‘ఆయన భార్య అని, ఈయన కోడలని పిలిచేవారు.. ఇప్పుడు నా పేరుతో నన్ను గుర్తిస్తున్నారు’

- రచయిత, దివ్య ఆర్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
పితృస్వామ్య సమాజంలో పురుషులే కుటుంబ పెద్దగా ఉంటారు. అన్ని నిర్ణయాలు వాళ్ల చేతుల్లోనే ఉంటాయి.
ముఖ్యంగా, డబ్బు సంపాదన పురుషుల బాధ్యత. మహిళలు ఇంటిపట్టున ఉంటారు.
కానీ, దేశంలో ఈ పరిస్థితి కొద్ది కొద్దిగా మారుతున్నట్టు కనిపిస్తోంది.
కుటుంబాన్ని నడుపుతున్న మహిళల సంఖ్య పెరుగుతోంది.
'ఇప్పుడు అందరికీ నా పేరు తెలుసు'
"ఇప్పుడు అందరూ నన్ను నా పేరుతో గుర్తిస్తున్నారు" అని బిహార్‌కు చెందిన ఉషా దేవి చెబుతుంటే కొంత చిత్రంగా తోచింది. అదేమంత పెద్ద విషయం కాదే అనిపించింది.
కానీ, 38 ఏళ్ల ఉషకు ఇది చాలా పెద విజయం.
"గుర్తింపు అనేది చిన్న విషయం కాదు. ఇంతకుముందు పురుషుల పేర్లు మాత్రమే అందరికీ తెలిసేవి. ఇప్పుడు మహిళల పేర్లూ తెలుస్తున్నాయి" అన్నారు ఉషా దేవి.
ఉషకు 15 ఏళ్ల వయసులో చదువు మాన్పించి పెళ్లి చేసేశారు. ఒక్కసారిగా ఆమె జీవితం మొత్తం మారిపోయింది. ఆమెను ఎవరూ పేరు పెట్టి పిలిచేవారు కాదు. ఫలానా వ్యక్తి భార్య అనో లేక ఫలానా ఊరి కోడలు అనో సంబోధించేవారు.
ఒక్క కొడుకునైనా కనాలని కుటుంబం ఆమెపై ఒత్తిడి తెచ్చింది. దాంతో, మళ్లీ మళ్లీ గర్భం దాల్చాల్సి వచ్చింది. ఆమె జీవితం ఆమె చేతుల్లో లేకుండా పోయింది. ఆమె కలలన్నీ ఆవిరైపోయాయి. బయటపడే మార్గం కూడా కనబడలేదు.
అప్పుడే ఆమెకు ఒక అవకాశాల తలుపు తెరుచుకుంది.
కుటుంబం పెద్దదవుతుండడంతో భారం పెరుగుతూ వచ్చింది. తమ గ్రామంలో సరైన అవకాశాలు దొరకక ఉష భర్త ఉపాధి కోసం వేరే ఊరికి మారాల్సి వచ్చింది. ఉష తమ ఊళ్లోనో ఉంటూ పిల్లల ఆలన పాలనా చూడడం మొదలుపెట్టారు.
ఇది దేశంలోని వివిధ గ్రామాల్లో కనిపిస్తున్న మహిళల కథ.
భర్తలు ఉపాధి కోసం వలస వెళుతుంటే భార్యలకు ఉన్న ఊళ్ళో అవకాశాల తలుపులు తెరుచుకుంటున్నాయి.
సోషియాలజిస్ట్, డెమోగ్రాఫర్ ప్రొఫెసర్ సోనాల్డే దేశాయ్ 'ఇండియా హ్యూమన్ డెవలప్‌మెంట్ సర్వే' (ఐహెచ్‌డీఎస్) ద్వారా లింగ, వర్గ అసమానతల్లో మార్పులను పరిశీలిస్తున్నారు.
ఐహెచ్‌డీఎస్ సర్వేను 2005, 2012లలో జాతీయ స్థాయిలో 41, 000 కుటుంబాలపై జరిపారు. ఇందులో వివిధ అంశాలను జోడించారు.
దిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రిసెర్చ్, యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్, ఇండియానా యూనివర్సిటీ, మిచిగాన్ యూనివర్సిటీ సంయుక్తంగా ఈ సర్వేలను నిర్వహించాయి.
భర్త వేరే ఊరికి ఉద్యోగం కోసం వెళ్లినప్పుడు, మావగారు లేదా భర్త అన్నదమ్ములపై ఆధారపడకుండా, సొంతంగా కుటుంబాన్ని నడపడం వలన మహిళలకు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ప్రొఫెసర్ దేశాయ్ అంటున్నారు.
