అదానీ గ్రూప్: ఆ నివేదిక అంతా అబద్ధం; 'అయితే, కోర్టులో తేల్చుకుందాం' అని సవాలు విసిరిన హిండెన్‌బర్గ్

అదానీ గ్రూప్‌పై అమెరికా రీసెర్చ్ కంపెనీ తీవ్ర ఆరోపణలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, నిఖిల్ ఇనామ్‌దార్, మౌనిక మిల్లర్
    • హోదా, బీబీసీ బిజినెస్ ప్రతినిధులు

ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన గౌతం అదానీ కంపెనీ 'స్టాక్ మానిప్యులేషన్', అకౌంటింగ్‌లో మోసాలకు పాల్పడిందని ఆరోపిస్తూ ఈ నెల 24న హిండెన్‌బర్గ్ అనే రీసర్చ్ సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. అయితే, అమెరికాకు చెందిన ఆ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ రూపొందించిన సదరు నివేదిక 'దురుద్దేశపూరితం'గా ఉందని, 'తప్పుడు సమాచారం'తో కూడుకున్నదని అదానీకి చెందిన 'అదానీ గ్రూప్' తోసిపుచ్చింది.

న్యూయార్క్‌లోని హిండెనబర్గ్ రీసర్చ్ సంస్థ ఈ నివేదికను బుధవారం విడుదల చేసిన తరువాత అదానీ గ్రూప్ మార్కెట్ విలువ 11 బిలియన్ డాలర్లు (దాదాపు 90 వేల కోట్ల రూపాయలు) నష్టపోయింది.

ఆ నివేదికను పూర్తిగా ఖండిస్తున్నట్లు తెలిపిన అదానీ గ్రూప్ ఆ సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నట్లు ప్రకటించింది.

హిండెన్‌బర్గ్ రీసర్చ్ దీనిపై స్పందిస్తూ, తాము తమ నివేదికకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. నివేదికలో వెల్లడి చేసిన అంశాలకు సంబంధించి పేజీలకొద్దీ సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నాయని కూడా ప్రకటించింది.

'కార్పొరేట్ చరిత్రలోనే అతి పెద్ద మోసం'

భారతదేశంలోని అతిపెద్ద వ్యాపార సంస్థలలో ఒకటైన అదానీ గ్రూప్ కమాడిటీస్ ట్రేడింగ్, ఎయిర్‌పోర్ట్స్, యుటిలిటీ, రెన్యువబుల్ ఎనర్జీ వంటి అనేక రంగాల్లో తన కార్యకలాపాలను సాగిస్తోంది. దీని యజమాని అయిన గౌతమ్ అదానీ ప్రపంచంలోనే నాలుగో అత్యంత సంపన్నుడు అని ఫోర్బ్స్ పత్రిక ప్రకటించింది.

ఇదిలా ఉంటే, హిండెన్‌బర్గ్ సంస్థ 'షార్ట్-సెల్లింగ్'లో తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. అంటే, ఒక కంపెనీ షేరు ధర పడిపోతుందనే అంచనా ఉన్నప్పుడు, ఆ షేర్లను అధిక ధరల వద్ద విక్రయించి, పడిపోయిన తరువాత కొనడం అన్నమాట.

హిండెన్‌బర్గ్ తన నివేదికలో 'కార్పొరేట్ చరిత్రలోనే అతి పెద్ద మోసానికి' అదానీ పాల్పడ్డారని ఆరోపించింది. అదానీ గ్రూప్ తన సంస్థలలోని కొన్ని షేర్లను పబ్లిక్‌కు విక్రయించడానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ నివేదిక వెలుగు చూసింది.

పన్ను ఎగవేతదార్లకు స్వర్గధామాలుగా పిలిచే మారిషస్, కరీబియన్ వంటి దేశాల్లో అదానీకి ఉన్న కంపెనీల గురించి ఈ నివేదిక ప్రశ్నించింది. అంతేకాదు, ఈ కంపెనీకి 'భారీ రుణాలు' ఉన్నాయని, అవి ఆ సంస్థను సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం ఉందని కూడా ఈ నివేదిక హెచ్చరించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

అదానీ: చట్టపరమైన చర్యలు తీసుకుంటాం

హిండెన్‌బర్గ్ మీద అమెరికాలో, భారత్‌లో చట్టపరమైన చర్యలు తీసుకునే విషయాన్ని పరిశీలిస్తున్నామని అదానీ గ్రూప్ గురువారం ప్రకటించింది. తాము ఎప్పుడూ చట్ట ప్రకారమే నడుచుకున్నామని కూడా అదానీ అన్నారు.ృ

"ఆ నివేదిక భారత స్టాక్ మార్కెట్‌లో సృష్టించిన అలజడి ఆందోళన కలిగిస్తోంది. భారత ప్రజలను అది అకారణ భయాందోళనలకు గురిచేస్తోంది" అని అదానీ గ్రూప్ లీగల్ టీం హెడ్ జతిన్ జలంధ్‌వాలా అన్నారు.

"అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల విలువపై దుష్ప్రభావం చూపించేందుకు ఆ నివేదికను, అందులోని నిరాధార ఆరోపణలను డిజైన్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అదానీ కంపెనీ షేర్లు పడిపోతే లబ్ధి పొందాలని చూస్తున్నట్లు హిండెన్‌బర్గ్‌ వాళ్ళే చెప్పుకున్నారు" అని అన్నారు.

అదానీ గ్రూపులోని ప్రధాన సంస్థ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్ల విక్రయాన్ని శుక్రవారం ప్రారంభించాలని ముందుగా నిర్ణయించారు.

అదానీ గ్రూప్‌పై అమెరికా రీసెర్చ్ కంపెనీ తీవ్ర ఆరోపణలు

ఫొటో సోర్స్, Reuters

‘మా నివేదికకు కట్టుబడి ఉన్నాం’ -హిండెన్‌బర్గ్

అదానీ గ్రూప్ ప్రకటన మీద హిండెన్‌బర్గ్ స్పందించింది.

‘మేం రిపోర్ట్ విడుదల చేసి 36 గంటలు అవుతోంది. ఇప్పటి వరకు మా ప్రశ్నల్లో ఒక్కదానికి కూడా అదానీ గ్రూప్ నుంచి సరైన సమాధనం రాలేదు.

మా రిపోర్ట్‌ను ముగించే ముందు మేం 88 ప్రశ్నలు నేరుగా అడిగాం. వాటికి సమాధానాలు ఇవ్వడం ద్వారా తమ పారదర్శకతను నిరూపించుకునేందుకు కంపెనీకి అదొక అవకాశం. కానీ, ఇంతవరకు అదానీ గ్రూప్ ఒక్క ప్రశ్నకు కూడా జవాబు ఇవ్వలేదు.

కానీ దానికి బదులు ఊహించినట్లుగా అదానీ బెదిరింపులకు దిగింది. ఇవాళ మీడియాకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో మా నివేదికను ‘అన్‌రీసర్చ్‌డ్’ అని అదానీ అనింది. మేం రెండు సంవత్సరాల పాటు పరిశోధించి 32 వేల పదాలు, 720 రెఫరెన్సులుతో 106 పేజీల రిపోర్ట్‌ను తయారు చేశాం.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

మా మీద చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు భారత, అమెరికా చట్టాల్లోని సంబంధిత సెక్షన్లను పరిశీలిస్తున్నట్లు కూడా అదానీ తన ప్రకటనలో తెలిపింది.

చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ అదానీ కంపెనీ చేస్తున్న బెదిరింపులను మేం ఆహ్వానిస్తాం. మా రిపోర్ట్‌కు మేం పూర్తిగా కట్టుబడి ఉన్నాం. మా మీద ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశమే లేదని మేం నమ్ముతున్నాం.

చట్టపరమైన చర్యలను నిజంగానే తీసుకోవాలని అదానీ అనుకుంటూ ఉంటే, మేం కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికాలో కూడా ఆ కంపెనీ దావా వేయాలి. న్యాయవిచారణ ప్రక్రియలో అనేక పత్రాలను చూపించాల్సిందిగా అదానీ గ్రూప్‌ను అడుగుతాం’ అని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తెలిపింది.

అదానీ గ్రూప్‌పై అమెరికా రీసెర్చ్ కంపెనీ తీవ్ర ఆరోపణలు

ఫొటో సోర్స్, Getty Images

రాజకీయ విమర్శలు

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం గౌతమ్ అదానీ సంస్థలకు ఎంతో ‘మేలు’ చేస్తోందంటూ కొంత కాలంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తూ వస్తున్నాయి.

అదానీ గ్రూప్ కార్యకలాపాల మీద విచారణ చేపట్టాలని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.

‘హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి’ అంటూ శివసేన నేత ప్రియాంక చతుర్వేది ట్వీట్ చేశారు.

‘స్టాక్ మార్కెట్‌లో నమోదైన కంపెనీలను సెబీ నియంత్రిస్తుంది. కానీ ఏదైనా ఫిర్యాదు వస్తేనే అది విచారణ చేపడుతుంది. కానీ ఈ కేసు(అదానీ)లో అలా జరగలేదు’ అని ఇన్‌గవర్న్ రీసెర్చ్ వ్యవస్థాపకుడు శ్రీరామ్ సుబ్రమణియన్ అన్నారు.

అదానీ గ్రూప్ మీద వచ్చిన ఆరోపణల మీద సెబీని బీబీసీ సంప్రదించింది. కానీ ఇంత వరకు దాని నుంచి స్పందన రాలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)