దావూద్ ఇబ్రహీం: మాఫియా డాన్ హైదరాబాద్ గుట్కా కంపెనీ కథ ఏమిటి? మాణిక్ చంద్, జేఎం జోషి వివాదంలో దావూద్ పాత్ర ఏమిటి?

ఫొటో సోర్స్, BHAWAN SINGH/THE THE INDIA TODAY GROUP VIA GETTY I
- రచయిత, వినీత్ ఖరే
- హోదా, బీబీసీ ప్రతినిధి
ముంబైలో వ్యాపారాలకు, నేరాలకు ఎంత దగ్గర సంబంధాలు ఉంటాయన్నది తెలియంది కాదు. అలాంటి నేరాలకు సంబంధించిన ఒక ముఖ్యమైన కేసులో ఈ నెలలో తీర్పు వచ్చింది.
ఇది గుట్కా తయారీ కంపెనీలకు చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలు జగ్‌దీష్ ప్రసాద్ మోహన్‌లాల్ (జేఎం) జోషి, రాసిక్‌లాల్ మానిక్ చంద్ దారివాల్ మధ్య వివాదానికి చెందిన కేసు.
ఈ ఇద్దరి మధ్య వివాదానికి మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం కీలక పాత్ర పోషించినట్టు దర్యాప్తు సంస్థ చెబుతోంది. దావూద్ ఇబ్రహీం బంధువులు, ఇతర సాక్ష్యాధారాలను పరిశీలించిన అనంతరం జేఎం జోషికి కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
ముంబైలోని ప్రత్యేక కోర్టు జేఎం జోషికి పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో మరో వ్యాపారవేత్త అయిన దారివాల్ 2017లో మరణించారు.
ఈ కేసులో మరో ఇద్దరు వ్యక్తులకు ఐపీసీ, ఎంసీఓసీఏ సెక్షన్ల కింద చెరో పదేళ్ల చొప్పున శిక్షలు విధిస్తున్నట్టు ముంబై ప్రత్యేక కోర్టు తెలిపింది.
జోషి, దారివాల్‌లు ఇద్దరూ తమ వివాదాన్ని అండర్ వరల్డ్ డాన్ దావూద్, ఆయన సోదరుడు అనీస్ ఇబ్రహీంల వద్ద పరిష్కరించుకుని, డబ్బులు కూడా ముట్టిజెప్పినట్టు సాక్ష్యాధారాలున్నాయని ముంబై ప్రత్యేక కోర్టు తన 242 పేజీల ఆర్డర్‌లో పేర్కొంది.
దీనికి బదులుగా దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లోని హైదరాబాద్‌లో గుట్కా ఫ్యాక్టరీని ప్రారంభించుకునేందుకు, అధికారిక నేరాల నుంచి స్థిరమైన ఆదాయం సంపాదించుకునే మార్గాన్ని ఏర్పాటు చేసుకునేందుకు జేఎం జోషి సాయపడ్డారని పేర్కొంది. ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై తాము హైకోర్టులో అప్పీల్‌కి వెళ్తామని జేఎం జోషి న్యాయవాది సుదీప్ పస్బోలా అంటున్నారు.
ఈ ఆదేశాలు చాలా ముఖ్యమైనవని ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రదీప్ ఘరాత్ అన్నారు. , కానీ ముంబైలో అండర్ వరల్డ్ ప్రభావాన్ని ఇవి తగ్గిస్తాయని తాను అనుకోవడం లేదని చెప్పారు. ఈ ఆదేశాలు, పోలీసులు తీసుకునే చర్యల ద్వారానే నేరాలకు అడ్డుకట్ట వేస్తున్న సంకేతాలను ఇవ్వొచ్చన్నారు.
2001లో దీనిపై కేసు నమోదవ్వగా, 2004లో సీబీఐ విచారణ ప్రారంభించినట్టు ఘరాత్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
కానీ, ఇదంతా ఎలా జరిగింది? జేఎం జోషికి, దారివాల్‌కి మధ్య వివాదం ఎలా వచ్చింది? దావూద్ ఇబ్రహీం, అనీష్ ఇబ్రహీం వీరి వివాదంలోకి ఎలా వచ్చారు? పాకిస్తాన్‌లోని హైదరాబాద్‌లో గుట్కా ఫ్యాక్టరీ ఏంటి? అనే చాలా ప్రశ్నలు మీ మెదళ్లలో మెదలుతూ ఉంటాయి.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పిన వివరాల ప్రకారం, జేఎం జోషి, రాసిక్‌లాల్ మానిక్ చంద్దారివాల్‌లు ఇద్దరూ 1988 నుంచి దారివాల్ టుబాకో ప్రొడక్ట్స్ లిమిటెడ్‌ను నడిపేవారు. ఆ కంపెనీలో జేఎం జోషి కంపెనీ డైరెక్టర్. వివిధ రకాల రుచులను కలుపడంలో అతను నిపుణుడు.
జేఎం జోషికి తాను చేసే పనికి కంపెనీలో తొలుత జీతం చెల్లించేవారని కోర్టు డాక్యుమెంట్లలో తెలిసింది. ఆ తర్వాత కంపెనీలో 10 శాతం వాటాను ఇస్తానని రాసిక్‌లాల్ మానిక్ చంద్ దారివాల్ వాగ్దానం చేసినట్టు జేఎం జోషి తెలిపారు.
ఈ షేర్లను మరో 10 శాతం పెంచిన దారివాల్ మొత్తంగా 20 శాతం వాటాలను ఇస్తానని వాగ్దానం చేశాడని జోషి చెప్పారు. కానీ, ఆ వాగ్దానాన్ని దారివాల్ నిలబెట్టుకోలేదని జేఎం జోషి ఆరోపించాడు.
తనకు రూ. 259 కోట్లు పొందే అర్హత ఉందని, కానీ, ఎన్నిసార్లు అడిగినా ఆ మొత్తాన్ని ఇవ్వలేదని జేఎం జోషి కోర్టుకు చెప్పాడు. ఆ తర్వాత 1996లో కంపెనీ నుంచి జేఎం జోషి వైదొలిగాడు.
దారివాల్‌కి దావూద్ ఇబ్రహీంతో ప్రమేయమున్న గోల్డెన్ బాక్స్ ట్రేడ్ కంపెనీతో సంబంధాలున్నాయని కోర్టు సాక్ష్యాధారాల్లో స్పష్టమైంది. ఈ కంపెనీ యజమాని దావూద్ ఇబ్రహీం కుటుంబ సభ్యుడు.
ప్రాసిక్యూషన్ సమర్పించిన వివరాల ప్రకారం, 1999 ఆగస్టులో జేఎం జోషిని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఉన్న గోల్డెన్ బాక్స్ ఆఫీసుకి రప్పించారు. దారివాల్ టుబాకో లిమిటెడ్‌లో అతను పొందిన షేర్లన్నంటిన్ని తిరిగి ఇచ్చేయమన్నారు. అదనపు షేర్ల కోసం గొడవ చేయొద్దని హెచ్చరించారు.
ఆ సమయంలో దావూద్ ఇబ్రహీం సోదరుడు అనీష్ ఇబ్రహీం, జేఎం జోషిని బెదిరించాడని, కొట్టాడని, దారివాల్‌కి సహకరించాలని హెచ్చరించినట్టు కోర్టు డాక్యుమెంట్లలో పేర్కొన్నారు.

మధ్యవర్తిగా దావూద్ ఇబ్రహీం
అనీష్ కుటుంబానికి చెందిన తన చిన్ననాటి స్నేహితుడిని కలిసి జేఎం జోషి, తన బాధను కూడా అనీష్ ఇబ్రహీం చెప్పాలని కోరాడని ప్రాసిక్యూషన్ తెలిపారు. సెప్టెంబర్ 1999లో దుబాయ్‌లో సమావేశమై, తన స్టోరీని జేఎం జోషి వారికి చెప్పుకున్నాడు. దారివాల్ తనకెలా షేర్లు ఇవ్వకుండా మోసం చేశాడో ఈ ఉగ్రవాదులకు చెప్పుకున్నాడని ప్రాసిక్యూషన్ తెలిపింది.
ఆ తర్వాత, కరాచిలో దావూద్ ఇబ్రహీం జోక్యంతో రూ.259 కోట్లకు బదులు కేవలం రూ.11 కోట్లతో జేఎం జోషి వివాదాన్ని సెటిల్ చేశారు. కానీ అక్కడితో ఆ సమస్య ముగిసిపోలేదు.
