World Cancer Day: క్యాన్సర్ కారణాలు ఏమిటి? ముందుగా గుర్తించడం ఎలా? చికిత్సలు ఏమున్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రతిభా లక్ష్మి
- హోదా, బీబీసీ కోసం
క్యాన్సర్ అంటే ఏమిటి? సాధారణంగా మన శరీరంలో కణ విభజనలు ఒక క్రమ పద్ధతిలో జరుగుతాయి. అయితే, కొన్ని కారణాల వల్ల, ఆ కణాలు నియంత్రణ కోల్పోయి, చాలా వేగంగా, అస్తవ్యస్తంగా విభజన చెంది కణ సమూహాలను ఏర్పరుస్తాయి. ఆ స్థితిని క్యాన్సర్ అంటారు. ఈ కణ సమూహాలను 'కణితి'( ట్యూమర్) అని పిలుస్తారు.
దేశంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధుల్లో మొదటి స్థానం గుండె జబ్బులది కాగా, ఆ తరవాత స్థానం క్యాన్సర్‌దే.
ప్రపంచ వ్యాప్తంగా, ఏటా కోటి మంది క్యాన్సర్‌తో మరణిస్తున్నారు. మన దేశంలో, ప్రతి సంవత్సరం సుమారు పదకొండు లక్షల మందికి క్యాన్సర్ సోకినట్లుగా నిర్ధారణ అవుతోంది. నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, ఊపిరి తిత్తుల క్యాన్సర్, కడుపు క్యాన్సర్ వీటిలో మొదటి వరుసలో ఉంటున్నాయి.
అయితే, మన దేశంలో క్యాన్సర్ బాధితుల్లో ప్రతి ముగ్గురిలో ఇద్దరికి, వ్యాధి ముదిరిన తరవాతే ఇది నిర్ధారణ అవుతోంది. దీంతో బతికే అవకాశాలు తగ్గిపోతున్నాయి.
అవగాహన లేక పోవడం, నిరక్షరాస్యత, భయం, వివిధ రకాల అపోహల వల్లే క్యాన్సర్ నిర్ధారణ ఆలస్యం అవుతోంది.
రొటీన్ స్క్రీనింగ్, ముందుగానే గుర్తించడం, తొలి దశలోనే చికిత్స చేయడం ద్వారా క్యాన్సర్ మరణాల్లో దాదాపు మూడింట ఒక వంతును అడ్డుకోవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
క్యాన్సర్ కారణాలు
నియంత్రించలేనివి: క్యాన్సర్ ముప్పుల్లో వయసు, జన్యు పరమైన కారణాలు, రోగ నిరోధక వ్యవస్థ వంటి వాటిని నియంత్రించడం కాస్త కష్టం.
నియంత్రించగలిగేవి: పొగాకు, మద్యపానం, ఊబకాయం, ఆహారపు అలవాట్లు, ఇన్ఫెక్షన్లు ఈ కోవకు చెందినవి. మన దేశంలో క్యాన్సర్ కారకాలలో 70% నివారించదగినవే. అందులో 40% పొగాకుకు సంబంధించినవి, 20% ఇతర వ్యాధుల వల్ల కలిగేవి, 10% ఇతర కారణాల వల్ల సంభవించే క్యాన్సర్లు.
పొగాకు: పొగాకు పద్నాలుగు రకాల క్యాన్సర్లకు కారణం అవుతోంది. పొగాకు పొగలో కనీసం 80 రకాల క్యాన్సర్ కారకాలు (కార్సినోజెనిక్ ఏజెంట్లు) ఉంటాయి. పొగను పీల్చినప్పుడు రసాయనాలు ఊపిరితిత్తులలోకి ప్రవేశిస్తాయి, రక్తప్రవాహంలోకి వెళ్లి శరీరమంతా రవాణా అవుతాయి . అందుకే ధూమపానం లేదా పొగాకు నమలడంతో ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్‌లు మాత్రమే కాకుండా అనేక ఇతర క్యాన్సర్‌లు కూడా వస్తాయి. ఒక వ్యక్తి ఎంత ఎక్కువ ధూమపానం చేస్తారు? ఎంత చిన్న వయస్సులో దీన్ని మొదలుపెట్టారు? ఇవన్నీ క్యాన్సర్ ముప్పు పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం పొగాకు వాడకం వల్ల దాదాపు 22% క్యాన్సర్ మరణాలు సంభవిస్తున్నాయి .

ఫొటో సోర్స్, Getty Images
మద్య పానం: పేగు (కొలొరెక్టల్), రొమ్ము, నోరు, స్వరపేటిక (నోరు, గొంతు), అన్నవాహిక, కాలేయం, కడుపుతో పాటు ఆరు రకాల క్యాన్సర్ల ముప్పును ఆల్కహాల్ పెంచుతుంది.
