పశ్చిమ దేశాలను ఢీకొనేందుకు రష్యా, చైనా అడుగులు.. పుతిన్, జిన్‌పింగ్ వ్యూహం ఏమిటి?

జిన్‌పింగ్, పుతిన్

ఫొటో సోర్స్, REUTERS

    • రచయిత, స్టీఫెన్ మెక్‌డొనెల్
    • హోదా, బీబీసీ చైనా ప్రతినిధి

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చైనా చేరుకున్నారు. తమ కీలక భాగస్వామి అయిన చైనాతో సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవడంతో పాటు పశ్చిమ దేశాల వ్యతిరేక కూటమి బలోపేతం లక్ష్యంగా ఆయన పర్యటన సాగుతోంది.

రష్యాతో సరిహద్దులో హైహీ అనే ఒక చిన్న చైనీస్ పట్టణం ఉంది. అక్కడి స్థానిక పర్యటకులు మధ్యలో ఉన్న నది దాటి అవతలి ఒడ్డున రష్యాలో ఉన్న బ్లాగొవెషెన్‌స్క్‌కి వెళ్తుంటారు. అయితే, ప్రస్తుతం రాకపోకలు అంతగా లేవు.

అక్కడ నీళ్లలో నిలిపి ఉన్న బోటులో చైనీస్ మ్యూజిక్ పెట్టి పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నా టిక్కెట్లు మాత్రం ఎవరూ కొనుగోలు చేయడం లేదు. ఆ బోటు ఈ రోజంతా అక్కడి నుంచి కదిలేలా కనిపించడం లేదు.

అవతలి వైపు నీళ్లపై అడ్డంగా రష్యా కోస్ట్‌గార్డ్ షిప్ నిలిపి ఉంది. కోస్ట్‌గార్డ్ సిబ్బంది షిప్ డెక్‌పై ఎండలో వ్యాయామం చేస్తూ కాలం గడుపుతున్నారు.

నిరుడు వింటర్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి పుతిన్ వచ్చిన సమయంలో ఇరుదేశాల భాగస్వామ్యంలో ఇక హద్దులు ఉండవని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అన్నారు.

ఇప్పుడు బీజింగ్‌లో మరోసారి పుతిన్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల సంబంధాలపై చైనా జాతీయ మీడియా ప్రశంసలు కురిపిస్తోంది.

ఇది రెండు ప్రభుత్వాలకూ ప్రయోజనకరంగా మారింది. ప్రపంచ వేదికలపై ఇబ్బందులు ఎదురైనప్పుడు ఒకరికొకరు భరోసా ఇచ్చుకోవడంతో పాటు, అంతా సవ్యంగానే సాగుతోందని తమ ప్రజలకు చెప్పేందుకు శక్తిమంతమైన ఈ ఇద్దరు నేతల కరచాలనాలు ఉపయోగపడుతున్నాయి. అయితే, ఇరుదేశాల సరిహద్దుల్లో మాత్రం రాజకీయంగా కనిపించినంత సాన్నిహిత్యం వ్యాపారపరంగా కనిపించడం లేదు.

చైనా, రష్యా బోర్డర్ మ్యాప్

చైనాలోని హైహీ పట్టణం నుంచి రష్యాలోని బ్లాగొవెషెన్‌స్క్ మధ్య కొత్త బ్రిడ్జి నిర్మించారు. రెండు దేశాల సరిహద్దు వాణజ్యంలో కొత్త వారధిగా భావిస్తున్న ఈ బ్రిడ్జిని గంటసేపటి నుంచి పరిశీలిస్తే అటు నుంచి కానీ, ఇటు నుంచి అటు కానీ ఒక్క వాహనం కూడా వెళ్లలేదు.

నది వెంబడి, నగరం నడిబొడ్డున ఉన్న షాపింగ్ కాంప్లెక్స్‌లు ఆదరణ లేక మూతపడ్డాయి. ఒకటి నెల కిందట మూతపడిందని, మరోటి ఏడేళ్లుగా ఖాళీగా ఉందని చెబుతున్నారు.

గతంలో అక్కడ దుకాణాలు నిర్వహించిన కొందరు అక్కడి భవనాల ముందు కార్ల వెనక రష్యన్ వస్తువులు, గ్యాడ్జెట్స్ పెట్టుకుని విక్రయిస్తూ కనిపించారు.

''వ్యాపారం బాలేదు. పర్యాటకులు పెద్దగా రావడం లేదు'' అని ఒక మహిళ చెప్పారు.

