నగ్నదౌత్యం: అక్కడ అధికారులు దుస్తులు విప్పేసి దేశాల మధ్య సమస్యలపై చర్చిస్తారు...ఏమిటీ ఆచారం

సావ్‌నాలో ఫిన్లాండ్ దౌత్యాధికారులు

ఫొటో సోర్స్, TOM PILSTON/BBC

ఫిన్లాండ్ దౌత్యాధికారులు అంతర్జాతీయ పాలసీలపై చర్చలు, సమస్యల పరిష్కారంపై రిలాక్స్‌డ్‌గా మాట్లాడుకోవడానికి సావ్‌నాలను ఉపయోగించుకోవడం చాలాకాలంగా ఉన్నదే.

ఆవిరి స్నానాలు చేయడానికి నిర్మించే గదిని సావ్‌నా అంటారు.

సావ్‌నాలలో కూర్చుని అంతర్జాతీయ అంశాలు చర్చించుకోవడం ఫిన్లాండ్ దౌత్యాధికారులకు అలవాటు.

ఇప్పుడు బ్రిటన్‌లోనూ అలాంటి సావ్‌నా ఉంది. లండన్‌లోని ఫిన్లాండ్ ఎంబసీలో ఉన్న సావ్‌నా సొసైటీలో ‘బీబీసీ’ ప్రతినిధి జేమ్స్ లాండాలే చేరారు.

దౌత్యం అనేక రూపాల్లో జరుగుతుంటుంది. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే సమావేశాలు, అత్యున్నత స్థాయి సంప్రదింపులు, ఖరీదైన ఆతిథ్యాలు వంటివన్నీ దౌత్యంలో వివిధ మార్గాలు.

కానీ ఫిన్లాండ్ దౌత్యం మాత్రం వీటన్నిటికంటే భిన్నంగా ఉంటుంది. వారు దాన్ని తమ రహస్య ఆయుధంగా కూడా చెప్తుంటారు. అది దుస్తులు విప్పి సాగించే దౌత్యం.

అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉన్న ఫిన్లాండ్ ఎంబసీలో చాలాకాలంగా సావ్‌నా సొసైటీ ఉంది. గత ఏడాది లండన్‌లోని ఫిన్లాండ్ ఎంబసీలోనూ ఇలాంటిది ఏర్పాటుచేశారు.

‘సావ్‌నా దౌత్యం’లో భాగంగా ఫిన్లాండ్ దౌత్యాధికారులు తాము ఎవరితో సమావేశం కావాలనుకుంటున్నారో వారిని పిలుస్తారు.

పరిచయాలు, పలకరింపులు అయిన తరువాత మద్యం తాగుతారు. ఆ తరువాత మహిళా అధికారులు మొదట సావ్‌నాలోకి వెళ్లి దుస్తులు తీసేసి ఆవిరి స్నానం చేస్తారు. వారి తరువాత మగవారు వెళ్తారు.

ఈ తంతు అంతా పూర్తయిన తరువాత బయటకు వచ్చి అంతా ఒకచోట చేరి డ్రింక్ చేస్తూ తింటారు.

దీన్ని నేక్డ్ నెట్‌వర్కింగ్ అని పిలవండి.. ఇంకేదైనా అనండి.. కానీ, ఇది మాత్రం ఫలితమిస్తుంది అంటారు వారు.

సావ్‌నాలో ఫిన్లాండ్ దౌత్యాధికారులు

ఫొటో సోర్స్, TOM PILSTON/BBC

‘సావ్‌నా అనేది ఫిన్లాండ్‌కు చెందిన పాత ఆచారం. వారి జీవన విధానంలో భాగం’ అని బ్రిటన్‌లోని ఫిన్లాండ్ ఎంబసీ ప్రెస్ కౌన్సెలర్ హెలో సువోమినెన్ అన్నారు.

స్నేహం పెంచుకోవడం, పరస్పర విశ్వాసం ఏర్పరుచుకోవడం కోసం ఈ సావ్‌నా దౌత్య విధానం ఫాలో అవుతామని ఆమె చెప్పారు.

‘నిజాయితీగా మాట్లాడుకోవడానికి ఇది మంచి వాతావరణం ఏర్పరుస్తుంది. అక్కడ అందరూ దుస్తులు లేకుండానే ఉంటారు. అందరూ అదే స్థితిలో ఉన్నప్పుడు హోదాలు ఏమీ గుర్తుకురావు. అప్పుడు విషయంలోకి వెళ్లి మాట్లాడుకోవచ్చు’ అంటారామె.

ఆవిరి స్నానంతో వేడెక్కి చెమటలు పట్టడం వల్ల శరీరమంతా రిలాక్స్ అవుతుంది. ఆందోళనలు తగ్గి, నమ్మకం కుదిరి సత్సంబంధాలు ఏర్పడడానికి వీలవుతుంది.

లండన్‌లో సావ్‌నా దౌత్యంలో నేనూ పాలుపంచుకున్నప్పుడు నాకూ అదే అనుభవం కలిగింది అన్నారు జేమ్స్.

