దేవుని వెల్లంపల్లి: ఇక్కడ తరతరాలుగా యానాదులే పూజారులు, ఈ సంప్రదాయం ఎలా మొదలైందంటే....

అర్చకుడు పోలయ్య
ఫొటో క్యాప్షన్, అర్చన చేస్తున్న పోలయ్య
    • రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
    • హోదా, బీబీసీ కోసం

దేవాలయాల్లో ఆదివాసీలు పూజారులుగా ఉండటం అరుదు. కానీ తరతరాలుగా ఆదివాసీ తెగకు చెందిన యానాదులు పూజారులుగా ఉంటున్న ఆలయం ఒకటి తిరుపతి జిల్లాలో ఉంది.

డక్కిలి మండలంలోని దేవుని వెల్లంపల్లిలో స్తంభాలగిరి ఈశ్వరయ్య స్వామి దేవస్థానం ఉంది. దేవాదాయ ధర్మాదాయశాఖ అధీనంలో నిత్యం పూజలు జరిగే ఈ శివాలయంలో యానాది కులస్తులే తరతరాలుగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

‘‘ఈ ఆలయంలో ప్రస్తుతం పూజలందుకుంటున్న శివలింగాన్ని మా పూర్వీకుడైన పాపయ్యకు పరమశివుడు ఇచ్చాడు. దానికి పూజలు చేస్తే అదే మమ్మల్ని సాకుతుందని ఆ దేవుడు చెప్పాడు’’ అని ప్రస్తుతం అదే ఆలయంలో పూజారిగా ఉన్న పాపయ్య వారసులు చెబుతున్నారు.

‘‘పశువుల కాపరి యోగి అయ్యాడు’’

‘‘మా తాత పాపయ్య కాపలా కాసే పొలంలో రోజూ ఒక ఆవు వచ్చి మేసేది. అది ఆయనకు ఒక్కరికే కనబడేది. దీంతో ఆయన దానిపై నిఘా పెట్టారు. అది రోజూ అర్ధరాత్రి సమయంలో కొండపై నుంచి దిగి వచ్చేది. ఆయనకు దానిపై సందేహం వచ్చి, అది ఎక్కడికి పోతుందో తెలుసుకోడానికి ఆవును వెంబడించాడు. అది స్తంభాలగిరి అనే గుహలోకి వెళ్లి ఆగింది.

తర్వాత అది మాయమైపోవడంతో అది ఏంటో తెలుసుకోవాలని ఆయన అక్కడే 3 నెలలు కూర్చున్నాడు. ఆ సమయంలో స్వామివారు ఆయనకు రకరకాల రూపాల్లో కనిపించారట. చివరకు ఆయన ఏం కావాలో కోరుకో అంటే నీ దర్శనమే చాలు ఇంకేం వద్దు అన్నారట. పాపయ్య శివభక్తుడు. అందుకే ఆయన ఏ కోరికలూ కోరకుండా శివుణ్ణి పూజించే భాగ్యం ప్రసాదించమని కోరాడు’’ అని పాపయ్య వారసులైన గురకల పోలయ్య చెప్పారు.

దేవుని వెల్లంపల్లిలో స్తంభాలగిరి ఈశ్వరయ్య స్వామి దేవస్థానం
ఫొటో క్యాప్షన్, దేవుని వెల్లంపల్లిలో స్తంభాలగిరి ఈశ్వరయ్య స్వామి దేవస్థానం

‘‘యానాదులు నాకు పూజ చేస్తారా అని శివుడు వేళాకోళమాడాడు’’

తమ పూర్వీకుడైన పాపయ్య పరమశివుడిని కోరిన వరం కారణంగానే ఇప్పటికీ తాము ఆలయ పూజారుగా ఉన్నామని చెప్పారాయన.

