Chat GPT: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో సంచలనాలు సృష్టిస్తున్న సామ్ ఆల్ట్‌మాన్ ఎవరు?

ఫొటో సోర్స్, Getty Images
సామ్ ఆల్ట్‌మాన్ జీవితం గురించి తెలుసుకోవడానికి మేం చేసిన మొదటి పని చాట్‌జీపీటీని ఆయన గురించి అడగడం. ఆల్ట్‌మాన్ 2015లో ఓపెన్‌ఏఐ సంస్థను స్థాపించారు. అది రూపొందించిన విప్లవాత్మక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఈ చాట్‌జీపీటీ.
"సామ్ ఆల్ట్‌మాన్ ఒక అమెరికన్ ఎంటర్‌ప్రెన్యూర్, సాంకేతిక నిపుణుడు. ఓపెన్ ఏఐ ప్రెసిడెంట్. గతంలో లూప్ట్ సీఈవోగా కూడా పనిచేశారు''.
నవంబర్ 30న ప్రారంభం అయిన ఈ వర్చువల్ రోబోట్ గురించి చాలా చర్చ నడుస్తోంది, మాకు దీని గురించిన సమాచారం ఉంది. చాట్‌జీపీటీ వల్ల ''ఆల్ట్‌మాన్‌ను సాంకేతిక సమాజంలో ప్రభావవంతమైన నాయకుడిగా పరిగణించారు. ఆయన కృత్రిమ మేథస్సుకు సంబంధించిన అంశాలపై ఉపన్యాసాలు అందిస్తున్నారు''.
చాట్‌జీపీటీ వాస్తవాలు, జనరలైజేషన్ ఆధారంగా ఈ అంశాలను వెల్లడించింది. అయితే ఇది వ్యక్తి గురించిన క్యారెక్టర్, వ్యక్తిత్వం గురించి మాత్రం చెప్పడం లేదు.
చాట్‌జీపీటీ, డాల్-ఈ ఇమేజ్ జనరేటర్ వంటి సాంకేతిక ఆవిష్కరణలను రూపొందించిన వ్యక్తి గురించి తెలుసుకోవడానికి మనం కొంచెం సంప్రదాయ మూలాలకు వెళ్లాలి.ది న్యూయార్కర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సామ్యూల్ హెచ్ ఆల్ట్‌మాన్ మాట్లాడుతూ 8 ఏళ్ల వయసు ఉన్నపుడే ఆపిల్ కంప్యూటరైన మాకింతోష్‌లో ప్రోగ్రామ్ చేయడం, దాని భాగాలు విప్పడం నేర్చుకున్నట్లు చెప్పారు.
కంప్యూటర్ ఉండటంతో తన లైంగిక భావన విషయంలో సాయపడిందని, యుక్తవయస్సులో తను మాట్లాడేలా చేసినందుకు ఆయా గ్రూపులకు ధన్యవాదాలు తెలిపారు ఆల్ట్‌మాన్. 16 ఏళ్ల వయసులో ఆల్ట్‌మాన్ స్వలింగ సంపర్కుడినని తన తల్లిదండ్రులకు చెప్పారు. తరువాత ఆయన చదివిన పాఠశాలలో తాను 'గే' అని బహిరంగంగా వెల్లడించారు.

ఫొటో సోర్స్, Getty Images
డిగ్రీ కూడా పాసవని ఆల్ట్‌మాన్..ఆల్ట్‌మాన్ కంప్యూటర్ సైన్స్ చదవడానికి స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో (కాలిఫోర్నియాలో) చేరారు. కానీ డిగ్రీ పూర్తి చేయలేదు.
కొంతమంది స్నేహితులతో కలిసి తమ మొదటి ఆలోచన అయిన లూప్ట్ యాప్ అభివృద్ధి చేయడానికి పూర్తిగా అంకితమవ్వాలని నిర్ణయించుకున్నారు.
