అమెరికా టెక్నికల్ సీక్రెట్స్‌ను చైనా ఎలా దొంగిలిస్తోంది? స్టెగనోగ్రఫీ అంటే ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నికోలస్ యంగ్
- హోదా, బీబీసీ న్యూస్
అది చూడటానికి సాధారణ ఫోటోలానే కనిపిస్తుంది. కానీ, తీక్షణంగా చూస్తేనే దాని వెనుక మర్మం బయటపడుతుంది. ఇది ‘‘జనరల్ ఎలక్ట్రిక్ పవర్’’ సంస్థ మాజీ ఉద్యోగి జెంగ్ షియావోకింగ్ మెయిల్‌లో బయటపడిన ఫోటో కథ.
ఒక సూర్యోదయాన్ని కెమెరాలో బంధించినట్లుగా కనిపిస్తున్న ఆ ఫోటోలో కొన్ని రహస్య ఫైల్స్‌ను ఆయన ఆఫీస్ నుంచి తీసుకెళ్లిపోయారు. ఆ ఫోటోలో బైనరీ కోడ్‌లో సమాచారాన్ని దాచిపెట్టి ఆయన తన వ్యక్తిగత మెయిల్‌కు పంపించుకున్నారని అమెరికాలోని న్యాయ సేవల విభాగం (డీఓజే) అధికారులు నిరూపించారు.
ఈ టెక్నిక్‌ను ‘‘స్టెగనోగ్రఫీ’’గా పిలుస్తారు. అంటే ఒక డేటా ఫైల్‌లో మరో డేటాను కోడ్ రూపంలో దాచిపెట్టడం. జనరల్ ఎలక్ట్రిక్ (జీఈ) నుంచి రహస్య సమచారాన్ని బయటకు తీసుకెళ్లేందుకు జెంగ్ ఈ టెక్నిక్‌ను ఉపయోగించారు.
ఎనర్జీ, ఏరోస్పేస్‌తో మొదలుపెట్టి ఆరోగ్య సేవల వరకు భిన్న రంగాల్లో జీఈ విస్తరించింది. ఫ్రిడ్జ్‌లతో మొదలుపెట్టి విమాన ఇంజిన్ల వరకు సంస్థ తయారుచేస్తుంది.
జెంగ్ తస్కరించిన సమాచారం ‘‘గ్యాస్, స్టీమ్ టర్బైన్ల డిజైన్, తయారీ’’కి సంబంధించినది. టర్బైన్ బ్లేడ్లు, టర్బైన్ సీల్స్ తయారీ సమాచారాన్ని కూడా ఆయన తీసుకెళ్లారు. కోట్ల రూపాయల విలువైన ఈ సమాచారాన్ని చైనాలోని తన ఏజెంట్లుకు ఆయన పంపించారు. మొత్తంగా దీని వల్ల చైనా ప్రభుత్వం, అక్కడి కంపెనీలు, యూనివర్సిటీలకు లబ్ధి చేకూరే అవకాశముంది.

ఫొటో సోర్స్, Getty Images
జెంగ్‌కు ఇటీవల రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించారు. అమెరికాలో వెలుగుచూస్తున్న రహస్య సమాచార చోరీల్లో ఇది తాజా కేసు. నవంబరులో చైనా పౌరుడు షు యంజున్‌కు కూడా 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు. అమెరికా విమానయాన రంగంతోపాటు జీఈకి చెందిన సహస్య వాణిజ్య సమాచారాన్ని ఆయన తస్కరించినట్లు అధికారులు నిరూపించారు.
తమ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంతోపాటు టెక్నాలజీలో అంతర్జాతీయంగా తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాల్లో ఈ రహస్య సమాచార తస్కరణ కూడా ఒక భాగమని నిపుణులు చెబుతున్నారు.
‘‘ఈ వాణిజ్య సమాచార చౌర్యం అనేది కీలక పాత్ర పోషిస్తుంది. సమయం, డబ్బు వెచ్చించకుండానే గ్లోబల్ వేల్యూ చైన్‌లో ప్రధాన పాత్ర పోషించేందుకు ఇది దోహదపడుతుంది’’అని ఎకనమిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ)కు చెందిన నిక్ మారో చెప్పారు.
‘‘పశ్చిమ దేశాల మేధా సంపత్తిని తస్కరించడమే లక్ష్యంగా చైనా పని చేస్తోంది.ఈ రహస్య సమాచాారాన్ని ఉపయోగించుకుని తన పారిశ్రామిక అభివృద్ధిని పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది’’ అని ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ రే గత జూలై నెలలో లండన్‌లో పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తల ఎదుట చెప్పారు.
