తిరుమల లడ్డూ తయారీలో ‘శ్రీవైష్ణవ బ్రాహ్మణులే’ ఉండాలా? టీటీడీ నిబంధనపై వివాదం ఎందుకు?

తిరుమల ఆలయం

ఫొటో సోర్స్, FACEBOOK

    • రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
    • హోదా, బీబీసీ కోసం

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల తిరుమల నడకదారిలో చిరుత పులుల దాడులపై టీటీడీ వరుసగా పతాక శీర్షికల్లో నిలిచింది.

టీటీడీ తీసుకుంటున్న చర్యలపై, జాగ్రత్తలపై సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఎన్నో విమర్శలు, మీమ్స్ కూడా వచ్చాయి.

ఇటీవల టీటీడీకి ఉద్యోగులను అందిస్తున్న ‘శ్రీ లక్ష్మి శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్’ విడుదల చేసిన నోటిఫికేషన్ మరో వివాదానికి కేంద్ర బిందువైంది.

తిరుమల లడ్డూ తయారీకి ఇచ్చిన ఈ నోటిఫికేషన్‌లో అభ్యర్థులు కచ్చితంగా శ్రీవైష్ణవ బ్రాహ్మణులు అయ్యుండాలనే నిబంధన పెట్టడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

తిరుమల ప్రసాదాల తయారీలో కుల వివక్ష పాటించటం న్యాయం కాదని వామపక్ష నేతలు వీడియోలు విడుదల చేయడంతో వివాదం రాజుకుంది.

ఈ నోటిఫికేషన్‌పై టీటీడీ అర్చకుల సమాధానం ఏంటి? చరిత్రకారులు ఏమంటున్నారు?

 శ్రీవారి ప్రసాదాలు

ఫొటో సోర్స్, TTD

అర్హతల్లో అది ఒకటి

ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ప్రసాదాలు తయారు చేసే పోటులో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో మొత్తం ఆరు స్థానాలు భర్తీ చేయడానికి ఇచ్చిన నోటిఫికేషన్‌లో టీటీడీ అర్హతలను స్పష్టంగా పేర్కొంది. దరఖాస్తు చేసే వ్యక్తికి ఆచారాలు, ఆ పని తెలిసుండాలని చెప్పింది.

ఆ తర్వాత ప్రసాదాల తయారీలో కచ్చితంగా ఐదేళ్ల అనుభవం ఉండాలని తెలిపింది.

ఇక మూడో అర్హతగా కచ్చితంగా శ్రీవైష్ణవ బ్రాహ్మణులు అయ్యుండాలని చెప్పింది. ఇప్పుడు వివాదం రాజుకుంది దీని చుట్టూనే.

కందారపు మురళి

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, కందారపు మురళి

ఇది కుల వివక్షే: సీఐటీయూ

తిరుమలలో ప్రసాదాల తయారీలో కుల వివక్ష సరికాదని, తక్షణం టీటీడీ తమ నోటిఫికేషన్ రద్దు చేయాలని తిరుపతి సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి డిమాండ్ చేశారు.

తిరుమల ఆలయంలోని పోటులో ప్రసాదాల తయారీకి శ్రీవైష్ణవ బ్రాహ్మణులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ ఇవ్వడం అభ్యంతరకరమని ఆయన చెప్పారు.

‘‘రామానుజాచార్యులు విశిష్టాద్వైతంతో కులమతాలకు అతీతంగా తిరుమల ఆలయ వ్యవస్థను నడిపించారు. ఇప్పుడు దానికి భిన్నంగా టీటీడీ ఫలానా కులం వారే ప్రసాదాలు తయారు చేయాలని నోటిఫికేషన్ ఇవ్వడం సమంజసం కాదు’’ అని ఆయన చెప్పారు.

ప్రసాదాలను బయటకు తరలించేది దళితులేనని, అప్పుడు లేని వివక్ష ప్రసాదాల తయారీకి ఎందుకని కందారపు మురళి ప్రశ్నించారు.