లూప్ట్ ఇతర వ్యక్తులతో లొకేషన్‌ను షేర్ చేయడానికి ఉపయోగించే అప్లికేషన్.
మేం 2005 సంవత్సరం గురించి మాట్లాడుతున్నాం. వాట్సాప్ ఉనికిలోకి రావడానికి చాలా కాలం ముందు అది. అదే సమయంలో ఫేస్‌బుక్ వచ్చింది.
లూప్ట్‌కు పెద్దగా ప్రాముఖ్యత దక్కలేదు. అయితే ఇది ఆల్ట్‌మాన్‌కు ఎంటెర్‌ప్రెన్యూర్‌గా కెరీర్ ప్రారంభించడానికి ఒక స్ప్రింగ్‌బోర్డ్‌లా పనిచేసింది.
భారీ ఎత్తున సాంకేతిక పెట్టుబడులకు తలుపులు తెరిచింది.
ప్రారంభంలో లూప్ట్‌కు మద్దతు ఇచ్చిన కంపెనీలలో మొదటిది వై కాంబినేటర్ (వైసీ). ఎయిర్ బీఎన్బీ, డ్రాప్ బాక్స్ వంటి కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన సంస్థ వైసీ.
ఆల్ట్‌మాన్ తన మొదటి ప్రాజెక్ట్‌ను దాదాపు రూ. 330 కోట్లకు విక్రయించారు. ఇది ఆల్ట్‌మాన్‌కు వైసీ గొడుగు కింద తన ఆలోచనలకు పెట్టుబడి పెట్టడానికి, తనకు ఆసక్తి ఉన్న రంగాలను విస్తరించడానికి వీలు కల్పించింది.
అంతేకాదు ఆల్ట్‌మాన్ 2014, 2019 మధ్య కాలంలో ఆ సంస్థకు అధ్యక్షుడిగా పనిచేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎలన్ మస్క్‌తో కలిసి కొత్త కంపెనీ ప్రారంభం
ఈ కాలంలోనే టెస్లా అధినేత ఎలన్ మస్క్‌తో కలిసి ఆల్ట్‌మాన్ ఓపెన్‌ఏఐ అనే కంపెనీని ఆల్ట్‌మాన్ స్థాపించారు.
అయితే ఈ సంస్థ ఆయనను ఆకర్షించడంతో పాటు, భయపడే ప్రపంచంలోకి తీసుకెళ్లింది. దానికి కారణం కృత్రిమ మేథస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్).
ఓపెన్‌ఏఐ అనేది ఒక పరిశోధనా సంస్థ. ఆ సంస్థ వెబ్‌సైట్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవాళికీ ప్రయోజనం చేకూర్చడం, అది అంతమవకుండా చూసుకోవడమే లక్ష్యమని పేర్కొంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవులకు వ్యతిరేకంగా ప్రాణాంతకమైన ఆయుధంగా మారుతుందని ఆల్ట్‌మాన్ కూడా భయం వ్యక్తం చేశారు.
2016లో ది న్యూయార్కర్ కోసం టాడ్‌ఫ్రెండ్ రాసిన విస్తృతమైన నివేదికలో ఆల్ట్‌మాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
"మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను బానిసలుగా చేయాలి లేదా అది మనల్ని బానిసలుగా చేసుకుంటుంది" అని ఆయన స్పష్టంచేశారు.
2018లో తన ప్రధాన కంపెనీ టెస్లా కారణంగా మస్క్ ఓపెన్ ఏఐ నుంచి బయటికొచ్చారు. అయితే దానిలో పెట్టుబడి పెట్టడం మాత్రం కొనసాగిస్తున్నారు.
వివాదాల కారణంగా ఓపెన్ ఏఐ నుంచి మస్క్ బయటికొచ్చినప్పటికీ, దానిలో పెట్టుబడి పెట్టడం కొనసాగిస్తున్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై పట్టు సాధించడానికి ఇతర ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేస్తారు.
వాటిలో ఒకటి మన మెదడు, కంప్యూటర్‌లకు కనెక్ట్ చేయడానికి ప్రయత్నించే న్యూరాలింక్.
