రెడ్ వైన్ తాగితే తలనొప్పి వస్తుందా? ఎందుకు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మిచెల్ రాబర్ట్స్
- హోదా, డిజిటల్ హెల్త్ ఎడిటర్
ఇతర రకాల ఆల్కాహాల్ తాగినప్పుడు ఎలాంటి ఇబ్బంది పడని కొందరు చిన్న గ్లాస్ రెడ్ వైన్ తాగినా బాగా తలనొప్పితో బాధపడుతుంటారు. ఇలా ఎందుకు జరుగుతుందో తాము కనుగొన్నట్లు అమెరికా పరిశోధకులు చెప్పారు.
ఎర్రటి ద్రాక్షల్లో ఉన్న రసాయన సమ్మేళనం వల్ల ఇలా జరుగుతుందని కాలిఫోర్నియా యూనివర్సిటీ బృందం తెలిపింది. ఇది ఆల్కాహాల్‌కు సంబంధించిన జీర్ణక్రియను క్లిష్టంగా మార్చగలదని చెప్పింది.
ఈ రసాయన మిశ్రమం యాంటీఆక్సిడెంట్ లేదా ఫ్లేవనాల్. దీన్ని క్వెర్సెటిన్‌గా పిలుస్తారు.
అమెరికాలోని కాలిఫోర్నియాలో సూర్యకాంతి ఎక్కువగా ఉండే నాపా వ్యాలీలో పండే ద్రాక్షలో క్వెర్సెటిన్ అధికమని పరిశోధకులు చెప్పారు.

ఫొటో సోర్స్, THINKSTOCK
సూర్యకాంతి ప్రభావం?
సూర్యకాంతి అధికంగా ఉండే ప్రాంతాల్లో పండే ఎర్రటి ద్రాక్షలలో క్వెర్సెటిన్ ఎక్కువగా ఉంటుంది.
దీని వల్ల చౌకైన ఆల్కాహాల్‌తో పోలిస్తే ఖరీదైన రెడ్ వైన్స్ వల్లనే ప్రజలు ఎక్కువగా తలనొప్పికి గురవుతున్నారని పరిశోధకుల్లో ఒకరైన ప్రొఫెసర్ ఆండ్రూ వాటర్‌హౌస్ బీబీసీతో చెప్పారు.
‘‘చౌకగా లభించే ద్రాక్షలు గుబురు గుబురుగా అల్లుకునే తీగలలో పండుతున్నాయి. వీటికి ఎక్కువగా ఆకులుంటాయి. దీంతో వీటిపై సూర్యకాంతి అంతగా పడదు’’ అని చెప్పారు.
ఎక్కువ క్వాలిటీ ఉండే ద్రాక్షలు ఆకులు తక్కువగా ఉండే చిన్న చిన్న పంటలలో పండుతాయి. దీంతో వీటిపై సూర్యకాంతి ఎక్కువగా పడుతుంది.
‘‘వైన్ క్వాలిటినీ పెంచేందుకు సూర్యకాంతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి’’ అని ఇతర పరిశోధకులు చెప్పారు.
మరోవైపు చౌకగా లభించే వైన్లే తలనొప్పికి ఎక్కువగా కారణమవుతున్నాయని చికిత్సలపై ప్రయోగాలు చేసే నిపుణులు లండన్‌లోని క్వీన్ మారీ యూనివర్సిటీ ప్రొఫెసర్ రోగల్ కార్డర్ చెప్పారు. కానీ, వీటిని ఆధారాలతో రుజువు చేయలేకపోయారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
తలనొప్పికి అసలు కారణం?
రెడ్ వైన్ తక్కువగానే తాగినా కొంత మందికి అర గంటలోనే తలనొప్పి ఎందుకు వస్తుందనేది వివరించేందుకు ఇప్పటివరకు చాలా ప్రయోగాలు జరిగాయి. రెడ్ వైన్‌లోని కొన్ని సల్ఫైట్స్ వల్ల ఇలా జరుగుతుండొచ్చని చెప్పాయి.
