హిప్నోథెరపీ: మత్తు లేకుండా, నొప్పి తెలియకుండా ఈ పద్దతిలో ఆపరేషన్ చేయవచ్చా?

రోగులపై ముందుగా హిప్నోసిస్‌ ప్రయోగించడంతో శస్త్రచికిత్స మెరుగ్గా నిర్వహించేందుకు అవకాశం ఏర్పడుతుందని బ్లాక్ వివరించారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రోగులపై ముందుగా హిప్నోసిస్‌ ప్రయోగించడంతో శస్త్రచికిత్స మెరుగ్గా నిర్వహించేందుకు అవకాశం ఏర్పడుతుందని బ్లాక్ వివరించారు
    • రచయిత, లారా ప్లిట్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘‘ఎలాంటి అవాంతరాలనూ పట్టించుకోకండి. ప్రశాంతంగా ఉండండి’’ అని చాలా సన్నగా ఒక మహిళ స్వరం వినిపిస్తోంది.

‘‘ఇప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకోండి. అంతే నెమ్మదిగా శ్వాసను బయటకు వదలండి’’ అని ఆమె చెబుతున్నారు. చాలా ప్రశాంతంగా ఆమె సూచనలు ఇస్తున్నారు.

బ్రిటన్‌లోని రాయల్ కాలేజీ ఆఫ్ అనస్తటిస్ట్స్ (ఆర్‌సీవోఏ) తమ వెబ్‌సైట్‌లో పోస్టు చేసిన ఆడియో ఇది. శస్త్రచికిత్సల సమయంలో దీన్ని ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఆందోళన తగ్గించేందుకు రోగులను ‘‘హిప్నోసిస్’’లోకి తీసుకెళ్లాలనే ఆలోచన ఎప్పటినుంచో ఉంది. దీని వల్ల ఆపరేషన్ గదిలోకి తీసుకెళ్లేముందే వారిలో యాంక్సైటీ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

రోగులకు అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతోనే ఈ రికార్డింగ్‌లను రూపొందించి, అందుబాటులో ఉంచినట్లు ఆర్‌సీవోఏ కోసం పనిచేస్తున్న అనస్తీషియా నిపుణురాలు డా. సమంతా బ్లాక్ చెప్పారు.

రోగులపై ముందుగా హిప్నోసిస్‌ ప్రయోగించడంతో శస్త్రచికిత్స మెరుగ్గా నిర్వహించేందుకు అవకాశం ఏర్పడుతుందని బ్లాక్ వివరించారు.

ఈ విషయంలో అమెరికా సహా కొన్ని యూరప్ దేశాలు ఎప్పుడో ముందడుగు వేశాయి. ఆపరేషన్‌కు ముందు మాత్రమే కాదు, ఆపరేషన్ సమయంలోనూ రోగులపై ఈ టెక్నిక్‌ను ఉపయోగిస్తున్నాయి.

హిప్నోసిస్‌నే హిప్నోసెడేషన్ లేదా హిప్నోథెరపీగా పిలుస్తారు. దీనిపై అమెరికా, బెల్జియం, ఫ్రాన్స్‌లలో అధ్యయనాలు నిర్వహించారు. దీంతో ఆపరేషన్ సమయంలో మత్తుమందు అవసరాన్ని హిప్నోసిస్ తగ్గించగలదని, దీంతో నొప్పి నివారిణుల అవసరం కూడా తగ్గుతుందని వెలుగులోకి వచ్చింది.

హిప్నోసిస్

ఫొటో సోర్స్, Getty Images

హిప్నోసిస్‌లో చుట్టుపక్కల ఏం జరుగుతుందో పెద్దగా తెలియని స్థితిలోకి రోగులను తీసుకెళ్తారు. దీని కోసం వైద్యులు చెప్పే అంశాలను రోగులు ఏకాగ్రతతో అనుసరిస్తుండాలి.

దీనిలో నిపుణులు పక్కనే ఉండటం తప్పనిసరి. వారు తమ మాటలతో రోగులను హిప్నోటిక్ ట్రాన్స్‌లోకి తీసుకెళ్తారు. మనం సొంతంగా సెల్ఫ్-హిప్నోసిస్‌ను అభ్యసించొచ్చు. ఈ స్థితిలో మనుషులు నిద్రలోకి వెళ్లారు. చుట్టుపక్కల ఏం జరుగుతుందో వారికి పెద్దగా తెలియదు.