మస్క్ ఈ విధంగా మాత్రమే మనుషులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అనుసంధానం అవుతారని నమ్ముతున్నారు.
ఈ విజన్స్ మస్క్, ఆల్ట్‌మాన్‌లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో భాగస్వామ్యం కావడానికి దారితీశాయి. చాట్‌జీపీటీ, డాల్-ఈ లకు సంబంధించి ఓపెన్‌ఏఐ వ్యూహాలను కూడా నిర్ణయిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
"వీటిని సమాజంలోకి ప్రవేశపెట్టడానికి అత్యంత బాధ్యతాయుతమైన మార్గం ఉంటుందని మేం నిజంగా విశ్వసిస్తున్నాం" అని ఆల్ట్‌మాన్ కొన్ని వారాల క్రితం స్ట్రిక్ట్లీవీసీతో చెప్పారు.
సిలికాన్ వ్యాలీ, సాంకేతిక ప్రపంచంలో ఏం జరుగుతుందో ఇది చెబుతుందని తెలిపారు.
"ఈ విధంగా మనం వ్యక్తులు, సంస్థలు, రెగ్యులేటర్‌లతో అనుసంధానం అవ్వొచ్చు. ఇబ్బందులు, సాంకేతికతను తెలుసుకోవడం, ఏం చేయాలి? ఏం చేయకూడదో నిర్ణయించుకోవడం'' లాంటివి సాధ్యం అంటున్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి వివరించడంలో ప్రత్యేకత గల యూట్యూబ్ డాట్ సీఎస్వీ ఛానెల్ ప్రకారం ఏఐ వ్యూహం గత 20 ఏళ్లలో పెద్ద టెక్నాలజీ కంపెనీలు సెట్ చేసిన ట్రెండ్‌కు ఒక మలుపు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో అగ్రగామిగా ఉన్న కంపెనీలు వేగంగా వెళ్లడం, బ్రేక్ థింగ్స్ అనే సిలికాన్ వ్యాలీ నినాదం ప్రకారం పని చేసే ధోరణి ఉంది" అని ఆల్ట్‌మాన్ మాటల ద్వారా చెబుతోంది.
అంతేకాకుండా దానిది " ఉత్పత్తులను వేగంగా వాటి పర్యవసనాల గురించి ఆలోచించకుండా విడుదల చేసే ఫిలాసఫీ" అని ఆరోపిస్తోంది.
సామ్ దృష్టి మాత్రం "అసంపూర్ణంగా ఉన్న ఉత్పత్తులైనా బయటికి తీసుకురావడం, సమాజం కొద్దికొద్దిగా వాటికి అలవాటు చేసుకోవడం" అని అది నొక్కి చెబుతోంది.
ఒక విధంగా చెప్పాలంటే చాట్‌జీపీటీ, డాల్ ఈలో అదే జరుగుతోంది. విద్యారంగం, సృజనాత్మకతతో సహా అనేక వర్గాల నుంచి ఇప్పటికే అనేక విమర్శలను అందుకుంటోంది.

ఫొటో సోర్స్, Getty Images
చాట్‌జీపీటీ పరిమితులపై ఆల్ట్‌మాన్ ఏం చెబుతున్నారు?
"చాట్‌జీపీటీ చాలా పరిమితం" అంతేకాదు ఆల్ట్‌మాన్ డిసెంబర్‌లో ట్విట్టర్‌లో పెట్టిన ఒక పోస్టులో దీన్ని అంగీకరించాడు.
అయితే కొన్నింటిలో గొప్పతనం గురించి తప్పుడు అభిప్రాయాన్ని సృష్టించే వీలుందని, ఏదైనా ముఖ్యమైన దాని కోసం దాన్ని విశ్వసించడం పొరపాటేనంటున్నారు.
