పెద్దవాళ్లు నిద్రపోతున్నప్పుడు మంచం మీద నుంచి కింద పడకపోవడానికి కారణం ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
రాత్రి మనం కళ్లు మూసుకుని నిద్రపోయినప్పటి నుంచి ఉదయం మేల్కొనేవరకు గంటల పాటు విశ్రాంతి తీసుకునే అదృష్టం ఉన్నప్పటికీ నిద్రలో కూడా మన మనసు, శరీరం రెండూ యాక్టివ్‌గానే ఉంటాయన్న విషయం అందరికీ తెలుసు.
నిద్రలో కలలు కనడం ఒక్కటే కాదు, గురకపెట్టడం, మాట్లాడడం, నవ్వడం, అరవడం, సర్దుకోవడం, కాళ్లూచేతులు విసరడం, అటుఇటు దొర్లడం.. ఒకటేమిటి అన్నీ చేస్తుంటాం.
రెండు అడుగుల వెడల్పు ఉంటే మడత మంచం మీద పడుకున్నా...ఆరు అడుగుల వెడల్పు ఉండే డబుల్ కాట్‌పై పడుకున్నా ఉదయం మళ్లీ దానిపైనుంచే లేస్తారు. అంతేకానీ.. కింద పడరు.
అవును కదా.. ఎంత గాఢ నిద్రలోకి వెళ్లినా మంచం మీద నుంచి కింద ఎందుకు పడిపోం?
‘‘గాఢ నిద్రలోకి వెళ్లిన తరువాత పరిసరాల నుంచి మనం పూర్తిగా దూరం జరుగుతామని చాలామంది అనుకుంటారు. కానీ, అది నిజం కాదు.
మీరు ఎంత గాఢంగా నిద్రపోతున్నా కూడా చుట్టుపక్కల ఎవరైనా గట్టిగా అరిస్తే నిద్రలేస్తారు’’ అని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ రసెల్ ఫోస్టర్ ‘బీబీసీ క్రౌడ్ సైన్స్’తో చెప్పారు.
‘‘మన శరీరాలు ఇంద్రియాల సహాయంతో సమాచారం స్వీకరిస్తూనే ఉంటాయి. కిందపడిపోకుండా ఒకరకమైన సెన్స్ తోడ్పడుతుంది’’ అంటారు ప్రొఫెసర్ రసెల్ ఫోస్టర్.
‘‘ఇది దాదాపు సిక్స్త్ సెన్స్ లాంటిదే. అయితే, చిన్నవయసులో ఇది అంత ప్రభావవంతంగా పనిచేయదు. అందుకే చిన్నపిల్లలు మంచం మీద నుంచి నిద్రలో పడిపోతుంటారు. కానీ వయసుతో పాటు ఈ సెన్స్ పెరుగుతుంటుంది. అందుకే పెద్దవాళ్లు నిద్రలో మంచం మీద నుంచి కిందపడరు’’

ఫొటో సోర్స్, Getty Images
సిక్స్త్ సెన్స్
సాధారణంగా సిక్స్త్ సెన్స్ అనగానే సాధారణ మనుషులకు లేనంతటి ప్రత్యేక గ్రాహకశక్తిగా భావిస్తారు. కానీ ఫోస్టర్ వంటి సైంటిస్టుల లెక్కప్రకారం సిక్స్త్ సెన్స్ అంత నిగూఢమైనదేమీ కాదు.
దీన్నే శాస్త్రవేత్తలు ప్రొప్రియోసెప్షన్‌గా చెప్తుంటారు. శతాబ్ద కాలంగా దీని గురించి శాస్త్రవేత్తలు మాట్లాడుతున్నారు.
ఫ్రాన్స్‌కు చెందిన క్లాడ్ బెర్నార్డ్, స్కాట్లాండ్‌కు చెందిన బెర్నార్డ్ కోహెన్, సర్ చార్ల్స్ బెల్, సర్ చార్ల్స్ షెరింటన్ వంటి న్యూరోసైన్స్ దిగ్గజాలు, మానవ శరీర నిర్మాణ శాస్త్ర కోవిదులు 19వ శతాబ్దంలో దీనిపై అధ్యయనం చేశారు.
ప్రొప్రియోసెప్షన్ అనే పదాన్ని 1932లో వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్న చార్ల్స్ షెరింటన్ అనే శాస్త్రవేత్త తొలిసారి ప్రయోగించారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రొప్రియోసెప్షన్ ఎలా ఉంటుందో చూస్తారా?
కళ్లు మూసుకోండి. ఇప్పుడు కుడిచేతి చూపుడు వేలితో ఎడమ మోచేతిని టచ్ చేయండి. చేశారు కదా...ఎలా సాధ్యమైంది?
కళ్లు మూసుకుని ఉన్నా చూడకుండానే అంత కచ్చితంగా ఎలా టచ్ చేయగలిగారు.
సింపుల్.. మీ శరీరంలో భాగమైన చూపుడు వేలు ఎక్కడుందో మీకు తెలుసు.. అలాగే మోచేయి కూడా మీకు తెలుసు. అందుకే అంత కచ్చితంగా కళ్లు మూసుకుని కూడా టచ్ చేయగలిగారు.
అంతేకాదు... కళ్లతో చూడకుండానే మీ అవయవాలు ఎక్కడ ఏవి ఉన్నాయో చెప్పేగలుగుతారు. ప్రొప్రియోసెప్షన్‌కు దీన్నే తొలి ఉదాహరణగా చెప్తారు.
కండరాలు, కీళ్లు, చర్మంలోని గ్రాహకాలకు.. మెదడుకు మధ్య న్యూరోఫిజియలాజికల్ సిగ్నల్స్ వల్ల ప్రొప్రియోసెప్షన్ సాధ్యమవుతుంది.
దీనివల్ల మన కండరాలు, అవయవాల కదలిక ఎలా ఉందనేది తెలుస్తుంది. శరీరం బ్యాలన్స్ సాధించడానికి ఇదే తోడ్పడుతుంది.
ఏదైనా కారణం వల్ల బ్యాలన్స్ తప్పినా తిరిగి బ్యాలన్స్ సాధించడానికీ ఇదే కారణం.
శరీర స్థితిని అదుపుచేయడంలో ప్రొప్రియోసెప్షన్ కీలకం.
ఈ ప్రొప్రియోసెప్షన్ కారణంగానే నిద్రలో కూడా మనం కిందపడిపోకుండా మంచం మీదే అటూఇటూ కదలగలుగుతాం.
ఇవి కూడా చదవండి:
- దేశానికి రక్షణగా పెట్టని గోడలు - ధ్వంసం చేస్తున్న అక్రమార్కులు...
- గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏమిటి? నీటి నుంచి ఎలా ఉత్పత్తి చేస్తారు?
- తెలంగాణ: గణేశ్ చందా ఇవ్వనందుకే టీచర్‌ను వివాదంలోకి లాగారా... బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ప్రజల కష్టాలేమిటి? మునిసిపాలిటీ పరిధిలోకి వస్తే ఏం జరుగుతుంది?
- తెలంగాణ: ఇంటర్ విద్యార్థులకు హెచ్‌సీఎల్‌లో సాఫ్ట్వేర్ జాబ్... ఎంపిక ఎలా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














