రెయిన్ వాటర్ హార్వెస్ట్: నీళ్లు విపరీతంగా వాడేసి ఎడారిలాగా మారిపోయిన నగరం.. తిరిగి పచ్చగా ఎలా మారిందంటే..

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా నైరుతి ప్రాంతమంతా తీవ్రమైన కరవుతో సతమతమవుతున్న వేళ ఎండిపోయిన ఒక నది తీరాన ఉన్న నగరం ఒకటి ఎడారి నుంచి నీరు సేకరించడం ఎలా అన్న ప్రశ్నకు సమాధానం చెబుతోంది.
దక్షిణ ఆరిజోనాలోని టక్సన్‌లో 'వాల్ లిటిల్' ఇంటి ఎదుట ఒక చిన్నబోర్డ్ ఉంది. చిన్నదే కానీ సగర్వంగా కనిపిస్తున్న ఆ బోర్డుపై ''ఈ ఇల్లు వాన నీటిని ఒడిసిపడుతుంది'' అని ఉంది.
రెండు నెలలకు ఓసారి 68 ఏళ్ల వాల్ లిటిల్ నిచ్చెన వేసుకుని తన ఇంటిపైకి ఎక్కి ఆకులన్నీ తుడుస్తుంటారు. ఆకులను తుడవకపోతే.. 'ఇంటిపైన చేరే నీరు కిందకు పారే పైపు రంథ్రాన్ని ఈ ఆకులు మూసేస్తాయి' అని చెప్పారు వాల్ లిటిల్.
లిటిల్ ఇంటిపై చేరే వర్షం నీరు ఇంటి వెనుక ఉన్న 4,900 లీటర్ల ప్లాస్టిక్ ట్యాంకులోకి ఈ పైపులలోంచే వెళ్తాయి.
లిటిల్ పెరట్లో ఇలాంటివి రెండు ట్యాంకులున్నాయి. సెప్టెంబరు చివర్లో ఆ రెండు ట్యాంకులూ దాదాపు నిండిపోయాయి. రుతుపవనాల కారణంగా వేసవిలో వర్షాలు కురవడంతో ట్యాంకులు రెండూ నిండాయి.
'మా వర్షం నీళ్ల ట్యాంకులు సగం కంటే తక్కువ నిండడం నేను ఎప్పుడూ చూడలేదు'' అని లిటిల్ చెప్పారు. ఇలా సేకరించిన వర్షం నీటితోనే ఆమె తన కూరగాయల తోటకు నీళ్లు పెడతారు.
వర్షాకాలం తరువాత ఆమె కూరగాయల తోటకు నీరు పెట్టడానికే కాదు, పండ్ల మొక్కలకు నీరు పెట్టడానికి.. తాగడానికి, వంటకు కూడా ఆమె ఈ నీటినే ఉపయోగిస్తుంటారు.
ఒక్క వాల్ లిటిలే కాదు... టక్సన్ ప్రజలంతా దాదాపు ఇదే పనిచేస్తారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి ఏడాదంతా ఉపయోగించుకుంటారు.

ఫొటో సోర్స్, Getty Images
టక్సన్ దాదాపు ఎడారి ప్రాంతంలాంటిది. ఇక్కడ వార్షిక సగటు వర్షపాతం 30 సెంటీమీటర్లు.
అందుకే రోజువారీ అవసరాలకు కావాల్సిన నీటిని వీరు ఇలా సంపాదించుకుంటారు. టక్సన్ నగర అధికారుల చొరవతో ప్రతిపాదించిన రెయిన్ హార్వెస్టింగ్ విధానాలను ప్రజలు అనుసరిస్తున్నారు.
అమెరికాలోని పశ్చిమ రాష్ట్రాలు సహా ప్రపంచంలోని అనేక నగరాలు, పట్టణాలు నీటి కొరతను ఎదుర్కొంటున్న తరుణంలో టస్కన్ అనుసరిస్తున్న వర్షపు నీటి పొదుపు విధానాలు అనుసరణీయమని నిపుణులు చెబుతున్నారు.
'కొత్తగా మౌలిక సదుపాయాలు కల్పించకుండానే నీటి సరఫరా పెంచడానికి, నీటి డిమాండ్‌ను తగ్గించడానికి వర్షపు నీటి సేకరణ విధానాలు ఎలా ఉపయోగపడతాయనడానికి టక్సన్ ఒక సక్సెస్‌ఫుల్ ఉదాహరణ' అని లింకన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ల్యాండ్ పాలసీకి చెందిన బాబిట్ సెంటర్ ఫర్ ల్యాండ్ అండ్ వాటర్ పాలసీ అసోసియేట్ డైరెక్టర్ పావ్‌లా రాండల్ఫ్ చెప్పారు. 'టక్సన్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది' అన్నారామె.
