వాజ్‌పేయి శతజయంతి: హిందూ జాతీయవాద రాజకీయాలను ఆమోదయోగ్యంగా మార్చిన నాయకుడు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రతిపక్షంలో బలంగా ఉన్న రోజులవి. 1975 జూన్ 26న, పోలీసులు బెంగళూరులోని ఒక హాస్టల్‌లో ఉండగా ఆయన్ను అరెస్ట్ చేశారు.
అంతకుముందు రోజు సాయంత్రమే అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఒక్కసారిగా పరిస్థితులన్నీ అల్లకల్లోలం అయిపోయాయి. ఎన్నికల రద్దు, పౌర హక్కుల అణచివేత, మీడియా నోరు మూతలాంటివన్నీ జరిగిపోయాయి. ప్రతిపక్ష పార్టీల నాయకులను అరెస్ట్ చేశారు. వీటన్నిటితో పాటు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై కూడా వేటు వేశారు ఇందిరా గాంధీ.
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సైద్ధాంతిక మూలాలు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినవేనన్న సంగతి తెలిసిందే.
అప్పటికి వాజ్‌పేయి ఆర్ఎస్ఎస్ సభ్యుడిగా, జన్‌సంఘ్ నాయకుడిగా ఉండేవారు. బీజేపీ ఏర్పడడానికి ముందు రైట్ వింగ్ రాజకీయాలకు జన్ సంఘ్ ఆయువుపట్టుగా ఉండేది. ఇది 1951లో ఏర్పడింది.
తరువాత రెండు దశాబ్దాలకు వాజ్‌పేయి భారత ప్రధానిగా ఎదిగారు. 1996, 1998లలో కొద్ది కాలం, 1999 నుంచి 2004 వరకు పూర్తి కాలం ప్రధానమంత్రిగా సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యం వహించారు.
1975 విషయానికొస్తే, ఎమర్జెన్సీ సమయంలో వాజ్‌పేయి అరెస్ట్ అయ్యారు. నగరంలో ఉన్న మంచి జైలేదో మరొక పార్టీ కార్యకర్తను కనుక్కున్నారు. పోలీస్ స్టేషన్‌లో ‘ఏమీ తోచనట్టు ఉన్నా, నిశ్చింతగా’ కూర్చున్నారు.
తరువాత నెల రోజులు జైల్లో ఉన్నారు. ఆ సమయంలో ‘ఖైదీ కవిరాయ’ పేరుతో కవితలు రాశారు. పేకాట ఆడుతూ, జైల్లో వంటగదిని పర్యవేక్షిస్తూ కాలం గడిపారు.
జూలైలో, వైద్య పరీక్షల అనంతరం వాజ్‌పేయిని ప్రత్యేక విమానంలో దిల్లీకి తరలించారు. రాజధానిలో ఆయనకు సర్జరీ జరిగింది. ఆస్పత్రి నుంచి బయటికొచ్చాక పెరోల్‌పై ఇంట్లో, పోలీసుల పర్యవేక్షణలో కొన్నాళ్లు కాలం గడిపారు.


ఫొటో సోర్స్, Getty Images
డిసెంబర్ నాటికి ఆయనకు నిరాశ ఆవహించింది. ఆ సమయంలోనే, "నా జీవితం అస్తమించడానికి సిద్ధంగా ఉంది.. మాటలు అర్థవిహీనం అవుతున్నాయి.. ఒకప్పుడు వీనులవిందు చేసిన సంగీతం ఇప్పుడు అరుపులు, కేకల్లా వినిపిస్తోంది" అంటూ ఒక కవిత రాశారు.
అప్పటికే ఆర్ఎస్ఎస్ ప్రచారకర్తలు రహస్యంగా తమ సిద్ధాంతాలను తెలియజెప్పే పుస్తకాలు పంచుతూ, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమాలను ఉధృతం చేశారు.
ప్రభుత్వంతో చర్చలు జరపడానికి వీలుగా "సరెండర్ డాక్యుమెంట్"పై సంతకం చేయాలని ప్రధాని సలహాదారులు ప్రతిపక్ష నాయకులపై ఒత్తిడి తెస్తున్నారు.
ఈ నేపథ్యంలో, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పెద్దఎత్తున తిరుగుబాటు జరగకపోవడం వాజ్‌పేయిని దిగ్భ్రాంతికి గురిచేసింది. అభిషేక్ చౌదరి రాసిన వాజ్‌పేయి జీవితచరిత్రలో ఈ విషయాలన్నీ వివరంగా రాశారు.
అప్పటికి, ఒక సంవత్సరం వ్యవధిలో వాజ్‌పేయి ప్రతిపక్షాలను ఏకం చేసి, కాంగ్రెస్‌కు ప్రత్యర్థిగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తారని ఎవరూ ఊహించి ఉండరు.
