ఆంధ్రప్రదేశ్: శ్రీకాకుళం నుంచి మత్స్యకారులు గుజరాత్‌కు ఎందుకు వలస పోతున్నారు?

మత్స్యకారులు

ఫొటో సోర్స్, Lakkoju srinivas/BBC

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకారులు చేపల వేటకు గుజరాత్, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలకు వెళ్తూ... అక్కడ దారి తప్పి పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక నేవీలకు చిక్కి జైళ్లలో కాలం వెళ్లదీసిన ఘటనలు చాలా వెలుగుచూస్తున్నాయి.

దేశంలోనే గుజరాత్ తర్వాత అత్యంత పొడవైన తీర ప్రాంతమున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఏపీలో ఉన్న శ్రీకాకుళం జిల్లాలో 193 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం, 145 మత్స్యకార గ్రామాల్లో సుమారు రెండులక్షల మంది మత్స్యకారులున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో 50 వేల మంది మత్స్యకారులుంటారని అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఇందులో 50శాతానికి పైగా వలస వెళ్తారు. ముఖ్యంగా జిల్లాలో వజ్రపుకొత్తూరు, సోంపేట, కవిటి, సంతబొమ్మాళి, పోలాకి, రణస్థలం, ఎచ్చెర్ల, గార తీర మండలాల నుంచి మత్స్యకారులు అత్యధికంగా వలస వెళ్తుంటారు.

గుజరాత్‌లోని వీరావలి, కర్ణాటకలోని రత్నగిరి, మహారాష్ట్రలోని ముంబయి, ఒడిశాలోని పారాదీప్, గోపాల్‌పుర్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గోవా తీర ప్రాంతాలకు వేటకు వెళ్తారు.

మత్స్యకారులు

ఫొటో సోర్స్, Lakkoju srinivas/BBC

డి. మత్యలేశం, కె. మత్యలేశం గ్రామాలల్లోని మత్స్యకారులు 2018 ఆగష్టులో చేపల వేటకు గుజరాత్ వెళ్లి... అనుకోని పరిస్థితుల్లో పాకిస్తాన్ బోర్డరుకు చేరుకున్నారు. వెంటనే పాకిస్తాన్ నేవీ వీరిని అదుపులోకి తీసుకుంది.

14 నెలల పాటు వారు పాకిస్తాన్ జైళ్లలోనే ఉండవలసి వచ్చింది. అలా పాకిస్తాన్ జైళ్లలో గడపడంతో శరీరమంతా వణికి అనారోగ్యానికి గురైన గురుమూర్తిని బీబీసీ కలిసి మాట్లాడింది.

“ఇక్కడ మా కడుపు నిండక గుజరాత్ వెళ్లాం. గుజరాత్‌లో నెలకు పది వేలు ఇచ్చేవారు. అలా వేట చేస్తూ...చేస్తూ... దారి తెలియక అంటే మా సెల్ ఫోన్లులోని జీపీఎస్ పని చేయకపోవడంతో పాకిస్తాన్ బోర్డరుకు వెళ్లిపోయాం. పాకిస్తాన్ నేవీ వాళ్లు వచ్చి మమ్మల్ని పట్టుకున్నారు. మా ఆధార్ కార్డులు, సెల్‌ఫోన్లు తీసేసుకున్నారు. 14 నెలలు అక్కడి జైల్లోనే ఉన్నాం. మన దేశానికి, మా ఊరికి వస్తామని అనుకోలేదు. ఆ దిగులుతోనే నా ఆరోగ్యం పాడైంది. నేను నిలబడితే శరీరమంతా వణుకుతూనే ఉంటుంది” అని వణుకుతూనే మాట్లాడారు గురుమూర్తి.

“జెట్టీ ఉంటే అంతంత దూరాలు వెళ్లి మా జీవితాలను ఎందుకు కష్టంలో పెట్టుకుంటాం. నేనే గత 20 ఏళ్లుగా చూస్తున్నాను. జెట్టీ కట్టిస్తున్నామని చాలా మంది నాయకులు మాట ఇచ్చారు. కానీ ఇప్పటీ వరకు జెట్టీ లేదు.. మట్టి లేదు. జెట్టీ ఉంటే మా ఊరికే అందరు వ్యాపారులు వస్తారు. మేం ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు” అని గురుమూర్తి బీబీసీతో అన్నారు.

మత్స్యకారులు

ఫొటో సోర్స్, Lakkoju srinivas/BBC

 ‘20, 30 కిలోమీటర్లకు ఒక జెట్టీ అక్కడ...’

ఆగష్టు, సెప్టెంబరు నెలల్లో జిల్లాలోని మత్స్యకార గ్రామాలకు వస్తే ఇక్కడ అంతా కర్ఫ్యూ వాతావరణంలా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ సమయంలోనే వీరంతా వేటకు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తుంటారు.

ఆ సీజన్ మార్చి, ఏప్రిల్ వరకు కొనసాగుతుంది. అలా వేటకు వెళ్లిన వారు అనుకోని ప్రకృతి విపత్తుల వలనో, మరే ఇతర కారణాల వలనే ఇతర దేశాల సరిహద్దుల్లోకి వెళ్లిపోయి అక్కడ రక్షణ దళాలకు చిక్కుకుంటారు. అలా శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ జైళ్లలో చాలా మంది మత్స్యకారులు ఉండాల్సిన పరిస్థితులు వస్తుంటాయి.

గుజరాత్, కేరళ, తమిళనాడులోని తీరప్రాంతంలో ప్రతి 20, 30 కిలోమీటర్లకు ఒక జెట్టీని ఉంటుందని, శ్రీకాకుళం జిల్లాకు చూసుకుంటే విశాఖపట్నం దాటిన తర్వాత మళ్లీ ఎక్కడ జెట్టీ లేదని మత్స్యకారులు చెప్పారు.

“మా సముద్రం మీదే వేటకు వెళ్లాలని ఉంటుంది. కాకపోతే ఇక్కడ కష్టం ఎక్కువ, లాభం తక్కువ. పైగా ప్రాణాలతో తిరిగి వస్తామా లేదా అనే భయం కూడా ఎప్పుడు మాతో పాటే ఉంటుంది. ఎందుకంటే జెట్టీ ఉంటే తెరతోనైనా వేటకు వెళ్లొచ్చు. రాత్రి సమయంలోనైనా ఏ భయం లేకుండా వేటాడొచ్చు. జెట్టీ లేకపోతే అలలు అటుపోట్ల వలన వేటలో ఉన్న పడవలు తిరగబడి, చనిపోయిన సంఘటనలు చాలా చూశాం. జెట్టీ ఉంటే అలాంటి పరిస్థితి రాదు. వాననొచ్చినా, తుపానొచ్చినా మా పడవలు అన్నింటికి జెట్టీ దగ్గరే కట్టేసుకొవచ్చు. అది లేకపోవడం వలన ఏ మాత్రం వాతావరణం మారినా పడవలు, బోట్లను కిరాయికి మనుషులను పెట్టుకుని ఒడ్డుకు తెచ్చుకోవాలి” అని డి. మత్యలేశం మత్స్యకారుడు గంగరాజు బీబీసీతో చెప్పారు.

మత్స్యకారులు

ఫొటో సోర్స్, Lakkoju srinivas/BBC

‘మా కుటుంబాల కోసం వలసలు తప్పడం లేదు’

‘‘జెట్టీలు కడతామనే మాట మా చిన్నప్పటి నుంచి వింటున్నాం కానీ జెట్టీ కానీ, చిన్న గోడ కానీ ఏదీ మా జిల్లా సముద్రతీరంలో కట్టలేదు’’అని వజ్రాపుకొత్తూరు మండలానికి చెందిన మత్స్యకారుడు అంబటి రాము బీబీసీతో చెప్పారు.