‘‘దాదాపు అన్ని కంపెనీలపైనా, నగరాల నుంచి పట్టణాల వరకు, విమానయాన రంగం నుంచి కృత్రిమ మేధస్సు వరకు, దిగ్గజ కంపెనీల నుంచి అంకుర సంస్థల వరకు ఇలా అన్నిచోట్లా వారు నిఘా పెడుతున్నారు’’అని రే హెచ్చరించారు.
అయితే, చైనాపై రే అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని, పచ్ఛన్న యుద్ధంనాటి ఆలోచనా విధానానికి ఆయన వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని అప్పటి చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘చైనా సవాల్ విసురుతోంది’’
జెంగ్‌పై న్యాయ సేవల విభాగం (డీవోజే) విడుదల చేసిన ప్రకటనలో ఎఫ్‌బీఐకి చెందిన అలాన్ కోహ్లెర్ స్పందిస్తూ.. ‘‘అమెరికా సంపత్తిని చైనా లక్ష్యంగా చేసుకుంటోంది. ప్రపంచ నాయకుడిగా కొనసాగుతున్న అమెరికాకు చైనా సవాల్ విసరాలని చూస్తోంది’’అని వ్యాఖ్యానించారు.
టర్బైన్ సీలింగ్ టెక్నాలజీలో జెంగ్ నిపుణుడు. స్టీమ్ టర్బైన్ ఇంజినీరింగ్‌లో లీకేజ్ కంటైన్‌మెంట్ టెక్నాలజీలపై ఆయన పనిచేశారు. టర్బైన్ పనితీరు మెరుగుపరచడంలో ఈ టెక్నాలజీ దోహదపడుతుంది. ‘‘టర్బైన్‌లను మరింత శక్తిమంతంగా చేసేందుకు, వాటి జీవిత కాలం పొడిగించేందుకు అవసరమైన టెక్నాలజీని ఆయన తస్కరించారు’’అని డీవోజే తెలిపింది. చైనా విమానయాన రంగంలో విమానాలను నడిపించే ఈ గ్యాస్ టర్బైన్ల టెక్నాలజీ ప్రధాన పాత్ర పోషిస్తోంది.
విదేశీ టెక్నాలజీపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు, దేశీయ పరిశ్రమలకు ఊతం ఇచ్చేందుకు చైనా అధికారులు గుర్తించిన పది రంగాల్లో విమానయాన రంగం కూడా ఒకటి.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, ఇతర భిన్న రంగాల్లోనూ చైనా చౌర్యానికి పాల్పడుతోంది.
సిలికాన్ వ్యాలీ కన్సల్టెన్సీ కాన్‌స్టెలేషన్ రీసెర్చ్ సీఈవో రే వాంగ్ సమాచారం ప్రకారం.. ఫార్మా, నానో టెక్నాలజీ, ఇంజినీరింగ్, మెడిసిన్, టెక్స్‌టైల్స్, ఫ్యాబ్రిక్స్, ఆటోమొబైల్ లాంటి రంగాల్లోనూ సమాచారాన్ని చైనా తస్కరిస్తోంది.
ఒక టాప్ 100 సంస్థలో రీసెర్చ్ విభాగానికి అధిపతిగా పనిచేసిన ఒక వ్యక్తి చెప్పిన మాటలను రే గుర్తుచేసుకున్నారు. ‘‘ఆయన పిల్లలు మా పిల్లలతోపాటు పెరిగారు. ఆయన మాతోపాటు ఏళ్లపాటు కలిసిపనిచేశారు. అయితే, చివర్లో ఆయన కమ్యూనిస్టు పార్టీ కోసం పనిచేస్తున్నట్లు తెలిసింది. అసలు మేం దాన్ని గుర్తించలేకపోయాం’’అని తన మిత్రుడు చెప్పినట్లు రే వివరించారు.
‘‘అసలు ఎక్కడ చూసిన గూఢచారులే కనిపించారని ఆయన చెప్పారు’’అని రే వివరించారు.
‘‘ఇదివరకు దక్షిణ కొరియా, తైవాన్, సింగపూర్ లాంటి ప్రాంతాల నుంచి ఇలాంటి పారిశ్రామ గూఢచర్య ముప్పు ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మాత్రం చైనా నుంచి ఈ ముప్పు విపరీతంగా ఎక్కువైంది’’అని మారో చెప్పారు.
హ్యాకింగ్ కూడా..
మరోవైపు ఇటీవల కాలంలో హ్యాకింగ్ ద్వారా కూడా రహస్య సమాచార చౌర్యం ఎక్కువైంది.
2015లో మేధోసంపత్తి సమాచారంపై సైబర్ దాడులకు తావివ్వబోమని అమెరికా, చైనా ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని కిందకు వాణిజ్య రహస్యాలు, ఇతర రహస్య సమాచారం కూడా వస్తుంది.
