సున్తీ తర్వాత సెక్స్ సామర్థ్యం పెరుగుతుందా? నాలుగు ప్రశ్నలు, సమాధానాలు

వీడియో క్యాప్షన్, సెక్స్ సామర్థ్యం సున్తీ చేసుకుంటే పెరుగుతుందా?
    • రచయిత, ఫెలిప్ లంబియాస్
    • హోదా, బీబీసీ న్యూస్

సున్తీ అనేది ఒక శస్త్రచికిత్స. దీన్ని వేల ఏళ్లుగా నిర్వహిస్తున్నారు.

ఈజిప్టులో వేల ఏళ్లకు ముందు నుంచి సున్తీ నిర్వహించేవారని చరిత్రకారులు భావిస్తున్నారు. నేటికీ చాలా ప్రాంతాల్లో దీన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో ప్రతి ముగ్గురు పురుషుల్లో ఒకరికి సున్తీ జరుగుతోంది.

ఈ చికిత్సలో భాగంగా పురుషాంగం ముందుండే చర్మాన్ని తొలగిస్తారు. ఎక్కువగా ముస్లింలలో బాల్యంలోనే సున్తీ చేస్తారు.

ఆ తర్వాతి స్థానంలో అమెరికా వాసులు ఉంటారు. ఇక్కడ జన్మించిన పురుషుల్లోనూ దాదాపు 80.5 శాతం మందికి ఇలా చేస్తున్నట్లు 2016నాటి డేటా చెబుతోంది. ఈ చికిత్సతో చాలా ప్రయోజనాలు ఉంటాయని ఇక్కడ దశాబ్దాల నుంచి ప్రజలు భావిస్తున్నారు.

సాధారణంగా సున్తీని బాల్యంలోనే చేస్తుంటారు. మరికొందరు మాత్రం ఆరోగ్యపరమైన కారణాలతో కాస్త పెద్దయ్యాక కూడా దీన్ని చేయించుకుంటారు.

సున్తీపై ప్రశ్నలకు సైన్స్ ఇస్తున్న నాలుగు సమాధానాలివీ..

సున్తీ

ఫొటో సోర్స్, Getty Images

పురుషాంగం ముందు చర్మాన్ని తీసేసినప్పుడు ఏం అవుతుంది?

పురుషాంగ మందు భాగమైన గ్లాన్స్ (జననాంగ శీర్షం)ను ఈ చర్మం కప్పి ఉంచుతుంది. పురుషాంగంపై కనిపించే మిగతా చర్మం కంటే ఫోర్‌స్కిన్ భిన్నమైనది. ఇది గ్లాన్స్‌కు అతుక్కుని ఉండదు. మొత్తం గ్లాన్స్ బయటకు కనిపించే వరకు ఈ చర్మాన్ని తొలగిస్తుంటారు.

ఈ చర్మం లోపల లూబ్రికేటెడ్ మ్యూకస్ ఉంటుంది. నోటిలో, లేదా మహిళల యోనిలో ఇలాంటి శ్లేష్మం కనిపిస్తుంది.

‘‘ఆ చర్మం అనేది పురుషాంగం ముందు భాగానికి రక్షణ కల్పిస్తుంది’’అని అమెరికా ఫెడరేషన్ ఆఫ్ యూరాలజీకి చెందిన అనా మరియా ఆట్రన్ చెప్పారు.

అయితే, ఈ చర్మానికి వ్యాధి నిరోధక శక్తితోనూ సంబంధముందని కొందరు నిపుణులు భావిస్తున్నారు.

పురుషాంగం గ్లాన్స్ అనేది చాలా సున్నితమైన భాగం. చిన్నప్పుడు లేదా పెద్దయిన తర్వాత దానిపై చర్మాన్ని తొలగించినప్పుడు అప్పటివరకు చర్మం కింద రక్షణలో ఉండే భాగం బట్టలకు తగలడం మొదలవుతుంది.

అందుకే సున్తీ తర్వాత కొన్ని వారాలపాటు చాలా అసౌకర్యంగా ఉంటుంది. పురుషాంగం ఉద్రేకమైనప్పుడు కూడా కాస్త నొప్పి వస్తుంది.

అయితే, ఆ తర్వాత గ్లాన్స్ పైనుంచే చర్మం గట్టిపడుతుంది. ఆ సున్నితత్వం కూడా తగ్గుతుంది.

సాధారణంగా రెండు విధాలుగా శస్త్రచికిత్సను నిర్వహిస్తారు. వీటిలో మొదటి కత్తి లేదా చాకుతో పైచర్మాన్ని తొలగించడం. రెండోది స్టాపిల్ గన్‌ ఉపయోగించడం.

కేవలం పురుషాంగం ప్రాంతంలో మాత్రమే మత్తుమందు ఇచ్చి ఈ చికిత్స నిర్వహిస్తారు.

