భారత్-పాకిస్తాన్‌ల మధ్య దూరాన్ని, ద్వేషాన్ని యుఏఈ తగ్గించగలదా?

భారత్-పాకిస్తాన్‌

ఫొటో సోర్స్, RAVEENDRAN/AFP VIA GETTY

    • రచయిత, వికాస్ త్రివేది
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అది 2019 ఫిబ్రవరి 14. భారత సైనికులతో కూడిన బస్సు కశ్మీర్ గుండా వెళుతోంది. పుల్వామా నగరంలో పేలుడు పదార్థాలు నింపుకున్న ఒక కారు బస్సుపైకి దూసుకెళ్లింది. ఈ ఆత్మాహుతి దాడిలో 40 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 

2019 ఫిబ్రవరి 26. పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో భారత వైమానిక దళం సర్జికల్ స్ట్రైక్ చేసిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భారత్ పగ తీర్చుకుందని, ఇంట్లోకి చొచ్చుకెళ్లి మరీ దెబ్బకొట్టిందని న్యూస్ చానల్స్ వార్తలను ప్రసారం చేశాయి. 

2019 ఆగస్టు 5. అంతకు కొద్ది రోజుల క్రితం, కశ్మీర్ సందర్శనకు, అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన వారు వెనక్కి తిరిగి వచ్చేయాలని, సొంతూళ్లకు వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేశారు. మెల్లగా కశ్మీర్‌ వాతావరణంలో నిశ్శబ్దం అలుముకుంది. భారీగా సైనికులను మోహరించారు. ఆగస్టు 5న మోదీ ప్రభుత్వం కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసినట్లు ప్రకటించింది.

గత కొన్నేళ్లుగా భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య దూరాన్ని, ద్వేషాన్ని పెంచిన మూడు ఘటనలు ఇవి. 

ఏడాదిన్నర తరువాత 2021లో అకస్మాత్తుగా భారత్, పాకిస్తాన్ సైనిక అధికారుల సమావేశం, "శాంతియుతంగా చర్చలు సాగాయని" అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా ప్రకటన, పత్తి, చక్కెర వంటి దిగుమతులపై నిషేధాన్ని తొలగించాలన్న అంశాలు తెరపైకి వచ్చాయి.

ఇరు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ దారిలోకి వస్తున్నాయని చాలామంది భావించారు. దీనికి కారణం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తీసుకున్న చొరవ అని చెప్పవచ్చు.

భారత్, పాకిస్తాన్‌ల మధ్య స్తంభించిన సంబంధాలను కదిలించిందీ దేశం.

అమెరికా గతంలో యూఏఈని 'లిటిల్ స్పార్టా'గా అభివర్ణించింది. ప్రాచీన గ్రీస్‌లో స్పార్టా నగరంలోని సైనికులకు ప్రత్యేక గౌరవం ఉండేది. వారు ధైర్యసాహసాలకు ప్రతీకగా ఉండేవారు. యూఏఈ సైనికుల ధైర్యాన్ని దృష్టిలో ఉంచుకుని అమెరికా మాజీ రక్షణ మంత్రి జిమ్ మాటిస్ యూఏఈకి ఆ పేరు పెట్టారు.

మళ్లీ 2023 జనవరిలో యూఏఈ ద్వారా భారత్, పాకిస్తాన్‌ల మధ్య సంబంధాలు మెరుగుపడతాయనే ఆశలు మొలకెత్తుతున్నాయి.

పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్

ఫొటో సోర్స్, AFP

పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ నమ్మకాలు

భారత్, పాకిస్తాన్‌ల మధ్య వైరాన్ని తగ్గించడంలో యూఏఈ మరోసారి కీలక పాత్ర పోషించగలదని విశ్లేషకులు భావిస్తున్నారు. 

పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఇటీవల చేసిన ఒక ప్రకటన ఈ విషయాన్ని తెలియజేస్తోందని అంటున్నారు. 

ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోందన్న సంగతి తెలిసిందే. షాబాజ్ షరీఫ్ అధికారం చేపట్టిన తరువాత ఇటీవల మూడవసారి యూఏఈ పర్యటనకు వెళ్లారు.

అక్కడ అల్-అరేబియా న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షరీఫ్ మాట్లాడుతూ, "భారత్, పాకిస్తాన్‌ల మధ్య సయోధ్య తీసుకురావాలని యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను కోరాను. ఆయన మాకు మిత్రుడు. భారత్‌తో కూడా ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. రెండు దేశాల మధ్య మాటలు మొదలయ్యేలా చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించగలరు. మేం హృదయపూర్వకంగా భారత్‌తో మాట్లాడతామని ఆయనకు మాటిచ్చాను" అని అన్నారు. 

"గుణపాఠాలు నేర్చుకోవడం", "శాంతి కోసం సిద్ధంగా ఉండడం" మొదలైన విషయాలు కూడా షరీఫ్ ప్రస్తావించారు.

మరోవైపు, భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ, "ఇలాంటి చర్చలకు ప్రశాంతమైన వాతావరణం ఉండాలి, ఇదే మా దృక్కోణమని" అన్నారు.

"నేను భారత ప్రధాని మోదీకి ఈ సందేశం అందించాలనుకుంటున్నాను.. రండి, మనం కలిసి కూర్చుని కశ్మీర్ వంటి నిత్యం మండే విషయాలపై సీరియస్‌గా చర్చించుకుందాం" అని షరీఫ్ అన్నారు.

ఇదంతా చూస్తుంటే యూఏఈ నిజంగానే భారత్ పాకిస్తాన్ల మధ్య సయోధ్య తీసుకురాగలదని షరీఫ్ బలంగా నమ్ముతున్నట్టు తెలుస్తోంది.

అయితే, యూఏఈ షరీఫ్ అంచనాలను అందుకోగలదా? గతంలో భారత్, పాకిస్తాన్లను ఒకచోట చేర్చడానికి యూఏఈ చేసిన ప్రయత్నాలేమిటి? భారత్-పాకిస్తాన్-యూఏఈ.. ఈ త్రయం ఎందుకు ప్రత్యేకమైనది? దీనివల్ల యూఏఈ పొందే లాభాలేమిటి? 

తెలుసుకుందాం.

భారత్, పాకిస్తాన్, యూఏఈ

ఫొటో సోర్స్, Getty Images

భారత్, పాకిస్తాన్, యూఏఈల మధ్య వాణిజ్యం

ఈ మూడు దేశాల మధ్య సంబంధాలను అర్థం చేసుకోవడానికి వాటి జనాభా, వాణిజ్యాన్ని పరీశీలిద్దాం.

యూఏఈ జనాభా దాదాపు 93 లక్షలు. ఇందులో భారతీయుల సంఖ్య సుమారు 35 లక్షలు కాగా, పాకిస్తానీయుల సంఖ్య 13 లక్షలకు పైనే ఉంది. 

వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశానికి మూడవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి యూఏఈ. 2021-22లో రెండు దేశాల మధ్య సుమారు 73 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది. వచ్చే మూడేళ్లలో ఇది 100 బిలియన్‌ డాలర్లు దాటుతుందని అంచనా. 

భారతదేశంలో పెట్టుబడి పెడుతున్న దేశాల్లో యూఏఈ ఎనిమిదవ స్థానంలో ఉంది. 2000 నుంచి 2021 వరకు భారత్‌లో సుమారు 11 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. 

మరోవైపు, భారతీయ కంపెనీలు యూఏఈలో ఇప్పటివరకు సుమారు 85 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాయని అంచనా. 

భారత్, యూఏఈకి విలువైన లోహాలు, రాళ్లు, ఆభరణాలు, ఖనిజాలు, చక్కెర, కూరగాయలు, పండ్లు, టీ, మాంసం, సీ ఫుడ్, వస్త్రాలు, ఇంజనీరింగ్, యంత్ర ఉత్పత్తులు, రసాయనాలను ఎగుమతి చేస్తుంది.