సావ్‌నాలో ఫిన్లాండ్ దౌత్యాధికారులు

ఫొటో సోర్స్, TOM PILSTON/BBC

అయితే, ఈ సావ్‌నా దౌత్య సమావేశాల్లో కొన్ని నిబంధనలు పాటిస్తారు. ఈ ఆవిరి స్నానపు గదిలోకి వెళ్లగానే అక్కడ ఒక టవల్ ఉంటుంది. దాన్ని బమ్ టవల్ అంటారు.

సావ్‌నాలో కూర్చున్నప్పుడు వేడి తగలకుండా ఉండేందుకు దీన్ని కట్టుకోవచ్చు. ఆడవాళ్లంతా ఒకసారి.. మగవాళ్లంతా ఒకసారి వేర్వేరుగా ఇందులో ఆవిరి స్నానం చేయాలి.

తాను ఇందులో ప్రవేశించినప్పడు 80 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడి ఉందని జేమ్స్ చెప్పారు. అందులోకి వెళ్లిన కాసేపటికే ఒళ్లంతా చెమటలు పట్టాయని.. కొద్దిసేపటికే అందరి మధ్య హద్దులు చెరిగిపోయి చర్చలు మొదలుపెట్టారని చెప్పారు.

అయితే ఈ సావ్‌నా దౌత్యం అన్ని దేశాలకు సరిపోదు. కొన్ని దేశాల ప్రజలు అందరి ముందు నగ్నంగా కనిపించడానికి ఇష్టపడరు. కానీ, ఇక్కడ మాత్రం అలాంటిదేమీ లేదని.. ఎవరైనా అసౌకర్యంగా ఫీలవుతున్నారా అని అడిగినప్పుడు అందరూ లేదనే చెప్పారు.

యూరోపియన్ యూనియన్ కోసం లండన్‌లో దౌత్యాధికారిగా పనిచేస్తున్న ఫ్రెడరికో బియాన్సీ మాట్లాడుతూ.. తాను ఈ అనుభవాన్ని చాలా ఎంజాయ్ చేశానని చెప్పారు.

సాధారణ సమావేశాలలో మాదిరిగా సూట్ వేసుకుని, మొబైల్ ఫోన్ పట్టుకుని కాకుండా ఇది భిన్నంగా ఉందన్నారు.

ఒంటి మీద దుస్తులు ఉండవు కాబట్టి సమావేశంలో మన వస్త్రధారణ, ఆహార్యం ఎలా ఉందనే ప్రశ్నే రాదని.. నగ్నంగా ఉండడం వల్ల మిగతా విషయాలపై దృష్టిపెట్టకుండా కేవలం చర్చించుకునే విషయం మీదే దృష్టి పెడతామని చెప్పారు ఫ్రెడరికో.

గతంలో ఉన్నతస్థాయి దౌత్య చర్చలు కూడా సావ్‌నాలో జరిగిన సందర్భాలున్నాయి. 1960లో ఫిన్లాండ్ ప్రచ్ఛన్న యుద్ధ నాయకుడు యురో కెకొనెన్ అప్పటి సోవియట్ యూనియన్ నేత నికిటా కృశ్చేవ్‌ను ఒక రాత్రంతా సావ్‌నాలో ఆవిరి స్నానానికి తీసుకెళ్లి చర్చలు జరిపారు.. ఫిన్లాండ్‌ను పశ్చిమ దేశాలతో కలిసేందుకు అనుమతించాలని ఆయన్ను ఒప్పించారు.

2005లో వ్లాదిమిర్ పుతిన్ హెల్సింకీలో పర్యటించినప్పుడు కూడా అప్పటి ఫిన్లాండ్ అధ్యక్షురాలి భర్తతో కలిసి సావ్‌నాలో చర్చించారు. ఆ తరువాత పుతిన్ దాన్ని అద్భుతమైన అనుభవంగా అభివర్ణించారు.

కానీ, ఇప్పుడు సావ్‌నా దౌత్యం సాంస్కృతిక కలయికలా మారిపోయిందని చెప్తున్నారు వాషింగ్టన్ డీసీలో సావ్‌నా నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఫిన్లాండ్ దౌత్యాధికారి సనా.

‘ఇది చాలా పాపులర్. సావ్‌నా సొసైటీలో చేరడానికి అందరూ టికెట్ కోరుకుంటున్నారు. వాషింగ్టన్‌లో అన్ని దేశాలకూ రాయబార కార్యాలయాలున్నాయి. నెలలో ఓ శుక్రవారం 25 మందిని మాత్రమే ఇందులోకి అనుమతించగలం మేం’ అన్నారు సనా.

‘ఫిన్లాండ్ సావ్‌నాలు లైంగిక కార్యకలాపాలకు ఉద్దేశించిన ప్రదేశాలు ఏమాత్రం కావు. ప్రతి ఒక్కరికీ అవి సురక్షితమైన ప్రదేశాలే. ప్రతి ఒక్కరూ సౌకర్యవంతంగా, గౌరవప్రదంగా ఉండే చోటు సావ్‌నా’ అని సనా చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)