సుకీర్త రాణి: 'అదానీ స్పాన్సర్ చేసిన అవార్డును నేను ఎందుకు తీసుకోలేదంటే...'

ఫొటో సోర్స్, SUKIRTHA RANI/FB
- రచయిత, దివ్య జయరాజ్
- హోదా, బీబీసీ తమిళ్
న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ ప్రకటించిన 'దేవి సమ్మాన్' పురస్కారాన్ని స్వీకరించేందుకు తమిళ కవయిత్రి సుకీర్తరాణి ఇటీవల నిరాకరించారు. సన్మాన వేడుకకు అదానీ గ్రూప్ ప్రధాన స్పాన్సర్‌గా ఉండటం వల్లే ఈ అవార్డును తాను తిరస్కరిస్తున్నట్లు ఆమె చెప్పారు.
దేశవ్యాప్తంగా విశేష కృషి చేస్తున్న మహిళలను న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ ప్రతి సంవత్సరం 'దేవి సమ్మాన్' పురస్కారంతో సత్కరిస్తుంది.
ఈ ఏడాది ఈ పురస్కారానికి ఎంపికైన 12 మంది మహిళా ప్రముఖుల్లో తమిళనాడుకు చెందిన కవయిత్రి సుకీర్తరాణి కూడా ఉన్నారు. సాహిత్యంలో, ముఖ్యంగా దళిత సాహిత్యంలో చేసిన కృషికి గు ఆమెను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు.
అయితే ఈ అవార్డును తాను స్వీకరించబోనని కవయిత్రి సుకీర్తరాణి సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా ప్రకటించారు.
''ఈ అవార్డు వేడుకకు అదానీ గ్రూప్ ప్రధాన స్పాన్సర్. అదానీ గ్రూప్ నుండి ఆర్థిక సహాయం పొందుతున్న ఇలాంటి ఏ అవార్డు మీదా నాకు ఆసక్తి లేదు. ఈ అంశం గురంచి నేను కొంత కాలంగా మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి సదరు అవార్డును స్వీకరించటానికి నిరాకరిస్తున్నాను'' అని ఆమె ఆ పోస్ట్‌లో వివరించారు.

ఫొటో సోర్స్, Twitter
సుకీర్తరాణి గత 25 సంవత్సరాలుగా తమిళ సాహిత్యంలో క్రియాశీలంగా ఉన్నారు. మహిళల హక్కుల కోసం, సమాజంలో అణగారిన ప్రజల కోసం ఆమె గొంతెత్తుతున్నారు. అందుకే అవార్డును తిరస్కరించాలన్న ఆమె నిర్ణయం పట్ల దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
ఈ మొత్తం విషయంపై సుకీర్తరాణి బీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు.
''ఈ అవార్డు గురించి మీకు ఎప్పుడు తెలిసింది? ఈ అవార్డును స్వీకరించరాదని పురస్కార వేడుకకు కేవలం ఒక వారం రోజుల ముందు మాత్రమే ఎందుకు నిర్ణయించుకున్నారు?'' అని బీబీసీ ఆమెను ప్రశ్నించింది.
ఈ ప్రశ్నకు సుకీర్తరాణి స్పందిస్తూ.. ''నేను చిన్నప్పటి నుంచి పెరియార్, అంబేడ్కర్, మార్క్స్ ఆలోచనల నుంచి స్ఫూర్తి పొందాను. వారి సిద్ధాంతాలు నన్ను ప్రభావితం చేశాయి. ఈ ముగ్గురి ఆలోచనలు నా రచనల్లో కూడా ప్రతిబింబిస్తాయి. నేను 'దేవి సమ్మాన్'కి ఎంపికయ్యానని డిసెంబరు 23న నాకు సమాచారం అందింది. ఆ తర్వాత వారు నాకు అధికారికంగా మెయిల్ పంపించారు'' అని తెలిపారు.
''మొదట నేను చాలా సంతోషించాను. నేను నాస్తికురాలిని. అందువల్ల.. దేవత పేరుతో ఇచ్చే పురస్కారాన్ని స్వీకరించడానికి విముఖత వ్యక్తంచేశాను.. కానీ ఇది మహిళా శక్తికి ఇస్తున్న గౌరవం అని కొంత మంది నాతో అన్నారు. దీంతో.. ఈ పురస్కారాన్ని స్వీకరించడానికి డిసెంబర్ 28వ తేదీన నేను అంగీకారం తెలిపాను'' అని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, Sukirtha Rani/FB
ఆ తర్వాత అవార్డును తీసుకోనని ఎందుకు ప్రకటించారు?