‘‘ఏదైనా కోరుకోమన్న శివుడితో.. పాపయ్య నాకు మీరు ఏమిచ్చినా నిలిచేది కాదు. నేను మిమ్మల్ని పూజించుకునేలా నాకు ఏదైనా సాయం చేయండి అన్నారట. అప్పుడు శివుడు కూడా మీరు యానాదులు, నాకు పూజ చేసే అంత గొప్పవాళ్లా, మహామహులే నాకు పూజలు చేయలేకపోతున్నారు అన్నాడట. దాంతో, పాపయ్య స్వామి మీరు అది ఇవ్వకపోతే నేను వెళ్ళిపోతాను అన్నారట. దాంతో శివుడు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నీకు ఒక లింగం ఇస్తా దాన్ని నువ్వు ఎక్కడ నివసించాలనుకుంటే, అక్కడ ప్రతిష్టించు అదే నిన్ను సాకుతుంది అన్నారట. ఆ తర్వాత పాపయ్య ఆ లింగాన్ని నా తరువాత తరాలు కూడా పూజించాలి అని కోరారట. దానికి శివుడు కూడా తథాస్తు పలికారని చెప్పుకుంటారు’’ అని పోలయ్య తెలిపారు.

పాపయ్య 1791లో శివుడు ఇచ్చిన లింగాన్ని వెల్లంపల్లిలో ప్రతిష్టించారని చెబుతారు.

దీంతో ఆ గ్రామం దేవుని వెల్లంపల్లిగా మారింది. సుమారు 25 ఏళ్లు ఆ విగ్రహానికి పూజలు చేసిన పాపయ్య ఆలయానికి వచ్చే భక్తులకు సోది(భవిష్యత్తు) చెప్పడం, వారి కోర్కెలు తీర్చడం చేసేవారని ఆయన వారసులు చెబుతున్నారు.

300 ఏళ్ల నుంచీ తమ కుటుంబాలు ఆ ప్రాంతంలోనే నివశిస్తున్నాయని పోలయ్య చెప్పారు. తమ నాలుగో తరం ప్రస్తుతం స్తంభాలగిరి ఆలయంలో పూజలు చేస్తున్నామని చెప్పారు.

స్తంభాలగిరి ఆలయంలో పూజారులుగా నాలుగో తరం
ఫొటో క్యాప్షన్, స్తంభాలగిరి ఆలయంలో పోలయ్య వంశానికి చెందిన నాలుగోతరం వారు పూజారులుగా పని చేస్తున్నారు.

‘ఇదే వృత్తి, ఉద్యోగాలపై ఆశ వదులుకున్నాం’

ఆలయం దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నా పూజారులు ప్రభుత్వం నుంచి జీతభత్యాలు ఆశించడంలేదు. భక్తులు హారతిపళ్లెంలో వేసే దక్షణతోనే వారు జీవనం సాగిస్తున్నారు. ఆలయం ద్వారా వచ్చే ఆదాయాన్ని పరుల సొత్తుగానే భావిస్తామని పోలయ్య అన్నారు.

‘‘నేను ఆలయ అర్చకుడుగా వచ్చి 5 ఏళ్లు అయ్యింది. మాది 4వ తరం. ఆలయానికి వచ్చే డబ్బుతో మా పరిస్థితి మెరుగుపడాలని, మార్చుకోవాలని అనుకోం. నాయనా ఇది పరుల సొత్తు, నిలబడేది కాదు అని మా తాతగారు ఎప్పుడో చెప్పారు. ఈ డబ్బును ఆశించవద్దు అని చెప్పారు. ఈ డబ్బుతో టౌన్‌లో ఎక్కడైనా స్థలం లాంటివి కొనాలన్నా అలాంటివి వద్దు. మీరు అలాంటి ప్రయత్నం చేసినా అది నెరవేరదు అని చెప్పారు. అందుకే భక్తులు ఇచ్చే కానుకలు, విరాళాలను దేవస్థానం కోసం, ఇక్కడకు వచ్చే ఆవులు, ఎద్దులు, వాటి పోషణకు ఖర్చు పెడతాం. వాటిని తీసుకువచ్చే వారికి చార్జీలు కూడా ఇస్తాం. ప్రభుత్వం మాకు ఇస్తోంది ఏమీ లేదు.’’ అని అన్నారు.

