారు పతకాలను పొందారు. ఈ మెడల్స్ భిన్నమైన వెయిట్ కేటగిరీల్లో వచ్చాయి. తాజాగా 53 కేజీల బరువు విభాగంలో 2022 ఆగస్టులో కూడా కామన్‌వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు.
వినేశ్ ఫోగట్ మహిళా రెజ్లర్ల కుటుంబం నుంచే వచ్చారు. ఆమె కజిన్లు గీతా, బబితా ఫోగట్‌లు కూడా పలు అంతర్జాతీయ పతకాలను సాధించారు.

ఫొటో సోర్స్, Getty Images
పీవీ సింధు
ఒలింపిక్స్ వ్యక్తిగత విభాగంలో రెండు పతకాలను పొందిన తొలి భారతీయ మహిళ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు.
టోక్యో గేమ్స్‌లో తన రెండో ఒలింపిక్ పతకంగా కాంస్యం పొందారు. 2016లో రియో గేమ్స్‌లో రజత పతకాన్ని సొంతం చేసుకున్నారు. 2022లో కామన్‌వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకాన్ని సింధు సాధించారు.
అంతకుముందు 2021లో బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో రజత పతకం గెలుచుకున్నారు.
2019లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్న తొలి భారతీయురాలిగా సింధు నిలిచారు.
17 ఏళ్ల వయసులోనే సెప్టెంబర్ 2012లో బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్ 20లో చోటు దక్కించుకున్నారు.
ప్రజా ఓటింగ్‌తో 2019లో ప్రారంభమైన బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును పీవీ సింధు పొందారు.
2022లో అత్యధికంగా సంపాదించిన ప్రపంచంలోని మహిళా క్రీడాకారుల ఫోర్బ్స్ జాబితాలో.. పీవీ సింధు 12వ స్థానంలో నిలిచారు.

ఫొటో సోర్స్, SAI
నిఖత్ జరీన్
2011లో జూనియర్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ పొందిన తర్వాత, నిఖత్ జరీన్ 2022లో మహిళా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా ఎదిగారు.
ఫైవెయిట్ కేటగిరీలో బర్మింగ్హమ్ 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో బాకింగ్స్‌లో బంగారు పతకాన్ని నిఖత్ గెలుచుకున్నారు.
భారత్‌లో నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో కూడా బంగారు పతకంతో తన 2022 ఏడాదిని ముగించారు. తన కూతురు ఉత్సాహాన్ని చూసిన నిఖత్ జరీన్ తండ్రి, ఆమెకు మరింత ప్రోత్సాహం కల్పించేందుకు క్రీడా రంగానికి పరిచయం చేశారు.
తన పెళ్లిపై బంధువుల నుంచి వస్తున్న విమర్శలను, తన కూతురిపై తల్లికి ఉండే భయాలను పక్కన పెట్టిన నిఖత్ తండ్రి ఆమె కలలను సాకారం చేసుకునేలా ప్రోత్సహించారు. అప్పటి నుంచి నిఖత్ జరీన్ వెనుతిరిగి చూసుకోలేదు.
ఇవి కూడా చదవండి:
- గౌతమ్ అదానీ: 25 ఏళ్ల క్రితం గుజరాత్లో అదానీని కిడ్నాప్ చేసింది ఎవరు? అప్పుడు ఏం జరిగింది?
- ఆంధ్రప్రదేశ్: పొలాల్లొకి వచ్చే అడవి ఏనుగులను తరిమికొట్టే కుంకీ ఏనుగులు - వీటిని ఎలా పట్టుకుంటారు? ఎలా శిక్షణ ఇస్తారు?
- దళిత గ్రామాలకు రూ.21 లక్షలు ఇచ్చే ఈ పథకం గురించి తెలుసా?
- సున్తీ తర్వాత సెక్స్ సామర్థ్యం పెరుగుతుందా? నాలుగు ప్రశ్నలు, సమాధానాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