ప్రధానంగా నాలుగు సెంట్రిస్ట్, రైట్ వింగ్ పార్టీల కూటమిగా జనతా పార్టీ ఏర్పడింది. జన్ సంఘ్‌ను ఇందులో విలీనం చేశారు.
1977 జనవరిలో ఇందిరా గాంధీ ఎన్నికలు జరుగుతాయని ప్రకటిస్తూ, 20 నెలలుగా సాగిన ఎమర్జెన్సీని ఎత్తివేశారు.
మార్చిలో జరిగిన ఎన్నికలలో జనతా పార్టీ కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించింది. స్వతంత్రం వచ్చిన 30 ఏళ్లకు కాంగ్రెస్ తొలిసారి ఓటమి చవిచూసింది.
మొత్తం 542 సీట్లలో జనతా పార్టీ 298 సీట్లు గెలిచింది. 90 సీట్లు గెలుచుకుని కూటమిలో జన్‌సంఘ్ అగ్రస్థానంలో నిలిచింది.
వాయ్‌పేయి ప్రధాని పదవి కావాలని అడిగి ఉండవచ్చు, కానీ అప్పటికి ఆయనకు 52 ఏళ్లే కావడంతో, ఆ పదవికి అది చిన్నవయసుగా భావించారని అభిషేక్ చౌదరి తన పుస్తకంలో రాశారు.
78 ఏళ్ల మొరార్జీ దేశాయ్ ప్రధాన మంత్రి అయ్యారు. కొత్త క్యాబినెట్‌లో ముగ్గురు జన్‌సంఘ్ సభ్యులకు చోటు దక్కింది. వాజ్‌పేయి విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. "దేశ విధానంలో తక్షణం మార్పులు లేదా పెద్ద మార్పులు ఉండవని, చైనాతో సంబంధాలను మెరుగుపరచుకుంటామని" వాగ్దానం చేశారు.
ఎన్నికల ప్రచారంలో జనతా పార్టీలో వాజ్‌పేయి ఆధిక్యం స్పష్టంగా కనిపించింది. 72 ఏళ్ల జయప్రకాశ్ నారాయణ్ తరువాత ఆ స్థాయిలో మంచి వక్త, జనాకర్షణ కలిగిన వ్యక్తి వాజ్‌పేయి అని, తన ప్రసంగాలతో జనాన్ని పెద్ద సంఖ్యలో పోగుచేయగలరని చౌదరి రాశారు. ప్రతిపక్షాలను ఏకం చేయడంలో జయప్రకాశ్ నారాయణ్ పోషించిన పాత్ర తెలిసిందే.
వాజ్‌పేయిని "జనతా పార్టీ గ్లామర్"గా మీడియా అభివర్ణించింది. ప్రచారానికి వాడిన ఒక పోస్టర్‌లో "దేశానికి గర్వకారణం" అని ఆయన గురించి పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
"హిందూ జాతీయవాదాన్ని ప్రధాన స్రవంతికి తీసుకురావడంలో వాజ్‌పేయి కీలక పాత్ర పోషించారు" అని అభిషేక్ చౌదరి అభిప్రాయపడ్డారు. సాధారణంగా జనాల్లో ఉన్న అభిప్రాయానికి ఇది వ్యతిరేకంగా ఉంది.
బీజేపీలో ప్రధాన పాత్ర పోషించిన ఎల్‌కే అడ్వాణీ, అయోధ్య రామ మందిరాన్ని ముందు పెట్టి హిందుత్వ రాజకీయలను పైకి తీసుకొచ్చారన్నది సాధారణ ప్రజల్లో ఉన్న అభిప్రాయం.
అయితే ఇది "సైద్ధాంతిక సోమరితనంతో చేసిన, మోసపుచ్చే విశ్లేషణ అని, అంతకుముందే బాటలు పడిన ధోరణిని కప్పిపుచ్చుతోంది" అని చౌదరి అభిప్రాయపడ్డారు.
బీజేపీ ఏర్పడక ముందే జన్‌సంఘ్ రైట్ వింగ్ రాజకీయలకు ఆలవాలంగా మారిందన్న విషయాన్ని చాలామంది మర్చిపోతారని చౌదరి అన్నారు. వాజ్‌పేయి జన్‌సంఘ్‌లో కీలక సభ్యుడు. 1967లో జన్‌సంఘ్ గరిష్ట స్థాయిలో పనిచేస్తున్నప్పుడు, ఆ పార్టీ నుంచి 50 మంది ఎంపీలు, దాదాపు 300 మంది శాసనసభ్యులు ఉన్నారు.