“అసలు మా జిల్లాలో వేట గిట్టుబాటు కానీ పనిలా మారింది. వేటకి వెళ్దామన్నా కూడా వలకి దొరికిన చేపకు మంచి ధర రాదు. ఎంతో కొంతకు ఇచ్చేసి వదిలించుకోవడం, లేదా వండుకుని తినడం ఇదే పనైపోయింది. జిల్లాలోని 150 మత్స్యకార గ్రామాలున్నాయి, అయినా ఒక్క జెట్టీ కూడా లేదు. కేరళ, తమిళనాడు, గుజరాత్‌లో అయితే ఎక్కడికక్కడ జెట్టీలుంటాయి. అందుకే అక్కడకు ఉపాధి కోసం వెళ్తున్నాం. మా కుటుంబాల కోసం మాకు వలసలు తప్పనిసరిగా మారాయి. ప్రస్తుత ప్రభుత్వం కూడా మాటలే కానీ.. చేతల్లో జెట్టీల నిర్మాణం చూపించడం లేదు” అని రాము చెప్పారు.

జెట్టీలతో పాటు చేపలను నిల్వ చేసుకునేందుకు కోల్ట్‌ స్టొరేజీలు, చేపలను ఎండ బెట్టుకునేందుకు ప్లాట్‌ఫాంలు జిల్లాలో ఎక్కడ కనిపించవు.

దేశంలో గుజరాత్ తర్వాత విశాలమైన తీరప్రాంతమున్న రాష్ట్రం మనదే, మొత్తం 950 కిలోమీటర్ల తీర ప్రాంతమున్న ఏపీలోని శ్రీకాకుళం జిల్లా తీర ప్రాంతం 193 కిలోమీటర్లు. అయినా ఒక్క జెట్టీ కూడా లేదు. అయితే రాష్ట్రంలోని తీర ప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక జెట్టీతో పాటు 9 హార్బర్లను నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది.

మత్స్యకారులు

ఫొటో సోర్స్, Lakkoju srinivas/BBC

‘మత్స్యకారుల జీవితాలతో రాజకీయాలు వద్దు’

ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల సమయంలో మాకు జెట్టీలు, హార్బర్లు కట్టేస్తామని గత 25 ఏళ్లుగా మాటిస్తున్నాయి, కానీ మాటలే కానీ చేతల్లో చూపిన ప్రభుత్వం ఒక్కటి లేదని మత్స్యకారులు చెప్తున్నారు. జెట్టీలు నిర్మిస్తే తమ బతుకులు మారతాయని నమ్మకంతో ఉన్నామని మత్స్యకార యువత అంటున్నారు.

మత్స్యకార యువకుల్లో చాలా మంది చదువుకున్నా ఉపాధి అవకాశాలు లేక చేపల వేటనే వృత్తిగా చేస్తున్నారు. వారు అంతా జెట్టీ కావాలని, అది తమ జీవితాలకు మేలు చేస్తుందని నమ్ముతున్నామని చెప్తున్నారు.

“ప్రభుత్వ అంచనాల ప్రకారం 25 కోట్లతో ఒక జెట్టీ నిర్మించవచ్చు. మనం చాలా సినిమాల్లో జెట్టీలను చూస్తుంటాం. రాళ్లను అడ్డుగా వేసి అలల అటుపోట్లను అడ్డుకునేది జెట్టీ. దాని వలన పడవలు, బోట్లు పెట్టుకునే చోట్ల అలల అలజడి ఉండదు. దాంతో వాటికి రక్షణ ఏర్పడుతుంది. జెట్టీ ఉంటే వ్యాపారులు చేపల కొనుగోలుకు నేరుగా మత్స్యకార గ్రామాలకే వస్తారు. అలా వారు వస్తే కోల్డ్ స్టోరేజ్‌లు వస్తాయి. ఉపాధి పెరుగుతుంది. గ్రామాలు బాగుపడతాయి” అని మత్స్యకార యువకుడు డు జి. రామారావు బీబీసీతో అన్నారు.

“గుజరాత్ అంటే అదీ మన దేశమే, అది దుబాయ్, అమెరికా కాదు కదా. అక్కడ ముఖ్యమంత్రులు జెట్టీలు కట్టేటప్పుడు, ఇక్కడ ముఖ్యమంత్రులు ఎందుకు బాధ్యత తీసుకోవడం లేదో మాకు అర్థం కావడం లేదు. మాకు ఏ రాజకీయ పార్టీతో పని లేదు. జెట్టీ కట్టిస్తే మా పని మేం చేసుకుంటాం” అని ఆయన చెప్పారు.

