ఆస్ట్రేలియా: సెక్యూరిటీ కారణాలతో చైనా తయారీ నిఘా కెమెరాలను తొలగించాలని నిర్ణయం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, టిఫానీ టర్న్‌బుల్
- హోదా, బీబీసీ న్యూస్, సిడ్నీ
ఇతర దేశాల మీద చైనా నిఘా పెడుతోందంటూ అమెరికా ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది.
జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా రక్షణశాఖ కార్యాలయం, ఇతర ప్రాంతాలలో చైనా తయారీ నిఘా కెమెరాలను తొలగించనున్నట్లు ప్రకటించింది.
చైనా ప్రభుత్వ సంస్థలు హిక్‌విజన్, దహువా కంపెనీలు తయారుచేసిన 900 నిఘా పరికరాలను పరిశీలించిన తరువాత ఆస్ట్రేలియా ఈ నిర్ణయం తీసుకుంది.
నిఘా పరికరాల ద్వారా సేకరించే డేటాను చైనా ప్రభుత్వానికి చేరుతోందనే అనుమానంతో పోయిన ఏడాది బ్రిటన్, అమెరికా అదే పని చేశాయి.
అయితే ఆ ఆరోపణలు నిరాధారమైనవని హిక్‌విజన్ వాదిస్తోంది. దహువా కంపెనీ మాత్రం స్పందించలేదు.

ఫొటో సోర్స్, Getty Images
200కు పైగా ఆస్ట్రేలియా ప్రభుత్వ భవనాలలో చైనా తయారీ నిఘా కెమెరాలు ఉన్నట్లు తేలింది. రక్షణశాఖ భవనంలోనూ ఉన్నట్లు తెలిసింది.
రక్షణ కార్యకలాపాలు నిర్వహించే ప్రాంతాలు, భవనాలలో చైనా తయారీ కెమెరాలను గుర్తించి తొలగిస్తామని ఇప్పటికే ఆస్ట్రేలియా రక్షణశాఖ మంత్రి రిచర్డ్ మార్లెస్ ప్రకటించారు.
"మేం పెద్దది చేసి చెప్పట్లేదు. ఆ కీలక సమస్యను మేం పరిష్కరించనున్నాం' అని ఆయన అన్నారు.
ఇతర ప్రభుత్వ భవనాలలోని కెమెరాలను తొలగించాల్సిన అవసరం ఉందా లేదా అనేది ప్రభుత్వం సమీక్షిస్తుందని అటార్నీ జనరల్ మార్క్ డ్రేఫస్ తెలిపారు.
చైనా షిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లోని వీగర్ ముస్లింల మీద నిఘా పెట్టడానికి ప్రభుత్వానికి సహకరించి, మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడినందున హిక్‌విజన్, దహువా సంస్థలను 'నైతిక' కారణాల దృష్ట్యా దూరంగా పెట్టాలని ఆస్ట్రేలియా సెనేటర్ పాటర్సన్ అన్నారు.
అయితే తమ మీద వస్తువన్న ఆరోపణలను హిక్‌విజన్ ఖండించింది. అవన్నీ 'అబద్ధాల'ని సంస్థ తెలిపింది. ఇంతవరకు నమ్మదగిన ఏ సంస్థ కూడా ఇది నిజమని చెప్పలేదని ఆ కంపెనీ ప్రతినిధి అన్నారు.
యూజర్ల డేటాను తాము చూడలేమని, అలాంటప్పుడు మరొకరికి ఆ డేటాను ఎలా ఇస్తామని సంస్థ ప్రశ్నిస్తోంది.

ఫొటో సోర్స్, Facebook/HKVISION
గత నవంబర్‌లో భద్రతా కారణాల దృష్ట్యా సున్నితమైన ప్రాంతాలలో హిక్‌విజన్, దహువా కంపెనీలు తయారుచేసిన కొత్త నిఘా కెమెరాల ఏర్పాటును బ్రిటన్ నిలిపివేసింది. ఇప్పటికే ఉన్న పరికరాలను తొలగించాలా వద్దా అనే విషయాన్ని కూడా సమీక్షిస్తామని తెలిపింది.
ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత దహువా, హిక్‌విజన్‌తో సహా ఐదు చైనా కంపెనీల నుంచి కొత్త కమ్యూనికేషన్ పరికరాల దిగుమతి చేసుకోవడాన్ని, విక్రయించడాన్ని అమెరికా నిషేధించింది.
తాము తీసుకున్న నిర్ణయం మీద చైనా స్పందనతో తమకు సంబంధం లేదని, తమ దేశ భద్రతే తమకు ముఖ్యమని ఆస్ట్రేలియా ప్రధాని అన్నారు.
2018లో హువావే 5జీ నెట్‌వర్క్‌ను ఆస్ట్రేలియా బహిష్కరించిన తర్వాత ఆ దేశంతో చైనా వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
బొగ్గు, ఎండ్రకాయలు, వైన్ వంటి ఆస్ట్రేలియా ఎగుమతులపైన చైనా సుంకాలు పెంచింది.

ఇవి కూడా చదవండి:
- తెలంగాణ: ‘కేజీ టు పీజీ’ ఉచిత విద్య అమలు ఎంత వరకు వచ్చింది?
- భూకంపం వచ్చినప్పుడు ఏం చేయాలి?
- కేరళ: బిడ్డకు జన్మనిచ్చిన ట్రాన్స్‌జెండర్ జంట
- దళిత విద్యార్థులు పైలెట్ కావాలనుకుంటే రూ.3.72 లక్షల స్కాలర్ షిప్, నెలకు రూ.22 వేలు ఉపకారవేతనం ఇచ్చే ప్రభుత్వ పథకం
- చాట్‌జీపీటీ: డిగ్రీ కూడా పాసవని సామ్ ఆల్ట్మాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో సంచలనాలు సృష్టిస్తున్నారు.. ఇంతకీ ఎవరీయన?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









