అకస్మాత్తుగా కుప్పకూలటం, ఐసీయూలో చేరటం పెరుగుతోంది, ఎందుకిలా జరుగుతోంది?

ఫొటో సోర్స్, Thinkstock
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కొంత కాలంగా అకస్మాత్తుగా ఐసీయూలో చేరుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. గుండె నొప్పి లేదా బ్రెయిన్ స్ట్రోక్ వంటి వాటితో అకస్మాత్తుగా కుప్పకూలిపోవడం, వెంటనే ఆసుపత్రికి తరలించి అత్యవసర విభాగంలో అడ్మిట్ చేయాల్సిన కేసులు పెరిగిపోయాయి. ఇలా అకస్మాత్తుగా కుప్పకూలిపోయి, ఐసీయూలో చేరే కేసుల విషయంలో ఇంకా విస్తృత అధ్యయనాలు, పరిశోధనలు జరుగుతున్నాయి.
ఇలాంటి వాటిలో ఒక కొత్త ట్రెండ్ గుర్తించారు హైదరాబాద్‌కి చెందిన గుండె వైద్యులు. అకస్మాత్తుగా దీర్ఘకాలిక మందులు ఆపేస్తున్న వారిలో ఇలా ఎక్కువగా జరుగుతోందని వారు వివరిస్తున్నారు.
ఉన్నపళంగా కుప్పకూలిపోయి ఎమెర్జెన్సీ వార్డుల్లో చేరడం కొత్త కాదు. కానీ అది ఈ మధ్య బాగా పెరిగింది. దానికి ప్రధాన కారణాల్లో దీర్ఘకాలికంగా వాడాల్సిన మందులు ఆపేయడం కూడా ఒక కారణం అంటున్నారు హైదరాబాద్‌కి చెందిన గుండె వైద్యులు డా. విరించి విరివింటి.
''ఐసీయూలో చేరిన రోగుల్లో నేను పరిశీలించిన మేరకు, నేను కన్సల్టేషన్ ఇచ్చిన వారిలో 60 శాతం మంది కొన్ని వారాలు లేదా నెలలుగా బీపీ, షుగర్ ట్యాబ్లెట్ వాడడం మానేసిన వారే ఉన్నారు. గతంలోనూ ఐసీయూకి పేషెంట్లు వచ్చేవారు. కానీ ఇలా లేదు. అకస్మాత్తుగా బీపీయో, షుగరో పెరిగిపోవడం వల్ల అడ్మిట్ అయ్యేవారు. వారికి ఆ వ్యాధి వచ్చిందని అప్పుడే కొత్తగా గుర్తించేవాళ్లం. కానీ ఇప్పుడు అలా కాదు. బీపీ లేదా షుగర్ ఉందని తెలిసీ, వాటి మందులు వాడటం ఆపేయడం వల్ల అడ్మిట్ అవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది'' అని డా. విరించి బీబీసీతో అన్నారు.
అత్యవసర చికిత్స తరువాత పేషెంట్ తరపు వారితో మాట్లాడుతూ వివరంగా, అసలు ఏం జరిగిందనే హిస్టరీ తెలుసుకునే ప్రయత్నంలో ఈ విషయాలు బయటపడుతున్నాయని ఆయన చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే దీనిపై వైద్య శాస్త్ర ప్రమాణాలకు అనుగుణంగా శాస్త్రీయ పరిశోధన జరగలేదు. వైద్యులు తమ స్వీయ అనుభవంలోకి వచ్చిన, ప్రాక్టీసులో భాగంగా తాముగా గుర్తించిన వివరాల ఆధారంగా ఈ అంచనాకు వచ్చారు. ఇది ఒక ట్రెండ్‌గా ఉందనీ, ఆందోళనకర స్థాయిలో ఉందనీ వారు చెబుతున్నారు.
''నిజానికి వాళ్లు అసలు ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వాల్సినంత దారుణ పరిస్థితుల్లో ఉండే పేషెంట్లు కాదు. కానీ, పనిగట్టుకుని మందులు ఆపేసి ఆ స్థితికి వస్తున్నారు. ఒక చిన్న ట్యాబ్లెట్ మానేయడం వల్ల కోమాలో పడుతున్నారు. ఇలాంటి కేసులు నాకు చాలా తరచుగా కనిపిస్తున్నాయి. సుళువుగా నివారించగలిగే దాన్ని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు'' అన్నారు డా. విరించి.
నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, తెలంగాణ రాష్ట్ర టీచింగ్ ఆసుపత్రి డాక్టర్ల సంఘం ఉపాధ్యక్షుడు డా. కిరణ్ మాదాల ఇదే విషయాన్ని చెబుతున్నారు. ''నాకు తెలిసిన ఒక ప్రముఖుడు షుగర్ ఉన్నప్పటికీ మందులు అన్నీ మానేసి ఒక పేరున్న డైట్ పాటించడం మొదలుపెట్టాడు. మొన్న అకస్మాత్తుగా కుప్పకూలి ఐసీయూలో పడ్డాడు. ఈ ట్రెండ్ ఇటీవల బాగా పెరిగింది. కొత్త కొత్త డైట్లు చేస్తున్నారు. మంచిదే. కానీ వాటిని నమ్మి, వైద్య సలహా లేకుండా మందులు ఆపేస్తున్నారు. ఎందుకని అడిగితే ఎవరో చెప్పారు అంటున్నారు. వైద్యుల సలహా లేకుండా, వైద్యులను సంప్రదించకుండా, సొంతంగా మందులు ఆపకూడదు'' అన్నారు డాక్టర్ కిరణ్.
''మందులు ఆపడం వల్ల ఐసీయూలో చేరే వారి సంఖ్య ఇంత శాతం అని పక్కాగా చెప్పలేను కానీ, ఆ ట్రెండ్ మాత్రం బాగా పెరిగింది'' అన్నారు డా. కిరణ్.

ఫొటో సోర్స్, AFP
మందులు అకస్మాత్తుగా ఆపేస్తే ఏమవుతుంది?
బీపీ మందులు ఆపేస్తే నేరుగా బ్రెయిన్ స్ట్రోక్‌కి కారణం అవుతుంది. 90 శాతం బ్రెయిన్ స్ట్రోక్ కేసులు బీపీ మందులు ఆపడం వల్లే వస్తాయి.
గుండెపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంటుంది. బీపీ శరీరంలోని ఏ భాగాన్నైనా దెబ్బతీయగలరు.
మందులు ఆపేయడానికి సోషల్ మీడియానే కారణమా?
మందులు ఆపేయడానికి ఒక్కొక్కరికీ ఒక్కో కారణం కనిపిస్తోంది. గతంలో ఏదైనా ఊళ్లు వెళ్లినప్పుడు మందులు వెంట తీసుకెళ్లకపోవడమో, కొత్త ఊరిలో ఫలానా మందులు దొరకకపోవడమో ఉండేది. అలా మానేసేవారు. ఇప్పుడు అలా కాదు. ఎవరో చెప్పారనీ, ఫలానా వీడియోలో చూశామనీ మందులు మానేసే వారి సంఖ్య పెరిగింది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా వచ్చే వీడియోలను నమ్మి ఇలా చేసే వారి సంఖ్య పెరిగిందని వైద్యుల మాట.
''అదంతా మెడికల్ మాఫియా. బీపీకి కూడా మందులు వేసుకుంటారా? ఫలానా పసరు వేడినీళ్లతో కలిపో లేదా తేనె తాగితేనో బీపీ తగ్గిపోతుంది అని యూట్యూబ్ లో ఎవరో చెబుతారు. అది పాటించేసి ఇక మాకు బీపీ లేదు అనుకుంటారు.''
''ఉదాహరణకు ఒక వ్యక్తి బీపీ ట్యాబ్లెట్ రెండేళ్లుగా రోజూ వాడుతున్నారు. అకస్మాత్తుగా ఏదో తేనో, పసరో తాగడం మొదలు పెట్టి బీపీ ట్యాబ్లెట్ ఆపేప్తారు. మొదటి మూడు నాలుగు రోజులు చెక్ చేస్తే నార్మల్ ఉంటుంది. వారం అయినా బానే ఉంది కదా అనుకుంటారు. నాకు బీపీ లేదు డాక్టర్లు అన్యాయంగా ట్యాబ్లెట్ రాశారు అనుకుంటారు. కానీ, అది శరీరాన్ని బట్టి మారుతుంది. వారు గతంలో వాడిన మందుల ప్రభావం తగ్గి, ఎప్పుడో సడెన్‌గా బీపీ పెరుగుతుంది. కొత్తగా మందులు మానేసిన వారు మొదటి వారం, రెండు వారాలు బాగా ఉత్సాహంగా బీపీ చెక్ చేసుకుని అది నార్మల్ గా కనిపించే సరికి ఇక చెక్ చేయడం మానేస్తారు. ఏదో ఒక రోజు ఆ శరీరం బీపీని భరించలేని దశలో ఏదో స్ట్రోక్ రూపంలో బయట పెడుతుంది'' అంటూ వివరించారు డా. విరించి.

