పాకిస్తాన్: కిలో ఉల్లిపాయలు రూ.250... ‘కోయకుండానే కళ్లల్లో నీళ్లు’

పాకిస్తాన్‌లో కొండెక్కిన ఉల్లి ధర

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మహమ్మద్ కజిమ్, అజిజుల్లా ఖాన్
    • హోదా, బీబీసీ ఉర్దూ ప్రతినిధులు

ఉల్లిపాయ తరగడమన్నది కాస్త కష్టంతో కూడుకున్న పనే. దాని ఘాటు కళ్లల్లో నీళ్లు తెప్పిస్తుంది.

ఇప్పుడు కోయకుండానే పాకిస్తానీ ప్రజల కళ్లలో నీళ్లు తెప్పిస్తోంది ఉల్లిపాయ.

ఉల్లిపాయ ధర పాకిస్తాన్‌లో ఆకాశాన్ని తాకుతోంది. పాకిస్తాన్‌లో కేజీ ఉల్లిగడ్డల ధర రూ.220 నుంచి రూ.250కి అంటే భారతీయ కరెన్సీలో రూ.70 నుంచి రూ.80కి పెరిగింది.

పాకిస్తాన్‌లో ఒకవైపు మాంసం ధర కేజీ రూ.800కి పైగా పెరగగా, మరోవైపు ఉల్లిగడ్డ రేటు కూడా భరించలేని స్థాయికి చేరింది. కూరల్లో గ్రేవీని పెంచే ఈ ఉల్లిగడ్డ రేటు ఇప్పుడు కొండెక్కడంతో, చాలా మంది చాలీచాలని కూరలను వండుకోవాల్సి వస్తుంది.

పాకిస్తాన్‌లో ప్రతి కూర కూడా ఉల్లిపాయతో తాళింపు వేశాకే వండటం ప్రారంభిస్తారు.

పెరుగుతున్న ఉల్లిపాయల ధరలపై పెషావర్ కూరగాయల మార్కెట్లోని ఒక కార్మికుడు గులామల్ ఖాన్‌ను ప్రశ్నించగా, రేట్లు ఇలా పెరిగితే కార్మికులు ఎక్కడి పోవాలి? అని ప్రశ్నించారు.

‘‘ 200 గ్రాముల ఉల్లిపాయలకి రూ.40 నుంచి రూ.50 అడుగుతున్నారు. అంతకుముందు వీటికి రూ.10 నుంచి రూ.12 మాత్రమే చెల్లించేవాళ్లం’’ అని గులామల్ ఖాన్ అన్నారు.

ప్రస్తుతం పాకిస్తాన్‌లో వివిధ రాష్ట్రాల్లో ఉల్లిపాయల ధరలు వివిధ రకాలుగా పలుకుతున్నాయి.

బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాలో ఉల్లిపాయలు ధర అత్యధికంగా పలుకుతుంది. అక్కడ కేజీ ఉల్లిగడ్డల ధర రూ.250 నుంచి రూ.260గా ఉంది. పెషావర్‌లో వీటి ధర కేజీ రూ.230 నుంచి రూ.250గా నమోదవుతోంది.

కరాచీలో చిన్న ఉల్లిగడ్డల ధర రూ.230గా, పెద్ద ఉల్లిపాయల ధర కేజీ రూ.240గా ఉంది. అదేవిధంగా పంజాబ్‌లోని లాహోర్ నగరంలో ఉల్లిగడ్డల ధరలు కేజీ రూ.220 నుంచి రూ.240 మధ్యలో ఉన్నాయి.

పాకిస్తాన్‌లో కొండెక్కిన ఉల్లి ధర

ఉల్లిగడ్డలు కొనడం ఆపడమెలా?

ఈ వారం కేజీ ఉల్లిగడ్డలను తాను రూ.260కి కొన్నట్లు క్వెట్టాకు చెందిన సహరీష్ నాజ్ అనే మహిళ బీబీసీ ప్రతినిధి మహమ్మద్ కజిమ్‌కి చెప్పారు.

మార్కెట్‌కి వెళ్లే ప్రతి వారం కూడా ఉల్లిగడ్డల రేట్లు పెరుగుతూనే ఉన్నాయని, ప్రతి వారం కొత్త రేటు చెబుతున్నారని ఆమె అన్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే నిత్యావసర వస్తువు అయిన ఉల్లిపాయ ధర ఈ స్థాయిలో పెరిగిందని ఆమె ఆరోపించారు.

