బీబీసీ టూ ఆస్ట్రోనాట్స్ షో విజేత సూజి ఇంబర్

బీబీసీ నిర్వహించే ‘టూ ఆస్ట్రోనాట్స్ షో’ లో మహిళా స్పేస్ సైంటిస్ట్ సూజి ఇంబర్ విజేతగా నిలిచింది. ఈ షోలో గెలుపొందడంతో సూజి ఇంబర్‌ను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలో చేరడానికి ప్రతిపాదిస్తారు.
ఈ విజయం తనకు ఓ అద్భుతమైన అనుభవమని సూజి అంటోంది. యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ లో సూజి అసోసియేట్ ప్రొఫెసర్. ప్లానెటరీ సైన్స్ విభాగంలో ప్రొఫెసర్ గా పనిచేస్తోన్న సూజి, ఈ షోలో 11 మందితో పోటీపడి గెలిచింది.

అంతరిక్షంలో అడుగుపెట్టిన మొదటి కెనెడియన్ వ్యోమగామి క్రిస్ హాడ్‌ఫీల్డ్, ఈ షోకు జడ్జ్ గా ఉన్నాడు. క్రిస్ హాడ్‌ఫీల్డ్ ఈ షోలో పాల్గొన్న 12 మందికి కఠిన పరీక్షలు పెట్టారు.
వ్యోమగామి అయ్యేందుకు ఉత్తమ లక్షణాలు ఎవరికున్నాయో తేల్చే క్రమంలో బీబీసీ టూ ఆస్ట్రోనాట్స్ షో కొనసాగుతుంది. 6 వారాల పాటు కొనసాగే ఈ షోలో అభ్యర్థులను కాచి వడపోశారు. చివరికి సూజి ఇంబర్‌కు మాత్రమే వ్యోమగామి అయ్యే అవకాశం లభించింది.
’ఈ ఛాలెంజ్‌లకు సిద్ధపడటం అంటే దాదాపు రక్తాన్ని చిందిస్తున్నట్టు అనిపించింది’ అంటూ తన అనుభవాలను చెప్పుకొచ్చింది డా.సూజి ఇంబర్.
‘బీబీసీ టూ ఆస్ట్రోనాట్స్ సిరీస్‌లో.. నీటిలో ఎక్కువసేపు ఉండటం, చాలా వేగంగా గిర్రున తిరిగే ఓ కాప్స్యూల్‌లో గడపటంతో ఊపిరి బిగపట్టాల్సి వచ్చేది. అయితే, ఈ ఛాలెంజ్‌లు ఎదుర్కోవడం చాలా కష్టమనిపించినా, ఆ పరీక్షలపైనే దృష్టి కేంద్రీకరించి వాటి తీవ్రతను, సమయాన్ని చాలా జాగ్రత్తగా ఎదుర్కొన్నాను’ అని సూజి వివరించింది.

ఈ యువ సైంటిస్టుకు తన బాల్యం నుండే అంతరిక్షానికి సంబంధించిన అంశాల పట్ల ఆసక్తి.. ప్రస్తుతం ఆమె మెర్క్యురీ అయస్కాంతావరణం పైనే పరిశోధనలు చేస్తోంది.
‘బీబీసీ టూ ఆస్ట్రోనాట్స్ సిరీస్ విన్నర్‌గా నా పేరు ప్రకటించినపుడు నేను షాక్ తిన్నా!.. ఈ ఆనందాన్ని వివరించడానికి చాలా కష్టంగా ఉంది. బహుశా నేను అంతరిక్షంలోనే అంతం కావచ్చేమో ఎవరు చెప్పగలరు!’ అంటోంది సూజి ఇంబర్.
ఈ సిరీస్‌లో తాను నేర్చుకున్న అంశాలను చెబుతూ..
‘మనం, ప్రతి అంశంలోనూ ప్రావీణ్యత సాధించాల్సిన అవసరం లేదు. కానీ అన్ని విషయాల పట్ల అవగాహన మాత్రం తప్పనిసరిగా వుండాలి. బహుశా అందుకే నేను 11 మందిపై కాస్త ఆధిక్యం ప్రదర్శించగలిగానేమో’ అన్నారు. ఈ సిరీస్‌లో భాగంగా తాను జీవితకాల స్నేహాన్ని పొందానని చెబుతోంది సూజి ఇంబర్.

ఫొటో సోర్స్, University of Leicester
సూజి ఇంబర్ ఓ సాహసోపేత అన్వేషకురాలని యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ ప్రెసిడెంట్ ప్రొ.పాల్ బోయెల్ అన్నారు.
నిర్భయంగా పర్వతాలను అధిరోహించే సూజి, బీబీసీ షోలో గెలిచి మరింత ఎత్తులకు వెళ్లిందని చెప్పారు.
సూజి విజయం పట్ల చాలా గర్వంగా వుందని, అన్ని దశల్లోనూ విజయం సాధించి ఆమె ఓ మంచి వ్యోమగామి కావాలని, యూనివర్సిటీ ప్రెసిడెంట్ పాల్ బోయెల్ ఆశించారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