ఫొటో సోర్స్, Getty Images
కొందరిలో వయసు వల్ల, రక్త నాళాల గట్టిదనం వల్ల, పాత ట్యాబ్లెట్ ప్రభావం వల్ల బీపీ నార్మల్ కనిపిస్తే, అది చిట్కాల వల్ల అని భ్రమించి దెబ్బతింటారు.
ఒక వైద్యుడు మీ బీపీ చూసిన వెంటనే మందులు ఫైనల్ చేయరు. ''అది వ్యక్తికీ వ్యక్తికీ మారుతుంది. జ్వరం వచ్చినప్పుడు డీహైడ్రేడ్ అయి లోబీపీ వస్తే, అప్పుడు బీపీ నార్మల్ ఉన్నట్టు కాదు. కొందరిలో సాయంత్రం తక్కువ బీపీ, ఉదయం ఎక్కువ ఉంటుంది. ఇంకొందరిపై వయసు ప్రభావం ఉంటుంది. అందుకే బీపీ మందులు ఇచ్చేప్పుడు వైద్యులు ముందు అబ్జర్వేషన్ పెడతారు. సాయంత్రం బీపీ చూసినప్పుడు 140 ఉంటే అసలు లేదని కాదు. పొటెన్షియల్ కావచ్చు. పాతికేళ్ల కుర్రాడికి సాయంత్రం బీపీ ఎక్కువ వచ్చింది అనిపిస్తే, అబ్జర్వేషన్లో పెట్టి నెల తరువాత రమ్మంటాం. ఇంకొందరని లైఫ్ స్టైల్ మార్చుకుని చూడు. డైట్, ఎక్సర్ సైజ్, యోగా వంటివి చెబుతాం. అప్పుడు మళ్లీ పరిశీలించి మందులు నిర్ణయిస్తాం. అదే అరవైయ్యేళ్ల వ్యక్తికి వస్తే లేదా కిడ్నీ, గుండె వంటి ఇతర జబ్బులున్న వారికి వస్తే ముందు జాగ్రత్తగా మందులు పెడతాం. కొందరికి 24 గంటల బీపీ చూస్తాం. కొందరిని నెల తరువాత చెక్ చేయించమంటాం. కొందరిని వారానికే చెక్ చేయించమంటాం. కొందరికి స్మాల్ డోస్‌తో ప్రారంభించి అబ్జర్వ్ చేస్తాం. ఇలా మనిషిని బట్టి మందు ఇచ్చే విధానం మారుతుంది. కానీ, అకస్మాత్తుగా ఆ మందు మానేసి మాకు తగ్గిపోయింది అనుకుంటారు. బీపీ చూడడం చాలా మందికి సరిగా రాదు. తప్పుగా చూస్తారు. ఎలక్ట్రానిక్ మెషీన్లు చాలాసార్లు తప్పుగా వస్తాయి. చూసే సమయం, పద్ధతిలో తేడాలుంటాయి. అవన్నీ పట్టించుకోరు. ఫలానా చిట్కా ఫాలోకాగానే తగ్గిపోయింది అని సంబరపడతారు. తరువాత దెబ్బ తింటారు'' అన్నారు డాక్టర్ విరించి.

ఫొటో సోర్స్, PETER DAZELEY/GETTYIMAGES
వైద్యం వర్సెస్ ఆరోగ్యం:
చాలా మందికి ఫలానా తింటేనో, ఫలానా తినకపోతేనో, ఫలానా ఎక్సర్ సైజ్ చేస్తేనో ఫలానా జబ్బు రాదు అని చెబుతారు. అది ఆరోగ్య సూత్రం. కానీ, ఆ ఫలానా జబ్బు వచ్చేసిన తరువాత వైద్యం చేయాలి కానీ ఆరోగ్య సూత్రాలు పనికిరావు.
