ఏపీ ఎక్సైజ్ సురక్ష: మీరు కొన్న మద్యం అసలా? నకిలీయా? ఈ యాప్‌తో కనిపెట్టేయొచ్చు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ మద్యం కొనుగోలు చేసినా అది నకిలీదో? నాణ్యమైనదో? గుర్తించేందుకు ప్రభుత్వం ''ఏపీ ఎక్సైజ్ సురక్ష'' పేరిట ఓ యాప్‌ను రూపొందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ యాప్‌ను ఆవిష్కరించారు.
మద్యం కొనుగోలుదారులే కాదు, అమ్మే వారు కూడా ఆ మద్యం కల్తీదా? ఆబ్కారీ శాఖ ఆమోదముద్ర వేసిన నాణ్యమైనదేనా? అనేది ఈ యాప్‌తో గుర్తించవచ్చని అధికారులు చెబుతున్నారు.


ఫొటో సోర్స్, AP govt/ApExciseSuraksha
ఈ యాప్ ఎలా పని చేస్తుంది?
- ప్లే స్టోర్‌లో ''ఏపీ ఎక్సైజ్ సురక్ష'' యాప్ అందుబాటులో ఉంచారు.
- ఫోన్‌లో ఆ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- కొనుగోలుదారుడు ఏదైనా మద్యం దుకాణానికి వెళ్లి తమకు కావాల్సిన బ్రాండ్ అడిగితే అక్కడి విక్రయదారు బాటిల్‌ను చూపిస్తారు.
- ఇప్పుడు యాప్ ఓపెన్ చేసి అక్కడ కనిపించే ''కన్జ్యూమర్ వెరిఫై లిక్కర్ అథెంటిసిటీ''పై క్లిక్ చేయాలి.
- అలా క్లిక్ చేయగానే ''కన్జ్యూమర్ పోర్టల్ – స్కాన్ క్యూఆర్ కోడ్ ఆన్ లిక్కర్'' అని వస్తుంది.

ఫొటో సోర్స్, I&PR
- కొనుగోలు చేసే మద్యం బాటిల్ మూతపై ఉన్న (హోలోగ్రామ్) క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి.
- స్కాన్ చేయగానే ఆ బాటిల్‌కు సంబంధించిన నంబర్ వస్తుంది. అక్కడ ఆ కోడ్ నంబర్‌తో పాటు అక్కడ కనిపించే సెక్యూరిటీ కోడ్ నమోదు చేసి వెరిఫై కోడ్‌పై క్లిక్ చేయాలి.
- వెరిఫై కోడ్‌పై క్లిక్ చేయగానే ఆ బాటిల్‌కు సంబంధించిన సమగ్ర సమాచారం వస్తుంది. ఎక్సైజ్ శాఖ సర్టిఫై చేసినట్టుగా.. అందులో వివరాలు పొందుపరిచి ఉంటాయి.
- మద్యం తయారీ తేదీ, టైమ్, బ్యాచ్ నెంబర్ వివరాలు ఉంటాయి.
- ట్రేసబిలిటీ, సర్టిఫికేషన్ కూడా ఉంటుంది.

ఫొటో సోర్స్, AP govt/ApExciseSuraksha
''ఒకవేళ నకిలీ మద్యం లేదా ఎక్సైజ్ శాఖ ధ్రువీకరించని మద్యం అయితే అసలు ముందుగా స్కాన్ కూడా కాదు'' అని ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ బోయపాటి శ్రీలత బీబీసీకి వివరించారు.
ఇప్పటి వరకు ఎక్సైజ్ అధికారుల వద్ద మాత్రమే ఇలా మద్యం షాపుల వాళ్లు అమ్ముతున్న మద్యం నకిలీదా? నాణ్యమైనదా? అని పరీక్షించే వీలు ఉండేదని, ఇప్పుడు మద్యం కొనుగోలు చేసే ప్రతి ఒక్కరూ తెలుసుకునేలా ప్రభుత్వం ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని ఆమె తెలిపారు.
ప్రతి మద్యం దుకాణంలో లిక్కర్ బాటిల్ కొనే ముందు తప్పనిసరిగా ఈ యాప్‌లో స్కాన్ చేస్తే విషయాలు తెలుస్తాయన్నారు.

ఫొటో సోర్స్, I&PR
ఇక బెల్ట్ షాపుల్లో అమ్మే వీలుండదు..
ఈ సురక్ష యాప్ ద్వారా అక్రమ మద్యం కొనుగోళ్లను కూడా కట్టడి చేయవచ్చని ఆబ్కారీ అధికారులు చెబుతున్నారు.
మద్యం బాటిళ్లు తయారయ్యే డిస్టిలరీల వద్దనే స్కాన్ స్టిక్కర్లు అంటిస్తారని, ఆ మద్యం బాటిళ్లు ఎక్కడ అమ్మాలో అక్కడే జియో ట్యాగింగ్ అవుతుందని ఏపీ డిస్టలరీస్ గొల్లపూడి డిపో మేనేజర్ రామకోటేశ్వరరావు బీబీసీతో చెప్పారు.
48 బాటిళ్లు ఓ కేస్‌గా వస్తుందని, ప్రతి బాటిల్‌కి ట్రేస్‌బిలిటీ, సర్టిఫికేషన్ ఉంటాయని తెలిపారు.
ఆ మద్యం బాటిళ్లు నిర్దేశించిన చోట కాకుండా మరో చోట అమ్మేందుకు వీలుండదని, దీంతో ఇక బెల్ట్ దుకాణాల్లో అమ్మడానికి అవకాశం ఉండదని ఆయన స్పష్టం చేశారు.
ఓ దుకాణానికి సరఫరా చేసిన మద్యం.. వేరే షాపులో అమ్మడానికి కూడా వీల్లేదని రామకోటేశ్వరరావు తెలిపారు.
ఇప్పటివరకు ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు
ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా వినియోగదారులు చెక్ చేసుకుంటున్నారనీ, ఎక్కడా కూడా ఇప్పటివరకు ఒక్క ఫిర్యాదు రాలేదని ఎక్సైజ్ శాఖ డీసీ శ్రీలత వివరించారు.
ఎక్కడైనా ఫిర్యాదులు ఉంటే 14405 నెంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.

ఫొటో సోర్స్, I&PR
ఈ యాప్‌ను ఎందుకు తీసుకొచ్చారంటే...
రాష్ట్రంలో ఇటీవల నకిలీ మద్యం తయారీ కేంద్రాలు బయటపడిన నేపథ్యంతో పాటు కల్తీ మద్యం విక్రయాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతుండటంతో ఈ యాప్‌ను తీసుకొచ్చినట్టు సీఎం చంద్రబాబు చెప్పారు.
ఎక్కడా కల్తీ మద్యం విక్రయాలు జరగడం లేదనే విషయాన్ని స్పష్టం చేయడంతో పాటు.. అలా దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా చంద్రబాబు ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ అధికారులను నిర్దేశించారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాల్లో అమ్మే ప్రతి మద్యం బాటిల్‌పై స్కాన్ స్టిక్కర్ ఉండే విధంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నామని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బీబీసీకి చెప్పారు.
మద్యం బాటిళ్లు, మద్యం షాపులకు జియో ట్యాగింగ్, జియో ఫెన్సింగ్ పెట్టామనీ, రిటైల్ షాపుల్లో కూడా స్కాన్ చేసిన తర్వాతే మద్యం అమ్మాలనే విధానాన్ని తెచ్చామని ఆయన వివరించారు.
బెల్ట్ షాపులనేవి లేకుండా ఉండేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని మంత్రి రవీంద్ర చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