‘‘చుట్టుపక్కల పరిసరాలతో మీకు కొంతసేపు బంధం తెగిపొతుంది. కొత్త ట్రాన్స్‌లోకి వెళ్తారు. అక్కడ కొత్త ఆలోచనలు పరిచయం చేసుకోవడానికి, అనుభవాలను పంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటారు’’ అని అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలోని సైకియాట్రీ, బిహేవియరల్ సైన్స్ విభాగం ప్రొఫెసర్ డేవిడ్ స్పైజెల్ చెప్పారు.

ఇక శస్త్రచికిత్స విషయానికి వస్తే, రోగుల ఏకాగ్రతను తమ శరీరం నుంచి వేరే ప్రాంతాల వైపుకు మళ్లిస్తారు. ‘‘ఫలితంగా శరీరంలో ఏం జరుగుతుందో పెద్దగా తెలియదు’’ అని స్పైజెల్ చెప్పారు.

‘‘సాధారణ భాషలో చెప్పాలంటే, మీరు నొప్పిని పట్టించుకోరు. వేరే అంశాలను వెతుక్కుంటూ వెళ్తారు’’అని ఆయన అన్నారు.

దీన్ని మనం పూర్తిగా నిమగ్నమై సినిమా చూడటంతో పోల్చుకోవచ్చని ఆయన చెప్పారు. ‘‘అప్పుడు మనం సమయంతోపాటు చుట్టుపక్కల వారిని కూడా మరచిపోతాం. స్క్రీన్‌పై ఏం జరుగుతుందో మాత్రమే గమనిస్తాం’’ అని ఆయన వివరించారు.

ఒక్కోసారి హిప్నోసిస్ అనేది కారు ప్రయాణంలా ఉంటుందని అమెరికాలోని టెక్సస్ క్యాన్సర్ సెంటర్ ప్రొఫెసర్ ఎలిజబెత్ రెబెల్లో చెప్పారు.

‘‘మీరు కారు ఎక్కిన తర్వాత, రేపు ఏం చేయాలనే దాని గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు. లేదా కుటుంబ సభ్యుల గురించి ఆలోచించొచ్చు. ఇంతలోనే మనం దిగాల్సిన చోటు వచ్చేయొచ్చు’’అని రెబెల్లో వివరించారు.

హిప్నోసిస్

ఫొటో సోర్స్, Getty Images

మెదడుపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?

హిప్నోసిస్ అనేది మెదడుపై మూడు రకాల ప్రభావాలకు కారణం అవుతుందని స్పైజెల్ చెప్పారు. తన పరిశోధనలో భాగంగా ఆయన ఫంక్షనల్ మ్యాగ్నెటిక్ రీసొనెన్స్ ఇమేజింగ్ (ఎఫ్ఎంఆర్ఐ)తో హిప్నోసిస్‌లో మెదడులో భాగాలను ఆయన పరిశీలించారు.

  • ‘‘యాంటీరియర్ సింగ్యులేట్ కార్టెక్స్’’గా పిలిచే భాగంలో చర్యలు తగ్గుతాయి. చుట్టుపక్కల పరిసరాల్లో ఏం జరుగుతుందో గ్రహించడంలో మెదడులోని ఈ భాగం క్రియాశీలంగా పనిచేస్తుంది.
  • ఒక్కోసారి ‘‘ప్రీఫ్రంటల్ డోర్సోలేటరల్ కార్టెక్స్, ఇన్సులా’’గా పిలిచే రెండు భాగాల మధ్య చర్యలు పెరుగుతాయి. శరీరంలో ఏం జరుగుతుందో నియంత్రించడంలో ఈ రెండు భాగాల మధ్య అనుసంధానాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి.
  • కొన్నిసార్లు ప్రీఫ్రంటల్ కార్టెక్స్‌, ఇతర న్యూరల్ నెట్‌వర్క్‌ల మధ్య చర్యలు తగ్గుతాయి. బహుశా ఈ అనుసంధానాలే సదరు వ్యక్తి చర్యలు, వాటి ద్వారా చుట్టుపక్కల నుంచి వచ్చే స్పందనలను నియంత్రిస్తూ ఉండొచ్చు. ఈ భాగం క్రియాశీలంగా లేకపోవడం వల్లే సదరు వ్యక్తి మానసిక నిపుణుడు చెప్పే అంశాలపై దృష్టిపెట్టగలుగుతుంటారు.
హిప్నోసిస్

ఫొటో సోర్స్, Getty Images

ఎందుకు హిప్నోసిస్ చేయాలని అంటున్నారు?

రోగులకు హిప్నోసిస్‌ను చేయాలని సూచిస్తున్నవారు పూర్తిగా అనస్తీషియాను పక్కన పెట్టేయాలని చెప్పడం లేదు. అయితే, హిప్నోసిస్‌ సాయంతో అనస్తీషియాను తక్కువ పరిమాణంలో ఇవ్వొచ్చని చెబుతున్నారు.