"భర్త ఇంటి నుంచి బయటికొచ్చి స్వతంత్రంగా కుంటుబాన్ని నడుపుతుంటే అప్పుడు ఆమె జీవితంలో మార్పు కనిపిస్తుంది. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలిగే బలం పెరుగుతుంది. ఆర్థిక బాధ్యతలు పంచుకుంటూ, సొంతంగా వ్యవసాయం చేసే శక్తి కూడా వస్తుంది" అని ఆమె అన్నారు.
గత మూడు దశాబ్దాలలో, దేశంలో మహిళలు నడుపుతున్న కుటుంబాల నిష్పత్తి దాదాపు రెట్టింపు అయింది.
దేశంలో చివరిగా సేకరించిన జనాభా లెక్కల (2011) ప్రకారం, 45 కోట్ల వలసదారులు ఉన్నారు. అంతకుముందు దశాబ్దంతో పోలిస్తే ఇది 45 శాతం పెరిగింది. ఆ దశాబ్దంలో జనాభా వృద్ధి రేటు (18 %) కంటే ఇది చాలా ఎక్కువ.
కోవిడ్ తరువాత పేదరికం, ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం వలన రానున్న సంవత్సరాలలో వలసలు ఇంకా పెరుగుతాయని, కుటుంబాలను నడిపే మహిళల సంఖ్య పెరుగుతుందని ప్రొఫెసర్ దేశాయ్ అంచనా వేస్తున్నారు.

భర్తల కన్నా పెద్ద చదువులు చదువుకుంటున్న భార్యలు
ఉష భర్త ఉపాధి కోసం వేరే ఊరికి వలస వెళ్లాక, ఆమె తన అత్తగారింటి ఇంటి నుంచి బయటికొచ్చేశారు. పిల్లలతో వేరు కాపురం పెట్టారు. భర్త సంపాదనకు చేదోడుగా ఉండేందుకు పని వెతుక్కున్నారు.
చేతిలోకి డబ్బులు వచ్చాయి. అది ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆమెకు ఆత్మవిశ్వాసం పెరిగింది.
ఇప్పుడు ఉష తమ గ్రామంలో మహిళలకు నాయకురాలు. పేద మహిళలకు సులభంగా రుణాలు అందించే ప్రభుత్వ పథకంలో వారి పేరును నమోదు చేయించడం ఆమె పని.
గ్రామంలో మహిళలంతా ప్రతి వారం సమావేశం అవుతారు. చిన్న చిన్న విరాళాలు సేకరిస్తారు. బ్యాంకుకు వెళతారు. ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటారు. ఈ పనులన్నీ ఇంతకుముందు మగవాళ్లు మాత్రమే చేసేవారు. ఇప్పుడు చాలామంది పురుషులు వలసవెళ్లడంతో, మహిళలు ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు.
ఒకరికొకరు తోడుగా ఉంటూ, పరస్పరం సహాయ సహకారాలు అందించుకుంటున్నారు. పురుషుల అవసరం లేకుండా తమకు తామే ఒక సపోర్ట్ నెట్‌వర్క్ తయారుచేసుకుంటున్నారు.
"ఇప్పుడు మా అందరి పేర్లు మాకు తెలుసు. మమ్మల్ని అందరూ పేరుతో పిలుస్తున్నారు. మా గుంపులో చదువుకున్నవారి సాయంతో నా పేరు రాయడం నేర్చుకున్నా. స్వయంగా ఆర్థిక వ్యవహారాలు చూసుకుంటున్నాను" అని మున్నీ దేవి చెప్పారు.
వీళ్లల్లో శోభా దేవి కాస్త చదువుకున్న మహిళ. ఆమెకు కూడా చిన్నప్పుడే పెళ్లయింది కానీ, తరువాత ఆమె స్కూలు చదువు పూర్తిచేశారు. ఉషా దేవి లేనప్పుడు శోభ వీరందరినీ ముందుండి నడిపిస్తారు.
"నా భర్త పంపించే డబ్బు అప్పుడప్పుడూ సరిపోదు. అప్పుడు నాకు తోటి ఆడవాళ్లే సహాయం చేస్తారు. మేమంతా ఇబ్బందులో ఒకరికొకరు సహకరించుకుంటాం" అని శోభ చెప్పారు.
"నాకు ఇప్పుడు డబ్బు నిర్వహణ గురించి అవగాహన వచ్చింది కాబట్టి, ఖర్చు వ్యవహారాల్లో నా మాటకు విలువ ఉంటోంది" అని చెప్పారామె.
శోభా దేవి తన భర్త కన్నా ఎక్కువ చదువుకున్నారు. ఇలా భర్తల కన్నా ఎక్కువ విద్యార్హతలు సంపాదిస్తున్న మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి.
