మహిళల కోసం స్పెషల్ బీర్లు, ఈ ట్రెండ్ ఎందుకు పెరుగుతోంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, లిలియన్ స్టోన్
- హోదా, బీబీసీ వర్క్‌లైఫ్
న్యూయార్క్ నగరంలోని ఒక సూపర్ మార్కెట్‌లో క్రాఫ్ట్ బీర్ విభాగంలో రంగురంగుల, కూల్ డిజైన్‌లతో బీర్లు కనిపిస్తున్నాయి. ఫ్రూట్ ఫ్లేవర్ బీర్ ఇష్టపడే వారిని ఆకర్షించేందుకు వీటిని పెట్టారు.
ఈ ప్రత్యేకమైన డిజైన్లతో కూడిన బీర్లు చూస్తే మహిళల కోసం తయారు చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే వీటి పక్కనే ఉంచిన మిగిలిన బీర్లు పురుషులను ఆకర్షించేవిగా ఉన్నాయి.
ఈ అందమైన ప్యాకేజింగ్‌ను తాలియా అనే బీర్ కంపెనీ తయారుచేసింది.
అమెరికాలోని బ్రూక్లిన్‌లో ఉన్న తాలియా బీర్ తయారీ కర్మాగారాన్ని లీన్ డార్లాండ్, తారా హాంకిన్సన్ అనే మహిళలు నడుపుతున్నారు. వారు 2019లో ఈ బ్రూవరీని స్థాపించారు.
పెద్ద యంత్రాల సహాయం లేకుండా బీరు తయారు చేసే చిన్న కర్మాగారాలను క్రాఫ్ట్ బ్రూవరీస్ అంటారు. ఇలా తయారైన బీర్‌ను క్రాఫ్ట్ బీర్ అంటారు, ఇది ఈ రోజుల్లో బాగా ప్రాచుర్యం పొందింది.
"మేం తాలియాను స్థాపించినప్పుడు క్రాఫ్ట్ బీర్ కంపెనీలు మాలాంటి మహిళలను కస్టమర్‌లుగా పరిగణించడం లేదని మా దృష్టిలో ఉంది" అని డార్లాండ్, హాంకిన్సన్‌లు బీబీసీ వర్క్‌లైఫ్‌కి పంపిన ఈమెయిల్‌లో రాశారు.
ఒక మహిళ అయినా, ఎల్జీబీటీక్యూ+ కమ్యూనిటీకి చెందిన వారైనా, మైనారిటీ అయినా, లేదా మొదటిసారి క్రాఫ్ట్ బీర్‌ని ప్రయత్నిస్తున్నా అందరికీ ఆ బీర్‌ను అందజేయడమే లక్ష్యమని వారిద్దరూ చెప్పారు.

ఫొటో సోర్స్, TALEA
బీరు మహిళల డ్రింక్ కాదా?
ప్రపంచవ్యాప్తంగా చాలామంది మహిళలు బీర్ తాగడం ఇష్టపడతారు, కానీ వివిధ రకాల ఆల్కహాల్‌లలో ముఖ్యంగా బీర్ విషయంలో వారిని విస్మరించారు.
''అమ్మాయిలు బీర్‌ను ఇష్టపడరని అనుకోవడం సహజం'' అని బీబీసీ ఉద్యోగి ఆదర్శ్ రాథోడ్‌తో గురుగ్రామ్‌లోని సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న అదితీ సింగ్ చెప్పారు.
“నాతో పాటు నాకు తెలిసిన చాలామంది అమ్మాయిలకు బీర్ ఇష్టం. కానీ నేను ఏదైనా పార్టీకి వెళితే వోడ్కా లేదా వైన్ ఇష్టమా అని అడుగుతున్నారు. ఆడపిల్ల అయితే బీరు తాగరని జనాలనుకుంటారు. బీర్ ప్రకటనలు, బ్రాండింగ్‌లోనూ అదే కనిపిస్తుంటుంది, బీర్.. మహిళల డ్రింక్ కాదనే ఆలోచనను అది ప్రతిబింబిస్తుంది'' అని ఆమె తెలిపారు.

ఫొటో సోర్స్, Talea
అనేక గ్లోబల్ బీర్ బ్రాండ్‌లు, స్థానిక క్రాఫ్ట్ బ్రూవరీలు కూడా పురుషులనే తమ ప్రధాన కస్టమర్‌లుగా పరిగణిస్తుంటాయి.
ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో యూట్యూబ్‌లో ప్రసిద్ధ కంపెనీలు జారీ చేసే మద్యం ప్రకటనలలో పురుషులే కేంద్రంగా ఉంటారు.
అయితే యూకే, అమెరికాలోని అనేక బ్రూవరీలు ఇప్పుడు ఇలాంటి మార్కెటింగ్‌ను నివారించడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నాయి.