ఉదాహరణకు కొవ్వు పదార్థాలు తినకుండా ఉండి, వాకింగ్ చేస్తూ ఉంటే గుండెకు మంచిది అనేది ఆరోగ్య సూత్రం. కానీ గుండె జబ్బు వచ్చిన తరువాత కొవ్వు పదార్థాలు మానేసి, వాకింగ్ చేసేస్తే ఆ గుండె జబ్బు తగ్గిపోదు. దానికి వైద్యం చేయాలి. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే ఎక్కువ మంది మిస్ అవుతున్నారు. జబ్బు రాకుండా ఆరోగ్యంగా ఉండడానికి సూత్రాలు పాటించడం వేరు, జబ్బు వచ్చాక వైద్యం మానేయడం వేరు.
''ఫలానా చేస్తే, ఫలానా తింటే మీరు అసలు డాక్టర్ దగ్గరకు వెళ్లక్లర్లేదు అని థంబ్ పెడతారు. మనం అది చూస్తాం. అలాంటివి చూస్తూనే ఉంటాం. రోజంతా అవే చూస్తారు. డోపమైన్ ఎఫెక్ట్ ఇది. వాటికి అప్పీలింగ్ అలా ఉంటుంది. మనకు ఏమీ కాదనే విష్ ఫుల్ థింకింగ్ ఉంటుంది. అంతా బావుంది అంటే ఆ డాక్టర్ మీద ప్రేమ, జబ్బు ఉందని చెప్పిన డాక్టర్ మీద కోపం ఉండడం మన సైకాలజీ. ఆరోగ్యకరమైన ఆహారం తింటాం అంటే ఏ డాక్టరూ వద్దనరు. కానీ ఆ ఆరోగ్యకరమైన ఆహారాలు, అప్పటికే వచ్చిన జబ్బును తగ్గించగలవా అనేది పెద్ద ప్రశ్న. ఆరోగ్య సూత్రాలు వైద్యానికి పనికిరావు. ఆరోగ్యంతో పాటూ వైద్యమూ కావాలి'' అని చెబుతున్నారు డా. విరించి.
''తెల్లటి అన్నం తగ్గించడం, వాకింగ్ చేయడం వంటివి షుగర్ తగ్గించడంలో సహకరిస్తాయి. కానీ, అవి చేస్తూ షుగర్ మందులు మానేయడం కాదు. ఎవరిలో అయినా ఏదైనా వ్యాధి తీవ్రత చాలా తక్కువ ఉండి, కేవలం లైఫ్ స్టైల్ మార్చుకోవడం వల్ల ఆ వ్యాధిని అదుపులో పెట్టుకునే పరిస్థితి ఉంటే, అప్పుడు కూడా వైద్యుల సలహాతో చేయవచ్చు. అప్పుడు వారి కండిషన్ ని బట్టి వైద్యులు మందుల డోస్ తగ్గించడం వంటివి చేస్తారు. కానీ, అప్పుడు కూడా అటువంటి వారు నిరంతరం వైద్య పర్యవేక్షలో ఉండాలి. నిరంతరం చెకప్‌లు చేయించుకుంటూ ఉండాలి. కానీ, ఇది సొంతంగా చేసేది కాదు. ఇది అందరికీ వర్తించేది కాదు. మనిషికీ మనిషికీ మారుతుంది'' అన్నారు డాక్టర్ కిరణ్.

ఫొటో సోర్స్, BOY_ANUPONG/GETTYIMAGES
హెల్త్ యాంగ్జైటీ పెరుగుతోంది:
ప్రస్తుతం మొబైల్ ఫోన్ వల్ల వైద్యం, ఆరోగ్యం గురించిన విస్తతమైన సమాచారం అందుబాటులోకి వచ్చింది. దీంతో చాలా మంది నిరంతరం ఆ హెల్త్ వీడియోలు, హెల్త్ టిప్స్ మాత్రమే చూస్తున్నారు. దాని వల్ల ఆరోగ్యపరంగా ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఆసక్తి, ఆత్రుత, కంగారు పెరుగుతున్నాయి.
''నిజానికి అంత అవసరం లేదు. ఒక డాక్టర్ నెల తరువాత రమ్మన్నాడు అంటే అతను చెప్పినట్టు పాటించి నెల తరువాత రావాలి. అంతేకానీ నెలంతా ఆ వీడియోలు చూస్తూ కూర్చోనక్కర్లేదు. గంటగంటకూ, రోజూవారీగా షుగర్, బీపీ, ఆక్సిజన్, హార్ట్ రేట్ చెక్ చేయాల్సిన పనిలేదు. స్మార్ట్ వాచ్ వచ్చాక ఇది పెరిగింది. ఇంకొందరు డాక్టర్లు ఇచ్చిన ట్యాబ్లెట్ల గురించి నెట్‌లో సెర్చ్ చేసి చూసి మానేస్తారు. ఆ ట్యాబ్లెట్ మీద డౌట్ ఉంటే డాక్టర్నే అడుగు అంతేకానీ, నెట్లో చదివింది చూసి మానేస్తే పేషెంటుకే నష్టం. ఒక ట్యాబ్లెట్ పది పనులు చేస్తుంది. సైడ్ ఎఫక్ట్స్ జాబితా నెట్లో ఉన్నవన్నీ జరగాలని కాదు'' అన్నారు డా. విరించి.