ఇది ఎలాంటి పురోగతిని సాధిస్తుందనే దాని ప్రివ్యూ మాత్రమే అని, దాని పటిష్టత, వాస్తవికతకు సంబంధించి ఇంకా చాలా పని చేయాల్సి ఉందని చెబుతూ ఆల్ట్‌మాన్ ముగించారు.
చాట్‌జీపీటీలో వస్తున్న సమాధానాల్లో పక్షపాత వైఖరిపై ఆల్ట్ మాన్ బదులిచ్చారు.
"చాట్‌జీపీటీకి పక్షపాతం పరంగా బలహీనతలు ఉన్నాయని మాకు తెలుసు, దానిని మెరుగుపరచడానికి మేం కృషి చేస్తున్నాం" అని ఆల్ట్‌మాన్ అంగీకరించారు.
డిఫాల్ట్ సెట్టింగ్‌లను మెరుగుపరచడానికి, వాటిని మరింత తటస్థంగా చేయడానికి పని చేస్తున్నామన్నారు.
"విస్తృత పరిమితుల్లో మా కంప్యూటర్లు వారి వ్యక్తిగత ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రవర్తించేలా చేయడానికి యూజర్లను అనుమతించడానికి కృషి చేస్తున్నాం.
ఇది కనిపించే దానికంటే చాలా కష్టం. దానిని సాధించడానికి మాకు కొంత సమయం పడుతుంది" అని ఆల్ట్‌మాన్ తన థ్రెడ్ చివరలో సమర్థించుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆల్ట్‌మాన్ భవిష్యత్ ప్రణాళికలేంటి?
ఆల్ట్‌మాన్‌కు ఏప్రిల్‌లో 38 ఏళ్లు నిండాయి. ఇటీవల మూడేళ్ల క్రితం రాసిన సందేశాన్ని మళ్లీ గుర్తుచేశారు,
దీనిలో ఆయన "2025 నాటికి సాధించబోయే ప్రధాన టెక్నలాజికల్ డెవలప్‌మెంట్స్"ని అంచనా వేశారు
న్యూక్లియర్ ఫ్యూజన్‌ను స్థిరమైన మార్గంలో ప్రోటోటైప్ స్కేల్‌లో పని చేయించడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను సాధారణ పరిశ్రమలలోని వారికీ అందుబాటులో ఉంచడం,
మనపై ప్రభావాలు చూపుతున్న అతి ముఖ్యమైన వ్యాధులలో కనీసం ఒకదానికైనా నివారణ కోసం జన్యు సవరణగా మారడం.
ఆ ట్వీట్‌లో ఆల్ట్‌మాన్ న్యూక్లియర్ ఫ్యూజన్, తన ఇతర ఆందోళనల గురించి తెలియజేశారు.
ఆల్ట్‌మాన్ తన హెలియన్ ఎనర్జీ కంపెనీలో పరిశోధన, అభివృద్ధి కోసం చాలా సంవత్సరాలుగా పెట్టుబడులు పెట్టారు.
ఈ కంపెనీ నీటి నుంచి ప్రత్యేకంగా పొందిన ఇంధనాన్ని ఉపయోగించి స్వచ్ఛమైన, తక్కువ-ధర విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తుంది.
ఆల్ట్‌మాన్ అంచనాలు నిజమవుతాయో లేదో చూడటానికి ఇంకా రెండు సంవత్సరాలు పడుతుంది.
కానీ వీటిలో ఇప్పటికే మరింత స్పష్టంగా కనిపిస్తున్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.
అయితే, దాని మొదటి అడుగుకు మనం ఓపెన్ ఏఐకి కృతజ్ఞతలు తెలియజేయాల్సిందే.
ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తు ఉందని ఆల్ట్‌మాన్ నమ్మకంతో రూపొందించిన కంపెనీ అది. దానికోసం ఆయన టెక్నాలజీ, శాస్త్రీయ పురోగతుల కోసం ఏళ్లుగా పెట్టుబడులు పెట్టారు.