''కోవిడ్ తర్వాత బోర్డర్లు ఎక్కువ కాలం మూసేసి ఉన్నాయి. ఇక్కడకు ఎక్కువ మంది రష్యన్లు కూడా రావడం లేదు. వాళ్లు యుద్ధంలో ఉండడంతో వారి వద్ద డబ్బులు లేవు''

ఆమె చెబుతున్నప్పుడు అక్కడ ఉన్న కొందరు తమ తలలు వంచుకున్నారు.

అక్కడికి సమీపంలోని ఒక వీధిలోని దుకాణంలో ఒక మహిళ కూర్చుని ఉన్నారు. ఆమె రష్యన్ ఊలుతో చైనాలో తయారుచేసిన టోపీలను అమ్ముతున్నారు. అప్పట్లో తమ వ్యాపారం బాగుండేదని, రష్యన్, చైనీస్ కస్టమర్లు వచ్చేవారని ఆమె చెప్పారు. కానీ, వ్యాపారం ఇప్పుడు ఇబ్బందుల్లో ఉందని ఆమె అన్నారు.

''గతంలో ఇలా ఉండేది కాదు. అప్పటి పరిస్థితులతో పోల్చి చూడలేం. ఒక్కసారి నిర్మానుష్యంగా ఉన్న ఈ వీధులను చూడండి. ఒకప్పుడు కొనుగోలుదారులతో రద్దీగా ఉండేవి'' అని ఆమె చెప్పారు.

చైనా - రష్యా

ఇదిలా ఉంటే, కొంతమంది మాత్రం రష్యా - చైనా వాణిజ్యంతో ఉత్సాహంగా ఉన్నారు. అక్కడి లారీ డ్రైవర్లు రివర్‌బోట్ పోర్టులో ప్రవేశించేందుకు ఎదురుచూస్తున్నారు.

''నేను సోయాబీన్, గోధుమలు, బార్లీ రవాణా చేస్తున్నా. అన్నీ రష్యా నుంచే. అంతకుముందు కంటే ఇప్పుడు రాకపోకలు పెరిగాయి'' అని ఒక డ్రైవర్ చెప్పారు.

''నేను రష్యా నుంచి ఇసుక, బొగ్గు తరలిస్తున్నా. మిగిలినవాళ్లు కంటైనర్లలో ఆహార పదార్థాలు రవాణా చేస్తున్నారు'' అని మరొకరు చెప్పారు.

సరుకు రవాణా కోసం వచ్చీపోయే వాహనాలతో పోర్టు ప్రవేశద్వారం వద్ద రద్దీగా ఉంది. షిప్పుల్లో వచ్చిన బొగ్గు, ఇసుక, ఇనుమును క్రేన్ల ద్వారా లారీల్లో లోడ్ చేస్తున్నారు.

ఇరుదేశాల మధ్య రవాణాకు కొత్త బ్రిడ్జిపై నుంచి రావడం కంటే షిప్పుల్లో రావడమే సులభమని, తక్కువ ఖర్చుతో అయిపోతుందని అక్కడి డ్రైవర్లు చెబుతున్నారు. ఇదే ఆ కొత్త బ్రిడ్జిపై రాకపోకలు అంత ఎక్కువగా లేకపోవడానికి కారణంగా కనిపిస్తోంది.

అలాగే, చైనా వస్తువులపై రష్యా విధిస్తున్న పన్నులు కూడా వ్యాపార లావాదేవీలు పడిపోవడానికి ఒక కారణమని హైహీకి చెందిన కొందరు వ్యాపారులు చెబుతున్నారు.

అయినప్పటికీ, యుక్రెయిన్‌పై దాడి తర్వాత ఆంక్షల బారిన పడిన తన భాగస్వామికి చైనా సాయం చేస్తోంది. రష్యా నుంచి పైపుల ద్వారా ఈశాన్య ప్రావిన్స్ హీలాంగ్‌జియాంగ్‌కి సహజ వాయువును తరలిస్తోంది.

దానికి తోడు, పుతిన్ యుద్ధంపై వ్యతిరేకత రాకుండా ప్రభుత్వ మీడియాలో కథనాల ద్వారా చాలా మంది చైనీయులను జిన్‌పింగ్ ప్రభుత్వం తమవైపు తిప్పుకుంది.

లారీడ్రైవర్

యుక్రెయిన్ భూభాగం ఆక్రమణ గురించి కానీ, యుద్ధం గురించి కానీ ప్రస్తావించని అక్కడి మీడియా, నాటో ఎలా విస్తారించాలనుకుంటోంది, మరీముఖ్యంగా అమెరికా ఆధిపత్యానికి వ్యతిరేకంగా రష్యా సైనిక చర్యకు దిగినట్టుగా చూపుతుంది.