“శ్రీవైష్ణవ బ్రాహ్మణులు పోటులో ప్రసాదాలు తయారుచేస్తే వాటిని ఇతర బ్రాహ్మణులు పోటు నుంచి బయటకు తరలిస్తారు. తర్వాత ఆలయ గేట్ల దగ్గర నుంచి వాహనాల వరకు బరువైన ప్రసాదాల ట్రేలను దళితులే మోస్తారు. ప్రసాదాలను మోయటానికి లేని వివక్ష, లడ్డూ తయారీకి ఎందుకు వచ్చిందని ప్రశ్నిస్తున్నాం. టీటీడీ యాజమాన్యం ఈ నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలి” అని డిమాండ్ చేశారు.

వేణుగోపాల దీక్షితులు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ఆలయ ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులు

ఆగమశాస్త్రం ప్రకారమే నోటిఫికేషన్: ప్రధాన అర్చకుడు

కానీ ఈ నోటిఫికేషన్ టీటీడీ అనుసరించే ఆగమశాస్త్ర నియమాల ప్రకారమే ఉందని ఆలయ ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులు బీబీసీతో చెప్పారు.

ఈ వివాదంపై బీబీసీతో మాట్లాడిన ఆయన, పోటులో ప్రసాదాల తయారీని శ్రీవైష్ణవులే చేస్తారని చెప్పారు.

‘‘ప్రసాదాల తయారీ వైఖానసులు చేయాలి. వారు దొరకనప్పుడు శ్రీవైష్ణవులను పెట్టుకోవచ్చని ఆగమశాస్త్రం చెబుతోంది. శాస్త్రం చెప్పినదాని ప్రకారం శ్రీవైష్ణవులు లడ్డూ తయారు చేయవచ్చు.

మనకు చిన్న దేవాలయాలు ఉన్నప్పుడు, అర్చకుడు ఒకరే ఉంటే పూజలు, ప్రసాదాలు అన్నీ వాళ్లే చేసుకుంటారు. గ్రామాల్లో అంతా కూడా అర్చకుడు తన ఇంట్లోనే నైవేద్యం చేసుకుని వచ్చి దేవుడికి పెడతారు.

పెద్ద దేవాలయాలు ఉన్నప్పుడు, ప్రత్యామ్నాయంగా శ్రీవైష్ణవులను నియమించవచ్చని ఆగమశాస్త్రం చెబుతోంది’’ అని అన్నారు.

తిరుమల ఆలయం

ఫొటో సోర్స్, TTD

‘వైఖానసుల తర్వాత శ్రీవైష్ణవులే’

ఆగమశాస్త్రం ప్రకారం ఆలయంలో వైఖానసులు మొదట ఉంటారని, ఆలయాల్లో అర్చనలు, పూజలు వారే చేయడం సంప్రదాయంగా వస్తోందని వేణుగోపాల దీక్షితులు వివరించారు.

ఇప్పుడు వారు ఎక్కువగా దొరకడం లేదు కాబట్టి ప్రత్యామ్నాయంగా శ్రీవైష్ణవులను ప్రసాదాల తయారీకి తీసుకుంటున్నారని తెలిపారు.

‘‘అప్పట్లో ఆలయాల్లో అన్నీ మొదట అర్చకులే చేసుకునే వాళ్లు. తర్వాత సహాయకులుగా శ్రీవైష్ణవులను పిలిపించి వారి ద్వారా ప్రసాదాలు తయారు చేసుకోవడం వచ్చింది.

అర్చనలు, కైంకర్యాలు అన్నీ కూడా వైఖానసులే చేస్తారు. వైఖానసులు ప్రసాదాలు కూడా తయారు చేయవచ్చు. కానీ వైఖానసులు దొరకరు కాబట్టి ప్రసాదాల తయారీకి ప్రత్యామ్నాయంగా శ్రీ వైష్ణవులను పెట్టుకొని ఈ కార్యక్రమాలను చేయించుకోవడం ఆచారంగా కొనసాగుతుంది.

సంస్కారము, యజ్ఞోపవీతం, బ్రాహ్మణులు అని ఒక వ్యవస్థ నడుస్తోంది. కాబట్టి ఆ సిస్టమ్ ప్రకారం మనం వెళ్లాలి. దానిపై ప్రశ్నిస్తే మేం ఏం సమాధానం చెప్పగలం.