‘‘ఎవరూ కూడా ఏమీ ఆలోచించడం లేదు. కేవలం ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని పెంచుతూ పోతుంది. పేద ప్రజలు ఈ ధరలను తట్టుకుని ఎలా బతకగలుగుతారని మాత్రం వీరు ఆలోచించడం లేదు’’ అని మిషాయిల్ నయీమ్ అన్నారు.

పాకిస్తాన్‌లో కొండెక్కిన ఉల్లి ధర

ఫొటో సోర్స్, Getty Images

ఎందుకు ధరలు పెరిగాయి?

ఉల్లిపాయల ధరలు ఇంతలా పెరిగేందుకు ప్రధాన కారణం గత ఏడాది వచ్చిన వరదలేనని అంటున్నారు రైతులు, మార్కెట్ ఏజెంట్లు.

వరదల కారణంగా పెద్ద మొత్తంలో పంటలు దెబ్బతిన్నాయి.

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి వచ్చే నెలలో కాస్త మెరుగుపడే అవకాశం ఉందని ఏజెంట్లు అంటున్నారు. ఎందుకంటే, మార్కెట్‌కి కొత్త ఉల్లి పంట వస్తుందని చెబుతున్నారు.

పాకిస్తాన్‌కి ఉల్లిగడ్డలు తజికిస్తాన్, ఇరాన్ నుంచి కూడా వస్తుంటాయి. ఈ ఉల్లిగడ్డల ధరలు పాకిస్తాన్ ఉల్లిగడ్డల కంటే కేజీ రూ.20 తక్కువగానే ఉంటాయి.

ఈసారి ఐదు టన్నుల ఉల్లిగడ్డలు పండినట్టు బలూచిస్తాన్ జమిందార్ యాక్షన్ కమిటీ ప్రధాన కార్యదర్శి అబ్దురెహ్మాన్ బజాయి చెప్పారు. బలూచిస్తాన్, సింధ్‌లో గత ఏడాది ఉల్లి పంట బాగా దెబ్బతిన్నదని, దీంతో ఉల్లిగడ్డల కొరత నెలకొందని ఆయన చెప్పారు.

పంజాబ్ నుంచి మార్కెట్‌కి పంట వస్తే ధరలు దిగొస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

పాకిస్తాన్‌లో కొండెక్కిన ఉల్లి ధర

ఒకవైపు ఉల్లి పంట దెబ్బతినడంతో పెద్ద మొత్తంలో డిమాండ్-సప్లయ్ అంతరాయం నెలకొందని, మరోవైపు ఇరాన్ నుంచి ఉల్లిగడ్డల దిగుమతులు దగ్గాయని ఫెడరేషన్ ఆఫ్ పాకిస్తాన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్‌పీసీసీఐ) బలూచిస్తాన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు అఖ్తార్ కాకర్ చెప్పారు.

ఉల్లిగడ్డల ఎగుమతులపై ఇరాన్ సుంకాలను పెంచిందని ఆయన తెలిపారు. మరోవైపు పెద్ద మొత్తంలో ఉల్లిగడ్డలు ఆ దేశం నుంచి అఫ్గానిస్తాన్‌కి కూడా వెళ్తున్నాయని, దీంతో ఇరాన్ నుంచి పాకిస్తాన్‌కి వచ్చే ఉల్లిపాయల సరఫరా తగ్గిందని చెప్పారు.

గత ఏడాది వచ్చిన వర్షాలకు, వరదలకు ఇతర పంటల మాదిరి ఉల్లిపంట కూడా దెబ్బతిందని ఖడ్‌కుచా ప్రాంతానికి చెందిన రైతు అబ్దుల అలీమ్ ఖాన్ చెప్పారు.

తామేసిన నాలుగు ప్రాంతాల్లో మూడు ప్రాంతాల్లో ఉల్లి పంట దెబ్బతిందని, కేవలం ఒకే ఒక్క ప్రాంతంలో పంట బతికిందని ఆయన తెలిపారు.

కాలమేదైనా, ఉల్లి పంట తమకు కన్నీళ్లు తెప్పిస్తుందని పెషావర్ కూరగాయల మార్కెట్‌లో తమల్ని కలిసిన గులామ్ ఖాన్ చెప్పారు.

త్వరలోనే పరిస్థితి మారుతుందన్న దానిపై తనకు ఎలాంటి ఆలోచన లేదన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)