ఆయుర్వేద వైద్యులు ఏమంటున్నారు?
(బీబీసీ తెలుగును , , లో ఫాలో అవ్వండి. లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
నిజానికి ఈ యూట్యూబ్ వైద్య చిట్కాల పట్ల ఆయుర్వేద డాక్టర్లు కూడా అసంతృప్తితోనే ఉన్నారు.
''యూట్యూబ్లో ఎవరెవరో ఏదేదో చెప్పి దాన్ని ఆయుర్వేదం అంటున్నారు. దాన్ని నమ్మి ఎవరో సమస్య తెచ్చుకుంటే చివరకు ఆయుర్వేదానికి ఆపాదించి చెడ్డపేరు తెస్తున్నారు. ఫలానా ఆయుర్వేదం మందు మంచిది అంటే నేరుగా వెళ్లి కౌంటర్లో కొని వాడుతున్నారు. గుళ్ల దగ్గర కౌంటర్లు పెట్టి చవగ్గా అమ్ముతున్నారని కొంటున్నారు. అది మంచి పద్ధతి కాదు. చివరకు తప్పు ఆయుర్వేదంపై పడుతోంది. ఇవి కాక ఆయుర్వేదం పేరుతో నకిలీ మందులూ పెరిగాయి'' అని బీబీసీతో అన్నారు తిరుపతి శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డా. మురళీకృష్ణ.
''ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఏ జబ్బుకూ సింపిల్ రెమెడీస్ ఉండవు. చాలా మంది చదువుకున్న వారు కూడా నాకు ఫోన్ చేసి తిప్పతీగ తీసుకుంటే షుగర్, బీపీ ఉండవంట కదా అంటారు. అది సరైన సమాచారం కాదు. ఎవరో నోటి మాటగా చెప్పిందీ, యూట్యూబులో చెప్పిందీ ఆయుర్వేద మందు కాబోదు. వీటిని అన్ డ్యూ క్లెయిమ్స్ అంటాం'' అన్నారు డా. మురళీకృష్ణ.
''మేం చెప్పేది ఒక్కటే. చిట్కా వైద్యం, సోషల్ మీడియా వైద్యం కాదు. మీకున్న సమస్యకు సుశిక్షుతులైన ఆయుర్వేద వైద్యులను కలసి వారు చెప్పినట్టు మందులు వాడాలి. అంతేకానీ సొంత వైద్యం చేసుకుని దానికి ఆయుర్వేదం అని పేరు పెట్టొద్దు'' అన్నారు డాక్టర్ మురళీకృష్ణ.
కరోనా తరువాత మెడికల్ మాఫియా అనే పదం విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చింది. దాంతో తాము వాడేవన్నీ మందులే కాదు, ఆరోగ్య సూత్రాలే వైద్యం అని భ్రమ పడుతున్నారు. దాని వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు అని చెబుతున్నారు వైద్యులు.

ఇవి కూడా చదవండి:
- అమిగోస్ సినిమా రివ్యూ: కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం థ్రిల్ ఇచ్చిందా... లేదా ?
- ఈ ‘కిల్లర్’ ఏనుగును జనం ప్రేమిస్తారు, భయపడతారు.. దీని కోసం ఆలయాలు పోటీ పడతాయి
- హైదరాబాద్: ఫార్ములా ఈ రేస్ ప్రత్యేకత ఏమిటి... తెలంగాణకు అవకాశం ఎలా వచ్చింది
- ఆస్ట్రేలియా: సెక్యూరిటీ కారణాలతో చైనా తయారీ నిఘా కెమెరాలను తొలగించాలని నిర్ణయం
- రామచరిత మానస్: తులసీదాస్ రాసిన ఈ గ్రంథం మహిళలను, దళితులను కించపరుస్తోందా... ఎందుకు వివాదం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














