భారత్, పాకిస్తాన్ ఒక దశలో అణుయుద్ధానికి దిగాలనుకున్నాయా...

భారత యుద్ధ విమానం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత్, పాకిస్తాన్ ఒక దశలో అణుయుద్ధానికి దిగేందుకు సిద్ధమయ్యాయని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తాను రాసిన పుస్తకంలో రాశారు.

2019లో పుల్వామాలో జరిగిన దాడిలో సుమారు 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు చనిపోయారు. దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ భూభాగంలోని మిలిటెంట్ స్థావరాల మీద భారత్ వైమానిక దాడులు చేసింది.

ఆ సందర్భంగా భారత సైన్యానికి చెందిన రెండు యుద్ధ విమానాలను కూల్చి వేసినట్లు పాకిస్తాన్ తెలిపింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్తమాన్‌ నాడు పాకిస్తాన్ బలగాలకు బంధీగా చిక్కారు.

ఈ ఘర్షణల నేపథ్యంలో రెండు దేశాలు అణుదాడులు చేసేందుకు సిద్ధమయ్యాయని పాంపియో చెప్పారు.

భారత్, పాకిస్తాన్‌ల మధ్య కశ్మీర్ వివాదం ఎన్నో దశాబ్దాల నుంచి నడుస్తోంది.

కశ్మీర్ లోయలో వేర్పాటు వాద మిలిటెంట్లను పాకిస్తాన్ పోషిస్తుందని భారత్ ఎంతో కాలంగా ఆరోపిస్తుంది. ఈ ఆరోపణలను ఇస్లామాబాద్ ఖండిస్తోంది.

1947 నుంచి ఈ రెండు అణు దేశాలు మూడు సార్లు యుద్ధానికి దిగాయి. ఈ యుద్ధాలన్ని కశ్మీర్‌ ప్రాంతం గురించే జరిగాయి.

‘నెవర్ గీవ్ ఆన్ ఇంచ్: ఫైటింగ్ ఫర్ ది అమెరికా ఐ లవ్’ పేరుతో పాంపియో ఈ పుస్తకం రాశారు.

భారత్-పాకిస్తాన్ దేశాలు ఫిబ్రవరి 2019లో అణు యుద్ధానికి ఎంత చేరువలోకి వచ్చాయన్న విషయం ప్రపంచానికి సరిగ్గా తెలియదని తాను అనుకుంటున్నట్టు పాంపియో తన పుస్తకంలో చెప్పారు.

అణు యుద్ధానికి దగ్గరగా వచ్చిన భారత్, పాకిస్తాన్ దేశాలు

ఫొటో సోర్స్, Reuters

‘‘ఇదే నిజం, కానీ, నాకు దీనిపై సరైన సమాధానం తెలియదు; నాకు తెలిసిందల్లా రెండు దేశాలు అణు యుద్ధానికి చాలా దగ్గరగా వచ్చాయి’’ అని రాశారు.

హనోయ్ సదస్సులో ఉన్నప్పుడు రాత్రి పూట జరిగిన ఆ చర్చలను తానసలు మర్చిపోనని పాంపియో తెలిపారు.

ఆ సమయంలో కశ్మీర్‌ విషయంలో భారత్, పాకిస్తాన్‌లు తీవ్ర హెచ్చరికలు చేసుకోవడం ప్రారంభించాయని, మరోవైపు అణు ఆయుధాలపై ఉత్తర కొరియన్లతో చర్చలు జరుగుతున్నాయని పాంపియో చెప్పారు.

‘ఇస్లామిస్ట్ ఉగ్ర దాడిలో భారతీయ సైనికులు 40 మందికి పైగా చనిపోయిన తర్వాత పాకిస్తాన్‌‌కు వైమానిక దాడులతో భారత్ సమాధానం చెప్పిందని పాంపియో అన్నారు. ఆ తర్వాత పాకిస్తానీలు భారత యుద్ధ విమానాన్ని కూల్చేసి, పైలట్‌ను బంధించారు’ అని ఆయన రాశారు.

పేరు చెప్పని భారత ప్రతినిధితో హనోయ్ నుంచే తాను మాట్లాడినట్టు పాంపియో తెలిపారు.

‘‘యుద్ధం చేసేందుకు అణు ఆయుధాలను పాకిస్తాన్ సిద్ధం చేయడం ప్రారంభించిందని ఆయన చెప్పారు. పాకిస్తాన్ అణ్వాయుధాలను తట్టుకునేందుకు వారు కూడా సిద్ధమవుతున్నట్టు తెలిపారు’’ అని పాంపియో తెలిపారు.

అణు యుద్ధానికి దగ్గరగా వచ్చిన భారత్, పాకిస్తాన్ దేశాలు

ఫొటో సోర్స్, PAKISTAN ISPR

‘‘తొందరపడకండి.... పరిస్థితిని చక్క దిద్దేందుకు ఒక నిమిషం సమయం ఇవ్వాలని కోరాను’’ అని పాంపియో తన పుస్తకంలో పేర్కొన్నారు.

ఆ తర్వాత అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్‌తో కలిసి ఆ విషయం మీద పనిచేసినట్టు చెప్పారు.

‘ఆ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావెద్ బజ్వాకు ఫోన్ చేశాను. కానీ అది అబద్ధమని ఆయన అన్నారు.

భారత్ అణు ఆయుధాలను సిద్ధం చేస్తూ ఉండొచ్చని ఆయన అన్నారు. కొన్ని గంటలు పని చేసిన మా బృందం, అణు ఆయుధాలను వాడకుండా రెండు దేశాలను ఒప్పించగలిగాయి.

ఆ రాత్రి అత్యంత ప్రమాదకర ఘటన జరగకుండా ఆపేందుకు మేం చేసిన పనిని, మరే దేశం చేసేది కాదు’ అని పాంపియో రాశారు.

పాంపియో వ్యాఖ్యలను ఇటు భారత్‌ కానీ, అటు పాకిస్తాన్ కానీ ఖండించలేదు.

2019లో భారత సైనికులపై జరిపిన దాడిని పాకిస్తాన్‌లోని జైష్-ఈ-మహమ్మద్ జరిపినట్టు ప్రకటించుకుంది.

దానికి ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని మిలిటెంట్ల మీద దాడులు చేసినట్లు భారత్ ప్రకటించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)