ఈ ప్రచారం ఎంత విజయం సాధించిందో తెలుసుకోవాలంటే మాత్రం మీరు హీలాంగ్‌జియాంగ్ రాజధాని హార్బిన్‌ వీధుల్లో ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.

శతాబ్దం కిందట ఈ ప్రాంతంలో రష్యన్ల ఆధిపత్యం ఉండేది. ఇక్కడ రష్యన్ సంస్కృతి కనిపించేది. ప్రస్తుతం అక్కడ వారి వారసులు కూడా కనిపించడంలేదు. పూర్తిగా చైనీస్ నగరంగా మారిపోయింది. ప్రస్తుతం ఇక్కడ రష్యన్ గత గుర్తులు మాత్రమే ఉన్నాయి.

అక్కడి రష్యన్ కేథడ్రల్ చర్చి ముందు చైనాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఫోటోలు తీసుకుంటూ ఉంటారు.

''రష్యా, చైనా మధ్య మంచి స్నేహం ఉంది'' అని ఒక మహిళ చెప్పారు.

''పుతిన్ ఒక బాధ్యతయుతమైన నేత. న్యాయబద్ధమైన వ్యక్తి'' అని ఆమె పక్కనున్న వ్యక్తి అన్నారు.

''పుతిన్‌ది ఉక్కు పిడికిలి. ఆయన చాలా కఠినంగా ఉంటారు. అది కూడా మంచిదే'' అని అక్కడకు స్నేహితుడితో కలిసి వచ్చిన మరో సందర్శకుడు అన్నారు.

పుతిన్ యుక్రెయిన్‌తో ఎందుకు యుద్ధం చేస్తున్నారో ఆయనకు తెలుసా అని అడిగినప్పుడు.. ''అలాంటి విషయాలపై మనలాంటి సామాన్యులు మాట్లాడకూడదు'' అని సమాధానమిచ్చారు.

నాటో వనరులను హరించివేయడం ద్వారా రష్యా యుద్ధం చైనా వ్యూహాత్మక లక్ష్యాలకు సానుకూలంగా మారింది. అలాగే, అమెరికాతో ఉంటే ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావొచ్చనే భావనను కొందరిలో రేపుతోంది.

హార్బిన్ సిటీ

ఒకవైపే ఇదంతా. మరోవైపు యుక్రెయిన వివాదం నాటో కూటమి శక్తి పెరిగేందుకు కూడా ఉపయోగపడొచ్చు. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న రష్యా ఆర్థిక వ్యవస్థను అది మరింత దిగజార్చవచ్చు. మరో విషయం ఏంటంటే, తైవాన్‌ను బలవంతంగా లొంగదీసుకోవాలనుకుంటున్న చైనాకూ ఇదే తరహాలో ఆర్థిక కష్టాలు, ఇతర ఇబ్బందులు తప్పవని కూడా ఇది ఎత్తిచూపుతోంది.

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కలల ప్రాజెక్టు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌ సమావేశాల్లో పాల్గొనడం కోసం వారం రోజులపాటు పుతిన్ చైనాలో ఉంటారని అధికారిక సమాచారం. చైనా తన పశ్చిమ దేశాలతో అనుసంధానంగా చేపట్టిన మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టుగా దీన్ని చెబుతారు. ఈ ప్రాజెక్టు పేరుతో చైనా తన పొరుగున్న ఉన్న పేద దేశాలను అప్పుల ఊబిలోకి నెట్టేసి తమ చెప్పుచేతల్లోకి తెచ్చుకుంటోందన్న వాదనలు కూడా ఉన్నాయి.

ఈ సమావేశాల్లో ఇరు దేశాల నేతలు సమావేశమై తమ సంబంధాలను బలోపేతం చేసుకోవడంతో పాటు, తమతో కలిసి వచ్చే ప్రభుత్వాలతో కలిసి పాశ్యాత్య దేశాలకు వ్యతిరేకంగా బలమైన కూటమి నిర్మాణానికి ప్రయత్నించే అవకాశం ఉంది.

దీనివల్ల వారికి కలిగే ప్రయోజనాలు కూడా సుస్పష్టమే.

అయితే, ఇతర పాశ్చాత్య దేశాలతో చైనా వాణిజ్య సంబంధాల స్థాయిలో రష్యాతో వాణిజ్య కార్యకలాపాలు సాగించేందుకు ఇంకా చాలా సమయం పడుతుంది.

ఇవి కూడా చదవండి: