అదానీ గ్రూప్: ఎల్ఐసీ పెట్టుబడులపై ప్రశ్నలు ఎందుకు వినిపిస్తున్నాయి

ఎల్‌ఐసీ ఆఫీసు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, దినేశ్ ఉప్రేతీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అదానీ గ్రూప్‌ ‘మోసాలకు’ పాల్పడిందంటూ ఇటీవల హిండెన్‌బర్గ్ రీసెర్చ్ వెల్లడించిన నివేదిక సంచలనం కలిగించింది.

ఆ నివేదిక వచ్చిన తరువాత అదానీ గ్రూప్ షేర్లు భారీగా నష్టపోయాయి. అయితే హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలను అదానీ ఖండించింది.

కానీ అదానీ గ్రూప్ వివాదం ప్రతిపక్షాలకు ఒక అస్త్రంగా మారింది. ప్రభుత్వరంగ సంస్థ ఎల్‌ఐసీ, అదానీ గ్రూప్ కంపెనీల స్టాక్స్‌ను కొనడాన్ని చాలా మంది ప్రశ్నిస్తున్నారు.

‘‘ప్రభుత్వం కోసం 40 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాను. ఏదైనా సంస్థల్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఎల్ఐసీకి ప్రధాన మంత్రి లేదా ఆర్థిక మంత్రి అనుమతి తప్పనిసరని నాకు తెలుసు. మధ్య తరగతి ప్రజలకు ముఖ్యమైన ఇలాంటి సంస్థలను ఎందుకు దెబ్బతీస్తున్నారో తెలియడం లేదు.’’ – జవాహర్ సర్కార్, రాజ్యసభ ఎంపీ (తృణమూల్ కాంగ్రెస్)

‘‘కోట్ల మంది సాధారణ పౌరులు ఎల్ఐసీలో మదుపుచేస్తారు. ఇవి కేవలం డబ్బులు మాత్రమే కాదు, వారి కలలు, ఆకాంక్షలు. ఇవే వారికి భరోసా కల్పిస్తాయి. ఇలాంటి అంశాలపై సామాన్య ప్రజలను గందరగోళానికి గురిచేయకూడదు. మీకు పారిశ్రామికవేత్తలపై కోపం లేదా శత్రుత్వం ఉండొచ్చు. కానీ, మీరు సాధారణ ప్రజలపై ప్రతీకారం తీర్చుకుంటున్నారు. ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు.’’ – సుష్మా పాండే, సీనియర్ జర్నలిస్టు

ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన గౌతం అదానీ కంపెనీలు ‘స్టాక్ మానిప్యులేషన్’, అకౌంటింగ్ మోసాలకు పాల్పడుతున్నాయని అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ ఆరోపించింది.

కంపెనీల షేర్ల విలువలను తప్పుగా చూపించడం, హవాలా మార్గాల్లో ఫేక్ కంపెనీల ద్వారా వ్యాపారం తదితర ఆరోపణలతో మొత్తంగా 88 ప్రశ్నలను ఆ నివేదికలో హిండెన్‌బర్గ్ సంధించింది.

ఈ ప్రశ్నలకు సమాధానాలతో 413 పేజీల నివేదికను అదానీ గ్రూపు ఆదివారం విడుదల చేసింది. హిండెన్‌బర్గ్ ఆరోపణలు తప్పుదోవ పట్టించేలా ఉండటంతోపాటు దానిలో చాలా అబద్ధాలు ఉన్నాయని వ్యాఖ్యానించింది. అంతేకాదు కావాలనే భారత్, ఇక్కడి స్వతంత్ర సంస్థలను హిండెన్‌బర్గ్ లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించింది.

అయితే, జాతీయవాదం పేరు చెప్పి మోసాలను కప్పిపుచ్చలేరని దీనికి ప్రతిగా హిండెన్‌బర్గ్ స్పందించింది.

అదానీ గ్రూపు

ఫొటో సోర్స్, ANI

అదానీ గ్రూపుకు భారీ నష్టం...

హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత అదానీ గ్రూపు షేర్లు భారీగా పతనం అయ్యాయి. మరోవైపు అదానీ గ్రూపుతోపాటు సంస్థలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలు, సంస్థల షేర్లు కూడా పతనం అయ్యాయి.

ముఖ్యంగా ఈ విషయంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)పై చర్చ జరుగుతోంది. అసలు అదానీ గ్రూపులో పెట్టుబడులు పెట్టేందుకు చాలా బీమా కంపెనీలు దూరం జరిగినప్పుడు ఎల్ఐసీ మాత్రం ఎందుకు అంత భారీగా పెట్టుబడులు పెట్టిందని చాలా మంది ప్రశ్నిస్తున్నారు.

బీఎస్ఈ సమాచారం ప్రకారం, అదానీ గ్రూపు కంపెనీల్లో ఎల్ఐసీ మినహా మరే ఇతర బీమా కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరచలేదు.

బీఎస్ఈ తాజా త్రైమాసిక గణాంకాల ప్రకారం, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో 4.23 శాతం, అదానీ పోర్ట్స్‌లో 9.14 శాతం, అదానీ ట్రాన్స్‌మిషన్‌లో 3.65 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీలో 1.28 శాతం, అదానీ గ్యాస్‌లో 5.96 శాతం, అదానీ విల్మర్‌లో 0.04 శాతం వాటా ఎల్ఐసీకి ఉంది.

అదానీ గ్రూపు

ఫొటో సోర్స్, SOPA IMAGES, GETTY

మదుపరుల ఆందోళన

అయితే, హిండెన్‌బర్గ్ నివేదిక ముందు కూడా అదానీ గ్రూపు కంపెనీల విషయంలో మదుపరులను ఆందోళనకు గురిచేసే కొన్ని పరిణామాలు చోటుచేసుకున్నాయి.

2021 జులై 19న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా ప్రశ్నకు స్పందిస్తూ.. అదానీ గ్రూపుకు చెందిన కొన్ని కంపెనీలు నిబంధనలను అనుసరించకపోవడంపై సెక్యూరిటీ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) దర్యాప్తు చేపడుతోందని పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి వెల్లడించారు.

అయితే, ఏఏ కంపెనీలపై దర్యాప్తు చేపడుతోందో చౌధరి వెల్లడించలేదు. మరోవైపు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) కూడా అదానీ గ్రూపు కంపెనీలపై దర్యాప్తు చేపడుతోందని ఆయన వివరించారు.

దీనికి ముందు, అంటే జూన్ 2021లోనూ అదానీ గ్రూపులో పెట్టుబడులు పెడుతున్న మూడు మారిషస్‌కు చెందిన విదేశీ సంస్థల ఖాతాలను స్తంభింపచేసినట్లు ఒక ఇంగ్లిష్ పత్రిక ఒక కథనం ప్రచురించింది. అప్పుడు కూడా భారీగా అదానీ షేర్లు పతనం అయ్యాయి.

అదానీ గ్రూపు

ఫొటో సోర్స్, REUTERS/AMIT DAVE

ఎల్ఐసీ మదుపరులు ఆందోళన చెందాలా?

ఎల్ఐసీలో 28 కోట్ల మంది పాలసీదారుల పెట్టుబడులు ఉన్నాయి. వీటిని షేర్లు, ప్రభుత్వ బాండ్లు లాంటి వాటిపై సంస్థ పెట్టుబడులుగా పెడుతోంది.

ఆ పెట్టుబడుల నుంచి వచ్చే ఆదాయాన్ని పాలసీదారులకు ఎల్ఐసీ ఇస్తుంది. అయితే, ఇక్కడ ఎల్ఐసీలో పెట్టుబడులు పెట్టేవారిలో చాలా మంది మధ్యతరగతి ప్రజలే.

అందుకే ఎలాంటి పెద్ద రిస్క్‌లు తీసుకోకుండా ఎల్ఐసీ ఈ డబ్బును జాగ్రత్తగా మదుపు చేస్తుందని, వచ్చే ఆదాయాన్ని మళ్లీ మదుపరులకు ఇస్తుందని అంతా భావించేవారు.

అదానీ గ్రూపు కంపెనీల్లో ‘ప్రజల మదుపుకే ముప్పు తెచ్చేలా ఎల్ఐసీ పెట్టుబడులు పెట్టడంపై’ కాంగ్రెస్ నాయకు జయరాం రమేశ్ ప్రశ్నలు సంధించారు.

మరోవైపు సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి కూడా హిండెన్‌బర్గ్ నివేదికపై ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘ఒకవేళ ఆ నివేదికలో అంశాలు నిజమని రుజువైతే, జీవితాంతం కష్టపడి ఎల్ఐసీలో డబ్బులు దాచుకున్న మధ్యతరగతి ప్రజల జీవితం ప్రశ్నార్ధకం అవుతుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

మరోవైపు హిండెన్‌బర్గ్ నివేదిక నడుమ తమపై వెల్లువెత్తుతున్న ప్రశ్నలపై ఎల్ఐసీ కూడా స్పందించింది.