ఈ సహాయానికి బదులుగా దావూద్ ఇబ్రహీం, అనీష్ ఇబ్రహీంలు పాకిస్తాన్‌లోని హైదరాబాద్ నగరంలో గుట్కా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసేందుకు జేఎం జోషి సాయపడ్డాడు. దీని ద్వారా అండర్ వరల్డ్ డాన్ స్థిరమైన ఆదాయం సంపాదించే మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.
ఆ తర్వాత జూలై 2000లో బ్యాంకాక్‌లో పని చేసేందుకు అని చెప్పి ఒక వ్యక్తి (ప్రాసిక్యూషన్ సాక్షి 32)ని దుబాయ్ మీదుగా కరాచికి తరలించారు. అతన్ని అక్కడి నుంచి సింధ్ ప్రావిన్స్ రాజధాని హైదరాబాద్ తీసుకెళ్లారు.
గుట్కా ఫ్యాక్టరీలో పనిచేసేందుకు అతన్ని అక్కడి పంపారు. అతన్ని హైదరాబాద్‌లోని సర్వెంట్ క్వార్టర్స్‌లో ఉంచారు. తన కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు కూడా అతనికి అనుమతి ఇవ్వలేదని ప్రాసిక్యూషన్ కోర్టు డాక్యుమెంట్లలో తెలిపింది.
జేఎం జోషి కంపెనీలో పనిచేసిన ఇతను తన కుటుంబ సభ్యులను కలిసేందుకు భారత్‌కు వచ్చానని, కానీ ఆ సమయంలో ఒకవేళ పాకిస్తాన్‌కి తిరిగి రాకపోతే భారత్‌లో ఎన్‌కౌంటర్ చేసి చంపుతామని బెదిరించారని ప్రాసిక్యూషన్ సాక్షి కోర్టులో చెప్పాడు.

ఫొటో సోర్స్, Getty Images
గుట్కా ప్యాకింగ్ మెషిన్ తరలింపు
పాకిస్తాన్‌లో గుట్కా ఫ్యాక్టరీని ప్రారంభించడం ద్వారా, దుబాయ్ మార్గంలో భారత్ నుంచి పాకిస్తాన్‌కి రూ. 2,64,000 విలువైన ఐదు గుట్కా ప్యాకెట్ల మెషిన్లను పంపించారు.
పాకిస్తాన్‌లో నివసించిన ఈ సాక్షి, 2006 మార్చి 16న తిరిగి భారత్‌కు తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి తన ఇంట్లోనే ఉంటూ, సెక్యూరిటీ కారణాలతో తన పేరును బయటికి చెప్పుకోవడం లేదని కోర్టుకి చెప్పాడు.
అయితే, పాకిస్తాన్ వెళ్లి, నివసించేందుకు అతనికి ఎలాంటి డాక్యుమెంటరీ ప్రూఫ్ లేదు. పాకిస్తాన్ వెళ్లేందుకు లేదా అక్కడి నుంచి వచ్చేందుకు తన పాస్‌పోర్టుపై ఎలాంటి స్టాంప్ వేసే వారు కాదని కోర్టు డాక్యుమెంట్‌లో పేర్కొన్నాడు.
పాకిస్తాన్ వెళ్లినప్పుడు తన టిక్కెట్, పాస్‌పోర్టు తీసేసుకునే వారని, ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చేటప్పుడు వాటిని ఇచ్చేవారని సాక్షి చెప్పాడు.
గుట్కా ఫ్యాక్టరీ ప్రారంభించేందుకు సాయపడటం నేరం కాదని, కానీ ప్రపంచ ఉగ్రవాదులని తెలిసి కూడా దావూద్ ఇబ్రహీం, అనీష్ ఇబ్రహీంలకి సాయపడి గుట్కా ఫ్యాక్టరీ ఏర్పాటులో సాయపడటం నేరమని కోర్టు తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
జేఎం జోషి వాదన
ఈ క్రైమ్ చేసేందుకు తన క్లయింట్‌కి ఎలాంటి ప్రమేయం లేదని జేఎం జోషి న్యాయవాది సుదీప్ కోర్టుకి చెప్పారు. పైగా కంపెనీలో తన షేర్లను తిరిగి ఇచ్చేయాలని బెదిరించారని అన్నారు.
