వరకట్నం: భారత్‌లో అబ్బాయిలు ఎంత ఎక్కువగా చదువుకుంటే కట్నం అంతగా పెరుగుతోందా, రీసెర్చ్‌లో ఏం తేలింది?

వివాహ వ్యవస్థ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ భారత ప్రతినిధి

భారత్‌లో మగవారికి విద్య, ఉపాధి అవకాశాలు దశాబ్దాలుగా మెరుగుపడుతూ రావడంతో, వరకట్నాలు కూడా పెరిగినట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. కట్నం ఇవ్వడం, తీసుకోవడమన్నది దక్షిణాసియాలో ఎన్నో శతాబ్దాల నుంచి సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది.

నగదు, వస్త్రాలు, ఆభరణాల రూపంలో పెళ్లి కూతురు కుటుంబం పెళ్లి కొడుకు కుటుంబానికి కట్నమిస్తోంది.

1961 నుంచి వరకట్నం ఇవ్వడం, పుచ్చుకోవడమనేది భారత్‌లో చట్టవిరుద్ధమైనప్పటికీ, ఇంకా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఈ విధానం భారతీయ మహిళల్లో గృహ హింసను పెంచుతోంది.

వరకట్న వేధింపులు తట్టుకోలేక భారత్‌లో అమ్మాయిలు చనిపోతున్నారు కూడా.

1930 నుంచి 1999 మధ్య కాలంలో భారత్‌లో జరిగిన 74 వేలకు పైగా పెళ్లిళ్లలో వరకట్నం ఎలా ఉందనే దానిపై దక్షిణ కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన జెఫ్రే వీవర్, వర్జీనియా యూనివర్సిటీకి చెందిన గౌరవ్ చిప్లుంకర్‌లు అధ్యయనం చేశారు.

వరకట్నం

ఫొటో సోర్స్, Getty Images

నికర కట్నం ఎంతుంటుందనే దానిపై వారు అధ్యయనం చేశారు. అంటే పెళ్లి కొడుకుకి లేదా ఆయన కుటుంబానికి పెళ్లి కూతురి కుటుంబం ఇచ్చే నగదు, బహుమతుల విలువ ఎంతుంది? పెళ్లి కూతురి కుటుంబానికి పెళ్లి కొడుకు కుటుంబం ఎంత ఇస్తుంది? అనే దాన్ని లెక్కించారు.

భారత్‌లో అత్యంత ఎక్కువ జనాభా కలిగిన 17 రాష్ట్రాల్లోని హోస్‌హోల్డ్ ప్యానల్ సర్వే అయిన భారత రూరల్ ఎకనామిక్, డెమోగ్రాఫిక్ సర్వే డేటా ఆధారంగా రీసెర్చర్లు ఈ అధ్యయనం చేపట్టారు.

ఇప్పటికీ భారత్‌లో చాలా వరకు పెళ్లిళ్లు పెద్దలు కుదిర్చినవే. ప్రస్తుతం చాలా వరకు అమ్మాయిలు 20 ఏళ్లు దాటిన తర్వాతనే పెళ్లి చేసుకుంటున్నారు.

1999 వరకు అధ్యయనం చేపట్టిన 90 శాతం పెళ్లిళ్లలో వరకట్నమనేది భాగమై ఉందని తాజా అధ్యయనంలో తెలిసింది.

1950 నుంచి 1999 మధ్య కాలంలో జరిగిన వరకట్న చెల్లింపులు సుమారు 250 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 20 లక్షల కోట్లు ) వరకు ఉన్నాయి.

ఆర్థికాభివృద్ధి వరకట్న చెల్లింపుల విధానాన్ని మరింత పుంజుకునేలా చేసిందని, ముఖ్యంగా 1940 నుంచి 1980 మధ్య కాలంలో ఈ చెల్లింపులు మరింత పెరిగాయని తాజా అధ్యయనం గుర్తించినట్లు జెఫ్రే వీవర్ బీబీసీతో అన్నారు.

ఈ మధ్య కాలంలో చాలా మంది అబ్బాయిలు చదువుకున్నారని, మెరుగైన ఉద్యోగాలను సంపాదించారని తెలిపారు. ఇవి వరకట్నాలు పెరిగేందుకు దోహదం చేశాయని అన్నారు.

వివాహ వ్యవస్థ

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌లో పెళ్లిళ్లు

భారత్‌లో చాలా వరకు పెళ్లిళ్లు ఒకే వివాహానికి చెందినవై ఉంటాయి. 1 శాతం కంటే తక్కువ పెళ్లిళ్లలో మాత్రమే భార్య, భర్త విడిపోతున్నారు.

పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుని ఎంపిక చేయడంలో తల్లిదండ్రులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. 1960 నుంచి 2005 మధ్య కాలంలో జరిగిన 90 శాతానికి పైగా పెళ్లిళ్లలో జీవిత భాగస్వామిని తల్లిదండ్రులే ఎంపిక చేశారు.

పెళ్లి తర్వాత 90 శాతానికి పైగా జంటలు, భర్త కుటుంబం వద్దనే జీవిస్తున్నాయి.

85 శాతానికి పైగా మహిళలు సొంత గ్రామానికి వెలుపలున్న వ్యక్తిని పెళ్లాడుతున్నారు. 78.3 శాతం పెళ్లిళ్లు ఒకే జిల్లాలో జరుగుతున్నాయి.

(సోర్స్: ఇండియా హ్యుమన్ డెవలప్‌మెంట్ సర్వే, 2005; నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2006; ఆర్‌ఈడీఎస్,1999)

పెళ్లి కొడుకు ఎంత ఎక్కువగా చదువుకున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడనే దాని బట్టి ఆయనకు ఇచ్చే కట్నాల విషయాల్లో మార్పులు వచ్చినట్లు తాజా అధ్యయనం తెలిపింది.

భారత్‌ వర్క్‌ఫోర్స్‌లో మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉండటంతో, పురుషులకు మెరుగైన, అత్యధిక ఉద్యోగాలు లభిస్తున్నాయి.

ఉన్నత విద్య చదివిన, మెరుగైన ఉద్యోగాలు చేస్తోన్న అబ్బాయిలు, అత్యధిక వరకట్నాన్ని ఆశిస్తున్నారు.

అయితే, వివాహ మార్కెట్లో చదువుకున్న వరులు పెరుగుతున్నా కొద్ది, ఉన్నత విద్య అభ్యసించిన పెళ్లి కొడుకులు పొందే వరకట్న ప్రీమియాలు కూడా తగ్గుతున్నాయని ఈ అధ్యయనం గుర్తించింది.

బలమైన ఆర్థికాంశాలు వరకట్న పెరుగుదలకు కారణమయ్యాయి. అమ్మాయి వైపు చూస్తే, తమ కూతుర్లకు వరకట్నం చెల్లించేందుకు నిరాకరిస్తున్న కుటుంబాలకు, తక్కువ చదువుకున్న, తక్కువ సంపాదిస్తున్న పెళ్లి కొడుకులు దొరుకుతున్నారు.

తమ కూతుర్లకు వరకట్నం చెల్లించాల్సి వచ్చినప్పుడు లేదా అబ్బాయి చదువులకు పెట్టిన పెట్టుబడులను తిరిగి పొందేందుకు పెళ్లి కొడుకు కుటుంబాలు వరకట్నం తీసుకోవడమన్నది మంచి ఆర్థిక ప్రోత్సాహంగా భావిస్తున్నారని వీవర్, చిప్లుంకర్ చెప్పారు.

ఇది కేవలం భారత్‌కు ప్రత్యేకమైనదేనా? అని దానిపై బ్రిటీష్ కొలంబియా యూనివర్సిటీకి చెందిన సివాన్ ఆండర్సన్ మరో రీసెర్చ్ పేపర్‌ను రూపొందించారు.

ఈ పేపర్‌లో భారత్‌లో మాదిరిగా కాకుండా యూరప్ లాంటి చాలా సమాజాల్లో పెరుగుతున్న సంపదతో వరకట్న చెల్లింపులు తగ్గుతున్నాయని చెప్పారు.

అయితే, భారత్‌ లాంటి కుల ఆధారిత సమాజాల్లో సంపద పెరుగుతుండటంతో, వరకట్న చెల్లింపులు కూడా పెరుగుతున్నాయని ఆండర్సన్ అన్నారు.

వివాహ వ్యవస్థ

ఫొటో సోర్స్, Getty Images

వరకట్న విధానం పెరిగేందుకు గల సంప్రదాయిక కారణాల్లో కొన్నింటికి మాత్రమే తాము ఆధారాలను కనుగొన్నట్లు వీవర్, చిప్లుంకర్ చెప్పారు.

దీనిలో ఒక థియరీ ప్రకారం తొలుత ఉన్నత కులాలకు చెందిన వారు వరకట్న విధానాన్ని అనుసరించారని, ఆ తర్వాత ఇది తక్కువ కులాలకు కూడా పాకిందని చెప్పారు.

తమ సామాజిక మొబిలిటీని మెరుగుపరుచుకునేందుకు ఈ విధానాలను తక్కువ కులాలకు చెందిన వారు కూడా అనుసరించారని అన్నారు.

అయితే, ఉన్నత కులాలు, తక్కువ కులాలకు చెందిన వారు ఒకేసారి వరకట్న విధానాన్ని ప్రారంభించారా? అన్న దానిపై ఎలాంటి స్పష్టత లేదని సరికొత్త అధ్యయనం పేర్కొంది.

తక్కువ కులాలకు చెందిన అమ్మాయిలు, ఉన్నత కులాలకు చెందిన అబ్బాయిలను పెళ్లి చేసుకోవడం ద్వారా కూడా వరకట్నం విషయంలో మార్పులు వస్తున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.

అయితే, కులాంతర వివాహాలు చాలా తక్కువగా ఉన్నప్పుడు ఇది కరెక్ట్ కాదని వీవర్ అన్నారు. తాము అధ్యయనం చేసిన 94 శాతం హిందూ పెళ్లిళ్లలో, వారు తమ కులాల్లోనే చేసుకున్నట్లు చెప్పారు.

వివాహ కానుకలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నగదు, ఇతర రూపాల్లో వరకట్న కానుకలు

అమ్మాయిలు చదువుకుంటూ ఉండటంతో వరకట్న చెల్లింపుల్లో ఏమైనా మార్పులొస్తున్నాయా?

గత రెండు నుంచి మూడు దశాబ్దాలుగా చదువుకున్న అమ్మాయిలు పెరుగుతున్నారు. అబ్బాయిలతో సరిసమానంగా అమ్మాయిలు రాణిస్తున్నారు. ఇది వరకట్న విధానాల్లో తగ్గుదలకు కారణంగా నిలుస్తోంది. అయితే, ఏ మేర తగ్గుతుందనే డేటా లేదని వీవర్ చెప్పారు.

అమ్మాయిలు ఎక్కువగా చదువుకున్న ప్రాంతంలో వరకట్న చెల్లింపులు తగ్గిన ఆధారాలను సరికొత్త అధ్యయనం గుర్తించింది.

మహిళల విద్యను ప్రోత్సహించడం ద్వారా, వర్క్‌ఫోర్స్‌లో వారి భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా వరకట్న నిర్మూలనకు సాయంగా నిలుస్తుందని తాజా అధ్యయనంలో స్పష్టంగా వెల్లడవుతుంది.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)