పులులను బలి తీసుకుంటున్నది ఎవరు? ఒక్క రాష్ట్రంలోనే ఏడాదిలో 38 పులులు, 87 చిరుతల మృతి

ఫొటో సోర్స్, ANI
- రచయిత, సల్మాన్ రవి
- హోదా, బీబీసీ ప్రతినిధి, భోపాల్
పులులు అత్యధికంగా ఉండే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గత ఏడాది కాలంగా పెద్ద సంఖ్యలో ఈ అటవీ మృగాలు మరణించినట్టు తెలిసింది.
మధ్య ప్రదేశ్ అటవీ విభాగపు గణాంకాల సమాచారం మేరకు గత ఏడాది కాలంలో 38 పులులు మరణించాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మధ్య ప్రదేశ్‌లోనే వీటి మరణాలు అత్యధికంగా ఉన్నాయి. కేవలం పులులు మాత్రమే కాదు, చిరుతలు కూడా ఎక్కువగా చనిపోయినట్లు మధ్య ప్రదేశ్ అటవీ విభాగపు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది సమయంలో గరిష్టంగా 87 చిరుతలు చనిపోయినట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి.
ఈ ఏడాది ఏప్రిల్ నాటికి పులులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ప్రాజెక్ట్ టైగర్'కి 50 ఏళ్లు పూర్తి కావొస్తున్నాయి.
2018లో చేపట్టిన అటవీ జంతువుల గణనలో మధ్య ప్రదేశ్‌లో 526 పులులు ఉన్నట్లు తేలింది. 2022లో కూడా ఈ గణన చేపట్టారు, కానీ దీని రిపోర్టును ఇంకా విడుదల చేయలేదు.
కేంద్ర ప్రభుత్వానికి చెందిన అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ కింద 'జాతీయ పులుల పరిరక్షణ సంస్థ', 'ప్రాజెక్టు టైగర్' కలిసి ఈ గణనను చేపట్టాయి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 3,000 పులులు ఉన్నాయి. మధ్య ప్రదేశ్‌లోని అడవుల్లో పెద్ద మొత్తంలో పులులు మరణించడంపై అటవీ జంతువుల పరిరక్షణ కోసం పనిచేస్తున్న నిపుణులు, ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి.
మధ్యప్రదేశ్ హైకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకుని, ఈ మరణాలపై పూర్తి విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
ఎందుకు అన్ని పులులు మరణించాయి?
రాష్ట్రంలో ముఖ్యంగా ఆరు పులుల అభయారణ్యాలు ఉన్నాయని, అవి పెంచ్, బాందవ్‌గఢ్, కన్హా, పన్నా, సంజయ్, సాత్పురాలని మధ్య ప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ప్రిన్సిపల్ చీఫ్ ఫారెస్ట్ గార్డు జస్వీర్ సింగ్ చౌహాన్ బీబీసీతో చెప్పారు. పులుల మరణాల రెండు రకాలుగా ఉన్నాయని, కొన్ని సహజంగా మరణిస్తుండగా, మరికొన్ని సహజరహితంగా మరణిస్తునట్లు తెలిపారు.
ఒక పులి సగటు వయసు 12 ఏళ్లని చౌహాన్ చెప్పారు. ఒకవేళ రాష్ట్రంలో పులుల సంఖ్య 526గా ఉంటే, దీని బట్టి చూస్తే ఇంత పెద్ద సంఖ్యలో మరణించడం సమస్యేమీ కాదని, కానీ అటవీ విభాగం సహజరహితంగా మరణిస్తున్న పులుల సంఖ్య పెరుగుతుందని నివేదించిందని, ఇదే ఆందోళనకర విషయమని పేర్కొన్నారు.
గత ఏడాది మరణించిన మొత్తం 38 పులుల్లో ఎనిమిది అసహజంగానే మృతి చెందినట్టు చెప్పారు.
''దీనికి చాలా కారణాలుంటాయి. వీటిల్లో ప్రధాన కారణం ఎలక్ట్రిక్ షాక్‌తో చనిపోవడం. కొన్ని సంఘటనలలో పాయిజన్‌కి చెందిన సాక్ష్యాధారాలను కూడా కనుకొన్నారు. కొన్ని కేసుల్లో పులుల మధ్య వాటి నివాసానికి సంబంధించి జరిగిన పోట్లాటలో ప్రాణాలు విడుస్తున్నాయి'' అని చెప్పారు.