మన శాస్త్రం, సంప్రదాయాల ప్రకారం మేం వీటిని పాటిస్తాం. ఒక్కొక్క వ్యవస్థకు కొన్ని దేవాలయాలకు కొన్ని ఆచారాలు పద్ధతులు, సంప్రదాయాలు ఉంటాయి. వాటిని కొనసాగిస్తూ, ముందుకు వెళ్తాం’’ అని వేణుగోపాల దీక్షితులు చెప్పారు.

ప్రస్తుతం శ్రీవారి పోటులో ప్రసాదాల తయారీలో శ్రీవైష్ణవులే ఉన్నారు కాబట్టి ఆ సంప్రదాయాన్ని అలాగే కొనసాగిస్తున్నామని ఆయన తెలిపారు.

గోపి కృష్ణారెడ్డి, చరిత్రకారుడు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, గోపి కృష్ణారెడ్డి, చరిత్రకారుడు

ఇది ఎక్కడి నుంచి వచ్చింది?: గోపీ కృష్ణారెడ్డి

చరిత్రకారులు మరో వాదనను తెరపైకి తెస్తున్నారు.

మొదట్లో ప్రసాదాలు ఎవరు తయారు చేయాలి అనేది లేదని, కానీ శ్రీవైష్ణవులు దానిలోకి ప్రవేశించి, వారి బలం పెంచుకున్న తర్వాత ఇది మొదట్నుంచీ తామే చేస్తున్నామని అంటున్నారని తిరుపతికి చెందిన చరిత్రకారుడు గోపీ కృష్ణారెడ్డి తెలిపారు.

‘‘ఏ కులం వాళ్ళు చేస్తున్నారు, ఏ కులం వాళ్ళు చేయడం లేదు అనే ప్రస్తావన మొదట్నుంచి లేదు. శ్రీవైష్ణవులు కొందరు మొదట గార్డెన్‌లోకి వచ్చారు. తర్వాత అన్ని విభాగాల్లోకి అంటే లడ్డూ తయారీలోకి కూడా ప్రవేశించారు. క్రమంగా వారి బలం పెరిగింది. దాంతో మొదట్నుంచి అన్నీ మేమే చేస్తున్నామని అంటున్నారు. మొదట్లో ఇలాంటి నిబంధనలు ఏమీ లేవు’’ అని అన్నారు.

ఎయిడెడ్ సంస్థల్లో ప్రభుత్వం అన్ని కులాల వారికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని, ఇతర కులాల వారు ఉంటే ప్రభుత్వం వారికి గ్రాంట్ ఇస్తుందని గోపీ కృష్ణారెడ్డి చెప్పారు.

‘‘మొదట్లో టీటీడీలో పనిచేసే వారిలో క్రైస్తవులు, ముస్లింలు, అందరూ ఉండేవారు. ఇప్పుడు కూడా ఉండొచ్చు. ముఖ్యంగా ఎయిడెడ్ సంస్థల్లో ప్రభుత్వం గ్రాంట్ ఇస్తుంది. అన్ని రకాల వాళ్ళను చేర్చుకోవాలి, ఉద్యోగాలు ఇవ్వాలి.

బ్రాహ్మణులు వచ్చిన తర్వాత, తమకు అధికారం ఉంది కదా అని అంతా బ్రాహ్మణులే ఉండాలి, వేరే వాళ్ళు ప్రవేశించకూడదనే నియమాలు తీసుకొచ్చారు. అక్కడ వాళ్లే చేయాలి. వేరే వారు ఈ పని చేయకూడదని ఏం లేదు.

ఒక ఆచారం ప్రకారం వచ్చిందని అంటున్నారు. కానీ మీరే చేయాలనే ‘రూల్’ ఎక్కడుంది అంటే మాత్రం చూపించరు’’ అని గోపీ కృష్ణారెడ్డి అన్నారు.

ఇలాంటివన్నీ ఒక ఆచారం, పద్ధతిగా మారిపోయాయని, ఒకవేళ టీటీడీ వేరే కులాల వారిని ఆయా పనుల్లో పెట్టుకున్నా ఇప్పుడు తాజా నోటిఫికేషన్ రద్దు చేయాలని అయన చెప్పారు.