ఈ సల్ఫైట్లను వైన్ తాజాగా, ఎక్కువ కాలం పాటు ఉంచేందుకు వాడతారు.
సాధారణంగా, రెడ్ వైన్లతో పోలిస్తే తియ్యగా ఉండే వైట్ వైన్లలోనే సల్ఫైట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
కొందరికి సల్ఫైట్ పడదు. అలర్జిక్ రియాక్షన్లు వస్తాయి.
ఈ అలర్టిక్ రియాక్షన్ల బారిన పడకుండా ఉండేందుకు రెడ్ వైన్ తాగకుండా ఉంటే మంచిది.
తలనొప్పికి ఈ సల్ఫైట్ కంటెంట్ కారణమా అనే దానిపై ఆధారాలు కాస్త తక్కువగానే ఉన్నాయి.
వైట్, రోజ్ వైన్లు కాకుండా రెడ్ వైన్‌లో అత్యంత సాధారణంగా వాడే పదార్థం హిస్టామైన్ కూడా తలనొప్పికి కారణంగా చెబుతుంటారు.
హిస్టామైన్ శరీరంలోని రక్తకణాలలో కలిసినప్పుడు, తలనొప్పికి కారణమవుతుంది. కానీ, దీని వల్లే ఇలా జరుగుతుందా అనే దానిపై కూడా సరైన ఆధారాలు లేవు.

ఫొటో సోర్స్, Getty Images
విషపూరితంగా మారడం
తూర్పు ఆసియా సంతతికి చెందిన ప్రతి ముగ్గురు వ్యక్తుల్లో ఒకరికి పైగా బీర్, వైన్, స్పిరిట్స్ ఇలా ఏ ఆల్కాహాల్ తాగినా తీవ్ర అస్వస్థతకు గురవుతున్నట్లు నిపుణులు గుర్తించారు.
వారు ఆల్కాహాల్ తాగినప్పుడు ముఖం ఎర్రబడటం, తలనొప్పి రావడం, వికారం కలుగుతాయని నిపుణులు చెప్పారు.
ఆల్కాహాల్ మెటబోలైజింగ్ ఎంజైమ్ ఏఎల్‌డీహెచ్2 లేదా అల్డిహైడ్ డీహైడ్రోజినేస్ ఎలా పనిచేస్తుందనే దానిపై ఇది ఆధారపడి ఉంటుందన్నారు.
ఆల్కాహాల్ శరీరంలో రెండు విధానాల్లో విచ్ఛిన్నమవుతుంది.
ఒకటి విషపూరితమైన సమ్మేళనం అంటే ఎసిటాల్డిహైడ్‌గా మారుతుంది. ఎసిటాల్డిహైడ్ ఆ తర్వాత ఎసిటిక్ ఆమ్లంగా, ఆ తర్వాత కార్బన్‌డయాక్సైడ్‌గా విడిపోతుంది.
ఒకవేళ అలా జరగనప్పుడు, హానికరమైన ఎసిటాల్డిహైడ్ వృద్ధి చెంది, ఈ లక్షణాలు కనిపిస్తాయి.
రెడ్ వైన్ తాగినప్పుడు వచ్చే తలనొప్పిలో కూడా ఇదే విధంగా జరుగుతుండొచ్చని పరిశోధకులు విశ్లేషించారు.

ఫొటో సోర్స్, Getty Images
‘ఇప్పుడు వారిపై పరిశోధనలు జరుపుతాం’
ఆల్కాహాల్‌తో కలిసినప్పుడు క్వార్సెటిన్ మాత్రమే సమస్యగా మారుతుందని పరిశోధకులు చెప్పారు.
క్రౌండ్ ఫండింగ్ ద్వారా వీరు ఈ పరిశోధనలు జరిపారు. సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో వీరు కనుగొన్న ఆధారాలు ప్రచురితమయ్యాయి.
క్వెర్సెటిన్ చాలా ఇతర పండ్లు, కూరగాయాల్లో ఉంటుంది. క్వెర్సెటిన్ ఆరోగ్యకరమైన పదార్థమే.