రూ.259 కోట్లకు బదులు కేవలం రూ.11 కోట్లను మాత్రమే జేఎం జోషి తీసుకున్నాడని ప్రాసిక్యూషన్ వాదనను అంగీకరిస్తే, అది తన ప్రమేయంతో జరగలేదని, బెదిరింపులు, బలవంతంగానే జరిగిందన్నారు.
హైదరాబాద్‌లో గుట్కా ఫ్యాక్టరీ ప్రారంభించేందుకు జేఎం జోషి బాధ్యత కాదని, అది కేవలం ఒత్తిడితోనే జరిగిందని, బలవంతంగా తనతో ఈ పని చేయించుటారని అన్నారు.
ఈ పరిస్థితుల్లో జేఎం జోషి ఇరుక్కుపోయి బాధితుడిగా మారాడని సుదీప్ కోర్టుకి తెలిపారు. అనీష్ ఇబ్రహీం నుంచి వచ్చిన బెదిరింపుల వల్లనే ఈ నేరంలో భాగం కావాల్సి వచ్చిందని, తన ప్రాణాన్ని కాపాడుకోవడానికే జేఎం జోషి ఇలా చేశారని సుదీప్ చెప్పారు.
‘‘జేఎం జోషి గౌరప్రదమైన వ్యాపారవేత్త. ఇతనికి చాలా పరిశ్రమలున్నాయి. వందలాది మందికి ఇతను ఉపాధి కల్పిస్తున్నారు. ఈయన ఎగుమతుల వ్యాపారం ద్వారా విలువైన విదేశీ మారకపు నిల్వలు పెరుగుతున్నాయి’’ అని జేఎం జోషి లాయర్ కోర్టుకి చెప్పారు.
ప్రాసిక్యూషన్ ప్రవేశపెట్టిన సాక్షి-32పై సుదీప్ పస్బోలా పలు ప్రశ్నలు లేవనెత్తారు. అతని రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు లేవని, భారత్ నుంచి అతను ఆరుసార్లు దుబాయ్‌కి వెళ్లి వచ్చాడని సుదీప్ పస్బోలా చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా దుబాయ్‌లో ఉన్నారని, పాకిస్తాన్ హైదరాబాద్‌లో అతన్ని బంధించారని చెబుతున్న మాటలు నమ్మకం కలిగించేలా లేవని అన్నారు.
వీసా లేకుండా ముంబై నుంచి కరాచికి వెళ్లలేడని సుదీప్ పస్బోలా అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రెండుసార్లు పాకిస్తాన్ వెళ్లిన జేఎం జోషి, దారివాల్
‘‘దేశంలో నివసిస్తున్నప్పుడు ప్రభుత్వంపై నీకు నమ్మకం ఉండాలి. ఒకవేళ మీ ప్రాణం ప్రమాదంలో ఉందని అనిపిస్తే, పోలీసుల వద్ద ఫిర్యాదు దాఖలు చేయొచ్చు. మీ ప్రాణం ప్రమాదంలో ఉన్నా మీరు ఆయుధాలను పట్టుకునేందుకు చట్టం అనుమతించదు’’ అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రదీప్ ఘరాత్ అన్నారు.
జేఎం జోషి, దారివాల్ రెండుసార్లు పాకిస్తాన్ వెళ్లారని, ఫ్యాక్టరీ ప్రారంభంలో కూడా వారు పాల్గొన్నారని చెప్పారు.
ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడంలో, ఆ ఫ్యాక్టరీ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు, ముడి సరుకుల విషయంలో, గుట్కా ఫార్ములా ఇవ్వడంలో జేఎం జోషి ముఖ్య పాత్ర పోషించారని ప్రదీప్ ఘరాత్ తెలిపారు.
అప్పీల్‌కి చెందిన కాపీ ఇంకా తాము పొందలేదని, ఒకవేళ హైకోర్టు అతని అప్పీల్‌ని అంగీకరిస్తే, జేఎం జోషి బెయిల్‌కి దరఖాస్తు చేసుకోవచ్చని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పారు.
అధికారిక నేరాలు చట్టవిరుద్ధమైన చర్యగా పరిగణించాలా? వద్దా? అనేది ఈ కేసులో అత్యంత ముఖ్యమైనదిగా కోర్టులో తన ఆదేశాల్లో ఒక దగ్గర పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