ఆలయంలో తరతరాల నుంచీ పూజారులుగా ఉన్న యానాది కుటుంబం చివరికి బాగా చదివి ఉద్యోగం చేయాలని కోరుకునే తమ వారసులు కూడా ఇదే వృత్తిలో ఉండాలని భావిస్తోంది. ఇక్కడ పూజారులుగా ఉండాలనేది విధి కాబట్టే తన కుమారుడుకి ఉద్యోగం కూడా రావడం లేదని అంటున్నారు పోలయ్య.

‘‘నా పెద్ద కుమారుడు కిషోర్ డిగ్రీ వరకు చదివాడు. ఏదైనా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని బతకాలని గత ఐదేళ్లుగా ప్రయత్నిస్తున్నాడు. కానీ రావడం లేదు. నెల్లూరులో రూమ్ తీసుకుని అక్కడే చదువుతున్నాడు. మనకు ఉద్యోగం రాదు అని వాడికి చెప్పాను. నీకు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం రావాలని ఉన్నా, ఒక మార్కులో అయినా పోతుంది అన్నాను. అలా 27 ఏళ్ల నుంచీ ఉద్యోగం రాలేదు. ఎప్పటికైనా ఇక్కడ ఇలా బతకాల్సిన వాళ్లమే. నేను పుట్టినప్పటి నుంచి, ఇదే ధ్యానంతో బతికాను. ఇప్పుడు కూడా అలాగే బతుకుతున్నా.’’ అని అన్నారాయన.

దేవుని వెల్లంపల్లి గ్రామంలో స్తంభాలగిరి ఈశ్వరయ్య ఆలయం
ఫొటో క్యాప్షన్, ఈ గుడికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు.

దైవ స్వరూపంగా భావించే గ్రామస్తులు

ఈ ఆలయంలో పాపయ్య ప్రతిష్టించిన విగ్రహానికి ప్రతి సోమవారం పూజలు చేస్తుంటారు. తర్వాత ఆలయం ప్రాంగణంలో ఉన్న వారి పెద్దల సమాధులకు పూజలు చేస్తారు.

ప్రస్తుతం ఈ ఆలయంలో పూజలు చేస్తున్న గురకుల పోలయ్యకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మరో పది మంది వరకూ ఈ ఆలయంలో రకరకాల పనులు చేస్తుంటారు. ఆలయం దగ్గర వాహన పూజలు, స్వామివారికి అర్చనలులాంటివి జరుగుతుంటాయి.

ఈ ఆలయంలో పూజారులుగా పనిచేసే యానాది కుటుంబంలో వారిని తాము దైవ స్వరూపంగా భావిస్తామని చుట్టుపక్కల గ్రామస్థులు చెబుతున్నారు.

తమ దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా తమ కోసం పూజలు చేస్తారని, వారిపై తమకు చాలా నమ్మకం ఉందని వెల్లంపల్లి పక్కనే ఉండే లింగ సముద్రంకు చెందిన రమణయ్య నాయుడు చెప్పారు.

