భూకంపం వచ్చినప్పుడు ఏం చేయాలి?

తుర్కియే భూకంపం

ఫొటో సోర్స్, Reuters

తుర్కియే, సిరియాలలో 7.8 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపం విధ్వంసం సృష్టించింది. ఈ దశాబ్దంలోనే అతిపెద్ద భూకంపాల్లో ఒకటిగా చెబుతున్న దీని కారణంగా ఐదు వేల మందికిపైగా మరణించారు.

విధ్వంసకర భూకంపాల ముప్పు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తుర్కియే కూడా ఒకటి. 1939 నుంచి 1999 మధ్య ఐదు భారీ భూకంపాలు ఈ ప్రాంతాన్ని కుదిపేశాయి.

1900 నుంచి నేటి వరకు ఇక్కడ 76 భూకంపాల కారణంగా 90,000 మంది మరణించారు. ఈ మరణాల్లో సగం 1939 నుంచి 1999 మధ్యే సంభవించాయి.

2021లో హైతీ (2,200 మరణాలు), 2018లో ఇండోనేసియా (4,300)లనూ ఇలాంటి భూకంపాలే కుదిపేశాయి. 2017లో ఇరాన్‌లో వచ్చిన భూకంపం కారణంగా 400 మందికిపైగా మరణించారు.

తుర్కియే భూకంపం

ఫొటో సోర్స్, Reuters

అంచనాలతో

భూకంపాలు ఎక్కడెక్కడ వచ్చే ముప్పు ఉంటుందో మనం ముందుగానే అంచనా వేస్తున్నప్పటికీ, అవి ఎప్పుడు వస్తాయో కచ్చితంగా చెప్పడంలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. అసలు ముందుగా మనం కనిపెట్టలేమా?

‘‘దురదృష్టవశాత్తు కచ్చితంగా కనిపెట్టలేమనే చెప్పాలి’’అని ఇంపీరియల్ కాలేజీ లండన్‌కు చెందిన సైస్మాలజిస్టు డాక్టర్ స్టీఫెన్ హిక్స్ చెప్పారు.

‘‘కానీ, అంచనాలు వెల్లడించగలం. ఇప్పుడు వచ్చే అవకాశముందని అంచనా వేయగలం. అమెరికాలోని కాలిఫోర్నియా, జపాన్‌లలో ఈ అంచనాలు నానాటికీ మెరుగవుతున్నాయి’’అని ఆయన చెప్పారు.

భూకంపాల నుంచి ప్రాణాలతో బయట పడాలంటే ఏం చేయాలి?

తుర్కియే భూకంపం

ఫొటో సోర్స్, Reuters

సిద్ధంగా ఉండాలి..

భూకంపం ఎప్పుడు వస్తుందో కచ్చితంగా అంచనా వేయడం కష్టం అవుతుండటంతో మనం అన్ని వేళలా సిద్ధంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

‘‘భూకంపాలు ఎక్కువగా వచ్చే ప్రాంతంలో మీరు జీవిస్తే, ‘ఎమర్జెన్సీ ప్యాక్’ను సిద్ధంగా ఉంచుకోవడం మంచిది’’అని హిక్స్ సూచించారు. ఎమర్జెన్సీ ప్యాక్‌లో మంచినీళ్లు, ఒక టార్చ్‌లైట్, ఫస్ట్ ఎయిడ్ కిట్, ఆహారం ఉంచుకోవాలని చెప్పారు.

ఆ కిట్‌లో కొంత డబ్బు, ఔషధాలు, ముఖ్యమైన డాక్యుమెంట్లు కూడా పెట్టుకోవాలని రెడ్ క్రాస్ సూచిస్తోంది.

తుర్కియే భూకంపం

ఫొటో సోర్స్, Getty Images

సురక్షితమైన చోటు అయితే, అక్కడే ఉండండి..

భూకంపం వచ్చినప్పుడు ఉన్నచోటే కదలకుండా ఉంటే గాయాల పాలయ్యే అవకాశం తక్కువని అమెరికా జియోలాజికల్ సర్వే సూచిస్తోంది. ‘‘భూకంపం వచ్చినప్పుడు బయటకు పరిగెత్తడం, లేదా వేరే గదుల్లోకి వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లడం లాంటివి చేయకూడదు’’అని సంస్థ సూచిస్తోంది.

