'రింగ్' కెమెరా రికార్డ్ చేసిన మహిళల బెడ్రూమ్ వీడియోలను చూసిన ఉద్యోగి.. రూ.47 కోట్ల పరిహారం చెల్లిస్తున్న అమెజాన్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జార్జి రైట్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అలెక్సా, "పాటలు వినిపించు". "హాల్లో లైట్లు ఆపెయ్". "బాత్రూమ్‌లో గీజర్ ఆన్‌చెయ్" అనడం ఇటీవల పెరిగిపోతోంది.
అమెజాన్ డోర్‌బెల్ కెమెరా యూనిట్ 'రింగ్' కూడా అలాంటిదే. లేచివెళ్లి తలుపు తీయాల్సిన అవసరం లేకుండా వాయిస్ కమాండ్ ఇస్తే చాలు అదే తలుపు ఓపెన్ అయ్యేలా చేస్తుంది.
ఈ వాయిస్ అసిస్టెంట్లు రికార్డ్ చేసే డేటాను ఎవరైనా దుర్వినియోగం చేస్తే..? సరిగ్గా అదే జరిగింది.
అందువల్లే అమెజాన్ అమెరికాలో 30 మిలియన్ డాలర్లు అంటే 247 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాల్సి వస్తోంది. ఇందులో అలెక్సా వల్ల సుమారు రూ.200 కోట్లు, ‘రింగ్’ వల్ల రూ.47 కోట్లు పరిహారం కింద కట్టాల్సి వస్తోంది.
తమ ఉద్యోగులకు ఎలాంటి నియంత్రణ లేకుండా, కస్టమర్ల వ్యక్తిగత డేటాను చూసేందుకు, లేదా డౌన్‌లోడ్ చేసుకునేలా యాక్సెస్ ఇచ్చినందుకు అమెజాన్ డోర్‌బెల్ కెమెరా యూనిట్ 'రింగ్' పరిహారం చెల్లించాల్సి ఉంది.
కొలంబియా డిస్ట్రిక్ట్‌లోని ఫెడరల్ కోర్టులో దాఖలైన పిటిషన్ ప్రకారం, ‘రింగ్’ 5.8 మిలియన్ డాలర్లు అంటే సుమారు 47 కోట్ల రూపాయల పరిహారం చెల్లించేందుకు సిద్ధమైంది.
2018లో అమెజాన్ తెచ్చిన రింగ్ తన కస్టమర్ల వ్యక్తిగత వీడియోలు చూసేందుకు తన వేల మంది ఉద్యోగులకు, కాంట్రాక్టర్లకు ఎలాంటి నియంత్రణ లేకుండా అనుమతులు ఇచ్చిందని యూఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్(ఎఫ్‌టీసీ) తెలిపింది.
దీని వల్ల కస్టమర్ల వ్యక్తిగత, సున్నితమైన డేటాను ఉద్యోగులు, కాంట్రాక్టర్లు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉందని ఎఫ్‌టీసీ కమిటీ చెప్పింది.
ఈ అంశంలో అమెజాన్ వాదన మరోలా ఉంది.
ఎఫ్‌టీసీ విచారణ ప్రారంభించడానికి సంవత్సరాల ముందే, రింగ్ ఈ విషయాలను పరిష్కరించిందని అమెజాన్ ఒక ప్రకటనలో బీబీసీకి తెలిపింది.
అయితే, రింగ్ కెమెరాలు రికార్డ్ చేసిన మహిళా వినియోగదారుల బాత్రూమ్, బెడ్రూమ్ దృశ్యాలతో కూడిన వేల వీడియోలను ఓ ఉద్యోగి చూసిట్లు ఎఫ్‌టీసీకి చేసిన ఫిర్యాదులో చెప్పారు.
ఆ వీడియోలు చూస్తున్నట్లు తన సహచర ఉద్యోగి గమనించిన తర్వాతే ఆయన వాటిని చూడడం ఆపేసినట్లు అందులో తెలిపారు.