ఎందుకంటే దీనిలో ఉన్న యాంటీ-ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఆరోగ్యానికి మంచిని కలగజేస్తాయి.
క్వెర్సెటిన్ అనే పదార్థం సొంతంగా తలనొప్పి లాంటి ఆరోగ్య సమస్యలను కలిగించదు.
పరిశోధకులు తాము కనుగొన్న అంశాలను ప్రజల్లో నిరూపించాల్సి ఉంది.
‘‘లక్షల ఏళ్లుగా అంతుచిక్కని రహస్యంగా ఉన్న దాన్ని ప్రజలకు తెలియజేసేందుకు మేం సరైన మార్గంలోనే ఉన్నాం. ఈ తలనొప్పులు వచ్చే వారిపై మేం ఇప్పుడు శాస్త్రీయంగా పరిశోధనలు జరపాల్సి ఉంది. వేచి ఉండండి’’ అని శాన్‌ఫ్రాన్సిస్కోలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ హెడెక్ సెంటర్ డైరెక్టర్, న్యూరాలజీ నిపుణులు ప్రొఫెసర్ మోరిస్ లెవిన్ చెప్పారు.
ఈ అధ్యయనాలు మరికొన్ని నెలల్లో ప్రారంభమవుతాయని ఆశిస్తున్నామన్నారు.
కానీ, వైన్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను అధ్యయనం చేసిన ప్రొఫెసర్ కార్డర్ మాత్రం ఇతర పదార్థాల వల్ల తలనొప్పి వస్తుండొచ్చని అనుమానిస్తున్నారు.
చౌక వైన్లను పాడవకుండా ఉంచేందుకు ముఖ్యంగా బ్రిటన్‌లో బాటిళ్లను పెద్ద పెద్ద కంటైనర్లలో తరలించేటప్పుడు డైమిథైల్ డైకార్బోనేట్‌ను ఉపయోగిస్తారు.
మద్యం ఎక్కువగా తాగడం, తరచూ తాగడం వల్ల స్వల్ప కాలంలో, దీర్ఘ కాలంలో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది.
ఏ ఆల్కాహాల్ తీసుకుంటున్నారనే దానితో సంబంధం లేకుండా రెగ్యులర్‌గా మద్యం తాగడం అంటే వారంలో 14 యూనిట్లకు పైగా తాగడం వల్ల కాలేయం, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. గుండెపోటులు, గుండె సంబంధిత వ్యాధుల బారిన పడతారు.
ఆల్కాహాల్ పలు రకాల క్యాన్సర్‌కు కారణమవుతుంది. డ్రింక్ చేసిన ప్రతీసారి ఈ ప్రమాదం పెరుగుతూ ఉంటుంది.
ఉదాహరణకు బ్రిటన్‌లో 10 రకాల రొమ్ము క్యాన్సర్ కేసుల్లో ఒకటి ఆల్కాహాల్ తాగడం వల్లే వస్తున్నట్లు తెలిసింది. ఏడాదికి 4,400 కేసులు నమోదవుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- శ్రద్ధా వాల్కర్ హత్య కేసు: 'శరీరంలో ఒక్క ముక్క ఇచ్చినా అంత్యక్రియలు చేసే వాళ్లం...'
- ఉత్తర కాశీ: సొరంగంలో పని చేయడమంటే ప్రాణాలకు తెగించడమేనా?
- అహ్మదాబాద్: భారత ప్రేక్షకులు, టీమిండియా ఆటగాళ్ల తీరుపై ఆస్ట్రేలియా మీడియా ఏం రాసింది?
- ఉత్తరకాశి సొరంగ ప్రమాదం: బిహార్, ఝార్ఖండ్ నుంచి వచ్చిన కార్మికులు ఏ పరిస్థితుల్లో ఇక్కడ పనిచేస్తున్నారు?
- తిరుమల లడ్డూ తయారీలో ‘శ్రీవైష్ణవ బ్రాహ్మణులే’ ఉండాలా? టీటీడీ నిబంధనపై వివాదం ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