బీబీసీ వర్క్‌లైఫ్ ప్రకారం, మిల్లర్ లైట్, కరోనా వంటి బ్రాండ్‌లు మహిళలను మార్కెటింగ్ కేంద్రంగా పరిగణిస్తున్నాయి.
అమెరికాలో మద్యం సేవించడంలో పురుషులను మహిళలు వెనక్కినెడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
దీంతో బీర్ పరిశ్రమ కూడా దీనిపై దృష్టి పెడుతోంది, ఇప్పటివరకు పురుషాధిక్యతలో ఉన్న తమ వైఖరిలో మార్పులు తీసుకువస్తోంది.

ఫొటో సోర్స్, KEEPING TOGETHER
భారత్‌లో పెరుగుతున్న ట్రెండ్
గత సంవత్సరం మహిళా దినోత్సవం సందర్భంగా బెంగళూరుకు చెందిన జిస్ట్ అనే క్రాఫ్ట్ బ్రూవరీ 'విమెన్ హూ లాగర్' ప్రచారం కింద ప్రత్యేక క్రాఫ్ట్ బీర్‌ను ప్రారంభించింది.
తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఈస్ట్ సహాయంతో తయారుచేసే బీర్‌ను లాగర్ అంటారు. 'విమెన్ హూ లాగర్' అంటే లాగర్ రకం బీర్‌ను తయారు చేసే మహిళలు.
భారత్‌లో బీర్ పరిశ్రమతో సంబంధమున్న ఆరుగురు ముఖ్యమైన మహిళలు ఈ ప్రచారంలో పాల్గొన్నారు.
కొందరికి సొంత బ్రూవరీలు ఉన్నాయి, చిన్న బ్రూవరీలకు సలహాదారులుగానూ ఉన్నారు, వేరేవాళ్లు బీర్ తయారీకి అవసరమైన పదార్థాలను అందిస్తారు.
ఇటీవలె స్ట్రాటోస్పియర్ అనే బీర్‌ను విడుదల చేశారు, ఇది కొంతకాలం అందుబాటులో ఉంది. అయితే ఈ బీర్ కేవలం మహిళలకు మాత్రమే కాదు.
మహిళలు తయారు చేసే బీరు కేవలం మహిళలకే కాదు అనే అభిప్రాయాన్ని బద్దలు కొట్టడమే తమ ధ్యేయమని ఈ ప్రచారంలో పాల్గొన్న మహిళలు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
‘మార్పు వస్తోంది’
కేట్ బెర్నాట్ అమెరికాలో బేవరేజ్-ఆల్కహాల్ రిపోర్టర్. ఆమె 'గుడ్ బీర్ హంటింగ్స్' కోసం విస్తృతంగా కథనాలు రాశారు.
మార్కెటింగ్ విధానంలో మార్పు వెనుక ఆర్థిక అవసరాలు కారణమని బీబీసీ వర్క్‌లైఫ్ కోసం కథనం రాస్తున్న లిలియన్ స్టోన్‌తో కేట్ అన్నారు.
“సాంస్కృతిక వ్యవస్థలు ఇకపై లింగ ఆధారితమైనవి కావు. మహిళలు, చాలామంది పురుషులు ఇప్పుడు కొత్త, తెలివైన ఆలోచనలను అభినందిస్తున్నారని అనుకుంటున్నా. అందువల్ల కంపెనీలు ఇప్పుడు మునుపటి కంటే కష్టపడి పనిచేయాలి'' అని అన్నారు కేట్.
ఇప్పటివరకు పురుషాధిక్యత ఉన్న బీర్ పరిశ్రమ కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో మహిళల సంఖ్య పెరిగిపోయి, బహిరంగంగా నిర్ణయాలు తీసుకోగలగడం మార్పును సూచిస్తోందని కేట్ అభిప్రాయపడ్డారు.
'హీనెకెన్ అమెరికా' సీఈవో మ్యాగీ టిమోనీ, 2021లో ఈ ఉన్నత స్థానానికి చేరుకున్నారు మ్యాగీ. అదేవిధంగా మోల్సన్ కూర్స్‌లో మిచెల్ సెయింట్ జాక్వెస్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్.
ఇటువంటి అనేక క్రాఫ్ట్ బ్రూవరీలు భారతదేశంలో కూడా ప్రారంభించారు, వీటిని మహిళలు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు బడా మద్యం కంపెనీలలో కూడా మహిళలు ఉన్నత స్థానాల్లో ఉనికిని చాటుకుంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మహిళల కోసం బీరు తయారు
పాత కంపెనీలు తమ మార్కెటింగ్ పద్ధతులను మార్చుకోవడమే కాకుండా కొత్త కంపెనీలు కూడా దీన్ని అవకాశంగా తీసుకుని మహిళలపై దృష్టి సారిస్తున్నాయి.