అధిక బరువు: గర్భాశయం, పాంక్రియాటిక్ క్యాన్సర్ సహా 12 విభిన్న క్యాన్సర్‌లతో అధిక బరువుకు సంబంధముంది.
ఇన్ఫెక్షన్లు: దాదాపు 70% గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌లు హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) ఇన్‌ఫెక్షన్‌ల వల్ల సంభవిస్తాయి. అయితే కాలేయ క్యాన్సర్, నాన్-హాడ్కిన్ లింఫోమా.. హెపటైటిస్ బీ, సీ వైరస్ వల్ల కూడా సంభవించవచ్చు. లింఫోమాలు ఎపిస్టీన్ వైరస్‌తో ముడిపడి ఉంటాయి..
అనారోగ్యకర ఆహారపు అలవాట్లు: అధిక కొవ్వు పదార్థాలు, ముఖ్యంగా ఎర్రని మాంసాలు, ప్రాసెస్ చేసిన మాంసాలు, సాల్టెడ్ ఫుడ్స్ తినడం, తక్కువ పండ్లు, కూరగాయలు తినే అలవాట్ల వల్ల అనేక రకాల క్యాన్సర్లు చుట్టే ముట్టే ముప్పు ఉంది.

ఫొటో సోర్స్, Science Photo Library
క్యాన్సర్ ముప్పు తగ్గించుకోవడం ఎలా?
యుక్త వయసు దాటే లోపే ( అంటే 9 నుంచి 25 ఏళ్లలోపు) మహిళలు గర్భాశయ క్యాన్సర్ రాకుండా హెచ్‌పీవీ వాక్సీన్ తీసుకోవాలి. హెచ్‌పీవీ అనేది అసురక్షిత సెక్స్ వల్ల వ్యాప్తి చెందుతుంది కాబట్టి, పురుషులు కూడా ఈ వ్యాక్సీన్ తీసుకోవడం మంచిది. ఆసురక్షిత సెక్స్‌లో పాల్గొనకుండా ఉండాలి.
పొగాకు తాగడం( సిగరెట్టు/ బీడీ/ చుట్ట/ హుక్కా), పొగాకు నమలడం(జర్దా, గుట్కా), లేక నషం పీల్చడం పూర్తిగా మానేయాలి. ఆ వ్యసనం నుంచి బయట పడటానికి అవసరమైతే వైద్యుల సహాయం తీసుకోవాలి.
మద్యం, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి.
శారీరకంగా చురుకుగా ఉండటంతో పెద్దపేగు, రొమ్ము, ఎండోమెట్రియల్ క్యాన్సర్‌ల ముప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది.
సరైన వయసులో పిల్లలను కని, వారికి రొమ్ము పాలు ఇస్తే మంచిది.
వాయు కాలుష్యం నుంచి కాపాడుకోవడానికి మాస్క్ వాడడం, ఇంట్లో గాలి ప్రసరణ బాగా ఉండేలా చూసుకోవడం అవసరం.

ఫొటో సోర్స్, Getty Images
ముందుగా గుర్తించడం ఎలా?
40 ఏళ్లు దాటిన మహిళలు రొమ్ము క్యాన్సర్ కోసం మామోగ్రాం పరీక్ష చేయించుకోవాలి. ప్రతి మూడేళ్లకు ఒక సారి ఈ పరీక్ష చేయించాలి.
రొమ్ములో ఏదైనా వాపు కనిపిస్తే, లేదా, రొమ్ము నుంచి నీరు కారడం లాంటివి గుర్తిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
మహిళలు పాతిక సంవత్సరాల తర్వాత పాప్ స్మియర్ పరీక్ష చేసుకోవాలి. ప్రతి మూడు నుంచి అయిదు సంవత్సరాలకు ఒక సారి ఆ పరీక్ష చేసుకోవాలి.
తెల్ల స్రావం( leucorrhoea ), పొత్తి కడుపులో నొప్పి, నెలసరికి మధ్య రక్తస్రావం, మెనోపాజ్ తరవాత రక్తస్రావం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే, 40 ఏళ్లు దాటేలోపే ఒక సారి సంబంధిత పరీక్షలు చేసుకోవాలి.
నోట్లో ఏదైనా చిన్న పుండు లాగా అయి అది మానకపోతే నిర్లక్షం చేయకుండా పరీక్ష చేయించుకోవాలి.
అసంకల్పితంగా బరువు తగ్గడం, రక్త హీనత, నీరసం, లేదా ఏవైనా లక్షణాలు కనిపిస్తే, ఆలస్యం చేయకుండా వైద్యుల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి.

ఫొటో సోర్స్, Science Photo Library
చికిత్స ఎలా?