అమెరికా పశ్చిమ రాష్ట్రాలలోని అనేక ఇతర నగరాల మాదిరిగానే టక్సన్ మునిసిపల్ వాటర్ సప్లయ్ కూడా ప్రధానంగా రెండింటిపై ఆధారపడుతుంది.
మొదటిది కొలరాడో నది కాగా రెండోది భూగర్భజలాలు. కొలరాడో నదిపై సెంట్రల్ ఆరిజోనా ప్రాజెక్ట్ నుంచి 540 కిలోమీటర్ల పొడవైన కెనాల్, పైప్‌లైన్ల ద్వారా టక్సన్ నగరానికి నీళ్లొస్తాయి. టక్సన్ నీటి అవసరాలలో 82 శాతం తీర్చేది కొలరాడో నదే.
మిగతా నీటి అవసరాలకు భూగర్భ జలాలపై ఆధారపడుతున్నారు.
కొలరాడో నదిపై పశ్చిమ అమెరికాలోని ఏడు రాష్ట్రాలు, ఉత్తర మెక్సికోలోని రెండు రాష్ట్రాలు ఆధారపడుతున్నాయి. ఈ 9 రాష్ట్రాలలోని 4 కోట్ల మంది ప్రజలు, 40 లక్షల ఎకరాల వ్యవసాయ భూమికి ఇదే జీవాధారం.
ఈ నేపథ్యంలో ఇప్పటికే కొలరాడో నది నీటి వినియోగం భారీ స్థాయిలో ఉంది. దశాబ్దాల తరబడి అవసరాన్ని మించి నీటిని తోడేయడం, గత 1200 ఏళ్లలో ఎన్నడూ లేనిస్థాయిలో కరవు ఏర్పడడంతో కొలరాడో నదిలో నీటి లభ్యత తగ్గి జలాశయాలు అడుగంటాయి.
ముందుముందు పరిస్థితి మరింత దిగజారుతుందని భావిస్తున్నారు. వచ్చే 30 ఏళ్లలో కొలరాడో నదిలో మూడొంతుల నీరు తగ్గిపోతుందని యూఎస్ జియోలాజికల్ సర్వే శాస్త్రవేత్తలు 2021లో జరిపిన అధ్యయనం అంచనా వేసింది.

ఫొటో సోర్స్, Getty Images
1974 వేసవి కాలంలో టక్సన్ తీవ్ర నీటి కరవును ఎదుర్కొంది. నీటి కొరత ఎక్కడకు దారితీస్తుందో అని అంతా ఆందోళన చెందారు.
అప్పటికి టక్సన్ ఎక్కువగా భూగర్భజలాలపై ఆధారపడేది. ఆ ఏడాదిలో ఒక రోజు మధ్యాహ్నం నగరంలో నీటి నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయి.
గృహ అవసరాలకు కూడా నీరు లేని పరిస్థితి ఏర్పడింది. అగ్ని ప్రమాదాలు జరిగితే మంటలు ఆర్పడానికి కూడా నీరు లేని పరిస్థితి ఏర్పడింది.
దాంతో మేల్కొన్న నగర పాలన యంత్రాంగం కొత్త నిబంధనలు తీసుకురావడంతో పాటు వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ప్రణాళికలు రూపొందించింది.
కొత్తగా కట్టబోయే ప్రతి ఇంటిలోనూ వర్షపు నీటి సేకరణ ఏర్పాట్లు ఉండేలా చేశారు. వాడుక నీరు పెరటి మొక్కలకు మళ్లించుకునేలా ఏర్పాట్లు చేసుకున్నారు.
నీటి వినియోగాన్ని క్రమబద్ధీకరించేందుకు గాను ఎక్కువ నీరు వాడేవారు ఎక్కువ ధర చెల్లించేలా నిబంధనలు మార్చారు.
1974 నాటి పరిస్థితులను గుర్తుచేసుకున్న వాల్ లిటిల్ ఆ సంక్షోభం నుంచి ప్రజలు, ప్రభుత్వం పాఠాలు నేర్చుకున్నారని చెప్పారు.
ప్రజలు తమ పాత అలవాట్లు పూర్తిగా మార్చుకుని జల సంరక్షణను తమ విధిగా మార్చుకున్నారని లిటిల్ చెప్పారు.
నీటి వినియోగాన్ని క్రమబద్ధీకరించుకోవడంతో పాటు వర్షం నీటిని జాగ్రత్త చేసుకోవడంపై టక్సన్ పట్టణం పూర్తిగా దృష్టి పెట్టింది.