‘‘గత కొన్ని సంవత్సరాల్లో అదానీ గ్రూపుకు చెందిన రూ.30,127 కోట్ల విలువైన షేర్లను మేం కొనుగోలు చేశాం. జనవరి 27నాటికి వాటి మార్కెట్ విలువ రూ.56,142 కోట్లుగా ఉంది’’అని ఎల్ఐసీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

‘‘అదానీ గ్రూపులో మొత్తంగా ఎల్ఐసీ పెట్టిన పెట్టుబడుల విలువ రూ.36,474 కోట్లు. ఎల్ఐసీ మొత్తంగా భిన్న సంస్థల్లో పెట్టిన పెట్టుబడుల విలువ రూ.41.66 లక్షల కోట్లు. అంటే మా పెట్టుబడుల్లో కేవలం 0.975 శాతాన్ని మాత్రమే అదానీ గ్రూపు సంస్థల్లో పెట్టాం’’అని ఎల్ఐసీ వివరించింది.

అదానీ గ్రూపు

ఫొటో సోర్స్, SUJIT JAISWAL/AFP VIA GETTY IMAGES

సంక్షోభం ముదురుతుందా?

రానున్న రోజుల్లో మరో సమస్య కూడా అదానీ గ్రూపు షేర్లను వెంటాడబోతోంది. అదే మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్ (ఎంఎస్సీఐ) విడుదలచేసే స్టాండార్డ్ ఇండెక్స్. దీనిలో అదానీ గ్రూపు సంస్థలకు చెందిన ఎనిమిది కంపెనీలకు 5.75 శాతం ప్రాధాన్యం(వెయిటేజీ) ఇస్తారు.

తాజా హిండెన్‌బర్గ్ ప్రశ్నలకు వివరణ ఇవ్వాలంటూ అదానీ గ్రూపుకు ఎంఎస్సీఐ శుక్రవారం సూచించింది. అదానీ గ్రూపుకు తమ ఇండెక్స్‌లో ఇచ్చే ప్రాధాన్యాన్ని ఎంఎస్సీఐ తగ్గించే అవకాశముందని న్యూవామా ఆల్టర్నేటివ్ అండ్ క్వానింటిటేటివ్ ఇండెక్స్ చెబుతోంది.

ఒకవేళ అదే జరిగితే, అదానీ గ్రూపు సంస్థలపై విదేశీ మదుపరుల నమ్మకం కూడా తగ్గుతుంది. ఫలితంగా దాదాపు 1.5 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను మదుపరులు విక్రయించేసే అవకాశముందని వార్తలు వస్తున్నాయి.

‘‘తమ ఇండెక్స్ నుంచి ఏదైనా కంపెనీలకు ఇచ్చే ప్రాధాన్యాన్ని తగ్గించేందుకు కొన్ని విధానాలను ఎంఎస్సీఐ అనుసరిస్తుంది. ఇప్పటివరకు వీరు ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. త్వరలో దీనిపై నిర్ణయం వెల్లడించే అవకాశముంది’’అని ఆసిఫ్ చెప్పారు.

వీడియో క్యాప్షన్, మ్యూచువల్ ఫండ్స్ డబ్బుతో ఇల్లు కొనడం మంచిదేనా?

అప్పుల భారం..

అదానీ గ్రూపుపై భారీగా అప్పుల భారం ఉందని కూడా తమ నివేదికలో హిండెన్‌బర్గ్ వెల్లడించింది.

రెండు లక్షల కోట్ల అప్పులు ఉన్నప్పటికీ ప్రజల డబ్బులతో మీరు వ్యాపారాలను విస్తరిస్తున్నారా? అని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నను గౌతం అదానీ ఖండించారు.

‘‘అసలు నిజాలేమిటో తెలుసుకోకుండానే చాలా మంది మాట్లాడుతున్నారు. తొమ్మిదేళ్ల క్రితం మా మొత్తం రుణాల్లో భారతీయుల బ్యాంకుల వాటా 86 శాతం వరకు ఉండేది. ఇప్పుడు అది 32 శాతానికి తగ్గింది. మేం ఇప్పుడు ఎక్కువగా ఇంటర్నేషనల్ బాండ్లను ఆశ్రయిస్తున్నాం’’అని ఆయన చెప్పారు.

అయితే ఇటీవల ఈక్విటీ సంస్థ సీఎల్ఎస్ ఒక నివేదికలో.. అదానీ గ్రూప్ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ పవర్, అదానీ గ్రీన్, అదానీ ట్రాన్స్‌మిషన్‌ల మొత్తం అప్పుల విలువ రూ.2.1 లక్షల కోట్లుగా పేర్కొంది.

అయితే, మొత్తం రుణాల్లో 40 శాతం కంటే తక్కువే వీరు బ్యాంకుల నుంచి తీసుకున్నట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)