సున్తీ

ఫొటో సోర్స్, Getty Images

సున్తీ ఎప్పుడు చేయాలి?

మతపరమైన కారణాలను పక్కన పెడితే, ఈ ప్రశ్నకు రెండు సమాధానాలు ఉన్నాయి.

వీటిలో మొదటిది అమెరికాలో అనుసరించే విధానం. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఏఏపీ) సమాచారం ప్రకారం, పుట్టిన కొద్ది రోజుల్లోనే ఈ చికిత్స చేస్తే, వచ్చే ముప్పుల కంటే ఆరోగ్య ప్రయోజనాలే ఎక్కువ ఉంటాయి.

మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, పెనైల్ క్యాన్సర్, హెచ్ఐవీ లాంటి కొన్ని సుఖ వ్యాధులను దీని ద్వారా మెరుగ్గా అడ్డుకోవచ్చని ఏఏపీ చెబుతోంది.

‘‘పెద్దయిన తర్వాత చేసినప్పుడు చేసిన సున్తీ చికిత్సలతో పోల్చినప్పుడు చిన్నప్పుడు చేసే చికిత్సలతో వచ్చే ‘శస్త్రచికిత్సా అనంతర సమస్యలు’ చాలా తక్కువగా ఉంటాయి’’అని ఏఏపీకి చెందిన వైద్యుడు షపీరో చెప్పారు.

అయితే, అంతిమంగా ఇది తల్లిదండ్రులు తీసుకోవాల్సిన నిర్ణయమని ఆయన చెప్పారు.

అయితే, రాయల్ డచ్ మెడికల్ అసోసియేషన్ (ఆర్‌డీఎంఏ) దీనికి భిన్నంగా స్పందిస్తోంది. పిల్లలకు సున్తీ చేయకూడదని ఆర్‌డీఎంఏ వివరిస్తోంది. ‘‘వ్యాధుల నియంత్రణ లేదా పరిశుభ్రత విషయంలో సున్తీ మెరుగ్గా పనిచేస్తుందని చెప్పే ఆధారాలేమీ లేవు. అందుకే పిల్లలందరికీ దీన్ని చేయకూడదు. ఏదైనా మెడికల్/థెరప్యూటిక్ కారణాలతో అవసరమైతేనే ఈ చికిత్స చేయాలి’’అని సంస్థ చెబుతోంది.

‘‘ప్రజలు అనుకునేదానికి విరుద్ధంగా ఈ సున్తీ వల్ల కొన్ని ఆరోగ్య, మానసిక సమస్యలు తలెత్తే ముప్పు ఉంటుంది. ఎక్కువగా రక్తస్రావం కావడం, ఇన్ఫెక్షన్, పానిక్ అటాక్‌లు లాంటివి వచ్చే ముప్పు ఉంటుంది’’అని సంస్థ వివరిస్తోంది.

అయితే, ఫిమోసిస్, పారాఫిమోసిస్, బలనైటిస్ లాంటి సమస్యలు వస్తే సున్తీ చేయొచ్చని చెబుతోంది.

పురుషాంగం ముందుండే చర్మం చివర రంధ్రం మరీ చిన్నగా ఉండటంతో గ్లాన్స్ బయటకు రాలేకపోవడాన్ని ఫిమోసిస్‌గా చెబుతారు. దీన్ని చిన్న వయసులోనే గుర్తిస్తే, కొన్ని క్రీమ్‌లతో కొంతవరకు ప్రభావం ఉంటుంది. అన్నిసార్లూ సున్తీనే చేయాల్సిన అవసరం లేదు.

పారాఫిమోసిస్ అంటే.. ముందు చర్మం పూర్తిగా వెనక్కి వచ్చేయడం. మళ్లీ ఇది ముందుకు పోవడం చాలా కష్టం అవుతుంది.

బలనైటిస్‌లో పురుషాంగ ముందుండే గ్లాన్స్ వాచిపోతుంది. దీనికి చాలావరకు అపరిశుభ్రతే కారణం. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు ఆ ముందు చర్మాన్ని కాస్త వెనక్కి లాగి సబ్బు నీళ్లతో కగడాలని పిల్లలకు సూచించాలి.

అయితే, ఈ సమస్యలు ఏ వయసులోనైనా రావచ్చు.

సున్తీ

ఫొటో సోర్స్, Getty Images

సెక్స్ జీవితంపైనా ప్రభావం పడుతుందా?

అయితే, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కాస్త కష్టమని షపీరో అంటున్నారు. ‘‘సున్తీకి ముందు, ఆ తర్వాత సెక్స్‌తో తమకు కలుగుతున్న ఆనందాన్ని పోల్చేందుకు మనకు చాలా తక్కువ కేసులు ఉంటాయి. అందుకే వీటిపై ఒక అవగాహనకు అంత త్వరగా రాలేం’’అని ఆయన అన్నారు.