ఈ ఏడాది జనవరి నెల ప్రారంభంలో సియోని జిల్లాలో ఒక పులి విద్యుదాఘతంతో మరణించింది. అడవికి ఆనుకుని ఉన్న బక్రంపత్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. గ్రామంలోకి వెళ్లే 11 కేవీ ఎలక్ట్రిక్ వైర్ గ్రిప్‌ను తగలడం వల్ల ప్రాణాలు కోల్పోయిందని అటవీ విభాగం విచారణలో తెలిసింది.
పన్నా టైగర్ రిజర్వులో ఒక చెట్టు వద్ద తగిలించి ఉన్న పులి అవశేషాలను కూడా గుర్తించారు. జంతువుల నుంచి పంటలను రక్షించుకునేందుకు గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్న ట్రాప్‌లో ఈ పులి చిక్కుకుని చనిపోయిందని విచారణలో తేలినట్టు చౌహాన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఐదేళ్లలో 171 పులులు, 310 చిరుతలు మరణం
మధ్య ప్రదేశ్‌లోని అటవీ విభాగం విడుదల చేసిన రిపోర్టులో గత ఐదేళ్లలో రాష్ట్రంలో 171 పులులు, 310 చిరుతలు చనిపోయినట్లు పేర్కొంది. అత్యధికంగా 2021లో 45 పులులు చనిపోయాయని, గత ఏడాది 87 చిరుతలు మధ్య ప్రదేశ్ అడవుల్లో మరణించినట్టు తెలిపింది.
పులులతో పోలిస్తే చిరుతలు విశాలమైన ప్రాంతంలో సంచరిస్తూ ఉన్నాయని చౌహాన్ చెప్పారు. ఇవి బయటికి వెళ్తున్నాయని, అందుకే వీటికి ప్రమాదాలు పెరిగాయని అన్నారు. వేటాడి చంపడమన్నది ప్రస్తుతం అడవుల్లో లేదని అన్నారు. కానీ ఫిర్యాదు మేరకు, పులుల మరణంపై మధ్య ప్రదేశ్ హైకోర్టు విచారణకు ఆదేశించడంతో, రాష్ట్రంలోని అడవుల్లో జంతువులను వేటాడి చంపడం పెద్ద ఎత్తునే సాగుతున్నట్టు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
సుమారు 7 పులుల వరకు మరణానికి కారణం వేటాడమేనని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పర్యావరణ వేత్త అజయ్ దుబే బీబీసీతో అన్నారు. పులుల మెడల్లో 'శాటిలైట్ కాలర్స్' పెట్టినప్పటికీ, అవి వేటగాళ్లకు చిక్కడం లేదా వలల్లో చిక్కుకోవడం ద్వారా మృత్యువాత పడుతున్నాయని చెప్పారు.
పులుల సగటు వయసు సుమారు 12 ఏళ్ల అన్నది నిజమేనని అజయ్ అన్నారు. కానీ, మధ్య ప్రదేశ్‌లో పులుల మరణాలకు గల కారణాలు సాధారణంగా లేవని, అనుమానించదగ్గవిగా ఉన్నాయని చెప్పారు.
పులుల కోసం ఏర్పాటు చేసే బఫర్ జోన్‌ను పర్యటకం కోసం తెరుస్తుండటంతో, వన్యప్రాణులపై ఒత్తిడి పెరుగుతుందని చెబుతున్నారు.
కర్నాటకలో కూడా పులుల సంఖ్య 500 కంటే ఎక్కువగా ఉందని, కానీ మధ్య ప్రదేశ్‌తో పోలిస్తే ఇక్కడ వీటి మరణాల సంఖ్య తక్కువగా ఉందని అజయ్ దుబే బీబీసీకి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
కర్నాటకలో పులుల లెక్కింపుపై ప్రశ్నలు
''కర్నాటకలో పులులకు అమృతం తినిపిస్తున్నారా? అక్కడ 500 కంటే ఎక్కువగా పులులు ఉన్నప్పుడు, సహజ మరణాలు కూడా అక్కడ సగటున ఒకే స్థాయిలో ఉండాలి. ప్రతేడాది సుమారు 30గా ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే, కచ్చితంగా ఏదో తప్పు జరుగుతుంది. పులుల సంరక్షణకు సంబంధించిన సమాచారం విషయంలోనైనా లేదా వాటి మరణాలలోనైనా అక్కడి అటవీ విభాగం సమాచారం పొందడం లేదు. ఒకవేళ పులుల మృతదేహాలను అక్కడి అటవీ విభాగం రికవరీ చేసుకోకపోతే, వాటి గురించి ఎలా తెలుస్తుంది?'' అని మధ్య ప్రదేశ్ ప్రిన్సిపల్ చీఫ్ ఫారెస్ట్ గార్డు జస్వీర్ సింగ్ చౌహాన్ అన్నారు.