క్యాన్సర్ అనగానే అదేదో చికిత్స లేని జబ్బు అని అనుకుంటూ ఉంటారు. కానీ, ఇప్పటి అధునాతన విధానాలతో తొలి దశలో గుర్తించ గలిగితే కొన్ని రకాల క్యాన్సర్లకు మెరుగ్గా చికిత్స అందించవచ్చు.
ఎన్నో రకాల క్యాన్సర్ల బాధితుల్లో జీవిత కాలాన్ని కూడా చాలావరకు పెంచొచ్చు. అయితే, క్యాన్సర్ మొదటి దశ నుంచి మూడు, నాలుగవ దశకు ఆరు నెలల నుంచి సంవత్సర కాలంలో పెరుగుతుంది. అందుకే, లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స ప్రారంభించడం ముఖ్యం.
క్యాన్సర్‌కు అనేక చికిత్సా విధానాలు ఉన్నాయి. ముఖ్యంగా శస్త్ర చికిత్సతో ఆ కణితిని తొలగించడం. ఒక వేల కణితిని పూర్తిగా తొలగించగలిగి, క్యాన్సర్ కణాలు లేకుండా చేస్తే, క్యాన్సర్‌కి పూర్తి చికిత్స చేసినట్టు. కానీ అది తొలి దశలోనే సాధ్యం.
(Chemotherapy) కీమోథెరపీ: క్యాన్సర్ కణాలతో పోరాడే ఔషధాలను శరీరానికి అందించడం. ఆరోగ్యకరమైన కణాలను కాపాడడానికి దీన్ని సైకిల్స్ రూపంలో కొన్ని కొన్ని రోజులకు ఇస్తారు. జుట్టు రాలిపోవడం, వాంతులు వంటి అనేక దుష్ప్రభావాలు దీనితో వస్తుంటాయి.
(Radiotherapy) రేడియోథెరపీ: రేడియేషన్ ద్వారా క్యాన్సర్ కణాలను హతమార్చే పద్ధతి ఇదీ. ఈ మధ్య కాలంలో ఆరోగ్యంగా ఉన్న కణాలకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి, ఎన్నో అధునాతన పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. దీని వల్ల ఒళ్లంతా మంటలు, చర్మంపై మచ్చలు, వంటి అనేక దుష్ప్రభావాలు కలుగవచ్చును.
కొన్ని రకాల క్యాన్సర్లకు, తీవ్రతను బట్టి, ఈ మూడు చికిత్స విధానాలను కలిపి కూడా అందించే అవకాశం ఉంది.
చికిత్స పూర్తి అయిన తరవాత కూడా మళ్ళీ కొద్ది రోజులకు, క్యాన్సర్ లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. కాబట్టి వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ, మధ్య మధ్యలో పరీక్షలు చేసుకుంటూ ఉండాలి.
అశాస్త్రీయ చికిత్సా పద్ధతులను పాటించే ప్రయత్నంలో, చికిత్స ఏ మాత్రం ఆలస్యం చేసినా, నిర్లక్ష్యం చేసినా ప్రాణాపాయం అని గుర్తించాలి.
ఇతర దేశాలతో పోలిస్తే, మన దేశంలో క్యాన్సర్ బాధితుల శాతం తక్కువ ఉన్నప్పటికీ, తొలి దశలో గుర్తించలేక పోవడంతో క్యాన్సర్ మరణాల శాతం ఎక్కువగా నమోదు అవుతోంది.
కాబట్టి, క్యాన్సర్ ముప్పులను తగ్గించుకుంటూ, లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేసుకొని, వైద్యుల సలహా మీద, తగిన చికిత్స పొందాలి. లేదంటే, ముందుముందు క్యాన్సర్ వల్ల సంభవించే మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
(రచయిత వైద్యురాలు)
ఇవి కూడా చూడండి:
- ‘అతడు నన్ను చంపేసుండేవాడు.. ఇద్దరు పిల్లలు పుట్టాక విడిపోయినా హింస కొనసాగింది’
- గౌతమ్ అదానీ: 25 ఏళ్ల క్రితం గుజరాత్లో అదానీని కిడ్నాప్ చేసింది ఎవరు? అప్పుడు ఏం జరిగింది?
- ఆంధ్రప్రదేశ్: పొలాల్లొకి వచ్చే అడవి ఏనుగులను తరిమికొట్టే కుంకీ ఏనుగులు - వీటిని ఎలా పట్టుకుంటారు? ఎలా శిక్షణ ఇస్తారు?
- దళిత గ్రామాలకు రూ.21 లక్షలు ఇచ్చే ఈ పథకం గురించి తెలుసా?
- సున్తీ తర్వాత సెక్స్ సామర్థ్యం పెరుగుతుందా? నాలుగు ప్రశ్నలు, సమాధానాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