‘‘ఎవరెవరు ఏ నియమాలు ఆచరిస్తారో అదే పద్ధతి అయిపోయింది. అది అసలు వాస్తవం. ఇప్పుడు టీటీడీ వేరే మతం వారిని నియమిస్తే, మళ్లీ ఆ కమ్యూనిస్టులే వేరే మతం వారిని చేర్చుకున్నారని విమర్శిస్తారు. దీనికి ఏవైనా నియమ నిబంధనలు, శాసనాలు ఉంటే వాటిపై పోరాడవచ్చు. అలాంటివి ఏవీ లేవు కాబట్టి వారి ఇష్టం’’ అని అన్నారు.

టీటీడీ నియామకాలకు నోటిఫికేషన్ ఇవ్వకుండా మామూలుగా చేసి ఉండాల్సిందని గోపీ కృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు.

‘‘ప్రసాదాల తయారీకి శ్రీవైష్ణవులే ఉండాలని ఏమీ లేదు. పోటు ఇన్‌చార్జ్ గమేకార్ ఎవర్ని చేర్చుకుంటారో ఎవరికి తెలుసు? ఎవరైనా యజ్ఞోపవీతం వేసుకుని నేను బ్రాహ్మణుడని చెబితే దానికి ఆధారం ఏంటి? గతంలో పంచకర్మలు ఉండేవి. వైష్ణవ సంప్రదాయంలో చేర్చుకునేటప్పుడు శంకు, చక్రం, నామం ముద్రలు వేసేవారు. వాటిని కాల్చి భుజాలపై, ముఖంపై వేస్తే వారు వైష్ణవులు. అప్పట్లో అలా ఉండేది. దీనిపై జీవో ఇవ్వడానికి ఏమీ లేదు’’ అని గోపీకృష్ణారెడ్డి అన్నారు.

సంప్రదాయాన్ని గౌరవించాలని ఆయన చెప్పారు. తమిళనాడులో ఇలా ఆలయాల్లో నియమించుకునే ఉద్యోగాలకు కులాలు ఏవీ లేవన్నారు.

మంత్రాలు, అవీ నేర్చుకుంటే వారు పూజారులుగా పనిచేయవచ్చని, సంప్రదాయాలన్నీ తెలిస్తే అర్చకులుగా పనిచేయవచ్చని తెలిపారు.

టీటీడీ సంప్రదాయం ప్రకారం ఈ నోటిఫికేషన్ జారీ చేసి ఉంటుందన్నారు.

తిరుమల ప్రసాదాలు

ఫొటో సోర్స్, TTD

‘అలవాటున్నవారినే నియమిస్తారు’

‘‘టీటీడీ సంప్రదాయాన్ని బాగా పాటిస్తుంది. సంప్రదాయం అనేది ముఖ్యం. మన ఇంట్లో కూడా మన పెద్దలు ఏం పాటిస్తే, మనం అదే పాటిస్తాం. మన పిల్లలు కూడా అదే చేస్తారు. కొండ మీదా అంతే. ఈ కమ్యూనిస్టులు అన్నీ అంటారే గాని వాళ్లే పాటించరు. వాళ్లకు దేవుడంటే నమ్మకం లేదు. అయితే వాళ్లు కూడా దర్శనానికి వస్తుంటారు. మీరు వచ్చారేంటి, మీరు వ్యతిరేకిస్తారు కదా అని అడిగితే. మా ఇంట్లో మహిళల బలవంతం మీద వచ్చాం, నాకేం ఆసక్తి లేదు అంటారు’’ అని గోపీ కృష్ణారెడ్డి విమర్శించారు.

శ్రీవారి పోటులో పని చాలా కష్టంగా ఉంటుందని ఆయన చెప్పారు. శారీరకంగా మానసికంగా ఆ వేడికి ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆ పనిలో బాగా అలవాటున్న వారినే నియమిస్తారని ఆయన వివరించారు.

“పోటులో పనిచేసే వారిని నియమించడాన్ని గమేకార్‌ చూసుకుంటారు. ఆయనే వారిని చేర్చుకుంటారు. మీరు ఏ ఋషి వంశస్థులు అని అడిగితే చెప్పలేని వారు కూడా అక్కడ పనిచేస్తూ ఉండొచ్చు” అని గోపీ కృష్ణారెడ్డి చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)