మత్స్యకారులు

ఫొటో సోర్స్, Lakkoju srinivas/BBC

‘వలసలే మాకు గతి’

‘‘చంద్రబాబు, జగన్, మాకు మాటిచ్చారు.. హార్బర్లు, జెట్టీలు కట్టిస్తామని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదే మాట చెప్తున్నారు. ఇలా మాటలు వినడమే కానీ, జెట్టీని చూస్తామో లేదో’’ అని రణస్థలానికి చెందిన ఏ. అప్పన్న నాయుడు బీబీసీతో అన్నారు.

రణస్థలంలో జనసేన నిర్వహించిన ‘యువశక్తి’ సభలో పవన్ కళ్యాణ్ తమ పార్టీ అధికారంలోకి వస్తే జెట్టీలను నిర్మిస్తామని ప్రకటించారు.

“కనీసం మినీ జెట్టీలైనా కట్టండని అంటున్నాం. ప్రభుత్వాలు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాయి. కానీ పనులే చేయడం లేదు. త్వరలోనే ఎన్నికలు వస్తున్నాయి. హామీలొద్దు, ఏ రాజకీయ పార్టీ అయినా, ప్రభుత్వమైనా మాకు కనీసం మినీ జెట్టీ కట్టిపెట్టండి చాలు. మేం ధైర్యంగా వేటకు వెళ్లి వచ్చేస్తాం. అది కూడా చేయలేకపోతే వలసలకు పోవడమే మా గతి. మా పడవలు, వలలు, మా పాకలను గాల్లో దీపాల్లో పెట్టి బతకడమే” అని అప్నన్న చెప్పారు.

వీడియో క్యాప్షన్, విశాఖపట్నం మత్స్యకారుల జీవితంలో ఒకరోజు - 'ఒక్కోసారి వేటకు వెళ్తే తిరిగి రావడంకష్టమే'

‘వంద శాతం వలసలు ఆగిపోతాయి’

2014 నుంచి ఇప్పటీ వరకు టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్‌తోపాటు డి. మత్స్యలేశం, రాళ్లపేటలో జెట్టీ, కవిటి మండలం ఇద్దివానిపాలెంలో జెట్టీ, సోంపేట మండలం బారువా కొత్తూరులో జెట్టీ, వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు-మంచినీళ్లుపేట జెట్టీ కట్టిస్తాం అని హామీలు ఇచ్చాయి.

అయితే వీటిలో డి. మత్యలేశం గ్రామంలో 2017లో టీడీపీ హయంలో జెట్టీ నిర్మాణానికి సర్వే చేశారని, ఆ తర్వాత ఎందుకో మళ్లీ ఆ పని ముందుకు వెళ్లలేదని మత్స్యకారులు చెప్పారు. ఇప్పుడు బుడగట్లపాలెం వద్ద జెట్టీ నిర్మిస్తున్నామని వైసీపీ ప్రభుత్వం చెప్తోంది.

ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు జిల్లాలోని మత్స్యకార కుంటుంబానికి చెందిన వారే. ప్రస్తుతం బుడగట్లపాలెంలో జెట్టీ నిర్మాణ పనులు జరుగున్నాయని, అక్కడే హార్బర్ కూడా ఏర్పాటు చేసే కృషి జరుగుతుందని మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు.

“రూ.350 నుంచి రూ. 450 కోట్లు ఒక్కొక్క హార్బరుకు ఖర్చు అవుతుంది. ఈ రకంగా తీసుకుంటే రాష్ట్ర తీర ప్రాంతంలో సుమారు రూ. 3500 కోట్లతో తీర ప్రాంతంలో మా ప్రభుత్వం మెరైన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్మిస్తోంది. జెట్టీలు, హార్బర్లు నిర్మాణంతో రానున్న రోజుల్లో ఈ తీర ప్రాంతంలో వలసలు పూర్తిగా నివారిస్తాం. సీఎం జగన్ ఫోటోను ప్రతి మత్స్యకారుడు వాళ్ల ఇంట్లో పెట్టుకోబోయే పరిస్థితి వస్తుంది” అని మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు.

వీడియో క్యాప్షన్, థర్మోకోల్ బోట్లతో చేపల వేట.. ఖర్చు తక్కువ, ఫలితం ఎక్కువ..

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)