అయితే, ఆ మరుసటి ఏడాదే ఆ ఒప్పందాన్ని చైనా ఉల్లంఘిస్తోందని అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ ఆరోపించింది. మరోవైపు ఆ ఒప్పందం ప్రభావం పెద్దగా ఉండబోదని విశ్లేషకులు ముందునుంచీ చెబుతూనే ఉన్నారు. దాన్ని ఒక హాస్యాస్పద ఒప్పందంగా రే అభివర్ణించారు. ‘‘ల్యాబ్‌ల నుంచి పరిశ్రమల వరకు పశ్చిమ దేశాల ప్రతి వ్యాపారంపైనా చైనా సైబర్-గూఢచర్యం నిఘా పెట్టింది’’అని బీబీసీతో రే చెప్పారు.
అయితే, ఈ నిఘా ఏ స్థాయిలో ఉందని చెప్పడానికి ఎలాంటి అధ్యయనమూ జరగలేదని సింగపూర్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన లిమ్ తాయ్ వీ తెలిపారు.
‘‘అమెరికాపై చైనా గూఢచర్యం ఇటీవల తగ్గిందని కొందరు చెబుతున్నారు. అయితే, ఇది మళ్లీ ఎక్కువైందని మరికొందరు అంటున్నారు. అమెరికా-చైనా సంబంధాలు దెబ్బతినడంతో ఇది మరింత ఎక్కువైందని మరికొందరు అంటున్నారు’’అని ఆయన వివరించారు.
ప్రస్తుతం సెమీకండక్టర్ రంగంలో చైనాకు కళ్లెం వేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. చైనా ఈ టెక్నాలజీతో భద్రతా పరమైన సవాళ్లు విసురుతోందని అమెరికా భావిస్తోంది.
గత అక్టోబరులో ఈ టెక్నాలజీ పరికరాల ఎగుమతిపై అమెరికా వరుస ఆంక్షలు విధించింది. అమెరికా టూల్స్, సాఫ్ట్‌వేర్‌తో తయారుచేసిన చిప్‌లను చైనాకు ఎగుమతి చేసే కంపెనీలు ప్రత్యేక లైసెన్సులు తీసుకోవాలని తెలిపింది. మరోవైపు కొన్ని చైనా చిప్ కంపెనీల కోసం పనిచేయకుండా అమెరికా పౌరులు, గ్రీన్‌కార్డ్ దారులపై ఆంక్షలు విధించింది.
ఈ చర్యలతో చైనా టెక్నాలజీ బదిలీని కొంతవరకు అడ్డుకోవచ్చని మారో అంటున్నారు. అదే సమయంలో తమ సప్లై చైన్ల నుంచి అమెరికా కంపెనీల ఉత్పత్తులను తొలగించాలనే చైనా లక్ష్యానికి ఇది కొంతవరకు తోడ్పడుతుందని వివరించారు.
‘‘చైనా ఎప్పటినుంచో తమ సప్లై చైన్ల నుంచి అమెరికా కంపెనీలను తొలగించాలని చూస్తోంది. అయితే, దీని వల్ల పెద్ద ప్రయోజనం లభించలేదు. అయితే, నేడు అమెరికా విధానం వల్ల వారికి అత్యవసర పరిస్థితి ఏర్పడింది’’అని ఆయన తెలిపారు.
మరోవైపు చైనా కూడా అమెరికా తరహాలోనే జాతీయ భద్రత గురించి ఆందోళన వ్యక్తంచేస్తోంది. దీంతో ఈ రెండు దేశాల మధ్య ఈ టెక్నాలజీ పోరు భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశముంది.
అయితే, టెక్నాలజీలో ఇప్పటికీ అమెరికాదే పైచేయి అని రే అంటున్నారు.
‘‘తాము చైనా సైట్లను హ్యాక్ చేసినప్పుడు, అక్కడ కనిపించేది అమెరికా మేధా సంపత్తి సమాచారమేనని నా స్నేహితులు చెబుతుంటారు’’అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- వీరసింహారెడ్డి: అమెరికా థియేటర్లను హడలగొడుతున్న తెలుగు సినిమా ‘సంస్కృతి’
- ఆస్కార్-ఆర్ఆర్ఆర్: ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల ‘నాటు నాటు’ పాట ఎలా పుట్టింది?
- గంగా విలాస్ క్రూయిజ్: డిజైన్ చేసింది తెలుగు మహిళ.. మోదీ ప్రారంభించిన ఈ షిప్ ప్రత్యేకతలేమిటి? విమర్శలు ఎందుకు?
- దేవికా రాణి: బాలీవుడ్లో చరిత్ర సృష్టించిన ఈ ‘ముద్దు సీన్’ చుట్టూ అల్లుకున్న కథలేంటి?
- క్రైస్తవ మిషనరీలు మత మార్పిడుల కోసం బుద్ధుడి జన్మస్థలాన్ని టార్గెట్ చేశాయా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