వర్షం నీటి సంరక్షణ విషయంలో సాధించిన ఈ ప్రగతికి 'బ్రాడ్ లాంకాస్టర్' కారణమని చెప్తారు.
బ్రాడ్ లాంకాస్టర్ పెర్మాకల్చర్ ఔత్సాహికుడు. 1990లలో ఆయన తన పెరట్లో సాగు ప్రారంభించారు. టక్సన్‌లో వాటర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఏమాత్రం బాగులేదని గుర్తించిన ఆయన ప్రత్యామ్నాయ పద్ధతుల అన్వేషణకు ఆఫ్రికాలోని దక్షిణ దేశాలకు వెళ్లారు.
అక్కడ ఆయన జెఫానియా ఫిరి మసేకో అనే రైతును కలిశారు.
మసేకో జింబాబ్వేలోని తన కుటుంబానికి ఉన్న బంజరు భూమిని సాగుకు అనుకూలంగా మార్చడంలో విజయం సాధించిన రైతు.
దోనెలు, చిన్నపాటి రాతి ఆనకట్టల సహాయంతో ఆయన వర్షం నీటిని సక్రమంగా వినియోగించుకుంటూ బంజరు భూమిలో పంటలు పండించారు.
'మసేకో చాలా తక్కువ వనరులతోనే ఇదంతా చేయడం చూసి ఆశ్చర్యపోయాను' అని లాంకాస్టర్ గుర్తు చేసుకున్నారు.
లాంకాస్టర్ అక్కడి నుంచి టక్సన్ చేరుకున్న తరువాత మసేకో నుంచి నేర్చుకున్నది ఆచరణలో పెట్టడం ప్రారంభించారు.
తన సొంత స్థలంలోనే పైలట్ ప్రాజెక్టుగా ఇదంతా మొదలుపెట్టారు.
రోడ్డు పక్కన మట్టిని తవ్వి అందులో స్థానిక మొక్క జాతులను నాటారాయన. వర్షం నీరు అక్కడకు చేరేలా మార్గాలు ఏర్పరిచారు.
ఆ చెట్లు పెరుగుతున్నకొద్దీ వాటికి నీటి అవసరం పెరగడంతో.. రోడ్లపై నీరు ఈ చెట్ల వద్దకు వచ్చేలా రోడ్డు పక్కన తవ్వారు.
అలా చేయడం చట్టవిరుద్ధమని లాంకాస్టర్‌కు తెలుసు. ఇలా రోడ్లపై తవ్వేసి నీటిని మళ్లించడం అక్కడ చట్ట విరుద్ధం. దిగువ ప్రాంతాలవారి నీటి హక్కులను కాపాడేందుకు ఇలాంటి నియమాలు రూపొందించారు.
అయితే, లాంకాస్టర్ చేసింది చూశాక.. ఇరుగుపొరుగువారు కూడా అలా మొక్కలు పెంచడం ప్రారంభించారు.
దీంతో లాంకాస్టర్ దీనిపై స్థానిక అధికారులను కలిశారు. తాము అనుసరిస్తున్న పద్ధతిలో మొక్కలు పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వాలంటూ ఆయన అధికారులను ఆశ్రయించారు.
మొదట్లో లాంకాస్టర్ విన్నపాన్ని అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. వీధులన్నీ వర్షపు నీటి ప్రవాహానికి అనుకూలంగానే ఉన్నాయని మొదట్లో అధికారులు చెప్పుకొచ్చారు.
కానీ, రెండుమూడేళ్ల పాటు నిరంతరం లాబీయింగ్ చేశాక.. వర్షం నీటి సంరక్షణకు వీలుగా మార్పులు చేయాలని గుర్తించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు వీలుగా మార్పులు చేసేందుకు ప్రణాళికులు రూపొందించారు.
'ఇక్కడ చాలాకాలంగా ఉన్న పద్ధతుల వల్ల వర్షం నీరు వృథా అవుతోంది' అని టక్సన్ మాజీ కౌన్సిలర్ రోడ్నీ గ్లాస్‌మన్ అన్నారు. రోడ్లపై నీరు పక్కనుండే మొక్కల వద్దకు చేరే వీలుగా తవ్వుకునే అనుమతుల కోసం చేసిన ప్రయత్నాలకు రోడ్నీ నాయకత్వం వహించారు.
'వర్షం నీటిని ఉపయోగించుకునే అవకాశం ఉన్నా ఉపయోగించుకోలేకపోతున్నామని గ్రహించాం. లాంకాస్టర్ చేసింది చూశాక వర్షం నీటి వల్ల ఎంత ప్రయోజనం పొందొచ్చో అర్థమైంది' అన్నారు రోడ్నీ.