టెక్సస్ యూనివర్సిటీలోని ఎండీ ఆండర్సర్ సెంటర్‌లో నిపుణులు ఏళ్ల నుంచి ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు.

రొమ్ముల నుంచి అసాధారణ కణితులను తొలగించే లంపెక్టమీ చికిత్సలో రెబెల్లో, ఇతర వైద్యులు హిప్నోసెడేషన్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ ప్రక్రియలను అనస్తీషియా నిపుణుల ఆధ్వరంలోనే చేయాల్సి ఉంటుంది.

‘‘ఇది చాలా సురక్షితమైన విధానం. ఎందుకంటే ఆపరేషన్‌ గదిలో మత్తు అవసరమైతే, దాన్ని ఇవ్వడానికి పక్కనే అనస్తీషియా నిపుణులు ఉంటారు’’అని రెబెల్లో చెప్పారు.

వీడియో క్యాప్షన్, యాంటీ బయాటిక్స్: ప్రాణాలు కాపాడడమే కాదు, ప్రాణాలు తీస్తాయి కూడా...

ప్రయోజనాలు ఏమిటి?

ఆపరేషన్‌కు ముందుగా హిప్నోసిస్‌ను ఉపయోగించడంతో చాలా ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.

ముఖ్యంగా దీని వల్ల రోగుల్లో ఆందోళన తగ్గుతుంది. అంతేకాదు, అనస్తీషియాతో వచ్చే వాంతులు, వికారం లాంటి ఇతర అనారోగ్యాలను కూడా అడ్డుకోవచ్చు.

మరోవైపు ఆపరేషన్ తర్వాత గంటలపాటు రోగులు మత్తులో ఉండాల్సిన అవసరం ఉండదు. ఆరోగ్యం కాస్త సద్దుమణిగాక వెంటనే వారు ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లిపోవచ్చు.

శస్త్రచికిత్స తర్వాత తీసుకునే నొప్పి నివారిణుల పరిమాణాన్ని కూడా హిప్నోసిస్‌తో తగ్గించుకోవచ్చని రెబెల్లో చెప్పారు.

‘‘ఒక్కోసారి అనస్తీషియాతో కొన్ని మేధోపరమైన సమస్యలు కూడా వస్తుంటాయి. వీటిని కూడా హిప్నోసిస్‌తో తగ్గించుకోవచ్చు’’ అని డాక్టర్ లొరెంజో కోహెన్ చెప్పారు.

‘‘కొన్నిసార్లు వ్యాధి నిరోధక స్పందనలను కూడా అనస్తీషియా తగ్గిస్తుంది. క్యాన్సర్ కణితుల పెరుగుదలను నియంత్రించాలని భావించేటప్పుడు ఇలాంటి పరిణామాలతో ముప్పు మరింత ఎక్కువ అవుతుంది’’ అని కోహెన్ చెప్పారు.

వీడియో క్యాప్షన్, సెక్స్ సామర్థ్యం సున్తీ చేసుకుంటే పెరుగుతుందా?

ప్రతికూల ప్రభావాలు ఏమిటి?

అందరినీ హిప్నోసిస్‌లోకి తీసుకెళ్లడం సాధ్యం కాదు. ఇదే అతిపెద్ద అడ్డంకి.

‘‘చాలా మందిని హిప్నోసిస్‌లోకి తీసుకెళ్లలేం. కొన్ని వర్గాల్లో ఇలాంటి వారి సంఖ్య 25 శాతం వరకూ ఉంటుంది. దీని వెనుక చాలా కారణాలు ఉండొచ్చు’’ అని స్పైజెల్ అన్నారు.

ఇక్కడ మరో అడ్డంకి ఏమిటంటే.. రోగిపై చాలా ఎక్కువ సమయాన్ని వైద్యులు వెచ్చించాల్సి ఉంటుంది. మరోవైపు శస్త్రచికిత్స సమయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.

అంతర్గత అవయవాలకు నిర్వహించే పెద్ద ఆపరేషన్లలో దీన్ని ఉపయోగించడం అనేది చాలా ముప్పుతో కూడుకున్న వ్యవహారం. ఎందుకంటే ఈ ఆపరేషన్లలో చాలా నొప్పి వస్తుంటుంది.

హిప్నోసిస్‌ను మెరుగ్గా ఉపయోగించుకోలేకపోవడానికి పెద్ద ఆసుపత్రులు దీనిపై దృష్టిసారించకపోవడమూ ఒక కారణమని స్పైజెల్ భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)