ఆంధ్రప్రదేశ్: విశాఖలో రుషికొండను గ్రీన్ మ్యాట్‌తో కప్పేయడం వెనుక మతలబు ఏంటి?

రుషికొండ
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

రుషికొండ అకస్మాత్తుగా పచ్చగా కనిపిస్తోంది. నిన్నటివరకు తొలిచేసినట్లుగా కనిపించిన రుషికొండపై కొంతభాగం పచ్చగా మారిపోయింది.

ఇప్పుడు దూరం నుంచి చూస్తే కొండ మొత్తం పచ్చగా కనిపిస్తోంది. తవ్వేసినట్లుగా కనిపించకుండా కొండపై గ్రీన్ మ్యాట్‌ను పరిచేయడంతో ఈ పచ్చదనం పరుచుకుంది.

గ్రీన్ మ్యాట్ వేయకముందు కొండను తొలిచిన ప్రదేశంలో స్పష్టంగా తవ్వినట్లుగా కనిపించేది.

ఇప్పుడు తవ్విన ప్రాంతం మీద కూడా పచ్చని మ్యాట్ పరిచారు. కొండంత పచ్చగా కనిపించేలా చేశారు.

రుషికొండ

కొరవడిన స్పష్టత

విశాఖపట్నంలోని రుషికొండపై నూతన కాటేజీల నిర్మాణం కోసం కొండలను తవ్వేసే పనులు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో గత ఏడాది నుంచి జరుగుతున్నాయి.

కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జెడ్) నిబంధనలు పాటించకుండా రుషికొండ మొత్తాన్ని తవ్వేస్తూ ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నారంటూ హైకోర్టుతో పాటు గ్రీన్ ట్రిబ్యునల్‌లో కూడా కొందరు పర్యావరణవేత్తలు, రాజకీయ నాయకులు కేసులు వేశారు.

దీనిపై ప్రభుత్వం అనేక సార్లు వివరణలు ఇచ్చింది. అయితే, ఏ వివరణ కూడా సంతృప్తికరంగా లేదు.

ఒకసారి కాటేజీల విస్తరణ పనులని, మరోసారి ముఖ్యమంత్రి కార్యాలయాల కోసమే నిర్మాణాలు చేస్తున్నాం... అయితే తప్పేంటి అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అంతేతప్ప అక్కడ జరుగుతున్నదానిపై ఏ అధికారి, మంత్రి కూడా స్పష్టత ఇవ్వలేదు.

రుషికొండ

పచ్చగా కనిపిస్తోన్న రుషికొండ

శనివారం నుంచి రుషికొండ మొత్తం పచ్చగా కనిపిస్తున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

విశాఖలో వచ్చే నెలలో జరుగనున్న జి-20 సదస్సు కోసం అంతర్జాతీయ ప్రతినిధులు ఇక్కడకు రానున్నారు. రుషికొండపై ప్రభుత్వం చేసిన ప్రకృతి విధ్వంసం ప్రతినిధుల కంట పడకుండా ఉండేందుకే ఇలా చేశారంటూ సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి.

రుషికొండపై పనులను ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ) పర్యవేక్షిస్తోంది.

నిర్మాణ పనులు జరుగుతుండటంతో పాటు అక్కడ మళ్లీ మొక్కలను వేసేందుకు వీలుగా జియోమ్యాటింగ్ (Geomatting) పనులు చేస్తున్నామని పర్యాటకశాఖ అధికారులు చెబుతున్నారు.

రుషికొండ

జియోమ్యాటింగ్ ఎందుకు?

జియోమ్యాటింగ్ చేయడం ద్వారా కొండను తొలిచిన భాగాల నుంచి మట్టి, రాళ్లు కింద పడకుండా ఉంటాయని, మొక్కలు మళ్లీ పెరిగేందుకు ఇది దోహదపడుతుందని అధికారులు చెబుతున్నారు.

కొండ పరిరక్షణ పనుల్లో భాగంగానే ఈ మ్యాటింగ్ చేశామని ఏపీటీడీసీ అధికారులు అంటున్నారు.

ఇప్పటి వరకు కొండపై కొంత భాగం జియోమ్యాటింగ్ చేశామని, రాబోయే రోజుల్లో మిగిలిన భాగాల్లోనూ ఇదే విధంగా జియోమ్యాటింగ్ చేస్తామని వారు చెబుతున్నారు.

జియోమ్యాటింగ్ వల్ల పచ్చదనం పెరుగుతుందని వారు అంచనా వేస్తున్నారు.

వీడియో క్యాప్షన్, జగన్ విశాఖ టూర్ : సీఎం వస్తున్నారని చెట్లు నరికేశారు, నిబంధనలను పట్టించుకోరా?

‘సూర్యరశ్మిని, నీటిని గ్రహిస్తుంది’

రుషికొండపై జియోమ్యాటింగ్ పనులను కాంట్రాక్టు కంపెనీతో పాటు పర్యాటక శాఖ కూడా పర్యవేక్షిస్తోంది. పర్యాటకశాఖ తరపున అక్కడ పర్యవేక్షణ పనుల్లో పాల్గొన్న ఉద్యోగి పి. రాజశేఖర్ బీబీసీతో మాట్లాడారు.

‘జియోమ్యాటింగ్ అనేది సాధారణంగా జరిగేదే. ప్రధానంగా వృక్ష సంపద పెరుగుదలకు, భూక్షయాన్ని నివారించేందుకు ఇది ఉపయోగపడుతుంది. రుషికొండపై ఇంకా నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

ఇలాంటి సందర్భంలో రాళ్లు, మట్టి కిందకు జారి అక్కడున్న మొక్కల వరుసలు దెబ్బతింటున్నాయి.

అటువంటి వాటికి రక్షణగా కూడా ఈ జియోమ్యాటింగ్ ఉపయోగపడుతుంది. జియోమ్యాటింగ్ ఉన్న చోట నీరు, సూర్యరశ్మి గ్రహించుకునే శక్తి పెరుగుతుంది.

పర్యావరణానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించేందుకే జియో మ్యాటింగ్‌ను వాడతారు” అని రాజశేఖర్ చెప్పారు.

వీడియో క్యాప్షన్, బాపట్ల అగ్రికల్చరల్ కాలేజ్:సన్నబియ్యం సాంబ మసూరీ పుట్టినిల్లయిన ఈ కాలేజీ ప్రత్యేకత ఏమిటి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)