"నేను ఈ దేశాన్ని సిగ్గులేకుండా ప్రేమిస్తున్నాను, ప్రపంచంలోనే అత్యుత్తమ దేశం" అని అమెరికాను ఉద్దేశించి ఆయన మాట్లాడినట్లు ది న్యూయార్కర్ కథనం తెలిపింది,
అభివృద్ధిపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థలో మాత్రమే ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు.
"ఆర్థిక వృద్ధి ప్రయోజనాలు లేకుండా ప్రజాస్వామ్యంలో ప్రయోగం విఫలమవుతుంది" అని ఆల్ట్‌మాన్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
బిలియనీర్ల జాబితాలోకి తీసుకెళ్లిన ఓపెన్‌ఏఐ
ఆల్ట్‌మాన్ తన కెరీర్‌లో వై కాంబినేటర్‌లో ఉన్న సమయంలో ఆమోదించిన, ఆ తర్వాత పెట్టుబడి పెట్టిన ప్రాజెక్ట్‌లకు ఆర్థిక సాయం చేయడానికి బలమైన పెట్టుబడిదారుల మూలధనాన్ని ఆకర్షించగలిగారు.
ఆయన విలువ ఎంత అనేది చాలా తక్కువ తెలుసు. కానీ ఇటీవల బిలియనీర్‌ల ఎంపికలో ఆయన వృద్ధిని అంచనా వేస్తూ అనేక ప్రకటనలు వచ్చాయి.
లాభాపేక్ష లేని ప్రాజెక్ట్‌గా పుట్టిన ఓపెన్‌ఏఐ పరిమిత లాభాలతో హైబ్రిడ్ కంపెనీగా మారింది.
కొన్ని వారాల క్రితం ది వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కథనంలో ఓపెన్‌ఏఐ అమెరికాలో అత్యంత అభివృద్ధి చెందుతున్న స్టార్టప్‌లలో ఒకటిగా మారుతుందని పేర్కొంది.
దీని విలువ దాదాపు రూ.2 లక్షల కోట్ల విలువైనది.
మైక్రోసాఫ్ట్‌తో కంపెనీ కుదుర్చుకున్న లక్షల కోట్ల ఒప్పందం తర్వాత భవిష్యత్తులో "వ్యక్తిగత కంప్యూటింగ్, ఇంటర్నెట్, స్మార్ట్ పరికరాలు, క్లౌడ్‌లలో" ఇది బలమైన ప్రభావాన్ని చూపుతుందని స్పష్టంచేసింది.
ఈ వారం మేం అమెరికాలో చాట్‌జీపీటీ ప్లస్ వెర్షన్ గురించి తెలుసుకున్నాం. దీని కోసం నెలకు 1,600 చెల్లించాలి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు, ఉత్పత్తులను రూపొందించడంలో వారి నిబద్ధతను ఈ చార్జీలు ప్రభావితం చేయవు.
మీరు దీన్ని చేస్తారా? అది మనం భవిష్యత్తులో చాట్‌జీపీటీని అడగవచ్చు.
ఇవి కూడా చదవండి:
- డీజిల్ ఇంజిన్-ను హైడ్రోజన్ ఇంజిన్-గా మార్చే కొత్త టెక్నాలజీ..-
- లీపు సంవత్సరం అంటే ఏమిటి? ఎలా లెక్కిస్తారు? ఎప్పటి నుంచి మొదలైంది?
- వీడియో, హైడ్రోజన్-తో నడిచే కారు భారత్-లో ఎప్పుడు రోడ్డెక్కుతుంది-వ్యవధి, 2,31
- ఈ ఊరిలో ఫోన్లు, టీవీలు లేవు, ఇంటర్నెట్ లేదు, అసలు కరెంటే లేదు... మరి ప్రజలు ఎలా జీవిస్తున్నారు-
- అమెరికా టెక్నికల్ సీక్రెట్స్-ను చైనా ఎలా దొంగిలిస్తోంది- స్టెగనోగ్రఫీ అంటే ఏంటి-
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్,ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