ప్యాకేజింగ్ నుంచి బీర్‌కు పేరు పెట్టడం వరకు ప్రతిదీ పరిశీలిస్తున్నాయి. అంతేకాదు బీర్ కూడా డిఫరెంట్‌గా తయారు చేస్తున్నారు.
ఉదాహరణకు తాలియా కంపెనీ ఉత్పత్తి చేసే కొన్ని బీర్లు తేలికపాటి రుచుల్లో ఉంటాయి. కొన్ని పండ్ల రుచుల్లో ఉంటున్నాయి.
భారతదేశంలోని క్రాఫ్ట్ బీర్ కంపెనీలు కూడా ఇదే వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి.
చేదు కారణంగా తనకు, తన స్నేహితుల్లో చాలామందికి బీర్ ఇష్టం ఉండేది కాదని బీబీసీ ఉద్యోగి ఆదర్శ్ రాథోడ్‌తో సిమ్లాలో నివసించే దీపికా శర్మ చెప్పారు.
"ఒకసారి నేను సిమ్లాలోని ఒక బ్రూవరీలో మామిడి రుచిగల క్రాఫ్ట్ బీర్‌ను తాగాను, అది నాకు బాగా నచ్చింది. అప్పుడప్పుడు క్రాఫ్ట్ బ్రూవరీ నుంచి రుచిగల బీర్ తాగుతాను" అని అన్నారు దీపికా శర్మ.
మిగతా బీర్స్ మాదిరి కాకుండా క్రాఫ్ట్ బ్రూవరీస్‌లు కొత్త తరహా బీర్స్ ప్రారంభించడంతో గతంలో కంటే ఎక్కువ ప్రజాదరణ పొందాయని దీపిక అభిప్రాయపడ్డారు.
“మేం రేటింగ్ వెబ్‌సైట్ 'బీర్ అడ్వకేట్'ని పరిశీలించాం, మహిళలు ఇష్టపడే తక్కువ చేదుతో పండ్ల రుచిగల బీర్లను తయారుచేశాం'' అని తాలియా కంపెనీ సహ వ్యవస్థాపకురాలు తారా హాంకిన్సన్ అన్నారు.
"మహిళలు ఇష్టపడే రుచులతో కూడిన బీర్లను అందించాలనే విషయాన్ని గట్టిగా నమ్ముతాం. తర్వాత వారు ఇతర రకాల బీర్‌లను కూడా ఆస్వాదించవచ్చు'' అని తెలిపారు తారా హాంకిన్సన్.
ఈ పద్ధతి కూడా పనిచేసింది. తమ కస్టమర్లలో 70 శాతం మంది మహిళలేనని తాలియా వ్యవస్థాపకుల అంచనా.

ఫొటో సోర్స్, Getty Images
ప్రాచుర్యంలో పలు బ్రాండ్లు
మహిళల్లో పెరిగిన కొనుగోలు శక్తి కూడా మార్పునకు దారితీసిందని రిపోర్టర్ కేట్ బెర్నాట్ చెప్పారు.
బీర్ కంపెనీలు మహిళల అంచనాలను దృష్టిలో పెట్టుకొని తయారుచేస్తే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న బీర్లను ఇష్టపడని పురుషులు కూడా మీ వైపు ఆకర్షితులవుతారని ఆమె సూచిస్తున్నారు.
“ఇప్పుడు చాలా బ్రాండ్లు మార్కెట్లోకి వచ్చాయి, అవి అమ్మాయిల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. మహిళలకు ప్రోడక్టులు విక్రయించాలనుకుంటే, అది వారికి నచ్చినట్లు ఉండాలని పరిశ్రమలు గ్రహించాయి''అని అదితీ సింగ్ తెలిపారు.
“మహిళలు ఇప్పుడు చాలా సంపాదిస్తున్నారు. కాలేజీకి వెళుతున్నారు, మంచి ఉద్యోగం చేస్తున్నారు. డబ్బు, అధికారం రెండూ ఉంటున్నాయి" అని కేట్ బెర్నాట్ చెప్పారు.
మద్యం బ్రాండ్‌లను ప్రభావితం చేయడానికి మహిళలకు అధికారం దక్కిందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- వరదలో మునిగిన కార్లకు ఇన్సురెన్స్ సొమ్మును ఎలా లెక్కిస్తారు? ఎంత చెల్లిస్తారు?
- World War II : హిమాలయాల్లో కూలిన 600 అమెరికా యుద్ధ విమానాల శకలాలు ఇప్పుడు ఎక్కడున్నాయంటే...
- అన్నా మణి: ఈ భారతీయ ‘వెదర్ వుమన్’ గురించి మీకు తెలుసా?
- బిగ్ బజార్: రిటైల్ కింగ్ కిశోర్ బియానీ సామ్రాజ్యం ఎలా దివాలా తీసింది...
- మెహందీ పెట్టుకుంటే కొందరికి అలర్జీ ఎందుకు వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














