LGBT లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్‌... ఈ పదాలకు అర్థం ఏంటి?

ఎల్జీబీటీ

ఫొటో సోర్స్, Getty Images

స్వలింగ వివాహాల చట్టబద్ధత మీద సుప్రీం కోర్టు అక్టోబర్ 17న తీర్పు చెప్పింది. స్వలింగ జంటలు కూడా సాధారణ జంటలుగానే సమాన వివాహ హక్కులు కలిగి ఉండాలని, లేదంటే అది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని సుప్రీం కోర్టు ప్రధా న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు.

అయితే, స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాల్సింది మాత్రం పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీలేనని సుప్రీం కోర్టు తెలిపింది.

స్వలింగ సంపర్కం నేరం కాదని భారత సుప్రీం కోర్టు 2018 సెప్టెంబర్‌లో తీర్పు చెప్పింది.

మైనారిటీ తీరిన ఇద్దరు వ్యక్తులు (అడల్ట్స్) పరస్పర అంగీకారంతో స్వలింగ సంపర్కం చేస్తే అది నేరం కాదని ఈ తీర్పు చెబుతోంది.

అయితే, స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టపరమైన గుర్తింపు ఇవ్వాలా? వద్దా? అనే విషయంపై సుప్రీంకోర్టు నిర్ణయం ఇంకా రాలేదు.

స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టపరంగా గుర్తింపు ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన వారిలో లెస్బియన్, గే, ట్రాన్స్‌జెండర్ జంటలు ఉన్నాయి.

ప్రాథమిక హక్కుల గురించి జరుగుతున్న ఈ చర్చను మరింత బాగా అర్థం చేసుకోవాలంటే, ముందు ఈ L, G, B, T, Q, I, A గురించి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

స్వలింగ సంపర్కుల్లో ఈ విభిన్న గుర్తింపుల వెనక రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి భౌతిక ఆకర్షణ (శరీర వాంఛ), రెండోది జననేంద్రియాల నిర్మాణం.

ఈ రెండింటి కారణంగా లైంగికపరమైన (లెస్బియన్, గే, బై సెక్సువల్), లింగపరమైన (ట్రాన్స్‌జెండర్, ఇంటర్‌సెక్స్) గుర్తింపు వస్తోంది.

లైంగిక గుర్తింపు ఇలా..

ఎల్ - లెస్బియన్: ఒక మహిళ మరొక మహిళపై ఆకర్షణ కలిగి ఉండడం.

జీ - గే: ఒక పురుషుడు మరో పురుషుడిపై ఆకర్షణ కలిగి ఉండడం.

అయితే, ఈ గే అనే పదాన్ని స్వలింగ సంపర్కులను సూచించే పదంగానూ వాడుతున్నారు. ఉదాహరణకు గే కమ్యూనిటీ, గే పీపుల్.

బీ - బై సెక్సువల్: ఒక వ్యక్తికి మహిళ, పురుషుడు, ఇద్దరిపై ఆకర్షణ ఉండడం.

మగ లేదా ఆడవారిపై ఈ ఆకర్షణ కలగొచ్చు.

ఎల్టీబీటీ

ఫొటో సోర్స్, CG KHABAR

టీ - ట్రాన్స్‌జెండర్: పుట్టుకతో మహిళ లేదా పురుషుడు అయి ఉండి, పెరుగుతున్న కొద్దీ తన శరీరంలో వస్తున్న మార్పుల వల్ల వ్యతిరేకంగా ప్రవర్తించడం.

ట్రాన్స్‌జెండర్ మహిళ: పుట్టుకతో పురుషుడి జననేంద్రియాలతో జన్మించి, వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో వచ్చే మార్పుల వల్ల మహిళగా మారడం.

ట్రాన్స్‌జెండర్ పురుషుడు: పుట్టుకతో మహిళ జననేంద్రియాలతో జన్మించి, వయసు పెరిగే కొద్దీ పురుషుడిగా మారడం.

హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ, సెక్స్ రీఅసైన్‌మెంట్ సర్జరీ వంటి పద్ధతుల్లో లింగమార్పిడి ద్వారా తమకు పుట్టుకతో వచ్చిన జననేంద్రియాలను మార్చుకోవచ్చు. ఈ లింగమార్పిడి వల్ల వారి శరీరం వారికి నచ్చినట్టుగా మారుతుంది.

ఒక ట్రాన్స్‌జెండర్ తన భౌతిక ఆకర్షణ (శరీర వాంఛ) కారణంగా లెస్బియన్ ట్రాన్స్‌జెండర్ కావొచ్చు, గే ట్రాన్స్‌జెండర్ కావొచ్చు, లేదా బైసెక్సువల్ ట్రాన్స్‌జెండర్ కూడా అయ్యే అవకాశం ఉంది.

ట్రాన్స్‌జెండర్లకు స్థానికంగా హిజ్రా, అరావణి, కోథి, శివ్‌శక్తి, కిన్నర్, జోగ్టి హిజ్రా అనే పేర్లు వాడుకలో ఉన్నాయి.

ఎల్జీబీటీ

ఫొటో సోర్స్, SOPA IMAGES

క్యూ - క్వీర్: క్వీర్‌ను మొదట్లో స్వలింగ సంపర్కులను ద్వేషించే పదంగా ఉపయోగించారు.

అయితే, ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. తమ భౌతిక ఆకర్షణల కారణంగా తాము ఎవరు అనే గుర్తింపు దక్కకూడదని వారు భావిస్తారు.

క్యూ - క్వశ్చనింగ్: తాను మహిళనో, పురుషుడో తేల్చుకోలేని వారు. ఎవరిపై తమకు ఆకర్షణ ఉందో తెలియని సంకట పరిస్థితిలో ఉన్నవారు.

ఐ - ఇంటర్‌సెక్స్: పుట్టినప్పుడు వారి జననేంద్రియాలను బట్టి వారు ఆడపిల్లలో, లేదా మగపిల్లలో తెలియని వారిని ఇంటర్‌సెక్స్‌గా వ్యవహరిస్తున్నారు. వైద్యులు వారి శరీర నిర్మాణాన్ని, జననేంద్రియాలను పరిశీలించి వారు ఆడ లేదా మగ అని నిర్ధారిస్తారు.

అయితే, పెద్దయిన తర్వాత వారు ఇతరులు(ఆడ, మగ, ట్రాన్స్‌జెండర్‌)గా మారే అవకాశం కూడా ఉంది.

ట్రాన్స్‌జెండర్‌ను మూడో జెండర్‌గా గుర్తిస్తూ 2014లో సుప్రీం కోర్టు చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఈ నిర్ణయంతో వారు ట్రాన్స్‌జెండర్ కోటాలో ఉద్యోగాలు, విద్యావకాశాల్లో రిజర్వేషన్ పొందే అవకాశం కలిగింది.

లైంగిక పరిభాషలో మరో మూడు విభాగాలు కూడా ఉన్నాయి..

ఏ - ఎలీజ్: గేలు కాకపోయినప్పటికీ వారికి మద్దతునిచ్చేవారు.

ఏ - అసెక్సువల్: ఎవరిపైనా భౌతిక ఆకర్షణ లేదా కోరిక కలగని వారు.

పీ - పాన్‌సెక్సువల్: ఎవరిపైన అయినా ఆకర్షణ లేదా కోరిక కలిగి ఉండే వారు.

ఇవి కూడా చదవండి: