వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసిన మంగళగిరి క్రికెట్ స్టేడియం నేటికీ ఎందుకు పూర్తి కాలేదు?
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
భారత క్రికెట్ జట్టులో ఆంధ్రప్రదేశ్ ఆటగాళ్లు అరుదుగా కనిపిస్తుంటారు. జాతీయ జట్టులో స్థానం దక్కించుకొనే స్థాయిలో క్రీడాకారులు నైపుణ్యాలు పెంచుకోవాలంటే వారికి స్థానికంగా తగినన్ని సదుపాయాలు, వనరులు ఉండటం అవసరం.
అలాంటి సదుపాయాల్లో మంచి ఇంటర్నేషనల్ స్టేడియం ఒకటి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్ అభివృద్ధి కోసం మంగళగిరి స్టేడియం నిర్మాణానికి ప్రణాళికలు రచించారు. అందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 24 ఎకరాల భూమి కేటాయించింది.
2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి దీనికి శంకుస్థాపన చేశారు. 2009లో పనులు మొదలయ్యాయి. ఇతర రాష్ట్రాల్లో దీని కన్నా వెనక పనులు మొదలైన కొన్ని స్టేడియాల నిర్మాణం పూర్తయి అందుబాటులోకి కూడా వచ్చాయి.
మంగళగిరి స్టేడియం నిర్మాణంలో మాత్రం 13 ఏళ్లు దాటినా ఆశించిన పురోగతి కనిపించడం లేదు. ఆటగాళ్లకు, క్రికెట్ అభిమానులకు ఎదురుచూపులు తప్పడం లేదు.
నిధుల లేమి, ఇతర సమస్యలతోనే నిర్మాణం ఆలస్యమైందని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) చెబుతోంది. ఇప్పటికే పలు సదుపాయాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ కీలకమైన స్టేడియం పూర్తికాలేదు. దానికి అవసరమైన నిధులు సమీకరించి, స్టేడియం పనులు పూర్తి చేస్తామని ఏసీఏ ప్రతినిధులు చెబుతున్నారు.
ప్రభుత్వం కూడా స్టేడియం వద్ద అవసరమైన మౌలిక వసతుల కల్పన మీద దృష్టి సారించాల్సి ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో రెండోది
ఇటీవల న్యూజీలాండ్‌తో టీమిండియా ఆడిన వన్డే మ్యాచుల వేదికల్లో రాయ్‌పూర్ స్టేడియం ఒకటి. అది దేశంలోనే 50వ అంతర్జాతీయ క్రికెట్ వేదిక. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క స్టేడియమే ఉంది. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి- ఏసీఏ స్టేడియం ఇప్పటికే పలు అంతర్జాతీయ మ్యాచులకు ఆతిథ్యం ఇచ్చింది. రొటేషన్ పద్ధతిలో బీసీసీఐ ప్రతీ క్రికెట్ బోర్డుకు మ్యాచులు కేటాయిస్తుంది. ఆ క్రమంలో ఏసీఏకి వచ్చే అవకాశాలను విశాఖ స్టేడియం ద్వారా పూర్తి చేస్తున్నారు.
విజయవాడ, గుంటూరు నగరాల మధ్య అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించాలని 2004లోనే ప్రతిపాదనలు వచ్చాయి. ఆ తర్వాత ప్రభుత్వం మంగళగిరి మండలం నవులూరు ఉడా కాలనీలో ఇందుకోసం 20 ఎకరాలు కేటాయించింది. 2009లో పనులు మొదలయ్యాయి.
అప్పట్లో రూ. 50 కోట్లు వెచ్చించి స్టేడియం నిర్మాణం పూర్తి చేయాలని ప్రతిపాదించారు. మంగళగిరి స్టేడియం ఆంధ్రప్రదేశ్‌లోనే అతిపెద్ద స్టేడియం కానుంది. ఇందులో 40 వేల మంది కెపాసిటీతో స్టాండ్స్ సిద్ధం చేస్తున్నారు. స్టేడియం పనులు 2013 నుంచి వేగవంతమయ్యాయి. అయితే మంగళగిరి స్టేడియం కన్నా వెనుక పనులు మొదలయిన అహ్మాదాబాద్, తిరువనంతపురం వంటి స్టేడియాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. మ్యాచులు కూడా జరుగుతున్నాయి.
మంగళగిరిలో గ్రౌండ్ ఆధునిక హంగులతో రూపుదిద్దుకుంటోంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ఉండడంతో వర్షం వచ్చినప్పటికీ, అది ఆగిన అరగంటలోపు మళ్లీ మ్యాచ్ ఆడేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ప్రమాణాలకు అనుగుణంగా పిచ్‌లు, గ్రౌండ్ అందుబాటులోకి వచ్చాయి.
డ్రెస్సింగ్ రూమ్స్‌ను ఇటీవల ప్రారంభించారు. ప్రాక్టీస్ గ్రౌండ్, నెట్ ప్రాక్టీస్ సదుపాయం, ఇండోర్ ప్రాక్టీస్ ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. ఆటగాళ్లకు జిమ్ వంటివి కూడా ఉన్నాయి.

ఇంకేం కావాలి?
అంతర్జాతీయ మ్యాచ్‌లు, ఐపీఎల్ లాంటి మ్యాచులు ఆడేందుకు వీలుగా స్టేడియం సిద్ధం చేయాల్సి ఉంది. సీటింగ్ సదుపాయం, స్టాండ్స్ నిర్మాణం జరగాలి. వీఐపీ గ్యాలరీలు లాంటివి సిద్ధం చేయాలి.
ఫ్లడ్ లైట్ల పనులు ఇంకా ప్రారంభమే కాలేదు. ఇప్పటి వరకూ ఈ స్టేడియం నిర్మాణం కోసం రూ. 60 కోట్ల వరకూ ఖర్చు చేసినట్టు స్టేడియం మేనేజర్ భాస్కర్ బీబీసీకి తెలిపారు. పూర్తిగా సిద్ధం చేయాలంటే మరో రూ.30 కోట్ల వరకూ అవసరం ఉంటుందని ఆయన తెలిపారు.
స్టేడియం నిర్మాణం పూర్తయ్యి, ఆడేందుకు అన్ని ప్రమాణాలతో సిద్ధం చేస్తే మొత్తం నిర్మాణ వ్యయంలో సగం బీసీసీఐ చెల్లిస్తుంది. మౌలిక సదుపాయాల కల్పన పేరుతో బీసీసీఐ నుంచి నిధులు తిరిగి చెల్లిస్తారు.
తొలుత నిధులు వెచ్చించి, స్టేడియం పూర్తి చేసేందుకు అవకాశం లేకపోవడంతోనే ఆలస్యమవుతోందని ఏసీఏ సీఈవో శివారెడ్డి బీబీసీకి తెలిపారు.
"ఆంధ్రా క్రికెట్ అభివృద్ధికి ప్రయత్నాలు చేస్తున్నాం. అన్ని జిల్లాల్లోనూ సదుపాయాలు మెరుగుపరుస్తున్నాం. అందుకే నిధులు ఒకే చోట కేంద్రీకరించి స్టేడియం పూర్తి చేయడానికి ఆటంకం అవుతోంది. అయినా వీలయినంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికే కొన్ని అంతర్రాష్ట్ర జోనల్ మ్యాచులు జరుగుతున్నాయి. వుమెన్ క్రికెటర్లకు శిక్షణ కూడా నడుస్తోంది. కాబట్టి త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తాం" అంటూ ఆయన బీబీసీకి వివరించారు.

ప్రభుత్వం ఏం చేయాలి?
మంగళగిరి స్టేడియం అందుబాటులోకి రావాలంటే ఏపీ ప్రభుత్వం కూడా తగిన శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత, రాజధాని ప్రాంతానికి ఆనుకుని ఉన్న స్టేడియం కాబట్టి ఇది త్వరగా పూర్తవుతుందనే ఆశాభావం స్థానికంగా వ్యక్తమైంది. తొలుత కొన్ని పనులు వేగంగా జరిగినా, తర్వాత పడకేశాయి.
ప్రధానంగా స్టేడియానికి వెళ్లే మార్గాన్ని ప్రభుత్వం సిద్ధం చేయాల్సి ఉంటుంది. మంగళగిరి నుంచి స్టేడియానికి వెళ్లేందుకు రైల్వే ట్రాక్ పై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేయాల్సి ఉంటుంది. అందుకు గతంలోనే ప్రతిపాదనలు సిద్ధం చేసినా ఆచరణ రూపం దాల్చలేదు.
స్టేడియం వరకూ రోడ్డు నిర్మాణానికి కొన్ని పనులు చేశారు. డివైడర్లు ఏర్పాటు చేసి రోడ్డు పనులు చేసినా ప్రస్తుతం అవన్నీ శిథిలమైపోయాయి.
మంగళగిరి-తాడేపల్లి మునిసిపల్ కార్పోరేషన్‌కు చెందిన డంపింగ్ యార్డ్ కూడా సమీపంలోనే ఉంది. దానిని వేరే చోటకు తరలించాలని గతంలో ఆలోచన చేశారు. అయినా అడుగులు పడలేదు. వీటిని పూర్తి చేయకుండా మంగళగిరి స్టేడియం ఉపయోగంలోకి వచ్చే అవకాశాలు తక్కువ.
ఆంధ్రప్రదేశ్‌లో క్రీడాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని మంగళగిరి స్టేడియం పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేందుకు ఏసీఏకి అన్ని విధాలా సహకరిస్తామని ఏపీ క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్‌కే రోజా తెలిపారు.

ఎదురుచూపులు ఎన్నాళ్లు?
ఆంధ్రాలో అనేక మంది క్రికెటర్లు ఉన్నప్పటికీ అంతర్జాతీయ లేదా ఐపీఎల్ వంటి వాటికి కూడా ఎంపిక కాకపోవడానికి తగిన ఎక్స్‌పోజర్ లేకపోవడమే కారణమని యువ క్రీడాకారులు అభిప్రాయపడుతున్నారు.
"మంగళగిరి ఇంటర్నేషనల్ స్టేడియం పూర్తయితే అన్ని ప్రాంతాల నుంచి ప్లేయర్స్ వస్తారు. నెట్ బౌలర్లుగా వెళ్లినా మా టాలెంట్ అందరికీ అర్థమవుతుంది. జట్లలోకి ఎంపికయ్యేందుకు అవకాశం వస్తుంది. విజయవాడలో ఉన్న ఏకైక స్టేడియం ఇతర అవసరాలకు వాడుతున్నారు. మాకు ప్రాక్టీస్ చేద్దామంటే చోటు లేదు. కాబట్టి మంగళగిరి స్టేడియం పూర్తి చేస్తే మాలాంటి వారికి ఉపయోగపడుతుంది" అని ఆర్.యశ్వంత్ అనే ఆటగాడు బీబీసీతో చెప్పారు.
కేరళ లాంటి రాష్ట్రంలోనే రెండు ఇంటర్నేషనల్ స్టేడియాలు ఉంటే ఏపీలో ఒక్కటి మాత్రమే ఉందని క్రికెట్ కోచ్ ఆర్.రమేశ్ వ్యాఖ్యానించారు.
"నేను రంజీ జట్టుకు పోటీపడే కాలంలో విజయనగరం వెళ్లి మ్యాచులు ఆడాల్సి వచ్చేది. ఇప్పటికీ ఏపీ రంజీ మ్యాచులు అక్కడే జరుగుతున్నాయి. ఇంకేం వస్తారు నేషనల్ ప్లేయర్లు. అన్ని చోట్లా ఉన్న గ్రౌండ్స్‌ను అభివృద్ధి చేసుకుంటూ, మంగళగిరి స్టేడియం ముందుగా సిద్ధం చేస్తే అటు ఐపీఎల్‌తో పాటుగా వుమెన్ ప్లేయర్లు కూడా ఎక్కువగా రాణించేందుకు అవకాశం వస్తుంది. ఏసీఏ, ప్రభుత్వం సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది" అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎదురుచూపులు చూడాల్సిన అవసరం లేకుండా స్టేడియాన్ని పూర్తి చేయాలని ఏసీఏను రమేశ్ కోరారు.
ఇవి కూడా చదవండి:
- కల్పనా చావ్లా: కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ కూలిపోతుందని నాసాకు ముందే తెలుసా... ఆ రోజు ఏం జరిగింది
- అదానీ గ్రూప్: ఎల్ఐసీ పెట్టుబడులపై ప్రశ్నలు ఎందుకు వినిపిస్తున్నాయి
- నిన్న ఆనం, నేడు కోటంరెడ్డి... నెల్లూరు వైసీపీ నేతల్లో అసంతృప్తి పెరుగుతోందా
- దావూద్ ఇబ్రహీం: మాఫియా డాన్ హైదరాబాద్ గుట్కా కంపెనీ కథ ఏమిటి? మాణిక్ చంద్, జేఎం జోషి వివాదంలో దావూద్ పాత్ర ఏమిటి?
- పాకిస్తాన్: కిలో ఉల్లిపాయలు రూ.250... ‘కోయకుండానే కళ్లల్లో నీళ్లు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