మధ్య ప్రదేశ్‌లో అటవీ విభాగం పనిచేసే స్టాఫ్ అంతా ప్రతి టైగర్ రిజర్వులో 24 గంటల పాటు పులుల కదలికలపై కన్నేసి ఉంటుందని చౌహాన్ చెప్పారు. శాటిలైట్ ద్వారా వాటి కదలికలను మానిటర్ చేస్తుంటారని తెలిపారు.
పులుల మరణాల సంఖ్య పెరిగేందుకు అడవులు తగ్గిపోవడం కూడా ప్రధాన కారణాల్లో ఒకటని ఐఎఫ్ఎస్ రిటైర్డ్ అధికారి ప్రవీన్ చంద్ర దుబే అన్నారు. అది జాతీయ పార్కు అయినా లేదా అభయారణ్యమైనా ఇదే జరుగుతుందన్నారు.
పులులు లేదా ఇతర క్రూర మృగాలు వెంటాడి చంపి వాటి కడుపులను నింపుకోగల జంతువులు అడవుల్లో ఉండాలని ప్రవీణ్ చంద్ర చెప్పారు. కానీ, వాటి సంఖ్య తగ్గిపోతున్నట్టు తెలిపారు.
''పులి, చిరుతా లేదా చీతా దేని వెంటాడుతాయి? ఇదే అతి ముఖ్యమైన ప్రశ్న. వాటి సంఖ్య తగ్గిపోతూ ఉంది. ఆహారం దొరకక, పులులు అడవులను వదిలి గ్రామాలున్న కొండల ప్రాంతాల్లోకి వెళ్తున్నాయి. దీంతో గ్రామస్తులు వారి పంటలను ఈ మృగాల నుంచి రక్షించుకునేందుకు పలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దురదృష్టవశాత్తు ఆ వలల్లో చిక్కుకుని పులులు, చిరుతలు మరణిస్తున్నాయి'' అని దుబే అన్నారు.
అడవుల చుట్టూ స్థలం ఎక్కువగా ఉండాలని వన్యప్రాణుల నిపుణులంటున్నారు. వాటిని పులుల సంరక్షణకు, సురక్షితకు వాడాలని పేర్కొంటున్నారు. ఈ స్థలాన్ని తగ్గించకూడదన్నారు. అభయారణ్యాలలో చుట్టూ ప్రజల రాకపోకల విషయంలో పరిమితులు విధించాల్సినవసరం ఉందని తెలిపారు.
టైగర్ రిజర్వు 'బఫర్ జోన్' లోపల పర్యటకాన్ని ప్రోత్సహించేందుకు ఏర్పాట్లు చేయడంతో సుమారు 7 పులులు చనిపోయినట్టు మధ్య ప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు, రాష్ట్ర అటవీ విభాగపు మాజీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఎకో టూరిజం కౌన్సిల్ సీఈఓకి వ్యతిరేకంగా నేర, పరిపాలన చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

ఇవి కూడా చదవండి:
- మోదీ కన్నా మన్మోహన్ సింగ్ ఎక్కువగా పనిచేశారు: అసెంబ్లీలో కేసీఆర్ ఫైర్
- మహిళా క్రీడాకారుల గురించి మీకు ఎంత తెలుసు? ఈ క్విజ్ ప్రయత్నించండి
- భారత మహిళా క్రికెటర్ల కష్టాలు, పడే పాట్లు వింటే ఆశ్చర్యం, బాధ కలుగుతాయి
- లిథియం: జమ్మూకశ్మీర్‌లో బయటపడ్డ ఈ నిక్షేపాలతో ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల పరిశ్రమ ఊపందుకుంటుందా?
- కోటె ప్రసన్న వెంకటరమణ ఆలయం: ఈ గుడి ముందున్న గరుడ స్తంభం టిప్పు సుల్తాన్ ప్రాణాలు కాపాడిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