గోప్యత, డేటా భద్రత విషయంలో రింగ్ నిర్లక్ష్యం, వినియోగదారుల రహస్య సమాచారం తెలుసుకునేందుకు, వేధింపులకు కారణమైందని ఎఫ్‌టీసీ బ్యూరోకు చెందిన వినియోగదారుల రక్షణ విభాగం డైరెక్టర్ శామ్యూల్ లివైన్ చెప్పారు.
గోప్యతను పణంగా పెట్టి లాభాలు ఆర్జించడాన్ని సహించేది లేదని ఎఫ్‌టీసీ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
వాయిస్ అసిస్టెంట్ అలెక్సా చిన్నారుల గోప్యతా హక్కులను ఉల్లంఘించిందనే ఆరోపణల వ్యవహారాన్ని పరిష్కరించుకునేందుకు 25 మిలియన్ డాలర్లు అమెజాన్ చెల్లించాల్సి వస్తోంది.
అలెక్సా రికార్డింగ్స్‌ను తొలగించాలన్న తల్లిదండ్రుల వినతులను పరిష్కరించడంలో విఫలమైనందుకు ఎఫ్‌టీసీకి ఈ మొత్తాన్ని చెల్లించడానికి అమెజాన్ అంగీకరించింది.
అలెక్సా వినియోగదారుల సున్నితమైన డేటాను చాలా సంవత్సరాలుగా దాచి ఉంచినట్లు గుర్తించారు.
అలెక్సా రికార్డ్ చేసిన వినియోగదారుల వాయిస్ రికార్డింగ్‌లను తొలగిస్తామని అమెజాన్ స్పష్టమైన హామీ ఇచ్చినట్లు ఎఫ్‌టీసీకి చేసిన ఫిర్యాదులో చెప్పారు.
కానీ, కంపెనీ ఆ రికార్డింగ్‌లను తొలగించలేదని ఫిర్యాదులో ఉంది. అలెక్సా అల్గారిథమ్‌ను మరింత మెరుగ్గా అభివృద్ధి చేసేందుకు వాయిస్ రికార్డింగ్‌లను సంవత్సరాల పాటు చట్టవిరుద్ధంగా తొలగించకుండా ఉంచిందనే ఆరోపణలు వచ్చాయి.
తల్లిదండ్రులను తప్పుదారి పట్టించడం, పిల్లల రికార్డింగ్స్‌ను డిలీట్ చేయకుండా ఉంచడం, వాటిని డిలీట్ చేయాలని తల్లిదండ్రులు చేసిన అభ్యర్థనలను ఉల్లంఘించడం లాంటి అభియోగాలు అమెజాన్‌పై నమోదయ్యాయని లివైన్ చెప్పారు.
తన లాభాల కోసం వినియోగదారుల గోప్యతను కంపెనీ విస్మరించిందని ఆయన అన్నారు.
''ఎఫ్‌టీసీ వాదనలతో మేం విభేదిస్తున్నాం. చట్టాలను ఉల్లంఘించామనే ఆరోపణలను కూడా తోసిపుచ్చుతున్నాం. అయితే ఈ చెల్లింపులతో ఆయా సమస్యలు పరిష్కారమవుతాయి'' అని అమెజాన్ ఒక ప్రకటనలో తెలిపింది.
వినియోగదారుల గోప్యతను కాపాడేందుకు మరిన్ని కొత్త భద్రతా ఫీచర్లు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని సంస్థ చెప్పింది.
ఇవి కూడా చదవండి:
- ఏఐ మారథాన్‌లో అమెరికాను చైనా అందుకోగలదా? సెమీకండక్టర్ ఎగుమతులపై యూఎస్ ఆంక్షల ప్రభావం ఏమిటి?
- 'ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హ్యాలూసినేషన్' అంటే ఏంటి... ఇది ఎందుకంత ప్రమాదకరం?
- సీరియల్ రేపిస్ట్: మగాళ్లను ట్రాప్ చేస్తాడు... లైంగిక దాడిని వీడియో తీస్తాడు
- గూగుల్‌లో ఉద్యోగానికి XYZ ఫార్ములా
- వాకింగ్: రోజూ నడవడం వల్ల కలిగే 10 లాభాలు ( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