పెట్రోలియం, విలువైన లోహాలు, రాళ్లు, రత్నాలు, ఆభరణాలు, కలప, కలప ఉత్పత్తులు, ముడి చమురు మొదలైనవాటిని యూఏఈ నుంచి దిగుమతి చేసుకుంటుంది.

భారత్, యూఏఈల మధ్య మంచి స్నేహసంబంధాలు ఉన్నాయి. 2022లో మోదీ అబుదాబి వెళ్లినప్పుడు, యూఏఈ అధ్యక్షుడు అల్ నహ్యాన్ స్వయంగా విమానాశ్రయానికి వచ్చి స్వాగతం పలికారు.

అలాగే, పాకిస్తాన్‌కూ యూఏఈతో మంచి సంబంధాలు ఉన్నాయి. 2023 జనవరిలో పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ యూఏఈలో పర్యటించారు. ఆ సందర్భంగా యూఏఈ పాకిస్తాన్‌కు మూడు బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.

2021-22లో యూఏఈ, పాకిస్తాన్ల మధ్య సుమారు 10 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది. రానున్న కాలంలో ఈ వ్యాపారం మరింత పెరగవచ్చని అంచనా.

డేటా వెబ్‌సైట్ ఓఈసీ ప్రకారం, 2020లో యూఏఈ నుంచి పాకిస్తాన్‌కు ఐదున్నర బిలియన్ డాలర్ల ఎగుమతులు వెళ్లాయి. పాకిస్తాన్ నుంచి యూఏఈకి సుమారు ఒక బిలియన్ డాలర్ల ఎగుమతులు అందాయి.

యూఏఈ ప్రధానంగా చమురు, 'స్క్రాప్ ఐరన్'లను పాకిస్తాన్‌కు ఎగుమతి చేస్తుంది. పాకిస్తాన్ యూఏఈకి బంగారం, మాంసం, బియ్యం ఎగుమతి చేస్తుంది.

భారత్, పాకిస్తాన్

ఫొటో సోర్స్, TWITTER/MODI

గతంలో యూఏఈ పోషించిన పాత్ర ఏమిటి?

2019లో పుల్వామా, బాలాకోట్, ఆర్టికల్ 370ని తొలగించిన ఘటనల తరువాత భారత్-పాకిస్తాన్ మధ్య దూరం ఏర్పడింది. 

ఈ దూరాలు 2021 ఫిబ్రవరిలో తగ్గడం ప్రారంభించాయి. ఫిబ్రవరి 25న, కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి '2003 కాల్పుల విరమణ ఒప్పందాన్ని' అనుసరించాలని భారత్, పాకిస్తాన్ సైనిక అధికారులు నిర్ణయించారు. 

ఆ సమయంలోనే అప్పటి పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా.. పాత వివాదాలను మరచిపోయి కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని అన్నారు. 

ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపరుచుకునే దిశలో ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలు జరిగాయి. 

అదే సమయంలో, భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచే దిశగా యూఏఈ కూడా ప్రయత్నిస్తోందని 2021 ఏప్రిల్‌లో రాయిటర్స్ వార్తా సంస్థ ఒక నివేదికను ప్రచురించింది. ఇదే విషయమై 2021 జనవరిలో దుబాయ్‌లో భారత్, పాకిస్తాన్ అధికారుల మధ్య 'రహస్య సమావేశం' కూడా జరిగిందని పేర్కొంది.

అమెరికాలోని యూఏఈ రాయబారి యూసుఫ్ అల్-ఉతేబా, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ విషయాన్ని ధృవీకరించారు. 

“కశ్మీర్‌కు సంబంధించి భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో యూఏఈ కీలక పాత్ర పోషించింది. ఇకపై ఇరు దేశాల మధ్య 'ఆరోగ్యకరమైన' సంబంధాలు నెలకొంటాయని విశ్వసిస్తున్నాం. ఇరు దేశాలూ పరస్పరం చర్చలు జరుపుతాయని, వారి రాయబారులను ఆ దేశాల రాజధానులకు పంపుతాయని ఆశిస్తున్నాం" అని అల్-ఉతేబా అన్నారు. 