‘‘కాళ్లు చేతులు దగ్గరకు ముడుచుకొని టేబుల్ లేదా డెస్కు కిందకు వెళ్లి తలదాచుకోవాలి. అప్పుడే పైనుంచి పడే వస్తువుల వల్ల మనకు గాయాలు కాకుండా ఉంటాయి. ప్రకంపనలు ఆగేవరకు టేబుల్ కాళ్లను గట్టిగా పట్టుకొని అక్కడే కదలకుండా కూర్చోవాలి’’అని సంస్థ సూచిస్తోంది.

కొంతమంది ఇంటి ప్రవేశ మార్గం, ద్వారాలు చాలా గట్టిగా ఉంటాయని, అక్కడకు వెళ్లి నిలబడాలని సూచిస్తుంటారు. అయితే, టేబుల్ కిందే సురక్షితంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

ఇంటి ముందు అందంగా అలంకరించే అద్దాలు, కిటికీలే ముందుగా భూకంప సమయంలో ధ్వంసం అవుతాయి. ఇలాంటి ప్రాంతాల నుంచి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

తుర్కియే భూకంపం

ఫొటో సోర్స్, Reuters

అప్పుడే బయటకు వెళ్లండి

మీరు నివసించే భవనం దెబ్బతినే పరిస్థితుల్లో ఉంటే, ప్రకంపనలు ఆగిన వెంటనే, బయటకు వెళ్లిపోతే మంచిది.

అయితే, ఇవన్నీ భూకంపం వచ్చినప్పుడు మీరు ఇంట్లో ఉంటే అనుసరించాల్సిన సూచనలు. ఒకవేళ మీరు బయట ఉంటే?

‘‘ఉన్నచోటే ఉండండి’’అని నిపుణులు సూచిస్తున్నారు. ‘‘భవనాలు, విద్యుత్ స్తంభాలు, చమురు, గ్యాస్ లైన్ల’’కు కాస్త దూరంగా వెళ్తే గాయాలయ్యే అవకాశం తగ్గుతుంది. చెట్లు, ఫోన్ స్తంభాలు, భవనాలు లేని బహిరంగ ప్రాంతానికి వెళ్తే మీరు సురక్షితంగా ఉంటారు.

తుర్కియే భూకంపం

ఫొటో సోర్స్, Reuters

ముప్పులకు దూరంగా ఉండండి..

భూకంప సమయంలో ఎక్కువ మరణాలకు పైనుంచి పడిపోవడం, లేదా టీవీలు, బుక్ కేస్‌లు లాంటివి పైనపడటం వల్లే సంభవిస్తున్నాయని ఎర్త్‌క్వేక్ కంట్రీ అలయన్స్ చెబుతోంది. గోడలపై అమర్చే భారీ వస్తువులు కదిలేందుకు వీలుగా ఫ్లెక్సిబుల్ స్ట్రాప్స్‌తో అమరిస్తే కొంతవరకు ఇవి కిందపడే ముప్పు తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

భూకంపం వల్ల గ్యాస్ పైప్‌లైన్‌లు దెబ్బతిని అగ్ని ప్రమాదాలు కూడా సంభవిస్తుంటాయి.

వీడియో క్యాప్షన్, హైతీలో భారీ భూకంపం, 304 మంది మృతి

1906లో శాన్‌ఫ్రాన్సిస్కో భూకంప సమయంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని హిక్స్ చెప్పారు.

‘‘ఆ భూకంపంలో 3,000 మందికిపైగా మరణించారు. వీటిలో ఎక్కువ మరణాలకు గ్యాస్ పైప్‌లైన్లు పేలిపోవడమే కారణం. అందుకే ఇలాంటి విస్పోటం చెందే ప్రాంతాలకు మనం దూరంగా ఉండాలి’’అని ఆయన సూచించారు.

వీడియో క్యాప్షన్, గుజరాత్‌లో భూకంపం: ‘2001 విధ్వంసం గుర్తొచ్చింది’

డ్రిల్స్ ముఖ్యం..

భూకంపం వస్తే ఎలా స్పందించాలో ముందుగా సిద్ధంచేసే డ్రిల్స్‌తోనూ ప్రయోజనం ఉంటుందని హిక్స్ చెప్పారు.

‘‘కొన్ని దేశాల్లో ఎర్త్‌క్వేక్ డ్రిల్స్ నిర్వహించడం తప్పనిసరి. నాకు తెలిసి తుర్కియేలో ఇలాంటి ఏర్పాట్లు లేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో అక్కడ భారీ భూకంపాలు రాలేదు’’అని ఆయన వ్యాఖ్యానించారు.

బీబీసీ ఐస్వోటీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును , , లో ఫాలో అవ్వండి. లో సబ్‌స్క్రైబ్ చేయండి.)