భారీ ఆక్వేరియం పగలడంతో వీధుల్లో వరద, వందల కొద్దీ చేపలు.. వందల కోట్ల రూపాయల నష్టం

బెర్లిన్ నగరంలో భారీ ఆక్వేరియం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మిషేల్ షీల్స్ మెక్‌నామీ , బెర్లిన్ నుంచి జెన్నీ హిల్, మిషేల్ స్టైనింగర్
    • హోదా, బీబీసీ న్యూస్

జర్మనీలోని బెర్లిన్ నగరంలో రాడిసన్ బ్లూ హోటల్‌లో 10 లక్షల లీటర్ల నీటితో ఉన్న ఒక భారీ ఆక్వేరియం పగిలిపోయింది.

ఈ నీరు హోటల్‌తో పాటు సమీపంలోని రోడ్లనూ ముంచెత్తింది.

‘‘ఆక్వాడోమ్’’ అని పిలిచే ఈ ఆక్వేరియం 14 మీటర్ల (46 అడుగుల) ఎత్తు ఉండేది.

అందులో 1,500 చేపలు ఉండేవి. ప్రపంచంలోనే అతి పొడవైన గుండ్రని ఆక్వేరియంగా దీనిని చెప్తారు.

ఈ ఆక్వేరియం పగిలిపోయిన ఘటనలో గాజు ముక్కలు తాకి ఇద్దరికి గాయాలయ్యాయి.

ఈ పేలుడు వల్ల భారీ నష్టం జరిగిందని పోలీసులు చెప్పారు.

ఖాళీ అయిన ట్యాంక్, హోటల్ లాబీలో నీరు ప్రవహించటం, ఆక్వేరియం శిథిలాలు చెల్లాచెదురైన దృశ్యాలు ఒక వీడియోలో కనిపిస్తున్నాయి.

స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 5:50 గంటలకు ఆక్వేరియం పగిలిపోయింది.

దీంతో హోటల్‌ గదుల్లో ఉన్న అతిథులను ఖాళీ చేయించి బయటకు తరలించారు.

వీడియో క్యాప్షన్, వీడియో: బెర్లిన్ హోటల్‌లో భారీ ఆక్వేరియం పేలిన తర్వాత విధ్వంసం దృశ్యాలివీ

ఈ ఆక్వేరియంలో ఉండే చేపలు చాలా వరకూ చనిపోయాయని బెర్లిన్ అగ్నిమాపక శాఖ అధికార ప్రతినిధి ఒకరు బీబీసీకి చెప్పారు.

వాతావరణం చాలా చలిగా ఉండటం వల్ల.. చేపలను రక్షించటానికి చాలా కష్టంగా ప్రయత్నించాల్సి వచ్చిందని తెలిపారు.

ఈ ఆక్వేరియంలో 100కు పైగా విభిన్న జాతుల చేపలు ఉండేవి.

రాడిసన్ బ్లూ హోటల్ వెలుపల.. శిథిలాలు, చెత్త పోగుపడింది. ఆక్వేరియం పేలుడు ధాటికి హోటల్ తలుపులు విరిగిపోయి బయటకు వేలాడుతున్నాయి.

ఈ ఘటన జరిగినపుడు హోటల్‌లోని నాలుగో అంతస్తులో పాల్ మాలెట్జీ, ఆయన గర్ల్‌ఫ్రెండ్ బస చేస్తున్నారు.

భారీ శబ్దంతో పాటు హోటల్ భవనం కంపించటంతో తమకు మెలకువ వచ్చిందని ఆయన వివరించారు. లాబీలోకి తొంగి చూసినపుడు నీరంతా పొంగుతూ కనిపించిందని చెప్పారు.

ఆ తర్వాత సాయుధ పోలీసులు తమను, ఇతర గదుల్లోని అతిథులను బయటకు తీసుకువెళ్లారని తెలిపారు.

బెర్లిన్ నగరంలో పేలిన భారీ ఆక్వేరియం

ఫొటో సోర్స్, REUTERS /MICHELE TANTUSSI

బెర్లిన్ మేయర్ ఫ్రాన్జిస్కా జిఫ్పే హోటల్‌ను సందర్శించి జరిగిన నష్టాన్ని పరిశీలించారు. ఆక్వేరియం పేలుడు ఒక సునామీలాగా ఉందని ఆమె అభివర్ణించారు.

అయితే ఈ ప్రమాదం తెల్లవారుజామున జరగటంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. ఒక గంట తర్వాత హోటల్ లాబీలోను, బయటి రోడ్డు మీద చిన్నారులతో సహా సందర్శకులతో రద్దీగా ఉండేదని చెప్పారు.

హోటల్ వెలుపలి దృశ్యం తీవ్ర విధ్వంసపూరితంగా ఉందని.. ఈ హోటల్‌లోనే బసచేసి ఉన్న జర్మన్ ఫెడరల్ పార్లమెంటు సభ్యురాలు సాండ్రా వీసర్ స్థానిక టీవీ చానల్‌తో మాట్లాడుతూ తెలిపారు.

ఆక్వేరియం నుంచి బయటపడిన చేపలు చలికి గడ్డకట్టుకుపోయి చనిపోయాయన్నారు.

ఈ ఆక్వేరియాన్ని రెండేళ్ల కిందట ఆధునికీకరించారు. ఆక్వేరియం లోపల పారదర్శకమైన గోడలతో ఒక లిఫ్ట్‌ కూడా ఉంది. సందర్శకులు దానిని ఉపయోగించేవారు. హోటల్‌లోని కొన్ని గదులు ఈ ఆక్వేరియాన్ని వీక్షించటానికి అనువుగా ఉన్నాయని కూడా ప్రచారం చేస్తుండేవారు.

బెర్లిన్ నగరంలో పేలిన భారీ ఆక్వేరియం

ఫొటో సోర్స్, EPA

ఆక్వేరియం పేలిన వెంటనే 100 మందికి పైగా సిబ్బందిని ఘటనా స్థలానికి పంపించినట్లు బెర్లిన్ అగ్నిమాపక విభాగం తెలిపింది.

ఆక్వేరియం ట్యాంక్ పగిలిపోవటానికి కారణమేమిటనేది ఇంకా తెలియరాలేదని చెప్పింది.

ఎవరైనా గాయపడి ఉన్నారేమోనని హోటల్ లోపల జాగిలాలతో గాలించామని, ఎవరూ కనిపించలేదని వివరించింది.

సమీప ప్రాంతాల్లోకి భారీ మొత్తంలో నీరు ప్రవహిస్తోందని జనం జాగ్రత్తగా వాహనాలు నడపాలని పోలీసులు అప్రమత్తం చేశారు.

ఏదైనా దాడి వల్ల ఈ ఆక్వేరియం పేలిందని చెప్పటానికి ఎలాంటి ఆధారాలూ లేవని పోలీసు వర్గాలు స్థానిక మీడియాతో చెప్పాయి.

ఆక్వాడోమ్‌ను 2003 డిసెంబర్‌లో ప్రారంభించారు. ప్రపంచంలో అతిపెద్ద సిలిండ్రికల్ ఆక్వేరియంగా దీనిని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గుర్తించింది.

ఆ కాలంలో దీని నిర్మాణానికి దాదాపు 112 కోట్ల రూపాయలు (1.28 కోట్ల యూరోలు) ఖర్చయిందని చెప్తున్నారు.

బెర్లిన్ నగరంలో పేలిన భారీ ఆక్వేరియం

ఫొటో సోర్స్, Alamy

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)