''అవార్డు తీసుకోవటానికి నేను అంగీకారం తెలిపిన తర్వాత హిండెన్‌బర్గ్ నివేదిక వచ్చింది. ఈ అవార్డు ప్రదాన కార్యక్రమం ఫిబ్రవరి 8వ తేదీన జరగాల్సి ఉంది. న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ దీనికి సంబంధించి ప్రోమో వీడియోలను ప్లే చేయడం, పోస్ట్ చేయడం ప్రారంభించింది. నేను ఫిబ్రవరి 3వ తేదీన ఆ వీడియో చూశాను. దాని మీద అదానీ గ్రూప్ లోగో కనిపించింది'' అని సుకీర్తరాణి చెప్పారు.
ఈ అవార్డుతో అదానీకి సంబంధం ఏమిటని ఆమె ఆశ్చర్యపోయారు.
''ఈ ఈవెంట్‌లో అదానీ గ్రూప్ పాత్ర ఏమిటని నేను న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్‌ని అడిగాను. ఈ కార్యక్రమానికి అదానీ గ్రూప్ ప్రధాన స్పాన్సర్ అని వాళ్లు చెప్పారు. దీంతో ఈ అవార్డును తీసుకోకూడదని నేను నిర్ణయించుకున్నాను'' అని సుకీర్తరాణి తెలిపారు.
''మనం నమ్మే సిద్ధాంతాలు, సూత్రాలతో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడరాదని నేను నమ్ముతాను. నేను నమ్మే, మాట్లాడే తరహా రాజకీయాలు, సిద్ధాంతాలు.. అదానీ గ్రూప్ వంటి వంటి వారి డబ్బు ప్రమేయం ఉన్న ఎలాంటి అవార్డునైనా తీసుకోవటానికి విరుద్ధమైనవి. వారు కూడా దీనిని అర్థం చేసుకున్నారు'' అని ఆమె వివరించారు.
హిండెన్‌బర్గ్ విచారణే కారణమా? మరేదైనా కారణం ఉందా?
ఈ ప్రశ్నకు సుకీర్తరాణి బదులిస్తూ.. ''అదానీ గ్రూప్ పనితీరుపై హిండెన్‌బర్గ్ కొన్ని తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణల నేపథ్యంలో ఆ కంపెనీ మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నేను కూడా అవినీతి గురించి, ప్రజల ఆస్తుల దుర్వినియోగం గురించి చాలా రాస్తూ ఉన్నాను'' అని చెప్పారు.
''అలాంటిది నేను ఈ అవార్డును ఎలా తీసుకోగలను? అది సరికాదు. అది అదానీ గ్రూప్ అనే కాదు.. అక్కడ వేరే ఏ కంపెనీ ఉన్నా సరే నేను తిరస్కరించి ఉండేదాన్ని. బహుళజాతి కంపెనీలన్నీ తమ సంపాదనలో కొంత భాగాన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటూ ఖర్చు చేస్తుంటాయి. ఆ డబ్బుతో గ్రామీణ ప్రాంతాల్లో చాలా పాఠశాలలు నడుస్తున్నాయి. మేము వీటన్నింటిని కాదనము. కానీ అవినీతి కేసు తెరపైకి వచ్చిన తర్వాత ఆ కార్యక్రమానికి హాజరుకావడం సరికాదు'' అని ఆమె పేర్కొన్నారు.
''ఆ అవార్డు అందుకోనందుకు విచారంగా లేదా?'' అని అడిగినపుడు.. ''ఏ మాత్రం లేదు. నేను చాలా స్పష్టతతో నిర్ణయం తీసుకున్నాను'' అని సుకీర్త రాణి బదులిచ్చారు.
''తమిళనాడులో ద్రవిడ ఉద్యమం, దళిత, అంబేద్కర్ ఉద్యమాల ప్రభావం చాలా ఎక్కువ. దీనికి సుదీర్ఘ వారసత్వం ఉంది. ఈ వారసత్వం కూడా ఇలాంటి నిర్ణయాలకు బలాన్ని ఇస్తుంది. నా రచనలు అవార్డుల కోసం కాదు.. ప్రజల కోసం రాసినవి. జనం చదివారు. నాకు అది చాలు'' అని ఆమె పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Sukirtha Rani/FB
ప్రచారం కోసం అవార్డును తిరస్కరించారా?