పట్టువదలకుండా లాంకాస్టర్ చేసిన ప్రయత్నాల కారణంగా అధికారులు వర్షం నీటిని ఉపయోగించుకునే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
సంగ్రహించిన వర్షం నీటితో వాణిజ్యపరంగా తోటలు పెంచేందుకు 2008లో టక్సన్‌లో బిల్లు ఆమోదించారు. అనంతరం 2013లో 'గ్రీన్ స్ట్రీట్స్ పాలసీ' తీసుకొచ్చారు. దాని ప్రకారం వర్షం పడినప్పుడు అందులో 1.3 సెంటీమీటర్ల నీటిని కచ్చితంగా సేకరించేలా రోడ్ల డిజైన్ ఉండాలి.
2020లో.. ప్రభుత్వం చేపట్టిన వాన నీటి సంరక్షణ ప్రాజెక్టుల కోసం ప్రజల నీటి వినియోగ బిల్లును స్వల్పంగా పెంచారు.
టక్సన్‌లో ఇప్పుడు అమలులో ఉన్న విధానాలు జలసంరక్షణను మించి అధిక ప్రయోజనాలు కలిగిస్తున్నాయంటున్నారు వాటర్ కంజర్వేషన్ మేనేజర్ కేండీస్ రూప్రెష్. జల సంరక్షణే కాకుండా మట్టి కోతను నివారించడం, అధిక వర్షాలు వచ్చినప్పుడు వీధుల్లో నీరు నిలవకుండా చూడడం వంటివన్నీ సాధ్యమవుతున్నాయంటున్నారు ఆమె.
అంతేకాదు, మొక్కల పెంపకం వల్ల టక్సన్ నగరంలో ఉష్ణోగ్రతలు తగ్గి చల్లదనం ఏర్పడుతున్నట్లు చెప్పారామె.

ఫొటో సోర్స్, Getty Images
2012లో టక్సన్ జలసంస్థ నీటి సంరక్షణకు పరికరాలు కొనేందుకు ప్రజలకు రాయితీ ఇవ్వడం ప్రారంభించింది. ఈ రాయితీ 2,000 డాలర్లు (సుమారు రూ. 1.63 లక్షలు) వరకు ఇస్తారు.
ఈ పథకంలో 2,600 కుటుంబాలు చేరాయి.
అయితే, మొదట్లో ఈ పథకం విజయవంతమైనప్పటికీ ఆ తరువాత పెద్దగా ఫలితం లేదని టక్సన్ జలసంస్థ గుర్తించింది.
రాయితీలు పొంది పరికరాలు కొన్నవారు ఒడిసి పడుతున్న వర్షం నీరు కంటే.. వారు తమ గార్డెన్లకు నీటి వినియోగం ఎక్కువవుతున్నట్లు అధికారులు గుర్తించారు.
అయితే, అధికారులు మెల్లమెల్లగా ప్రజలకు అవగాహన కల్పించడంతో పరిస్థితులు మారాయి. 2021 నాటి టక్సన్ వాటర్ కంజర్వేషన్ రిపోర్ట్ ప్రకారం.. ఈ రాయితీ పథకం కారణంగా 2021లో 15.8 కోట్ల లీటర్ల నీరు ఆదా చేయగలిగారు. మొత్తంగా ఇంతవరకు 420 కోట్ల లీటర్ల నీటిని సేకరించి వినియోగించారు.
ప్రజల్లో మరింత అవగాహన, చైతన్యం కల్పిస్తే నీటి సంరక్షణ ఇంకా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.
అయితే, నీటి సమస్య ఎదుర్కొన్న అన్ని పట్టణాలకూ ఇలాంటి మోడల్ పనిచేయకపోవచ్చని 'లింకన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ల్యాండ్ పాలసీ'కి చెందిన బాబిట్ సెంటర్ ఫర్ ల్యాండ్ అండ్ వాటర్ పాలసీలో పనిచేసే రాండల్ఫ్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ట్విటర్‌లో సగం ఉద్యోగాల కోత - 'మరో దారి లేదు'.. ఎలాన్ మస్క్ సమర్థన
- లాటరీలో రూ. 25 కోట్ల జాక్‌పాట్ కొట్టిన ఆటో డ్రైవర్‌కు ఊహకందని కష్టాలు
- చలికాలంలో చర్మ సౌందర్యాన్ని కాపాడుకునేందుకు10 జాగ్రత్తలు ఇవే...
- ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని మాత్రమే కాదు, అవతరణ దినోత్సవమూ ఒక గందరగోళమేనా?
- ‘‘నేను గర్భవతిని, వానొస్తే గుడిసెలోకి నీళ్లొస్తాయి. పాములు తేళ్లు కూడా లోపలికి వస్తుంటాయి.''-బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


