ఇది జరిగిన మూడు రోజుల తరువాత భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, అప్పటి పాక్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషీ అబుదాబి వెళ్లారు. 

2021లోనే బ్లూమ్‌బెర్గ్ కూడా ఒక నివేదికలో ఇదే విషయాన్ని ప్రస్తావించింది. యూఏఈ మధ్యవర్తిత్వంతో భారత్-పాకిస్తాన్ మధ్య శాంతి కోసం రోడ్‌మ్యాప్‌ సిద్ధమవుతోందని పేర్కొంది.

అయితే, యూఏఈ మధ్యవర్తిత్వం గురించి భారత్ అధికారికంగా ఒప్పుకోలేదు. కశ్మీర్ విషయంలో మూడవ దేశం జోక్యాన్ని ఎప్పుడూ తిరస్కరిస్తూ వచ్చింది.

యూఏఈ

ఫొటో సోర్స్, ANADOLU AGENCY

యూఏఈ ఏ దేశానికి ఎంత దగ్గరగా ఉంది?

భారత్, యూఏఈల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. ఇరుదేశాల్లో పాలకుల మధ్య సారూప్యం ఉందని, పాలనాశైలి ఒకేలాగ ఉందన్న విశ్లేషణలూ వచ్చాయి.

దుబాయ్ యువరాణి షేక్ తాలిఫాను పట్టుకునే విషయంలో భారత్, మోదీల పాత్ర ఉందని విదేశీ మీడియాలో పలు నివేదికలు వచ్చాయి. 

ఓపక్క భారత్‌కు యూఏఈతో సంబంధాలు మెరుగుపడుతుండగా, పాకిస్తాన్‌కు యూఏఈతో కొంత దూరం పెరుగుతూ వచ్చింది.

2020లో కరోనా సమయంలో పాకిస్తాన్ నుంచి వచ్చేవారికి వీసాలు మంజూరు చేయడంపై యూఏఈ తాత్కాలిక నిషేధం విధించింది. కానీ, భారత్‌పై అలాంటి నిషేధం లేదు.

ఇజ్రాయెల్-యూఏఈ శాంతి ఒప్పందం జరిగినప్పుడు పాకిస్తాన్ చేసిన ఆందోళన కూడా ఈ నిషేధానికి ఒక కారణమని నిపుణులు భావిస్తున్నారు. 

ఇవన్నీ ఉన్నప్పటికీ, ఇస్లామిక్ దేశాలుగా పాకిస్తాన్, యూఏఈల మధ్య సోదర భాదం ఎప్పటికీ నిలిచే ఉంటుంది.

సౌదీ అరేబియా, యూఏఈలకు బదులు తుర్కియే, ఖతార్‌లకు దగ్గరగా వెళ్లడం వల్ల పాకిస్తాన్ ఆర్థికంగా నష్టపోయిందని నిపుణులు భావిస్తున్నారు.

అందుకే, పాత వివాదాలను పక్కనపెట్టి యూఏఈతో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి పాకిస్తాన్ విశ్వప్రయత్నాలు చేస్తోంది.

భారతదేశం శాంతి కోరుకుంటుందని యూఏఈకి విశ్వాసం కలిగించడంలో గత ప్రభుత్వాలు సఫలమయ్యాయని జామియా యూనివర్శిటీలోని సెంటర్ ఫర్ వెస్ట్ ఏషియన్ స్టడీస్ ప్రొఫెసర్ డాక్టర్ సుజాత ఐశ్వర్య బీబీసీతో అన్నారు. 

"అంతర్గతంగా ఎన్ని వివాదాలు ఉన్నప్పటికీ, భారతదేశం సంపూర్ణ ప్రజాస్వామ్య దేశమన్న చిత్రాన్ని ప్రదర్శించడంలో ప్రభుత్వాలు విజయం సాధించాయి. ఈవిషయాన్ని యూఏఈ బలంగా నమ్ముతోంది" అని ఆమె అన్నారు. 