‘‘మాకు, మా పిల్లలకు ఆరోగ్యం సరిగా లేకుంటే, ఇక్కడికి వచ్చి స్వామి వారిని మొక్కుకుని వారి చేత్తో ఇచ్చిన విభూది తీసుకెళ్తే అది కుదుటపడుతుంది. ఎలాంటి సమస్యలు ఉన్నా ఇది వరకు వారి పూర్వీకులు సోది కూడా చెప్పేవాళ్లు. వాళ్లు చెప్పినట్టే జరుగుతుండేది. అందుకే మేం ఇక్కడికే వచ్చేవాళ్ళం. యానాది అయ్యవారి చేత్తో విభూది ఇచ్చినా, దారం కట్టిన మాకు అంత నమ్మకం. వాళ్లనే దేవుళ్ళుగా భావించినాము. వాళ్లను దైవ స్వరూపంగా భావించి, మేం కాళ్ళ మీద పడాలని అనుకున్నా, వాళ్లు మమ్మల్ని తమ కాళ్లు తాకనివ్వరు’’ అని రమణయ్య నాయుడు చెప్పారు.

ఆలయంలో పూజ చేస్తున్న పోలయ్య
ఫొటో క్యాప్షన్, ఆలయంలో పూజ చేస్తున్న పోలయ్య

దేవాదాయశాఖ పర్యవేక్షణలో ఆలయాభివృద్ధి

ఈ ఆలయం 1990లో దేవాదాయ శాఖ కిందికి వచ్చింది. ప్రస్తుతం ఆలయానికి ఏటా రూ.50 లక్షల వరకూ ఆదాయం వస్తోంది.

గతంలో ఈ ఆలయం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉండేది. ఇప్పుడు తిరుపతి జిల్లా కిందకు వచ్చింది. చెన్నైతో పాటు చిత్తూరు, కడప జిల్లాల నుంచి భక్తులు ఎక్కువగా వస్తున్నారు.

ఇక్కడ పాపయ్య స్వామి వారసులు గురుకల పోలయ్య స్వామి ప్రస్తుతం పూజలు చేస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎండోమెంటు వారు ప్రతిష్టించిన విగ్రహం వెనుక ఒక పలక లాంటి శివలింగం ఉంటుంది.

ఈ ఆలయానికి కుంబాభిషేకం జరగక ముందునుంచీ కూడా పాపయ్య స్వామి వారసులే పూజలు చేస్తున్నారు.

ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీధర్ నాయుడు
ఫొటో క్యాప్షన్, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీధర్ నాయుడు

ఆలయానికి ఏ కులాలకు చెందిన భక్తులు వచ్చినా, ఎంత పెద్దవారు వచ్చినా మిగతా పూజారుల దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటున్నట్లే వీరి దగ్గర దీవెనలు తీసుకుంటారు.

భక్తులకు ఈ ఆలయంపై ఉన్న విశ్వాసాల వల్ల ఆలయానికి చుట్టుపక్కల పేరు వచ్చిందని, క్రమంగా దాని అభివృద్ధి జరిగిందని ఆలయ ఎగ్జిక్యుటివ్ ఆఫీసర్ శ్రీధర్ నాయుడు చెప్పారు.

పూర్వం పూరి గుడిసెలో ఉన్న గుడి భక్తుల తాకిడి పెరగడంతో బాగా అభివృద్ధి చెందిందని, ఇటీవల సీజీఎఫ్ నిదులతో దాన్ని మరింత అభివృద్ధి చేశామని తెలిపారు.

‘‘సోమవారం భక్తులు బాగా వస్తున్నారు. మిగతా రోజుల్లో చాలా తక్కువ సంఖ్యలో వస్తున్నారు. సోమవారం వచ్చిన భక్తులందరికీ ఇక్కడ సౌకర్యాలు సరిపోవడం లేదు. ఇక్కడ దాదాపు 2000 మందికి అన్నదానం చేస్తాం. అది కూడా భక్తుల సహకారంతోనే జరుగుతుంది. వారు బియ్యం, కూరగాయలు లాంటివి ఇస్తుంటారు. ఇక్కడ ఎలాంటి భోజనం గానీ టిఫిన్ గానీ ఏమీ దొరకదు. కాబట్టి ఆలయం ద్వారా చేసే అన్నదానం భక్తులకు ఆకలి తీరుస్తుంది.’’అని శ్రీధర్ నాయుడు అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)