ఐహెచ్‌డీఎస్ సర్వే ప్రకారం, 1980లలో పెళ్లిళ్లు అయినవారిలో 5 శాతం మహిళలు తమ భర్తల కన్నా ఎక్కువ విద్యార్హతలు ఉన్నవారు. 2000లలో, 2010లలో ఇది 20 శాతానికి పెరిగింది.
"కుటుంబ పెద్ద అంటే ఎక్కువ సంపాదించేవారని కాకుండా, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉన్నవారని అనుకుంటే, చదువుకున్న ఈ మహిళలే కుటుంబ పెద్దలవుతారు" అని ప్రొఫెసర్ దేశాయ్ వివరించారు.


పురుషులు కూడా అండగా నిలబడుతున్నారు..
ఉషా దేవి సంపాదించడం మొదలుపెట్టాక మళ్లీ చదువుకోవడం ప్రారంభించారు. కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు.
ఆమెకు ఆమె భర్త రంజీత్ తోడుగా నిలిచారు.
"నేను పెద్దగా చదువుకోలేదు, నాకేమీ తెలీదు. నా భార్య చదువుకోకపోయుంటే, నా పిల్లలు కూడా నాలాగే తయారయ్యేవాళ్లు" అన్నారు రంజీత్.
రంజీత్ పదేళ్లకే స్కూలు చదువు మానేశారు. తన భార్య తెలివితేటలు చూశాక, చదువుకోకపోవడం ఎంత బుద్ధి తక్కువ పనో అర్థమైందని ఆయన అంటున్నారు.
"నా భార్య వల్ల నా పిల్లలకు మంచి భవిష్యత్తు అందుతుంది" అన్నారు రంజీత్.
గ్రామాలో సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన పురుషులు ఇలా మాట్లాడడం, భార్య గొప్పతనాన్ని ఒప్పుకోవడం అరుదైన విషయమే. వలసలు వెళ్లడం వల్ల ఒక రకంగా పురుషులకు కుటుంబంపై పట్టు తగ్గి, భార్యపై ఆధారపడడం పెరిగింది.
రంజీత్ సొంత రాష్ట్రానికి దూరంగా తమిళనాడులోని ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. తన భార్య కుటుంబాన్ని ఒంటి చేత్తో నడపడం చూస్తే గర్వంగా ఉందని చెబుతున్నారు. కానీ, కుటుంబానికి దూరంగా ఉండడం బాధగా ఉందని, చదువుకుని ఉంటే ఇంత దూరం రావలసి వచ్చేది కాదని వాపోయారు.
ఇంత జరుగుతున్నా, ఉషా, శోభ, ఇతర మహిళలు తమ భర్తలకే మొదటి స్థానం ఇస్తున్నారు.
ఉష దృష్టిలో తన భర్తే కుటుంబానికి పెద్ద.
"నా గొప్పేం లేదు. ఆయన నాకు తోడుగా నిలబడకపోతే నేనెప్పటికీ ముందుకెళ్లేదాన్ని కాదు" అంటున్నారు ఉష.

కానీ, ఉష వాళ్ల పెద్దమ్మాయి రష్మి దృష్టిలో మాత్రం అమ్మే తనకు స్ఫూర్తి.
"మా అమ్మలో మార్పు చూశాను. నేను కూడా ఆమెలా మారాలనుకుంటున్నా" అన్నారామె.
రష్మి ట్యూషన్లు చెబుతూ కుటుంబానికి సాయంగా ఉన్నారు. బాగా డబ్బు కూడబెట్టి పోలీస్ కావాలన్నది ఆమె కల. అది నెరవేర్చుకుని తోటి అమ్మాయిలకు ప్రేరణగా నిలవాలనుకుంటున్నారు.
"మగవాళ్ళు మాత్రమే కుటుంబ బాధ్యతలు మోయగలరన్న అపోహలు పోవాలి. అమ్మాయిలు కూడా చేయగలరు. వాళ్లకు స్వేచ్ఛ ఇచ్చి, ఎదగనిస్తే అమ్మాయిలు అన్నీ చేయగలరు" అంటున్నారు రష్మి.
ఇవి కూడా చదవండి:
- మనిషిని చంపేసి ఇంటర్నెట్లో ఏం వెతుకుతున్నారు? శవాన్ని ఎందుకు ముక్కలు చేస్తున్నారు?
- మిల్క్ డే: పచ్చిపాలా, మరగబెట్టినవా? ఆరోగ్యానికి ఏవి మంచివి?
- భారీగా రూ.500 దొంగ నోట్లు.. నకిలీ నోటును ఇలా గుర్తించవచ్చు
- మీరు సూర్యుడిని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు
- ఆంధ్రప్రదేశ్: భూముల రీసర్వేలో అన్యాయం చేశారంటున్న గిరిజనులు, కోర్టులో తేల్చుకోమంటున్న అధికారులు
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