కశ్మీర్ విషయంలో యూఏఈ వైఖరి భారత్‌కు అనుకూలంగా ఉంది. అప్పట్లో కశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోవడానికి యూఏఈ నిరాకరించింది. 

అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ల రాకతో పాకిస్తాన్ ప్రాంతంలో తుర్కియే, ఖతార్‌ల ప్రభావం పెరుగుతుందన్న ఆందోళన యూఏఈకి ఉంది. అందుకే ఆ ప్రాంతంలో పట్టు సాధించేందుకు పాకిస్తాన్‌తో దోస్తీ పటిష్టం చేసుకోవాలనే కోరుకుంటుంది.

భారత్, పాకిస్తాన్‌

ఫొటో సోర్స్, STOCK

భారత్, పాకిస్తాన్‌ల మధ్య సంధి కుదురుతుందా?

ఈ రెండు దేశాల మధ్య సంధి కుదర్చాలని యూఏఈ తాపత్రయపడుతోంది కానీ, అందుకు ఇరు దేశాలు సిద్ధంగా ఉన్నాయా?

"యూఏఈ న్యాయంగా ఇరుదేశాల మధ్య సయోధ్య తీసుకురాగలదని భారత్, పాకిస్తాన్‌లు నమ్మాలి. అందుకు సంసిద్ధత కనబరచాలి. అప్పుడే ఇది సాధ్యమవుతుంది" అని ప్రొఫెసర్ సుజాత అన్నారు.

అయితే, భారత్ తన అంతర్గత వ్యవహారాల్లో బయట దేశం జోక్యాన్ని ఇష్టపడదు. మరి, యూఏఈ మధ్యవర్తిత్వాన్ని అంగీకరిస్తుందా? 

ఇది ద్వైపాక్షిక సంబంధాల సమస్య అని, ఇందులో మూడవ దేశం జోక్యం చేసుకోదని గతంలో చాలాసార్లు నిరూపణ అయిందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు, రక్షణ నిపుణుడు ఖమర్ ఆఘా అభిప్రాయపడ్డారు. 

"పాకిస్తాన్ ఒకసారి అమెరికాను కోరుతుంది. మరోసారి యూఏఈని కోరుతుంది. కానీ, గత ఉదాహరణలను పరిశీలిస్తే మూడవ దేశం జోక్యం చేసుకున్న సందర్భాలు లేవు. గతంలో అటల్ బిహార్ వాజ్‌పేయి భారత్ వైపు నుంచి శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నించారు. నవాజ్ షరీఫ్‌ను కలిసేందుకు ప్రధాని మోదీ పాకిస్తాన్ వెళ్లారు. చాలాసార్లు చర్చలు జరిగాయి. పరిష్కారానికి దగ్గరగా వస్తున్నారని అనిపించినప్పుడు, పాకిస్తాన్ వైపు నుంచి దాడి లేదా చొరబాటు జరుగుతుంది. చర్చలు జరగాలంటే ఉగ్రవాదాన్ని అదుపు చేయాలని భారత్ చెబుతోంది. ఉగ్రవాద సంస్థలను మూసివేయాలి. చొరబాటు ఇంకా కొనసాగుతూనే ఉంది. శిక్షణ శిబిరాలు ఇంకా కొనసాగుతున్నాయి. అలాంటప్పుడు ఇరు దేశాల మధ్య చర్చలు ఎలా సాధ్యం?" అని ఖమర్ ఆఘా ప్రశ్నిస్తున్నారు. 

కశ్మీర్ సమస్యను అంత సులువుగా పరిష్కారం కానివ్వరని ప్రొఫెసర్ సుజాత అభిప్రాయపడ్డారు.

"భారత్ మూడవ దేశం జోక్యాన్ని ఎప్పటికీ అంగీకరించదు. కశ్మీర్ సమస్య పరిష్కారం అయిపోతే దేశంలో రాజకీయాలు ఎలా నెరపాలి? పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాన్ని శాంతి చర్చల తరువాత పాకిస్తాన్‌కు అప్పగించడానికి భారత్ అంగీకరిస్తుందా? భారత్ భూభాగంలో ఉన్న కశ్మీర్‌ను పాకిస్తాన్ విడిచిపెడుతుందా? అది భారత్‌కు చెందినదని అంగీకరిస్తుందా? కశ్మీర్ సమస్య పరిష్కారం కావాలని భారత్, పాకిస్తాన్‌లు ఎప్పుడూ కోరుకోలేదు. ఎందుకంటే ఏ దేశం అంత సులువుగా రాజీ పడదు. కశ్మీర్ చిచ్చు రగులుతూనే ఉంటుంది. దాన్నలా మార్చారు" అని సుజాత అన్నారు.

యూఏఈ

ఫొటో సోర్స్, WIKTOR SZYMANOWICZ/GETTY

దీనివల్ల యూఏఈకి వచ్చే లాభం ఏమిటి?

భారత్, పాకిస్తాన్‌ల మధ్య సయోధ్య కుదిరితే యూఏఈకి వచ్చే లాభం ఏమిటి? 

"యూఏఈ శాంతికాముక దేశమని, మధ్యవర్తిత్వం వహించగల సామర్థ్యం ఉన్న దేశమని ప్రపంచానికి చూపించాలనుకుంటోంది. భారత్ కూడా విశ్వశాంతి గురించి మాట్లాడుతుంది. యూఏఈ ఎజెండాలో భారత్-పాకిస్తాన్ సమస్య సరిగ్గా ఇముడుతుంది" అని ప్రొఫెసర్ సుజాత అభిప్రాయపడ్డారు.

"యూఏఈ, ఖతార్ వంటి దేశాలు శాంతిని ఎందుకు కోరుకుంటాయంటే, పాకిస్తాన్ ఆర్థికంగా కూరుకుపోయినప్పుడు ఈ దేశాలే సహాయం అందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ఏదో ఒకవిధంగా అక్కడ స్థిరత్వం రావాలని యూఏఈ కోరుకుంటోంది" అని ఖమర్ ఆఘా అన్నారు.

2016 సంవత్సరంలో ఇథియోపియా, ఎరిట్రియా మధ్య శాంతి నెలకొల్పడంలో యూఏఈ కీలక పాత్ర పోషించింది. నైలు నదిపై ఆనకట్ట నిర్మాణం విషయంలో ఇథియోపియా, ఈజిప్టు మధ్య వివాదాన్ని పరిష్కరించడంలో కూడా యూఏఈ పాత్ర పోషించింది. ఒకప్పుడు లిబియాకు ఆయుధాలను సరఫరా చేసిన దేశం ఇప్పుడు దేశాల మధ్య శాంతి నెలకొల్పే ప్రయత్నాలు చేస్తోంది.

"చమురు ఆధారంగా వేగంగా ఎదుగుతున్న దేశం యూఏఈ. ఇజ్రాయెల్‌తో సంబంధాలు మెరుగుపరుచుకున్న తీరు చూస్తే భారత్-పాకిస్తాన్ మధ్య సయొధ్య కుదిర్చే సామర్థ్యం దానికి ఉందని తెలుస్తోంది" అన్నారు ప్రొఫెసర్ సుజాత. 

భారత్, పాకిస్తాన్ ప్రజలకు ఉమ్మడి ఆకర్షణ దుబాయ్. ఒకప్పుడు ధూళి ఎగిరే దేశంగా పేరుపడింది. ఆ ధూళిని దులిపి బుర్జ్ ఖలీఫా లాంటి ఎత్తైన కట్టాడాన్ని యూఏఈ నిర్మించింది. 

మరి, భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలపై ఉన్న దుమ్ము దులిపివేయగలదా?

దీనికి ఈ రెండు దేశాలు మాత్రమే సమాధానం చెప్పగలవు. 

ఇవి కూడా చదవండి: