సముద్రంలో దీపావళి జరుపుకున్న నేవీ మహిళల బృందం

ఫొటో సోర్స్, Twitter
ఐఎన్‌ఎస్‌వీ తరిణిలో ప్రపంచ యాత్ర చేస్తున్న ఆరుగురు మహిళల నేవీ బృందం ఈసారి తమ దీపావళి పండుగను సముద్రంలో జరుపుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలను నేవీ అధికార ప్రతినిధి ట్విటర్లో ఉంచారు.
ఈ బృందం త్వరలోనే ఆస్ట్రేలియాకి చేరుకోనుంది. ప్రధాని నరేంద్ర మోదీ వీరితో వీడియో కాల్‌లో మాట్లాడారు. దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. వారి యాత్ర విజయవంతం కావాలని కోరుకున్నారు.
ఈ బృందంలోని వర్తికా జోషి, పాయల్ గుప్తాలకు ముందస్తుగా పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియచేశారు.

ఫొటో సోర్స్, Twitter
ఈ బృందం తమ ప్రయాణాన్ని ప్రారంభించేముందు కూడా ప్రధానిని కలిసింది. 22100 నాటికల్ మైళ్ల తమ ప్రయాణంలో 4770 నాటికల్ మైళ్ల దూరం పూర్తికానుంది.
చరిత్రలో మొదటిసారిగా భారత నేవీకి చెందిన ఆరుగురు సాహస మహిళా లెఫ్టినెంట్ కమాండర్లు ప్రపంచ యాత్ర చేస్తున్నారు.
ఈ టీంలో ఉన్న ఇద్దరు తెలుగు వారిలో ఒకరు ఐశ్వర్య బొడ్డపాటి. ఈమె విజయవాడ సమీపంలోని కంకిపాడులో పుట్టారు. హైదరాబాద్‌లో పెరిగారు. ఓడను డిజైన్ చేయగలరు. సముద్రం మధ్యలో నౌక ఆగిపోతే వెళ్లి బాగు చేస్తారు.
ఈమెతో పాటు ఈ టీంలో మరో తెలుగమ్మాయి స్వాతి పాతర్లపల్లి కూడా ఉన్నారు.
ఈమె స్వస్థలం విశాఖ. తండ్రి ఆదినారాయణ. విశాఖలోని ఎంవోవీలో హెడ్‌కుక్. తల్లి రాణి సెయిలింగ్ క్లబ్‌లో కోచ్. రాణికి నీళ్లంటే భయం. దీంతో కూతురు కూడా అలా భయపడకూడదని. స్వాతిని సెయిలింగ్ వైపు ప్రోత్సహించారు.
ఈ ఆరుగురు 56 అడుగుల పొడవైన సరికొత్త 'ఐఎన్‌ఎస్‌వీ తరిణి'లో ఈ సాహస యాత్ర చేస్తున్నారు. చాలా చోట్ల మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
సముద్రంలో ఆటుపోట్లు వస్తే శాటిలైట్ ఫోన్‌తో సమాచారం అందిస్తారు. సమీపంలోని దేశానికి చెందిన నౌకాదళం వచ్చి రక్షిస్తుంది. వీరంతా చిన్నచిన్న ప్రయాణాలను విజయవంతంగా పూర్తి చేశారు. కానీ ఇది సాహసంతో కూడిన సుదీర్ఘ ప్రయాణం.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి)