తుర్కియే-సిరియా భూకంపం: శిథిలాల మధ్య అప్పుడే పుట్టిన పసిబిడ్డ ఏడుపు... కాపాడిన బంధువులు

ఫొటో సోర్స్, AFP
సిరియాలో భూకంపంతో కుప్పకూలిన ఓ భవనం శిథిలాల నుంచి అప్పుడే పుట్టిన పసికందును సహాయక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. భూకంపం వచ్చిన కాసేపటికి ఆ బిడ్డ తల్లికి పురిటి నొప్పులు వచ్చాయి. బిడ్డకు జన్మనిచ్చి ఆ తల్లి చనిపోయింది. ఆ పాప తండ్రి, తోబుట్టువులు కూడా శిథిలాల కింద చనిపోయారు.
జిండేరిస్ ప్రాంతంలోని ఓ శిథిల భవనంలోంచి దుమ్ము, ధూళి ఆవరించిన పసికందును ఓ వ్యక్తి మోసుకొస్తున్న దృశ్యం ఓ వీడియోలో కనిపించింది.
అక్కడికి దగ్గర్లోని ఆఫ్రిన్ ఆస్పత్రిలో ఆ బిడ్డను చేర్పించారు. పాప క్షేమంగా ఉందని డాక్టర్లు చెప్పారు.
తుర్కియే సరిహద్దుకు దగ్గర్లోని జిండేరిస్‌లో 7.8 తీవ్రతతో వచ్చిన భూకంపానికి దాదాపు 50 భవనాలు కుప్పకూలిపోయాయి. ఈ పాప కుటుంబం వాటిలో ఒక ఇంట్లో ఉంటుండేది. ఆ భవనం కూలిపోయిందని తెలియగానే బంధువులు కొందరు అక్కడికి చేరుకున్నారని ఆ పాప మామ ఖలీల్ అల్-సువాదీ చెప్పారు.
"శిథిలాలను తవ్వుతుంటే పసిపాప ఏడుపు వినిపించింది. నెమ్మదిగా మట్టిని పక్కకు తొలగించి చూస్తే బొడ్డూడని పసిబిడ్డ కనిపించింది. పేగును కత్తిరించి బిడ్డను వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్ళాం" అని ఖలీల్ చెప్పారు.
పిల్లల డాక్టర్ హానీ మారూఫ్ ఆ పాపకు ప్రాథమిక చికిత్స చేశారు. బిడ్డ ఒంటి మీద చాలా గాయాలు ఉన్నాయని డాక్టర్ చెప్పారు. "తీవ్రమైన చలి వల్ల పాపకు హైపోథెర్మియా వచ్చింది. బిడ్డను కొంత వెచ్చ చేసి, కాల్షియం ఇచ్చాం" అని ఆయన వివరించారు.
ఇంక్యుబేటర్‌లో ఉంచి సెలైన్ ఎక్కిస్తున్న పాపను ఫోటో తీశారు. ఆ బిడ్డ తల్లి అఫ్రా, తండ్రి అబ్దుల్లా, నలుగురు తోబుట్టువులకు కలిపి అంత్యక్రియలు నిర్వహించారు.

ఫొటో సోర్స్, Getty Images
8 వేలకు చేరిన మృతుల సంఖ్య
దమాస్కస్ ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థ అయిన వైట్ హెల్మెంట్స్ చెప్పిన వివరాల ప్రకారం సిరియాలో భూకంపం వల్ల దాదాపు 2,000 మంది చనిపోయారు. తుర్కియేలో మరో అయిదు వేల మంది దాకా చనిపోయారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని వైట్ హెల్మెట్స్ చెప్పారు.
శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ మృతుల సంఖ్య బాగా పెరిగిపోతోంది. గడ్డ కట్టించే చలిలో సమయం మించిపోకుండా వీలైనంత త్వరగా బాధితులను గుర్తించేందుకు సహాయక చర్యల సిబ్బంది నిరంతరం పని చేస్తున్నారు.
కుప్పకూలిన భవనాల్లో ఉంటున్న వారి బంధువులు కూడా సహాయక చర్యల్లో భాగమవుతున్నారు. అయితే, కొన్ని చోట్ల ఎలాంటి సహాయక చర్యలూ అందడం లేదని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు.
భారత్ సాయం
తుర్కియే, సిరియాలకు మానవతా సాయం అందించేందుకు భారత్ ముందుకు వచ్చింది.
రెండు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను తుర్కియేకు పంపుతున్నట్లు ఆ సంస్థ డీఐజీ(ఆపరేషన్స్ అండ్ ట్రైనింగ్) మోషెన్ సాహెది వార్తా సంస్థ ఏఎన్‌ఐకి తెలిపారు.
రెండు బృందాల్లో సుమారు 101 మంది సిబ్బంది ఉంటారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని కాపాడటంతోపాటు ఇతర సహాయక చర్యల్లో వారు పాల్గొంటారు.

వెంట వెంటనే భూకంపాలు
తుర్కియే తూర్పున 26 కి.మీ దూరంలో ఉన్న నూర్దా నగరంలో గాజియంటెప్‌లో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది.
7.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ జియోసైన్సెస్ (జీఎఫ్‌జెడ్) ప్రకటించిందని వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది.
జీఎఫ్‌జెడ్ ప్రకారం భూకంపం కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల దిగువన ఉంది. అదే సమయంలో భూకంప కేంద్రం భూమికి 11 మైళ్ల దిగువన ఉందని యూఎస్‌జీఎస్ తెలిపింది.
ఇది జరిగిన కొద్దిసేపటికే సెంట్రల్ తుర్కియేలో రెండోసారి భూమి కంపించింది.
దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.5 తీవ్రత నమోదైందని యూఎస్‌జీఎస్ వెల్లడించింది. దీని కేంద్రం భూమికి 9.9 కిలోమీటర్ల దిగువన ఉన్నట్లు తెలిపింది.

ఇవి కూడా చదవండి:
- తుర్కియే, సిరియా: 'ఇది భూకంపం... అందరూ దగ్గరికి రండి, కలిసి చనిపోదాం'
- తుర్కియే-సిరియా: భూకంపానికి కారణం ఏంటి... ఇంత విలయాన్ని ఎందుకు సృష్టించింది?
- అదానీ గ్రూప్ వారం రోజుల్లో లక్షల కోట్లు నష్టపోయింది... మరి లాభపడింది ఎవరు?
- ఆంధ్రప్రదేశ్- విశాఖలో రుషికొండను గ్రీన్ మ్యాట్-తో కప్పేయడం వెనుక మతలబు ఏంటి-
- నందాదేవి: ఆ సరస్సులో మానవ అస్థికలు, పర్వత పుత్రిక ఉగ్రరూపం... ఏమిటీ కథ?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