‘‘సున్తీ తర్వాత కొత్త పరిసరాలకు పురుషాంగం ముందు భాగం నెమ్మదిగా అలవాటు అవుతుంది. ఫలితంగా మొదట్లో కాస్త సున్నితత్వం ఎక్కువగా ఉండొచ్చు. అసౌకర్యంగా కూడా కలగొచ్చు’’అని ఆయన తెలిపారు.

‘‘సున్తీ తర్వాత త్వరగా పురుషాంగం ముందు భాగం పొడిబారుతుంది. సున్నితత్వంలోనూ మార్పులు చూడొచ్చు. ఇక్కడ పురుషాంగం ముందు భాగంపై నుండే చర్మంలోనూ నరాలు ఉంటాయి. చర్మం తొలగించేటప్పుడు వీటిని కూడా తొలగిస్తారు’’అని ఆయన తెలిపారు.

అయితే, కొంతమంది తమ పురుషాంగం మరింత అందంగా కనిపించేందుకు ఆ ముందు చర్మాన్ని తొలగించాలని కూడా వైద్యుల దగ్గరకు వస్తుంటారు.

ఇక్కడ కొన్ని అపోహల గురించి మనం తెలుసుకోవాలి. సున్తీ తర్వాత పురుషాంగం పొడవుగా లేదా పెద్దగా అవ్వదు. సున్తీ తర్వాత ఎక్కువ సమయం సెక్స్ చేయొచ్చు అనేది కూడా అపోహే. అంగం ఉద్రేకం కావడం అనేది సున్తీ ముందు, తర్వాత ఒకేలా ఉంటుంది.

సున్తీ తర్వాత నాలుగు నుంచి ఐదు వారాల పాటు సెక్స్‌కు దూరంగా ఉండాలని, అప్పుడే ఆ భాగాలు పూర్తిగా కోలుకుంటాయని, అసౌకర్యం కూడా తగ్గుతుందని వైద్యులు సూచిస్తుంటారు.

సున్తీ

ఫొటో సోర్స్, Getty Images

సుఖ వ్యాధులను అడ్డుకోవచ్చా?

సున్తీతో హెచ్ఐవీ లాంటి సుఖ వ్యాధులను మెరుగ్గా అడ్డుకోవచ్చని ఈ చికిత్సకు మద్దతు పలికేవారు ఎక్కువగా చెబుతుంటారు.

హెచ్ఐవీపై పోరాటంలో భాగంగా దక్షిణ, తూర్పు ఆఫ్రికాలోని చాలా ప్రాంతాల్లో సున్తీలను ప్రోత్సహిస్తున్నారు. ఈ ప్రాంతంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండే సంగతి తెలిసిందే.

పురుషాంగం ముందు చర్మాన్ని తొలగించడంతో హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ రేటు తగ్గుతున్నట్లు కొన్ని అధ్యయనాల్లో తేలింది. అయితే, కేవలం ఇన్ఫెక్షన్ రేటు ఎక్కువగా ఉండేటప్పుడు, పురుషులు-మహిళల మధ్య సెక్స్ సంబంధాల వరకు మాత్రమే ఈ అధ్యయనాలు పరిమితం.

‘‘నిజానికి హెచ్ఐవీ వ్యాప్తి, సున్తీ మధ్య సంబంధంపై ఇప్పటికీ చాలా అస్పష్టత ఉంది. అమెరికాలో సున్తీ రేటు ఎక్కువగా ఉంటుంది, అక్కడ హెచ్ఐవీ రేటు కూడా ఎక్కువే. కానీ, నెదర్లాండ్స్ పరిస్థితి దీనికి పూర్తి భిన్నమైనది. అక్కడ సున్తీలు తక్కువ, అలానే హెచ్ఐవీ కేసులు కూడా తక్కువే’’అని యూరోపియన్ మెడికల్ అసోసియేషన్ వెల్లడించింది.

తరచూ సెక్స్‌చేసే స్వలింగ సంపర్కులైన పురుషుల్లో హెచ్ఐవీ వ్యాప్తిపై సున్తీ ప్రభావం చాలా తక్కువని మరొక అధ్యయనంలో తేలింది.

గనేరియా, సిఫిలిస్, క్లైమీడియా, హెర్పిస్, హ్యూమన్ పపిలోమావైరస్, జెనెటల్ అల్సర్లను అడ్డుకోవడంలో సున్తీ కొంతవరకు పనిచేస్తుందని కొందరు నిపుణులు చెబుతుంటారు. అయితే, దీన్ని పక్కాగా నిరూపించే అధ్యయనాలేమీ లేవు.

వీడియో క్యాప్షన్, సంతానలేమికి దోశ పెనం, పిజ్జా బాక్స్ కూడా కారణం అవుతోందా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)