"భారత రాజకీయాల్లో రెండు యుగాలకు మధ్య వారధి వాజ్‌పేయి. కాంగ్రెస్, రైట్ వింగ్ రాజకీయాలకు మధ్య వంతెనగా వ్యవహరించారు. వాజ్‌పేయి లేకుండా నరేంద్ర మోదీ లేరు" అన్నారు చౌదరి.
1980లో జనతా పార్టీ కూటమి వీగిపోయినప్పుడు, జన్‌సంఘ్ కొత్త రూపుతో ప్రధాన స్రవంతిలోకి రావాలని వాజ్‌పేయి పట్టుబట్టారు. ఫలితంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది.
డేగల పార్టీలో "ముసుగు" తొడుక్కున్న వ్యక్తి వాజ్‌పేయి అని చాలామంది అంటుంటారు. అయితే, వాజ్‌పేయికి తన అసలు ముఖం చూపించే అవకాశం లేకపోయిందని, భిన్నమైన రాజకీయ పార్టీల కూటమితో కలిసి పని చేయాల్సి రావడం వలన రాజీతత్వానికి తల ఒగ్గారని చౌదరి అభిప్రాయపడ్డారు. రాజకీయాలలో రాజీపడడం కీలకమని వాజ్‌పేయి గ్రహించారని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వాజ్‌పేయి 1924లో గ్వాలియర్‌లో పుట్టారు. ఆయన తండ్రి స్కూలు టీచర్, తల్లి గృహిణి. అప్పటికే దేశంలో హిందుత్వ అనుకూల గ్రూపులు 'హిందూ మహాసభ', 'ఆర్య సమాజ్' లాంటివి హిందువుల ఐక్యత గురించి మాట్లాడుతున్నాయి.
"వాజ్‌పేయి తొలినాళ్లలో రాసిన కవిత్వంలో తీవ్రమైన ఆవేశం, బాధిత స్వరం వినిపిస్తుంది. భారతదేశ చరిత్ర, భౌగోళిక పరిధుల గురించి సంకుచిత, గందరగోళ భావజాలం వ్యాప్తిలో ఉందని, దాన్ని పునరుద్ధరించే అవసరం ఉందనే ఆలోచన, ప్రపంచంలో తనదైన స్థానం పొందాలన్న స్పృహ కనిపిస్తాయి" అని చౌదరి తన పుస్తకంలో రాశారు.
వాయ్‌పేయి పుట్టిన మరుసటి సంవత్సరం 1925లో ఆర్ఎస్ఎస్ ఏర్పడింది. కాలేజీ రోజుల్లో ఆయన అందులో చేరారు. వారానికోసారి ప్రసంగాలు ఇచ్చేవారు. జర్నలిస్ట్ కావాలని కలలు కనేవారు. దేశంలో ఇస్లాం చరిత్రపై ఆయనకు భిన్నాభిప్రాయం ఉండేది. వాటన్నిటినీ కాగితంపై పెట్టేవారు.
ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు ప్రాతినిధ్యం వహించే 'పాంచజన్య' లాంటి నాలుగు ప్రచురణలకు వాజ్‌పేయి ఎడిటర్‌గా వ్యవహరించారు. గోసంరక్షణ, హిందూ పర్సనల్ లా, ప్రపంచం, హిందూ మతంతో భారతదేశానికి గల సంబంధం మొదలైన అంశాలపై అనేక వ్యాసాలు రాశారు.
'బర్సాత్' అనే హిందీ సినిమాలో పాటలు "చెత్తగా, అశ్లీలంగా" ఉన్నాయని, పిల్లలు వాటిని చూడకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు. ఇవన్నీ ఆయనకున్న సంప్రదాయ, మితవాద ఆలోచనలను స్పష్టం చేస్తాయి.
కొన్ని దశాబ్దాల తరువాత వాజ్‌పేయి వ్యవహారకర్తగా, ఆచరణవాదిగా ఎదిగారు. జనతా పార్టీ కూటమి తరపున ఆయన ప్రచారం చేస్తున్నప్పుడు మీడియా ఆయన్ను "పరిమితులు, మర్యాద తెలిసిన, సమస్యలను గ్రహించి, భేదాలను రూపుమాపగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తి" కొనియాడింది.
వాజ్‌పేయి, తన ఆరు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో "అత్యంత గూఢమైన, జటిలమైన భారత రాజకీయవేత్తగా" మిగిలిపోయారని అభిషేక్ చౌదరి అభిప్రాయపడ్డారు.
93 ఏళ్ల వయసులో 2018లో వాజ్‌పేయి ఆగస్టు 16న కన్నుమూశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