దీనిపై సుకీర్త రాణి మాట్లాడుతూ.. ''ఏమాత్రం కాదు. అవార్డును తిరస్కరించడం వల్ల మంచి ప్రచారం వస్తుందని నేను ఎప్పుడూ ఆలోచించలేదు'' అని చెప్పారు.
''ప్రపంచ ప్రఖ్యాత ప్రచురణ సంస్థ 'వెర్సో బుక్స్'.. నాలుగు వేల ఏళ్లలో ప్రపంచ సాహిత్యంలో ప్రభావవంతమైన మహిళా రచయితల జాబితాను రూపొందించింది. ఆ జాబితాలోని అగ్రస్థాయి 200 మంది రచయిత్రుల్లో నా పేరు ఉంది. కన్నడ, మలయాళం, తెలుగు, గుజరాతీ, మరాఠీ, హిందీ, ఇంగ్లీష్, మలేషియా మరియు జర్మన్ భాషల్లోకి కూడా నా రచనలు అనువాదం అయ్యాయి'' అని తెలిపారామె.
సుకీర్తరాణి అనుకోకపోయి ఉండొచ్చు కానీ, ఆమె ఈ అవార్డు తీసుకోబోమని ప్రకటించిన తర్వాత.. ఆమెకు తమిళ సాహితీ లోకం నుంచే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న సాహితీ వర్గాల నుంచి కూడా ఫోన్లు వచ్చాయన్నది వాస్తవం.
సిద్ధాంతాలను, భావాలను సరైన సమయంలో వ్యక్తీకరించినట్లయితే అది సామాజిక అవగాహన పెంపొందించటానికి కూడా దోహదపడుతుందని సుకీర్త రాణి అన్నారు.
సాహిత్య రంగంలో కృషి
సుకీర్త రాణి తమిళనాడులోని రాణిపేట జిల్లా లాలాపేట్‌లో గల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా కూడా పనిచేస్తున్నారు. ఆమె తమిళ సాహిత్యంలోను, ఆర్థికశాస్త్రంలోను మాస్టర్స్ డిగ్రీ పొందారు.
ఇప్పటి వరకూ ఆమె రచనలతో ఆరు కవితా సంకలనాలు వచ్చాయి. వాటిలో చాలా కవితలను తమిళనాడు కాలేజీ పాఠ్యాంశాలుగా చేర్చారు.
కుల వివక్ష, అణచివేతతో పాటు స్త్రీ శరీరం గురించి కూడా ఆమె తన రచనల్లో చర్చించారు. మహిళలు వారి శరీరం కారణంగా కూడా హింసకు గురవుతున్నారని, దళిత మహిళల విషయంలో ఇలాంటి హింస మరింత ఎక్కువగా జరుగుతోందని సుకీర్త రాణి అంటారు.
ఇదిలావుంటే.. న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ అవార్డు వేడుక ఫిబ్రవరి 8వ తేదీన చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళా హోటల్‌లో జరిగింది. ఇందులో శాస్త్రవేత్త గగన్‌దీప్ కాంగ్, భరతనాట్యం నర్తకి ప్రియదర్శిని గోవింద్, సామాజిక కార్యకర్త రాధికా సంతానకృష్ణ, స్క్వాష్ ప్లేయర్ జోష్నా చినప్ప సహా 11 మంది మహిళలకు అవార్డులు అందించారు.

ఇవి కూడా చదవండి:
- స్మార్ట్‌ఫోన్ విజన్ సిండ్రోమ్: రాత్రిళ్లు స్మార్ట్‌ఫోన్ చూస్తే కళ్లు పోతాయా? హైదరాబాద్ యువతి సమస్యపై డాక్టర్ ట్వీట్ వైరల్
- పులులను బలి తీసుకుంటున్నది ఎవరు? ఒక్క రాష్ట్రంలోనే ఏడాదిలో 38 పులులు, 87 చిరుతల మృతి
- లిథియం: జమ్మూకశ్మీర్‌లో బయటపడ్డ ఈ నిక్షేపాలతో ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల పరిశ్రమ ఊపందుకుంటుందా?
- 'చనిపోయిన వ్యక్తి'ని కోర్టుకు తెచ్చి 14 ఏళ్ల శిక్ష వేయించిన అత్యాచార బాధితురాలి తల్లి, అసలేం జరిగింది?
- పిల్లల భవిష్యత్ బంగారంలా ఉండాలంటే ఏ దేశానికి వెళ్లాలి? టాప్ 5 దేశాలు ఇవీ...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















